[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]


సత్యం ఏమిటో
~
చిత్రం: అతిథి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గానం: దీపు, ఉష


~
పాట సాహిత్యం
పల్లవి:
అతడు: సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
ఆమె: నిను నీవే సరిగా కనలేవే మనసా
అతడు: నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయట పడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చరణం:
అతడు: చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు గనుక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎప్పుడైనా
ఆమె: నిను నీవే సరిగా కనలేవే మనసా
అతడు: నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
చరణం:
అతడు: పోయింది వెతికే వేదన, పొందింది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి, అలజడి నిలిచేదెపుడో? సందేహం కలిగే మదికి, కలతను తీర్చేదెవరో?
శాపంలాగ వెంటపడతున్న గతం ఏదైనా
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా?
॥ సత్యం ఏమిటో ॥
♠
కళ్ళకు కనిపించినదంతా సత్యం కాదు కనిపించనిదంతా భ్రమా కాదు. సత్యం కానిదాన్ని మిథ్య అనీ, మాయ అనీ, బ్రాంతి అనీ, స్వప్నమనీ నిర్వచిస్తూ ఉంటారు. కనిపించనిది భ్రాంతి కాదు. మన భ్రాంతులు సత్యాలు కాలేవు. మన భావాలకు అనువుగా వస్తువులు ఉండవు. సూక్ష్మదర్శిని, యంత్రసహాయంతో మనం దర్శిస్తేనే కొన్ని వాస్తవాలను గ్రహించగలం. ‘దూరపు కొండలు నునుపనే’ వాదన, ‘రజుసర్ప భ్రాంతి’ భ్రాంతులే కాని వాస్తవాలు కావు. వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకొనే ప్రక్రియనే మాయ అంటారు.
ఆది శంకరాచార్యుల ప్రసిద్ధ వాక్యం “బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య” అద్వైత వేదాంత దర్శనం యొక్క ప్రధాన స్తంభం. సత్యం అంటే నిరంతర వాస్తవం బ్రహ్మ అంటే అంతిమ, నిత్యమైన, శాశ్వతమైన వాస్తవం. ఎప్పుడూ మారని స్వభావం కలది సత్యం. మిథ్య అంటే, తాత్కాలికమై, అనుభవంపై ఆధారపడి, నిరంతరం మారుతూ వుండే సాపేక్ష వాస్తవం. మిథ్య అంటే అసత్యం కాదు. సంఘటనలు క్షణికం; ఆలోచనలు, భావాలు క్షణికం; అనుభవాలు వ్యక్తిగతం; జ్ఞాపకాలు కల వంటివి; సంబంధాలు కాలంతో మారుతాయి; భౌతిక వస్తువులు నిరంతరం మారుతాయి. ఇవన్నీ మిథ్యను కల్పిస్తాయి.
అతిథి చిత్రంలో ‘సత్యం ఏమిటో, స్వప్నం ఏమిటో చెప్పేదెవరు? ఏ కంటికైనా’.. పాటలో సిరివెన్నెలగారు వేదోపనిషత్తుల సారాన్ని రంగరించి, మనకు అందించారు. చిత్రపరంగా మనకు కనిపించే చిత్రీకరణ, నేపథ్యం, అభివ్యక్తి.. కథాపరంగా అన్వయించుకునేలాగా అనిపిస్తుంది. కానీ, మరో కోణంలో పరిశీలిస్తే, పాట పూర్తిగా సత్యం, మాయల ఆట అయిన జీవిత చిత్రాన్ని చూపిస్తుంది. కళ్లకు కనిపించే matter, పదార్థాన్ని సత్యం అనుకొని, కనిపించని చైతన్యాన్ని, లేదా energy ని భ్రమ అనుకుంటూ ఉంటాం. ఈ విషయంలో Advanced Research చేసిన Hans Peter Duerr, మనమందరం ఆశ్చర్యపోయే, వేదాలు ఏనాడో చెప్పిన ఒక సత్యాన్ని మనకు చెబుతున్నారు.
