శత్రువు సహజంగానే నీకు గురి పెడుతుంటాడు
వాడు నిన్ను ద్వేషిస్తూనే ఉంటాడు!
ఈర్ష్యా, అసూయలతో రగిలిపోతూనే ఉంటాడు!
బురద జల్లుతూ, అభాండాలు వేస్తూ కాలం గడుపుతుంటాడు!
నీకెప్పుడూ కీడు తలపెడుతూనే ఉంటాడు!
నీ కదలికల నెప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు!
నీ బలహీనతల కోసం వెదుకుతూనే ఉంటాడు.
వాడి బుర్రెప్పుడూ దయ్యాల కార్ఖానాలాగే పనిచేస్తుంది!
వాడి శక్తులూ, యుక్తులూ కుయుక్తులై ఉంటాయి!
ఒక్కోసారి –
నీ శ్రేయోభిలాషి లాగే నటిస్తుంటాడు.
నీ వెంటే ఉంటూ శల్య సారథ్యం వహిస్తాడు.
నారదుడై నీ మాటల్నే మంటలుగా మండిస్తాడు.
నీ సంతోషం వాడికి విషాదమవుతుంది!
నీ విజయం వాడికి పరాజయమవుతుంది.
నీ పురోగమనం వాడికి తిరోగమనమవుతుంది.
నీ పరాభవం వాడికి ఉల్లాసంగా ఉంటుంది.
నీ పరాజయం వాడికి ఉత్తేజాన్నిస్తుంది!
నీ పతనం వాడికి ఉత్థానమవుతుంది.
వాడు నివురు గప్పిన నిప్పులా
కుబుసం వీడని పాములా
అదను కోసం ఎదురుచూస్తూంటాడు
నిన్ను వెన్నంటే నీడ వాడు!
నిన్ను ఉరివేసే తాడు వాడు!
నీ కంట్లో నలుసు వాడు!
నీ ఒంట్లో నలత వాడు!
వాడెన్ని సార్లు ‘క్లిక్’ చేసినా
నువ్వు ఓపెన్ కాని పేజీలా ఉండాలి!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.