నాకు పండగొచ్చిందంటే భయం!
అల్లుడొస్తాడనో –
మామూలోళ్ళస్తారనో కాదు!
నా భార్యను చూస్తేనే!?
పండుగ శుభాకంక్షలు
చెబుదామని సెల్‌ఫోన్ తీస్తానా –
వంటింట్లో గిన్నెలు
శివతాండవమాడతాయి!
మాటల తూటాలు గుండెను
తూట్లు పొడుస్తాయి!
నే బడుద్ధాయినై వెలవెలబోతాను!
శుభాకాంక్షలు గాలిలో కల్సిపోతాయ్!
వెంటనే సెల్‌ఫోన్ మూగబోతుంది
ఉగాది కవిత్వమై ఊరేగాలనుకుంటానా –
కలం తీసి కాగితం మీద పెట్టబోతానా –
“బుద్ధి లేకపోతే సరి
పొద్దున్నే పనికిమాలిన పనులు
కాస్త వంటింట్లో సహాయం చెయ్యొచ్చుగా!”
సర్రున సతీమణి లేస్తుంది!
కాగితం మూడు ముక్కలై
మూలన మూలుగుతుంది!
కలం గోడకెళ్ళి బుర్ర బాదుకుంటుంది!
హృదయం ఛిద్రమై
మౌనం విస్ఫోటిస్తుంది!
ఇక ఇంట్లో సీతారామయుద్ధం మొదలౌతుంది!
అంతరంగాలు అల్లకల్లోలమై
ఆధ్యాత్మిక భావన అటకెక్కుతుంది!
అందుకే పండగంటే నాకు భయం
భార్యామణి ఇవ్వాలి అభయం!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.