‘I studied matter for the last 35 years, only to find out that it does not exist! I have been studying something that does not exist’. – exactly what Adi Shankara said long back from the Upanishads- “All that you see doesn’t exist”
ఇక సిరివెన్నెల ఈ పాటను చిత్రంలో ఏ నేపథ్యం కోసం వ్రాశారో ఒకసారి గమనిద్దాం. హీరో, హీరోయిన్లు చిన్నపిల్లలుగా ఉన్న సందర్భం నుండి కథ ప్రారంభమవుతుంది. ఢిల్లీలో ఒక అనాథ కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి ‘అతిథి’గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను హత్య చేయగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది. 14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలు నుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, తల్లిదండ్రులను చంపిన ఆ కుర్రవాణ్ణి ఆ యువతి ఇప్పటికీ ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. ఆ అమృతే తను వెతుకుతున్న చిన్ననాటి స్నేహితురాలని తెలుసుకున్న ‘అతిధి’, నిజాన్ని ఆమెకు ఎలా చెప్పాలో అర్థంకాక, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకుంటుండగా చూసిన పోలీసులు తనని అరెస్ట్ చేశారనే బాధను వ్యక్తపరుస్తూ, చేయని నేరానికి తాను శిక్ష అనుభవించానని బాధపడుతూ, తనే దోషి అనుకొని హీరోయిన్ తనను ద్వేషించడం భరించలేక.. ఈ నిజాన్ని ఆమెకు ఎవరు తెలియజేస్తారని ఆవేదనలో ఉన్నప్పుడు వినిపించే నేపథ్య గీతం.. ‘సత్యం ఏమిటో? స్వప్నం ఏమిటో?’
Danni Bond ఇలాంటి భావాలనే వ్యక్తపరుస్తూ వ్రాసిన Dreams vs Reality అనే కవితను పరిశీలిద్దాం. స్వప్నాలు మనకు ఆనందంగా అనిపించినా, ఆశలకు ఊపిర్లు పోసినా, నిజమైన అనుభవమేమో అన్న బ్రాంతి కలిగించినా, అంతా బాగానే ఉందని అనిపించినా, నిజం బయటపడగానే, ఆ కల క్షణాల్లో కరిగిపోతుంది. కానీ సత్యం ఎప్పటికీ మారదు. అది మంచి – చెడులు రెండింటికి అతీతమైనది. కానీ, కలలను నిజాలని నమ్మించుకోగలిగితే, అవి సాకారమైతే మన మనసు మన అదుపులోకి వస్తుంది.. అంటున్నారు Danni Bond.
Dreams make reality worse.
They bring expectations up.
They make everything seem okay.
They make us happy,
They make us laugh,
They make us feel good,
They make us love.
And everything’s okay.
But then,
In a matter of seconds,
hat dream is crushed!
Devoured by reality.
Reality has always been reality.
Its never been good,
Its never been bad.
But once a dream can show that reality can be perfect,
It sets your expectations up.
Making reality,
Which was once bearable,
A living nightmare.
Leaving us with pain,
Sorrow,
Hurt,
Regret,
Leaving us with feelings,
Feelings we once had under control.
Feelings that now control you.
And these feelings will stay
Until you learn to control them,
Once More.
ఇక పాట విశ్లేషణలోకి వెళ్తే, కొండల్లో.. కోనల్లో.. ఎవరూ లేని నిర్జన ప్రదేశాల్లో.. హీరో, హీరోయిన్ల మనోభావనలు వ్యక్తపరిచేలాగా, వారి మనసులు పాడుకుంటున్నట్టుగా, నేపథ్యంలో మనకు ఈ గీతం వినిపిస్తుంది.
