Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సెకెండ్ షో

[శంకర ప్రసాద్ గారి ‘సెకెండ్ షో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సుబ్బారావుకి సెకెండ్ షో సినిమా చూడటం చాలా ఇష్టం. అది కూడా వేసవికాలంలో అయితే ఇంకా ఇష్టం. దీనికి చెప్పుకోదగ్గ ప్రత్యేక కారణాలు ఏమీ లేవు.

వేసవిలో కరెంటు కోత, ఉక్కపోత, రెండో ఆట సినిమాకి AC సినిమా హాలుకెల్తే, చల్లగా హాయిగా ఉంటాది. జనాలు ఎక్కువ ఉండరు. ప్రశాంతంగా ఉంటాది.‌ ఓ రెండు గంటలు రెండో ఆటలో రెస్టు తీసుకోవచ్చు. అదీ అసలు కారణం.

కళాచిత్ర థియేటర్‌లో ఏదో కొత్త దెయ్యం సినిమా వచ్చిందట.. వేసవికాలం, దెయ్యం సినిమా, రెండో ఆట, పెద్దగా జనాలు ఉండరు. హాయిగా పడుకోవచ్చు.. అనుకొని రెండో ఆటకి వెళ్ళటానికి డిసైడ్ అయ్యాడు సుబ్బారావు.

రాత్రి భోజనం మామూలు టైంకే చేసాడు. బ్యాచిలర్ బతుకు. వంట చెయ్యటం వచ్చు.. దాని వలన సుబ్బారావుకి భోజనం ప్రాబ్లం లేదు. సెకెండ్ షో కాబట్టి భోజనం తాపీగా ముగించాడు. టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతోంది. రూంలో ఉక్కపోత విపరీతంగా ఉంది. ఫ్యాను గాలి పని చెయ్యటం లేదు. షో రాత్రి 9.30 కి. నెమ్మదిగా లేచి, బట్టలు వేసుకున్నాడు సుబ్బారావు.

రూం బయటకి వచ్చి తాళం వేసాడు. అతడి అద్దె రూం, మేడ పైన ఉంది. కిందకి దిగి మెయిన్ గేటు దగ్గరకి వచ్చాడు, ఓసారి వెనక్కి తిరిగి కింద పోర్షన్లో ఉన్న ఓనరు ఇంటి వైపు చూసాడు. అందరూ నిద్ర పోయినట్టున్నారు. నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు రాకుండా గేటు నెమ్మదిగా తెరిచి స్కూటర్‌ని బయటకి తీసుకెళ్ళి స్టాండు వేసి మళ్ళా వచ్చి మెయిన్ గేటు వేసి స్కూటర్ స్టార్టు చేసాడు.

బండిని మెల్లగా ముందుకు పోనిచ్చాడు. పావుగంట తరువాత కళాచిత్ర సినిమా హాలు దగ్గర ఉన్నాడు. 9.00 గంటలయ్యింది. అంతకు ముందే మొదటి ఆట అయిపోయినట్టుంది. సినిమా హాలు ముందు పెద్దగా జనాలు లేరు ఒకరిద్దరు కనిపించారు.

9.15 అయ్యింది. కౌంటరు దగ్గరకి వెళ్ళి ఒక బాల్కని టిక్కెట్ తీసుకున్నాడు.

హాలుకి ఆనుకుని ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్టు కొని, ఒక సిగరెట్టు తీసి వెలిగించాడు. 9.25 అయ్యింది. సగం కాల్చిన సిగరెట్ ఆఖరి దమ్ము గట్టిగా పీల్చి, సిగరెట్ పడేసాడు. సినిమా హాల్లోకి వెళ్ళాడు. బాల్కనీకి వెళ్ళాడు. తను తప్ప ఇంకెవరూ లేరు. ఏసీ బాగా తగిలే సీటు చూసుకొని కూర్చున్నాడు.

స్క్రీన్ మీద ప్రకటనలు అయిపోయాయి. అసలు సినిమా  మొదలయ్యింది. టైటిల్స్.. అప్పుడు పరికించి చూసాడు సుబ్బారావు, సినిమా టైటిల్.. అంత వరకు హాల్లో పడుకునే ఆలోచనలోనే ఉండటం వలన టైటిల్‌ని లోపల కూర్చున్నంత వరకు పట్టించుకోలేదు. ఇంతకీ సినిమా టైటిల్.. ‘నీ పక్కనే దెయ్యం..!!!’.

ముందు టైటిల్ చూడగానే గతుక్కుమన్నాడు సుబ్బారావు. తరువాత లైట్ తీసుకున్నాడు. నేను సినిమా చూస్తానా ఏంటి.. నిద్రపోయేదానికి ఏ సినిమా అయితే ఏంటి.. అని ఏసీ చల్లదనానికి హాయిగా కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. గంట సినిమా అయ్యింది. మగత నిద్రలో ఉన్న సుబ్బారావుకి తన భుజం మీద ఎవరో తల పెట్టినట్టుగా అనిపించింది. మెల్లగా కళ్ళు తెరచి చూసాడు. ఎవరో స్త్రీ జుత్తు విరబోసుకొని తెల్ల చీర కట్టుకొని, తల తన భుజం పైన పెట్టి ఉంది. సుబ్బారావుకి గుండె ఆగినంత పని అయ్యింది. తుళ్ళి పడి లేచాడు. పక్కన ఉన్న స్త్రీ కనిపించలేదు. అక్కడ ఎవరూ లేరు.

సుబ్బారావుకి నిద్ర మత్తు ఎగిరిపోయింది. భయం మొదలయ్యింది. బిక్కుబిక్కుమంటూ సినిమా చూడటం మొదలు పెట్టాడు. సినిమాలో దెయ్యం చేసే భీభత్సం కనిపిస్తోంది. ఏసీలో కూడా సుబ్బారావుకి చెమటలు పట్టడం మొదలయ్యింది. ఇంతలో తన వెనుక సీటులో ఎవరో కదిలినట్టు అనిపించింది. సుబ్బారావుకి గుండె దడ మొదలయ్యింది. మెల్లగా తల కొంచెం పక్కకి తిప్పి వెనక్కి చూసే ప్రయత్నం చేసాడు. తెల్ల చీర కనిపించింది. సుబ్బారావుకి పై ప్రాణాలు పైకి పోయినట్టు అనిపించింది. గొంతు తడారిపోయింది. ఒక్క ఉదుటున లేచి గబగబా బయటకి వెళ్ళిపోయాడు. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఎలాగో కష్టపడి స్కూటర్ స్టార్ట్ చేసి మరి వెనక్కి చూడకుండా ఇంటి వైపు బండి జోరుగా పోనిచ్చాడు. మరి జన్మలో సెకెండ్ షో చూడకూడదని నిర్ణయించుకున్నాడు.

ఇంతకీ జరిగినది ఏమిటంటే, బాల్కనీ వెనక సీట్ల వెనుక ఉన్న తెల్ల కర్టెన్ జారిపడి కొంత సుబ్బారావు భుజం మీద కొంత వెనుక సీటు పైన పడింది. నిద్రమత్తులో సుబ్బారావుకి అది దెయ్యంలా కనిపించింది.

సమాప్తం

Exit mobile version