[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]


కొందరు కళ కోసమే పుడతారు, తమ జీవితాన్ని కళకే అంకితం చేసి జీవితపర్యంతం ఆ కళతో జనావళిని రంజింప చేసి, ఈ లోకం విడిచి స్వర్గం చేరతారు. అటువంటివారి జన్మ ధన్యం! వారి జీవనం పావనం! అటువంటి అతి కొద్దిమంది కారణజన్ములలో గానకోకిల లతామంగేష్కర్ ఒకరు. లత అనబడే ఒక పదమూడేళ్ల ముక్కుపచ్చలారని బాలిక తండ్రిని పోగొట్టుకొని, సంసార భారం మీద పడగా, అమాయకమైన కళ్ళతో హిందీ సినిమా ప్రపంచంలో అడుగు పెట్టింది. ఆమె జీవనప్రస్థానాన్ని కస్తూరి మురళీకృష్ణగారు అక్షరీకరించిన తీరు పాఠకులను విస్మయపరుస్తుంది. ఆపకుండా మనల్ని చదివిస్తుంది.
28 సెప్టెంబరు, 1929లో ఇండోర్, మధ్యప్రదేశ్ లో జన్మించిన లతాజీ జీవితం మొత్తం, హిందీ సినిమా సంగీతంతో విడదీయలేనంతగా కలిసిపోయింది. ఈమె తన సహ గాయనీగాయకులతోనూ, పాటల రచయితలతోనూ, సంగీత దర్శకులతోనూ కలిసి చేసిన బృందగానం ఈ రచన. సాధారణంగా జీవిత చరిత్రలు పాఠకుడు చదవాలి అనుకుని చదువుతాడు, కాస్త ఇబ్బంది అయినా ఓర్చుకుంటూ. లతాజీ జీవితగాథ మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా చదివిస్తుంది. ఇందులో హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, సరళ స్వచ్ఛ జీవితం ఉంది. దానిలోని సంఘర్షణలూ, ఆటుపోటులూ ఉన్నాయి. చుట్టూ పర్ఫెక్షన్ అంతగా లేని మనుషులున్నారు. కానీ వీరంతా అద్భుత సంగీతానికి సంబంధించిన కళాకారులు. వారి సృజన హిందీ చలనచిత్ర రంగాన్ని సుసంపన్నం చేసింది. అది చక్కని రొమాంటిక్ పాటలతో పాటు జీవన తాత్వికతను అలవోకగా చెప్పే పాటల స్వర్ణయుగం. నాటికీ, నేటికీ ఆ పాటలు ఉత్తమ శ్రేణికి చెందినవే. ఆ బంగారు రోజుల్లో సుదీర్ఘ కాలం నిలబడిన పాటల రారాణి లతాజీ.
ఒకోసారి ఇతరుల జీవిత చరిత్రతో ఎక్కడో ఒకచోట మన చరిత్ర కూడా పోలి ఉంటుంది. అందుకే మనం చదువుతూ మమేకమవుతాము. వారి జయాపజయాలు, వారి కష్టసుఖాలు మనవి కూడా అనిపిస్తాయి. మన జీవితాన్ని అవలోకనం చేయిస్తాయవి. అటువంటి నిజమైన అలంకరణలు లేని అతిశయోక్తులు లేని సహజాతిసహజ జీవిత కథ ఇది. మనకి సజీవ చిత్రాన్ని చూస్తున్నట్టు అనిపించే గాథ ఇది.
సాధారణంగా జీవిత చరిత్రలు విసుగు పుట్టిస్తాయి, ఒకో చోట పేజీలు తిప్పేయాలనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆద్యంతం మనకి ఉత్సుకత తప్ప నిరుత్సాహం కలగదు. లతాజీ చుట్టూ ఉన్న వారందరి కథలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఆమెది నికార్సైన నిరాడంబర జీవితం. ఆ కష్టాలూ, కన్నీళ్లూ, నిస్సహాయతా, ప్రతివారికీ ఏదో ఒక సమయంలో అనుభవైకవేద్యమే కనుక, చదువుతూ ఉంటే మన జీవిత పుస్తకాన్ని మనమే ఆప్యాయంగా చదువుతున్నట్టు అనిపిస్తుంది.