పల్లవి:
అతడు: సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
ఆమె: నిను నీవే సరిగా కనలేవే మనసా
అతడు: నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయట పడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా


నిరపరాధి అయిన తనను, తన తల్లిదండ్రులను చంపిన హంతకుడిగా హీరోయిన్ భావించడం, హీరోకు చాలా వేదనను కలిగిస్తుంది. అసలైన సత్యం ఆమెకు ఎలా తెలుస్తుంది? అనే బాధను పల్లవి వివరిస్తుంది. నిజమేంటో, అబద్ధం ఏంటో ఏ కంటికి అయినా ఎలా తెలుస్తుంది? కళ్ళతో చూసిందే నిజమని ఎవరైనా నమ్ముతారు. కంటికి కనిపించే దృశ్యం వెనుక దాగి ఉన్న నిజాన్ని మనసు మాత్రమే గ్రహించగలుగుతుంది. తాను చూసిన దాన్నే నిజమని భావించేవారి కళ్ళు సత్యాన్ని గుర్తించకుండా మూసుకుపోయి ఉంటాయి. /రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా../ ఆ చీకట్లో నుండి నిజమైన కాంతిని, అసలైన సత్యాన్ని గుర్తించే దారి ఏది? అని హీరో మథన పడతాడు.
దానికి సమాధానంగా/నిను నీవే సరిగా కనలేవే మనసా/ అంటే మనసును.. మనసే గుర్తించలేకపోతోంది, అని హీరోయిన్ సమాధానం ఇస్తుంది. ఈ సమాధానంలో ఎంతో లోతైన ఆత్మజ్ఞాన విశేషాలు కూడా ఉన్నాయి. తనను తాను గుర్తించిన మనసు, సృష్టిలో దేన్నైనా సరిగ్గా గ్రహించగలుగుతుంది. అందుకే ఆధ్యాత్మికవేత్తలందరూ.. నీవు ఎవరో ముందుగా తెలుసుకో! అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు.
దీనికి సమాధానం హీరో ఇలా అంటాడు. /నడిరాతిరి నడక కడతేరదు తెలుసా../ చీకట్లో ప్రయాణం మొదలు పెడితే.. ఏ దారిలో వెళ్తున్నామో, ఏ గమ్యం మనకే తెలియదు. ఇక్కడ నడిరాత్రి అంటే సత్యం తెలుసుకోలేని చీకటి. ఆ చీకటి నుండి వెలుగులోకి నడిచినప్పుడు మాత్రమే గత జ్ఞాపకాల సుడుల నుండి బయటపడి, ఆశావహమైన, తీయటి భవిష్యత్తులోకి మనసు ప్రయాణించగలుగుతుంది. నీవు నమ్మిన బ్రాంతిలోనే ముందుకు వెళుతూ ఉన్నావు కాబట్టి, ఆ చీకటిని వదిలించుకొని, అందమైన భవిష్యత్తు నీకు ఎలా ఆహ్వానం పలుకుతుందో ఒకసారి చూడు అని హీరో దానికి సమాధానం ఇస్తాడు.
చరణం:
అతడు: చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా, భ్రమలో పడమా తెలిసి జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు గనుక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎప్పుడైనా
ఆమె: నిను నీవే సరిగా కనలేవే మనసా
అతడు: నడిరాతిరి నడక కడతేరదు తెలుసా


సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవనీ, భూభ్రమణం వల్లే మనకు అలా అనిపిస్తాయని తెలిసినా.. మనందరం ‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.. పడమట అస్తమిస్తాడు’.. అని వల్లె వేస్తుంటాం.. అదే విధంగా చంద్రుడి ఎదలో రగులుతున్న మంటను (హీరో మనసులోని ఆవేదనను) అందరూ వెన్నెల అనుకుంటారు. ఆ విషయం నిజమే అని మనకు తెలిసినా మనము నమ్మం. చల్లటి వెన్నెల అనే భావంలోనే దాన్ని ఆస్వాదిస్తాం.. కానీ సత్య మూలాల్లోకి వెళితే.. ఆ చల్లదనానికి మూలం సూర్యునిలోని వేడే కదా! ఒకవేళ ఈ సత్యం తెలుసుకున్నా, జాబిలి చల్లనివాడు కాదని.. అతడితో చెలిమిని వదులుకుంటామా? మన జీవితంలో నుండి ఆ చల్లని జాబిల్లిని వెలివేసుకుంటామా? వేసుకోము కదా! అదేవిధంగా నీ భ్రమ వెనుక ఉన్న నా నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకో.. అన్న లోతైన హీరో మనోభావన ఇందులో దాగి ఉంది.
