దృశ్యకథనం (Visual storytelling) ద్వారా కథ చెప్పిన నిజమైన దృశ్యకావ్యం ‘శంకరాభరణం’. సినిమాలో తులసి పాత్ర మాట్లాడే మాటలు బహుతక్కువ. అయినా ఆమెకు, శంకరశాస్త్రికి మధ్య సుదీర్ఘమైన సంభాషణలు జరిగినట్లు మనకు అనిపిస్తుంది. అదే దర్శకుడు కె. విశ్వనాథ్ గొప్పతనం.
తులసి ఒక వేశ్య కూతురు. విటుల్ని ఆకట్టుకుంటుందని సంగీతం, నృత్యం నేర్పిస్తుంది తల్లి. మన శాస్త్రీయ సంగీతం, నృత్యం అంతా భగవంతుడి ఆరాధనామయం. ఆ లక్ష్యం అవగతమౌతుంది తులసికి. ఇది పూర్వజన్మ సుకృతం. సంగీతనృత్యసాధనలోనే కాలం గడుపుతుంటుంది. సంగీతవిద్వాంసుడు శంకరశాస్త్రి అంటే తులసికి అపారమైన భక్తి. శంకరశాస్త్రికి ఒక్కతే కూతురు. ప్రసవసమయంలో భార్య మరణించింది.
గోదావరి ఒడ్డున కూతురి చేత సంగీతసాధన చేయిస్తున్న శంకరశాస్త్రి ఆ సంగీతానికి నృత్యం చేస్తున్న తులసిని చూసి విస్మయంతో పాట ఆపుతాడు. ఆమెలోని ప్రతిభని వెంటనే గుర్తిస్తాడు. అతను చూశాడని తెలిసి ఆమె బెరుకు పడుతుంది. ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? ఆమె ఎవరు, ఏమిటి అనేది అతనికి అనవసరం. ఆమెలోని కళే అతనికి కనిపించింది. ఇది శంకరశాస్త్రి ఔన్నత్యం. తులసి కోసమే మళ్ళీ పాట మొదలుపెడతాడు. ఆమె ఆనందంతో నృత్యం చేస్తుంది. పాట పూర్తయ్యాక అతనికి పాదాభివందనం చేస్తుంది. మీరే నా గురువులు అనే భావం ఉంటుంది అందులో. మాటలు లేకుండానే ఈ సన్నివేశమంతా నడుస్తుంది.
జమీందారు దగ్గరకి వెళ్ళమని ఒత్తిడి చేస్తున్న తల్లి నుంచి తప్పించుకుని రైలెక్కుతుంది. కచేరీకి వేరే ఊరెళుతున్న శంకరశాస్త్రి రైల్లో కనపడతాడు. తనతో తీసుకువెళతాడు. జరిగిన విషయం అతనికి చెప్పిందని అర్థం చేసుకోవాటానికి ఇక్కడ మాటలు అవసరం లేదు. రైలు దిగినప్పుడు శంకరశాస్త్రి వాద్యబృందం వారు తులసిని చూసి అవాక్కవుతారు. ఇక్కడ నేపథ్యంలో “ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలైనా కాంతదాసులే” అనే పాట సంగీతరూపంలో వినపడుతుంది. లోకులు ఏమనుకుంటున్నారో చెప్పకనే చెప్పారు దర్శకుడు. “లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడను” అంటాడు శంకరశాస్త్రి తర్వాత తన మిత్రుడైన లాయరు మాధవయ్యతో. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలవాడో మనకు అర్థమౌతుంది.
తులసి తల్లి బలవంతంగా తీసుకుపోయి తులసిని జమీందారుకి అప్పచెబుతుంది. అతను ఆమెను బలాత్కరిస్తాడు. “ఇప్పుడు కావాలంటే సంగీతం మాస్టారి దగ్గరికి పో” అంటూ శంకరశాస్త్రి పటాన్ని కాలితో తంతాడు. అతని మాటలో ఉన్న శ్లేష ఆమెకి అర్థమౌతుంది. అంతకన్నా తన గురువుకి జరిగిన అవమానమే ఆమెని బాధిస్తుంది. తనకు మానభంగం జరిగినా, గురువుతో అక్రమసంబంధం అంటగట్టినా రాని ఆగ్రహం ఆమెకి గురువుకి జరిగిన అవమానం వల్ల వస్తుంది. జమీందారుని పొడిచి చంపుతుంది. శరీరం కన్నా గురువు గౌరవానికే ప్రాధాన్యం ఇచ్చే పునీతమైన పాత్ర తలసి.