లతాజీ విజయానికి ఆమె ఏకాగ్రత, పట్టుదల, దీక్ష కారణం. ఆమె తన సహజ ప్రతిభకి నిరంతరం మెరుగులు పెట్టుకుంటూ ఉండడం, అడుగడుగునా ఆమె తనను తాను పుటం పెట్టుకోవడం వల్లే ఆమె శిఖరాగ్రం ఎక్కగలిగింది. ఏదీ ఎవరికీ ఊరికే రాదు. జీవిత రథచక్రాల కిందపడి, నలిగి, లేచి ధైర్యంగా నిలబడి తనని తాను నిరూపించుకుని, ఎవరికీ అందనంత ఎత్తున నిలబడగలిగారంటే అదంతా ఆమె స్వయంకృషి. గులాం హైదర్, అనిల్ విశ్వాస్ వంటి లబ్ధప్రతిష్ఠులైన సంగీతదర్శకుల నుంచి నేర్చుకున్న మెళకువలతో, నిరంతర సాధనతో తనకంటూ ఒక గాన సంవిధానాన్ని ఏర్పరచుకున్నారామె.
ప్రతిభ గల రచయితలూ, అద్భుతమైన సంగీత దర్శకులూ, వారికి దీటుగా పాడగల లతాజీ కలవగా ఎన్నో సుమధుర గీతాలు వెలువడ్డాయి. అలా లతాజీ పాడిన పాటలు అధిక సంఖ్యలో సూపర్ హిట్లు కావడం వల్ల ఆమె దశాబ్దాల పాటు తిరుగులేని గాయనిగా వెలిగారు. ఆ సమయంలో ఆమెకు రికార్డింగుల తొందరలో తినడానికి టైం లేక టీ బిస్కెట్లతో సరిపుచ్చుకునే వారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నవవిధ భక్తి పద్ధతుల్లో ఒకటైన సంగీతాన్ని ఆమె ఈశ్వర స్వరూపంగా భావించారు. “నా ధర్మం నాలో శాంతిని, ప్రపంచ మానవాళి పట్ల ప్రేమ భావనని నింపుతుంది” అనగలగడం ఆమె తాత్వికతకు అద్దం పడుతుంది.
లతామంగేష్కర్ భగవంతుడు భారతదేశానికి ఇచ్చిన ఆశీర్వాదం. ఆమె మన దేశ సంపద. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఆమెను తిరుపతి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమించినప్పుడు అత్యంత సంతోషపడిన భక్తి తత్పరత ఆమెది. అంతటి గాయని డైరీ రాయబోయి, తన జీవితంలోని చేదు అనుభవాలను, సత్యాలను నిజాయితీగా వెల్లడిస్తే ఎవరికైనా బాధ కలుగుతుందేమో అని డైరీ రాయడం మానేసిన సున్నిత మనస్క.
తన కుటుంబం యొక్క జీవిక కోసం పాడడం మొదలుపెట్టిన ఆమె, తానే సంగీత సరస్వతిగా మారి పోయి అదే ప్రపంచంగా దానిలో మునిగిపోయారు. లతగారు విషాదాంత ప్రేమ పెళ్లిళ్లను దగ్గరగా చూడడం వల్ల కావచ్చు, సంగీతంతో తాదాత్మ్యం చెందడం వల్ల కావచ్చు ఆమె అవివాహితగా ఒక తులసిమొక్కలా పవిత్రంగా ఉండిపోవడం జరిగిందనిపిస్తుంది.