దీనితోపాటు సిరివెన్నెల మరొక ఉదాహరణ ఇస్తున్నారు. ప్రతిదానికి మనం సాక్ష్యం ఉంటేనే నమ్ముతామా? సాక్ష్యం లేని సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయమా? అనే భావాన్ని వ్యక్తపరుస్తూ, /రూపం లేదు గనుక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎప్పుడైనా/ అంటారు. ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘మెరిసే తారలదే రూపం’ పాటలో /ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?.. గానం పుట్టుక గాత్రం చూడాలా?.. అని ప్రశ్నించినట్టుగానే, ఈ పాటలో కూడా ప్రాణం ఉందా లేదా అని అనుమానిస్తూ, దాని ఉనికిని పరీక్షిస్తామా? లేక రూపం లేదు కాబట్టి దాని ఉనికిని గుర్తించలేమని వదిలేస్తామా? అనే సముద్ర గంభీరమైన ప్రశ్నలను సంధిస్తున్నారు సిరివెన్నెల.
/నిను నీవే సరిగా కనలేవే మనసా/ అన్న హీరోయిన్ స్పందన/నడిరాతిరి నడక కడతేరదు తెలుసా.. అనే హీరో ప్రతిస్పందన.. ఇక్కడ రిపీట్ అవుతాయి.
I walk two roads, yet stand in place,
One bound by time, one lost in space.
In daylight’s grasp, my mind is clear,
But in the night, new worlds appear.
By day, I wear a mask of stone,
Chained to a life that’s not my own.
The clock ticks loud, the world spins fast,
Reality is truly rigid cast.
But in the quiet depths of sleep,
I dive into the ocean deep.
Where dreams unravel, wild and free,
And show the self I long to be..
Reality speaks in a measured tone,
It built with bricks and makes its throne.
But dreams, they sing in whispered rhyme,
A symphony untouched by time..
అనేది ఇలాంటి భావాలనే వ్యక్తపరుస్తూ Kapil Sharma తన కవిత ద్వారా ఇచ్చే వివరణ.
చరణం:
అతడు: పోయింది వెతికే వేదన, పొందింది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి, అలజడి నిలిచేదెపుడో? సందేహం కలిగే మదికి, కలతను తీర్చేదెవరో?
శాపంలాగ వెంటపడతున్న గతం ఏదైనా
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా?