గురువు దగ్గరికే వెళుతుంది. జమీందారు రక్తంతో ఆయన పాదాలు కడుగుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ కూడా సంభాషణల అవసరం లేదు. దృశ్యమే అంతా చెబుతుంది. శంకరశాస్త్రి కోరిక మీద మాధవయ్య తులసి తరఫున వాదించి ఆమెను విడిపిస్తాడు. తులసి తల్లికి శిక్ష పడుతుంది. తులసిని తన ఇంటికి తీసుకువెళతాడు శంకరశాస్త్రి. దీంతో వంటలక్క ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఇక్కడ జంధ్యాల రాసిన మాటలు సంప్రదాయ కుటుంబాల్లో ఉండే పట్టింపులని తెలియజేస్తాయి. ఎవర్నీ తప్పుబట్టలేం. అంతరాత్మలు ఎంత పరిశుద్ధంగా ఉన్నా కట్టుబాట్లు కూడా ఉంటాయి మరి. ఆ కట్టుబాట్లని ఎదిరించాలంటే ఎంతో పోరాడాలి. వంటలక్క వెళ్ళిపోవటంతో చిన్నపిల్లైన శంకరశాస్త్రి కూతురు శారద మడిగట్టుకుని వంటకు సిద్ధపడుతుంది. నీళ్ళ బిందె మోయలేక కిందపడుతుంది. తులసితో “నీకు వంట చేతకాదా” అంటాడు శంకరశాస్త్రి. నేను నీచకులానికి చెందినదాన్ని కదా, నేను మీ ఇంట్లో వంట చేయవచ్చా అన్నట్టు తటపటాయిస్తుంది తులసి. “ఆచారవ్యవహారాలు మనసుని సక్రమమార్గంలో పెట్టడానికే గాని కులం పేరుతో మనుషుల్ని విడదీయటానికి కాదు” అంటాడు శంకరశాస్త్రి. కులం పేరుతో మనుషుల్ని అవమానించేవారికి ఇది చెంపపెట్టు.
తులసి కచేరీలకి వస్తుండటంతో వాద్యబృందంలోనివారు శంకరశాస్త్రిని వదిలి వెళ్ళిపోతారు. శ్రోతలు కూడా కరువవుతారు. శంకరశాస్త్రికి జరిగే అవమానాలు చూడలేక తులసి వెళ్ళిపోతుంది. తాను గర్భంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని జరిగినా మనోబలంతో ముందుకు సాగుతుంది. విషసర్పం శంకరునికి ఆభరణమైనట్టే ఒక దుర్మార్గుడి పాపఫలితమైన తన బిడ్డని శంకరశాస్త్రి పాదాల వద్దకి చేర్చాలనే ఆశయంతో కాయకష్టం చేసుకుని జీవిస్తుంది.
పన్నెండేళ్ళు గడిచిపోతాయి. పాశ్చాత్యసంగీతం హోరులో శాస్త్రీయసంగీతానికి ఆదరణ తగ్గుతుంది. శంకరశాస్త్రి ఇల్లు తాకట్టుపెట్టుకుని బతుకుతుంటాడు. తులసి తిరిగి ఆ ఊరికి వస్తుంది. తాను మళ్ళీ శంకరశాస్త్రి జీవితంలోకి ప్రవేశిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని భయపడి కొడుకు శంకరాన్ని అనాథగా అతని ఇంటికి పంపిస్తుంది. శంకరం పనులు చేసుకుంటూ సంగీతం నేర్చుకుంటాడు. ఒకరోజు మాధవయ్య తులసిని వీధిలో గుర్తుపట్టి ఆమె తల్లి ఆస్తిని ఆమెకు అప్పచెబుతాడు. వద్దంటే ఏదైనా పుణ్యకార్యానికి ఉపయోగించమని చెబుతాడు. తులసి అజ్ఞాతంగా ఒక కచేరీ హాలుని బాగుచేయించి శంకరశాస్త్రి కచేరీ పెట్టిస్తుంది. కచేరీ చేస్తున్న శంకరశాస్త్రికి గుండెపోటు వస్తుంది. శంకరం కచేరీ పూర్తి చేస్తాడు. శంకరశాస్త్రి తన గండపెండేరాన్ని శంకరానికి తొడిగి కన్నుమూస్తాడు. తన జీవితాశయం నెరవేరిన తులసి ఆయన పాదాల దగ్గర మరణిస్తుంది.