తక్కువగా మాట్లాడుతూ, ఎన్నో వివాదాస్పద సంఘటనల పట్ల మౌనమే జవాబుగా ఉండే లతాజీ ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని చాలా నిశితంగా పరిశీలించి ఈ పుస్తకంలో విశ్లేషణ చేయడం జరిగింది. ఆమె జీవితాన్ని చదువుతూ ఉంటే అసలామెలో సంగీతం పట్ల అంకిత భావన, అనురక్తి తప్ప మరొకటి కనబడదు.
అనేక విషయాల్లో లతాజీ మనసులోని సుకుమార భావాలను ఒడిసి పట్టగలిగిన మురళీకృష్ణగారు ఆమెపై చలామణిలో ఉన్న అపవాదులను (చెల్లెలితో సహా తన సహగాయనీమణులను ఎదగనీయకుండా అడ్డుపడ్డారు అన్న అపప్రధ), అవి వట్టి అభాండాలని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆమెవంటి ఉచ్చస్థితిలో ఉన్న ఏ కళాకారిణి అయినా, ఆ రంగంలో తన చుట్టూ ఒక కంచె కట్టుకోక తప్పదు. ఆ కట్టుకునే దారిలో చుట్టుపక్కల వారు ఆమెపై కొన్ని అపోహలు పడ్డారు తప్ప, ఆమెకు పోటీ, సాటీ ఎవరూ లేరనిపిస్తుంది. సహజ ప్రతిభ, సంగీతం పట్ల తదేక ధ్యాస ఆమె బలాలు. లతాజీ తనకి చిన్నతనంలో తండ్రి నేర్పిన సంగీతాన్ని ఊతకర్రగా తీసుకొని, ఆయన ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పుణికి పుచ్చుకొని ఎవరు అందుకోలేని ఎత్తులకు ఎదిగారు. నిరంతరం తండ్రి తనతోనే ఉన్నాడన్న భావనతో జీవించారు.
కొత్త సంగీత దర్శకుల, గేయ రచయితల నైపుణ్యాన్ని గ్రహించే శక్తి గల లతాజీ జాగ్రత్తగా తన కెరియర్ నిర్మించుకున్నారు. ఎంతో శ్రద్ధతో ప్రతి పాటనూ అదే తన తొలి పాట అయినట్టు జాగ్రత్తగా పాడుతూ 36 భాషల్లో పాడిన లతాజీ తిరుగులేని మహారాణిగా వెలుగొందారు. వివిధ వయసుల అనేక నాయికల స్వరాలకు తగినట్టుగా పాడగల శక్తి ఆమెకు సరస్వతీకృప వల్ల అబ్బింది. ఇంకా ఆమె అనేక ప్రైవేట్ సాంగ్స్, భజనలూ పాడారు. కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించి తన సత్తా నిరూపించుకున్నారు.
కస్తూరి గారు కేవలం లతాజీ గురించి మాత్రమే కాకుండా ఆమె సమకాలీన సంగీత దర్శకుల గురించీ, పాటల రచయితల గురించీ, సహాగాయనీ గాయకుల గురించీ సవివరంగా, సోదాహరణంగా రాయడం వల్ల ఈ పుస్తకం యొక్క పఠనీయత మరింత పెరిగి, ఒక నవల చదువుతున్న అనుభూతి కలిగింది. వందేళ్ల హిందీ సంగీత ప్రపంచాన్ని గురించి చదవడం పాఠకులకు చరిత్ర చదువుతున్నంత హాయిగా ఉంటుంది.
పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు భారతరత్న కూడా అందుకున్న ఆమె – హిందీ సినిమాఫీల్డ్ లో మాత్రమే కాక, భారతీయ సంగీత ప్రపంచంలో తనకు ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకున్న అపర సరస్వతి. ఈ గంధర్వగాయనిని భారత ప్రభుత్వం 1999లో రాజ్యసభ సభ్యురాలిని చేసి గౌరవించింది.