మనిషి ఏదైనా పోగొట్టుకున్నానన్న నిరాశలో వేదనలో ఉన్నప్పుడు, తను పొందిన వరాలను, అదృష్టాన్ని గుర్తించలేడు. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా, Attitude of Gratitudeను Ho’oponopono message ద్వారా వైరల్ చేస్తున్నారు. ‘Count your blessings’.అనే సందేశంతో ముందు మనం పొందిందేమిటో గుర్తించి విశ్వానికి కృతజ్ఞతలు చెల్లించమంటున్నారు. దాని ద్వారా విశ్వం నుండి మనకు మరింత సానుకూలమైన అవకాశాలు, సహకారం లభిస్తాయని గ్రహించమంటున్నారు. అందుకే ఈ పాటలో కూడా /పోయింది వెతికే వేదన, పొందింది ఏదో పోల్చునా/ అనే expressionతో సిరివెన్నెల అదే అంశాన్ని చర్చిస్తున్నారు. ఒక బాధల సుడిగుండాన్ని మనసులో దాచుకొని, సముద్రంలాగా నిత్యం అలజడి అలలతో ఎగిసి పడుతూ ఉంటే.. ఆ మనసుకు నెమ్మదితనం, ప్రశాంతత ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. మనసులో ఏదైనా సందేహం కలిగితే, నిజాన్ని నిగ్గు తేల్చే దాకా సత్యాన్వేషణ చేయాలి. అప్పుడే మనిషికి ఊరట కలుగుతుంది. అలా కాకుండా, సందేహాన్ని మనసులోనే దాచుకొని నిరంతరం ఒత్తిడికి గురవడం వల్ల ఆ సందేహం తీరిపోతుందా? ఎవరు వచ్చి ఆ సందేహాన్ని నివృత్తి చేయగలరు? అంటూ సిరివెన్నెల మార్గదర్శనం చేస్తున్నారు. /శాపంలాగ వెంటపడతున్న గతం ఏదైనా ..దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా?/ శాపం లాగా మారి తనను వెంబడిస్తున్న తన గతం.. ఆ చీకటిని తొలగించే దీపం లాగా.. నిజాన్ని వెల్లడించే దారిని చూపగలుగుతుందా? అన్న హీరో సందేహంతో.. పాట ముగుస్తుంది.
అర్థం చేసుకుంటే ఈ పాటలోని తాత్విక చింతన, మనల్ని ఎంతో కదిలిస్తుంది. మనమందరం మాట్లాడుకునే Material Science అయినా, ఆధ్యాత్మికతకు పట్టుకొమ్మయిన సత్యాన్వేషణ అయినా, మనల్ని ఒకే గమ్యానికి చేరుస్తుంది. సత్యము, (స్వప్నము) భ్రమల మధ్య తేడా అర్థం చేసుకోగలిగితే, సృష్టి రహస్యాలన్నీ మనకు అర్థమైనట్టే. సిరివెన్నెల గారి పాటలలో నిజమైన భావాన్ని గ్రహించాలంటే, రసానుభూతిని పొందాలంటే, ఆయన సాహితీ సృజన – పైపైన మనకు కనిపించే అర్థము, భావము, పదవిన్యాసము, అలంకారాలు, తళుకులు, మెలికలు.. పరిశీలిస్తే సరిపోయేది కాదు. ఆయన రాసిన భావాన్ని మన మనసు గ్రహించాలంటే, లోతుల్లోకి.. మన మనసు లోలోతుల్లోకి వెళ్ళగలగాలి. మనం అలా మనలోకి ప్రయాణించాలంటే.. మనల్ని మనం ప్రశ్నించుకొని, సమాధానాలు వెతుక్కోవాలి. అలాంటి తార్కిక చింతన పెంచి మన ప్రశ్నలకు మనమే సమాధానాలు వెతుక్కునేలా చేయగలగడమే సిరివెన్నెలగారి ప్రత్యేకమైన, ప్రభావవంతమైన శైలి.
/నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులువ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా../
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ముచ్చటిస్తున్నప్పుడు, ‘సినీ గేయ సాహిత్యంలో నాకన్నా ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. కానీ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తరువాత అంతటి తాత్త్విక చింతన కలిగిన కవిని నేనే’ అని స్వయంగా చెప్పుకుని మురిసిపోయారు. ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయిన తాత్త్వికత, మనకు దాదాపు ఆయన అన్ని పాటల్లో అంతర్లీనంగా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ఆయన ఒక Deep Philosophical Thinker అనీ, సత్యాన్వేషి అనీ, ఆయన సాహిత్య అభివ్యక్తులు మనకు ఋజువు చేస్తాయి. ఆయన సాహితీ తపస్సంతా ఆలోచనలు రేకెత్తించి, ప్రేరణ కలిగించి, తమ జీవితాన్ని తాము సారవంతంగా ఆనందంగా మార్చుకునేలాగా చేయగలగడమే!
Images Source: Internet

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.