శాస్త్రీయసంగీతానికి పట్టం కట్టడటమే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం. దానికోసం ఒక కథ అల్లుకున్నారు. సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహదేవన్, ఆయన సహాయకుడు పుహళేంది అజరామరమైన పాటలు సృష్టించారు. పాశ్చాత్యసంగీతం మోజులో పడి శాస్త్రీయసంగీతాన్ని వేళాకోళం చేసే యువకులకు శంకరశాస్త్రి బుద్ధిచెప్పే సన్నివేశం కథోచితంగా ఉంటుంది. సంగీతం ఏదైనా అది దైవస్వరూపమే అనే మాటలు సామరస్యం విలువని తెలియజేస్తాయి. “బ్రోచేవారెవరురా” అనే కీర్తనలో అక్షరాలని విడగొట్టి భావాన్ని నాశనం చేసే సంగీతం మాస్టారుకి చీవాట్లు పెడతాడు శంకరశాస్త్రి. అర్థం తెలుసుకోకుండా పాడి భావాన్ని నాశనం చేసిన పరభాషాగాయకులను ఎందరినో తరవాతి కాలంలో చూశాం మనం. అదృష్టవశాత్తూ ఇప్పుడు అది తగ్గింది. ఈమధ్య వచ్చిన ‘హృదయం’ అనే మళయాళం సినిమాలో ‘నగుమోము’ కీర్తన విని నా మటుకు నేను ఎంతో సంతోషించాను. శాస్త్రీయసంగీతానికి మళ్ళీ మంచిరోజులు వస్తాయి అని శంకరశాస్త్రి అన్న మాటలు కొంతవరకు నిజమైనందుకు అందరం సంతోషించాలి. ఐశ్వర్యం పోయినా దేవుడిచ్చిన స్వరం ఉంది కదా అనే శంకరశాస్త్రి మనోనిబ్బరం హృదయానికి హత్తుకుంటుంది. “నేను బాధపడేది తిండి లేనప్పుడు కాదు, పాడలేనప్పుడు” అంటాడు. కళాకారులు కళాసేవలోనే తరిస్తారు.
తులసిగా మంజుభార్గవి అత్యద్భుతంగా నటించింది. ఆమె మాటలు లేకుండా భావాలను పలికించడం చిత్రం పొడుగునా చూస్తాం. బెరుకు, బాధ, జుగుప్స, రౌద్రం, దుఃఖం, జాలి, సంకోచం, నిర్వేదం, సంతోషం, ఆరాధన, పారవశ్యం, తృప్తి – ఇలా ఎన్నో భావాలు ఆమె ముఖంలో కనిపిస్తాయి. ఇక ఆమె నృత్యాల మాట చెప్పక్కరలేదు. అన్ని నృత్యాలు ఒక ఎత్తు, కొడుకు పాడుతుంటే ఆమె తనివితీరా నృత్యం చేసి మురిసిపోవటం ఒక ఎత్తు. శంకరశాస్త్రిగా సోమయాజులు, మాధవయ్యగా అల్లు రామలింగయ్య తమ పాత్రలకు ప్రాణం పోశారు. మాధవయ్య ఓ పక్క హాస్యం పండిస్తూనే మొండి పట్టుదలకు పోయే శంకరశాస్త్రిని చీవాట్లు పెట్టడం ఎంతో పాత్రోచితం. ఆ పాత్రల స్నేహం అలాంటిది. సినిమా మొదట్లో ఇద్దరు నటుల పేర్లూ కలిపి వేసి వారికి సమున్నత గౌరవం ఇచ్చారు.