సినిమా పాటల రికార్డింగ్ అమ్మకాల్లో గాయనీగాయకులకు కూడా రాయల్టీ హక్కుగా ఉండాలని ఆమె పట్టుబట్టి గెలవడం వల్ల ఆమె తర్వాతి తరం వారికి కూడా మేలు జరిగింది. ఆ గ్రామఫోన్ రికార్డుల మీద వారి పేర్లు ఉండాలనీ, రేడియోలో పాట పాడిన వారి పేర్లు కూడా చెప్పాలనీ డిమాండ్ చెయ్యగల పోరాటపటిమ ఆమెది. అలాగే నేపథ్య గాయనీగాయకులకు కూడా ఫిలింఫేర్ అవార్డులు ఇవ్వాలని ఆమె గట్టిగానే మాట్లాడి సాధించారు.
తను పాడబోయే పాటల స్క్రిప్ట్‌లో సభ్యత లేని పదాలుంటే ఆ పాటను తిరస్కరించే స్థాయి ఆమెది. స్పష్టమైన ఉచ్చారణ కోసం ఉర్దూ నేర్చుకున్నారు. గీతారాయ్ వంటి అగ్రశ్రేణి గాయనిని దాటి ముందుకు దూసుకుపోగలిగిన సూపర్ స్టార్ సింగర్ లతాజీ. శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న లతాజీ ఎటువంటి బాణీనైనా ఇట్టే గ్రహించి పాడగలడం వల్ల సంగీత దర్శకులకు సృజనాత్మకమైన బాణీలు కట్టగలిగే ధైర్యమూ, ఉత్సాహం కలిగేవంటేనే ఆమె అరుదైన గాయని అని అర్థం అవుతుంది. ఆమెలో మేలు మరువని గుణంతో పాటు అవమానాన్ని సహించకపోయే గుణం ఉండడం, ప్రతిభకు తోడు బలమైన వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం మనకి ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా అందరికీ ఆమె పట్ల గౌరవ ప్రపత్తులు కలగటానికి కారణం ఆమె నిరాడంబరత, మిత ప్రవర్తన, మిత భాషిత్వం.
లతాజీని హిందీ సినీ పరిశ్రమతో పాటు భారతదేశం మొత్తం అభిమానించి గౌరవించింది, విదేశాలతో సహా. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తర్వాత గానం కోసం భారతరత్న పొందిన వారు లతాజీ. ఆమె తాను పాడే పాటలోని భావంగా మారిపోయేవారంటే మ్యూజిక్ పట్ల అంతటి తాదాత్మ్యత ఆమెకే సొంతం అనిపిస్తుంది. శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకుని స్వరాన్ని ఉచ్చస్థాయికి తీసుకు వెళ్లగలిగిన మహమ్మద్ రఫీ గారొక్కరే ఆమెకి పాట పాడడంలో పోటీ ఇవ్వగలిగేవారంటే ఆమె ఎటువంటి ఉత్తమ శ్రేణి గాయనీమణో మనకి అర్థం అవుతుంది. ఆమె అత్యంత్య ఉచ్చదశలో దాదాపుగా అయిదు దశాబ్దాలూ, మొత్తంగా చూసుకుంటే హిందీ సంగీత ప్రపంచంలో 72 సంవత్సరాలూ ఉన్నారు. ఈ రికార్డు అనితర సాధ్యం. దేశంలోని గాయనీమణులంతా పోటీపడే హిందీభాషలో సినీ గాయనిగా 72 సంవత్సరాలు నిలబడగలగడం అంటే అది న భూతో న భవిష్యతి అనదగ్గ విషయం.
ఏది రాసినా అలవోకగా చదివించగల నైపుణ్యం, భావధార కస్తూరి మురళీకృష్ణ గారి కలం బలం. అలాగే ఈ జీవితచరిత్రలో కూడా నవల లాంటి కథనం, అల్లిక మనల్ని మమేకం చేయిస్తుంది. రచయిత లతగారిపై పరిపూర్ణ గౌరవంతో, హృదయపూర్వక గౌరవవాభిమానాలతో ఒక తపస్సుగా భావించి చేసిన రచన ఇది అనిపిస్తుంది. 424 పేజీల ఆమె జీవిత కథ మురళీకృష్ణ గారి కొన్ని సంవత్సరాల కృషి కావచ్చు. ఇంకా ఆయన మన కోసం, లతాజీ పాడిన మొత్తం పాటల లిస్టు, తప్పనిసరిగా వినాల్సిన పాటల లిస్టు కూడా ఇచ్చారు. ఆమె గురించిన సమగ్ర గ్రంథం ఇది. హిందీ పాట తెలిసిన వారి ఇంటింటా ఉండాల్సిన గ్రంథరాజమిది.
మన భరతజాతి గర్వించదగ్గ లెజెండరీ సింగర్, క్వీన్ అఫ్ మెలోడీ అయిన లతా మంగేష్కర్ జీవిత చరిత్ర చదవడం చదువరులకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఎంతో శ్రమకోర్చి ఇంత చక్కని జీవితచరిత్రను అపురూపంగా మనకి అందించిన మురళీకృష్ణ గారి కృషి బహుధా ప్రశంసనీయం.
***


రచన: కస్తూరి మురళీకృష్ణ
పుటలు: 424
వెల: ₹ 300.00
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్లైన్లో తెప్పించుకునేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1298&BrandId=82&Name=Lata+Mangeshkar
https://www.amazon.in/Lata-Mangeshkar-Kasturi-Muralikrishna/dp/B0C6Y8QW1Z

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
10 Comments
కొల్లూరి సోమ శంకర్
Good afternoon Gowri Lakshmi garu, your analysis on Kasturi Murali Krishna gari “Sangeeta Saraswati Latha Mangeshkar ” is very nice. We are very thankful to you for the analysis and information about Sangeeta Saraswati Latha Mangeshkar, chala chakkaga vivarana icharu.






Rajendra Prasad
డా కె.ఎల్.వి.ప్రసాద్
గానకోకిల భారతరత్న కుమారి లతా మంగెేష్కర్ భారతదేశ సంగీత సామ్రాజ్యంలో మరచిపోలేని ఒక చరిత్ర సృష్టికర్త.తెలుగులో లతాజీ పాడిన “నిదురపోరా తమ్ముడా..” అన్న పాట మొదటిసారి విన్నవారికి,ఆవిడ తెలుగు గాయని అన్న భ్రమ కలుగుతూంది.అలాంటి ప్రతిభావంతురాలైన మధురగాయనీమణి గురించి
ప్రముఖరచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ,జీవిత చరిత్రను తెలుగు పాటక లోకానికి అందించి పుణ్యం కట్టుకున్నారు.
ఆ 400 పేజీల గ్రంధాన్ని ప్రముఖ రచయిత్రి,శ్రీమతి గౌరీ లక్ష్మి గారు తనదైన శైలిలో చక్కగా సమీక్షించి పుస్తకం వెంటనె చడవాలనిపించెే విధంగా,మన ముందు వుంచారు.ఈ విధంగా మంచి సమీక్షకుల లిస్టులో శ్రీమతి గౌరీ గారు చేరిపోయారు.ఈ కొనసీమ మిత్రమణికి, హృదయపూర్వక అభినందనలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్‌గూడ. సికిందరాబాద్
కొల్లూరి సోమ శంకర్
Mera Dil thadup huvaa ye padneke baadh saheli
abhinandanalu,,murali Krishna gariki,,,mariyu Saraswathi putrikaku 



Savitri pemmaraju
పుట్టి నాగలక్ష్మి
లతా మంగేష్కర్ గారి జీవితచరిత్రతో సమాంతరంగా వారి నేపథ్యసంగీతప్రస్థానాన్నీ,హిందీ సినిమా సంగీత చరిత్రతో సమ్మిళితం చేసి అపురూప గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించిన కస్తూరి మురళీకృష్ణ గారు అభినందనీయులు.