శంకరశాస్త్రి కూతురు శారద (రాజ్యలక్ష్మి)కి, కామేశ్వరరావు (చంద్రమోహన్) అనే యువకుడికి మధ్య అన్నవరం కొండపై జరిగే ముచ్చటైన సన్నివేశాలని కూడా మాటలు లేకుండానే నడిపించారు దర్శకుడు. పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా చిలిపితనంతో హాయిగా ఉంటాయి ఆ దృశ్యాలు. నేపథ్యసంగీతం కూడా సన్నివేశాలకి తగినట్టే ఆహ్లాదంగా ఉంటుంది. కామేశ్వరరావుతో పెళ్ళిచూపులు జరుగుతున్నపుడు శారద పాట పాడుతూ పారవశ్యంలో అపస్వరం పలికితే శంకరశాస్త్రి ఆగ్రహించటం తెలుగు సినిమా చరిత్రలో మరచిపోలేని సన్నివేశాల్లో ఒకటి. ఈ సన్నివేశాలన్నీ తర్వాత కొన్ని సినిమాల్లో ప్యారడీ చేశారంటే ఇవి ఎంత ప్రజాదరణ పొందాయో ఊహించవచ్చు. కూతురి పెళ్ళిచూపులు రసాభాస కావటంతో తన మీద తనకే కోపం వచ్చి శంకరశాస్త్రి చేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుడికి హారతి ఇస్తాడు. తర్వాత సన్నివేశంలో కొబ్బరాకు మీద మంచు కారుతుండగా చీకట్లో వాకిట్లో పడుకుని తనలో తానే మథనపడుతుంటాడు. శారద వచ్చి అరచేతికి వెన్నపూస రాస్తుంది. కొబ్బరాకు మీద మంచు తెల్లవారుఝామున కారుతుంది. అంటే శంకరశాస్త్రి, శారద రాత్రంతా మేలుకునే ఉన్నారన్నమాట. ఒక రసజ్ఞుడు చెప్పగా నేను ఈ అపురూపమైన విషయం విన్నాను.
కె. విశ్వనాథ్ తర్వాత ఎన్నో ప్రజాదరణ పొందిన, అవార్డులు పొందిన చిత్రాలు తీసినా ‘శంకరాభరణం’ ఒక కలికితురాయిగా నిలిచిపోయింది. ఇతర చిత్రాల్లో నాటకీయత కోసం కథనంలో రాజీ పడ్డారని నాకనిపిస్తుంది. ‘సాగరసంగమం’లో మాధవి బాలుతో స్నేహం చేసినా తనకు పెళ్ళైన విషయం చెప్పకపోవటం మింగుడుపడదు. మొదట్లో చెప్పలేదంటే ఒప్పుకోవచ్చు. స్నేహం పెరిగిన తర్వాత కూడా చెప్పకపోవటం వింతగా ఉంటుంది. ఆ పెళ్ళి మీద తనకు ఆశ లేకపోయినా చెప్పకపోవటం తప్పే అని నా అభిప్రాయం. డాన్స్ ఫెస్టివల్లో బాలుకి తెలియకుండానే అతని నృత్యం ఏర్పాటు చేయటం కూడా నమ్మశక్యం కాని విషయం. పేరుప్రఖ్యాతులు లేని కళాకారుడికి చోటు ఇవ్వటమే పెద్ద విషయమైతే, అతనికి తెలియకుండా ఇవ్వటం మరీ విడ్డూరం. అతనికి విషయం తెలిసినపుడు ఉండే నాటకీయతను చూపించటం ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా అనిపిస్తుంది. వైధవ్యాన్ని పెద్ద శాపంలా చూపించటం ఇంకో సమస్య. వైధవ్యాన్ని దాచటానికి బొట్టు పెట్టుకోవటం ప్రేక్షకులని భావోద్వేగానికి గురిచేయటం కోసమే అనిపిస్తుంది. చివర్లో ఒక్క మాటతో మాధవి కూతురు శైలజలో పరివర్తన కలగటం కూడా నమ్మలేని విషయం. ఆ మాటేదో ముందే చెబితే సరిపోయేది కదా. ఇంతకీ ఈ సినిమాకి ‘సాగరసంగమం’ అని పేరెందుకు పెట్టారో నాకిప్పటికీ అర్థం కాలేదు.