ఈ పుస్తకంలోని అన్ని కోణాలను నిశితంగా పరిశీలించి,లతాజీ గ్రంథ ఆత్మను పట్టుకుని తన సహజశైలిలో సుందర సరళ భాషలో, అలతి అలతి పదాలలో బంధించి, పాఠకులకి వెంటనే పుస్తకాన్ని చదివేయాలనే ఆసక్తిని కలిగించిన గౌరీలక్ష్మి గారికి ధన్యవాదాలు. రచయితకు, సమీక్షకురాలికీ హృదయపూర్వక అభినందనలు..
కొల్లూరి సోమ శంకర్
I have with great interest read the review of the book on Nightingale of India, Kumari Lata Mangeshkar.
A lot of details have been which we do not know though we are the vivid listeners of her song.
When I and Vani Jayaram were working together in 60s, she was singing in the functions. Her favourite songs were, ” I barakha Baha raayee…” “Ajaare maito kab se khadi sakati..”
She sang exactly sang like her.
Later she resigned and learnt Hindustani music.
Vasant Desai recogniser music talent and she became tge debut singer in Guddy” movie. She always praised Lataji as unique.
In duets, she sang exactly like tge male singer, may he be Rafi, Kishore, Hemanth Kumar or any other. She was so perfect.
She was my favourite singer. So obssessed by her singing that I also tried to sing her songs at tge age of 78, suddenly. I devote at least an hour to listen to her songs. We have no words left to extoll her.
The writer took so much of pain in narrating about the graph of Lataji in singing world.
And Lata liked the voice so much that she privately sang his song, “Suhani raat dal chuki, na jaane..” in the film Dulari.
So sweet..as sweet as Rafiji.
Their talent is God-given really.
I will buy tge book soon and read lije a text book.
Mrs Gouri Lakshmi has done great justice in her review of the book. I am afraid, Mrs Gouri is a singer by herself.
Here is Lataji song I liked..
“O gha sawari…”
In the film Abhinetri picturised on Hema Malini.
~
Raghavendra Rao
అల్లూరి Gouri Lakshmi
సమీక్ష చదివి మురళీకృష్ణ గారినీ నన్నూ అభినందించిన Dr.Prasad గారికీ..రాఘవేంద్ర రావు గారికీ,రాజేంద్రప్రసాద్ గారికీ,సావిత్రి గారికీ,నాగలక్ష్మి గారికీ కృతజ్ఞతలు మరీ మరీ తెలియచేస్తూ ఉన్నాను.మీ ప్రోత్సాహమే మాకు గొప్ప బహుమతి.ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్
ఇప్పుడే చదివాను.నీ సమీక్ష చాలా బాగుంది.లతా మంగేష్కర్ నా అభిమాన గాయని.ఆమె గురించి ప్రత్యేకంగా పుస్తకం వ్రాసిన మురళి కృష్ణ గారికి ధన్యవాదాలు
కనకదుర్గ పాకలపాటి
కొల్లూరి సోమ శంకర్
Alluri gouri laxmigaru ma lathaji gurinchina matter chudagane antho santhoshamanipinchindhi chiru jallulu namidha kurisi nattuga ubbi thabbibbayyanu naku nachinnappatinunchi lathaji songs ante pranam sangitha prapamchamlo aavidaku opika unnanthavaraku sangitha dharsakulu vadhili pettaledhu aa maahagayani gurinchi adhbhuthamaina vishayalu cheppina gouri gariki dhanyavadhalu
గాయత్రి, భీమవరం
కొల్లూరి సోమ శంకర్
రివ్యూ చాలా బాగుంది…
పుస్తకం చదవాలి అనిపిస్తోంది…
Shaameer janaki
P.Usha Rani
Excellent review madam.. chala bagundhi mee visleshana