పాత్రల గతంలో జరిగిన విషయాలను విస్మరించటం ‘స్వాతిముత్యం’లో కూడా కనిపిస్తుంది. లలిత ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. భర్త చనిపోతే మామగారి దగ్గరకు వెళుతుంది. ఆయన వెళ్ళగొడతాడు. అన్నగారి దగ్గరకు చేరుతుంది. అంత నిస్సహాయంగా ఉండే అమ్మాయి ప్రేమించి ఎలా పెళ్ళి చేసుకుంది? ప్రేమించే స్వాతంత్ర్యం ఉంటే తన కాళ్ళపై తాను నిలబడే ధైర్యం కూడా ఉండాలి. అప్పట్లో పరిస్థితులు వేరు అంటారా, మరి ప్రేమించి పెళ్ళి చేసుకోవటం కూడా అప్పట్లో పల్లెటూళ్ళలో మధ్యతరగతిలో అంత సాధారణం కాదు. ఈ చిత్రాలు మంచి చిత్రాలనటంలో సందేహమేమీ లేదు. కానీ పాత్రల ఔచిత్యం కొంతవరకు దెబ్బతిన్నదనే నాకు అనిపిస్తుంది.
‘శంకరాభరణం’ విడుదలైనపుడు మొదట్లో థియేటర్లలో ప్రేక్షకులు ఎక్కువ లేరు. క్రమంగా ఆ నోటా ఈ నోటా విని ప్రేక్షకులు థియేటర్లకి వరస కట్టారు. నా చిన్నతనంలో మా కుటుంబమంతా ఈ సినిమా చూడటానికి వెళ్ళటం, టికెట్ల కోసం మా అమ్మ ముందే వెళ్ళి క్యూలో నిలబడటం నాకింకా గుర్తే. ఆ తర్వాత చాలా ఏళ్ళు పొద్దున్నే గుడి స్పీకర్లో ‘శంకరాభరణం’ పాటలు వినపడేవి. దక్షిణభారతంలోనే కాదు, ఉత్తరభారతంలో కూడా పాటలు ప్రజాదరణ పొందాయి. సినిమాకి అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు వచ్చింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. మహదేవన్కి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు, నంది అవార్డు వచ్చాయి. వాణీ జయరాం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయనీగాయకులుగా జాతీయ అవార్డు, నంది అవార్డు వచ్చాయి. వేటూరి సుందరరామమూర్తికి ఉత్తమ గీతరచయితగా నంది అవార్డు వచ్చింది. ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తున్న తులసి శంకరంగా నటించి ఉత్తమ బాలనటిగా నంది అవార్డు అందుకుంది.
“దొరకునా ఇటువంటి సేవ” చివరి కచేరీలో శంకరశాస్త్రి పాడే పాట. పాటలో అనుపల్లవి “నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ”. ఈ అనుపల్లవి విని వేటూరితో ఆత్రేయ “అంత పెద్ద అనుపల్లవి రాశావేమిటయ్యా? అది పాడటానికి ఊపిరి చాలకే శంకరశాస్త్రికి గుండెపోటు వచ్చింది” అన్నారట.
‘శంకరాభరణం’ ఎన్నో కళాత్మక చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. బాపు ‘త్యాగయ్య’, దాసరి ‘మేఘసందేశం’, జంధ్యాల ‘ఆనందభైరవి’, వంశీ ‘సితార’ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ అవార్డులు అందుకున్న సినిమాలే. ‘శంకరాభరణం’ శాస్త్రీయసంగీతం పట్ల ఆసక్తిని పెంచిందనటం నిర్వివాదాంశం. దృశ్యాలతోను, హావభావాలతోనూ, సంగీతంతోనూ కథ నడిపించి ఒక దృశ్యకావ్యాన్ని రూపొందించిన కె. విశ్వనాథ్ ధన్యులు.
Sankaraabharanam ante naku BALUGARE GURTUVASTAARU! ENTA GOPPAGAA PADERO>
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పూచే పూల లోన-73
శ్రీ మహా భారతంలో మంచి కథలు-4
పదసంచిక-63
జీవన వంచితులు
రామం భజే శ్యామలం-55
సంచిక – పద ప్రతిభ – 95
నీలమత పురాణం – 21
ఫొటో కి కాప్షన్-39
అత్తగారు.. అమెరికా యాత్ర 4
బాల్యపు వీధులలో విహారం – ‘పగడాలూ… పారిజాతాలూ…’ పఠనం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®