Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సీతా రామ లక్ష్మణులు లేని రామాయణం

[ఒడియాలో డా. నిఖిలానంద పాణిగ్రాహి రచించిన కథని అనువదించి అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి.]

దేబరాజ్ బాబులో ఒక గుణం ఉంది. తనకిష్టం లేని విషయాలని ప్రస్తావించటానికి కూడా అతడు ఇష్టపడడు. ఎవరైనా వాటిని గూర్చి తెలుసుకోవటానికి ఆసక్తి చూపితే అదేం పెద్ద గొప్పవిషయం కాదని తేలిగ్గా తీసిపారేస్తాడు. కానీ ఎవరైనా పదేపదే వాటినే ప్రస్తావిస్తూ మాట్లాడుతుంటే అతడు మరి మొండిగా వాదించడు.

అతడికి ఒకమారు ఇలాంటి సందర్భం ఒకటి ఎదురైంది. ఒకసారి ఒక సభకి వెళ్లాల్సివచ్చింది.. నిజానికి సభలో తన పాత్ర ఏమిటో అతడికి నిర్వాహకులు తెలియజేయలేదు. తనని ముఖ్య అతిథిగానో, ముఖ్యవక్తగానో గౌరవిస్తారనే దేబరాజు బాబు భావన. అసలు సభ ఎందుకు తలపెట్టారో, సభలో ప్రసంగాంశం ఏంటో వేదిక మీదకి ఎక్కాకే తెలిసింది.

సంస్కృతి మీద మాట్లాడాలట! దేబరాజ్‌కి నెత్తి మీద పిడుగు పడినట్లైంది. ఇంతలోనే అధ్యక్షుడు అతడిని ప్రసంగించమని మైక్ దగ్గరికి ఆహ్వానించాడు.

సంస్కృతిని గురించి అసలు అవగాహన లేదు దేబరాజ్‌కి. అతడు ఎన్నో పుస్తకాలు చదివిన మాట వాస్తవం ! కానీ సంస్కృతి అంటే ఏమిటి? – ఈ విషయాలని గూర్చి ఆలోచించలేదు. విభిన్న సంస్కృతులతో విలసిల్లుతున్న మన దేశంలో మన సంస్కృతి గొప్పదనం గురించి అతడికి తెలీదు.

దేబరాజ్ బాబు జంకు లేకుండా అధ్యక్షుడితో అన్నాడు “నేను వక్తని కాదు. అతిథిగా వచ్చా. నేను తరువాత మాట్లాడతా”.

అధ్యక్షుడు వెంటనే మరో పెద్దమనిషిని మాట్లాడమని కోరాడు.

ఆయన నిలబడి తన ఉపన్యాసం మొదలెట్టాడు. అతడి ఉపన్యాసం అనర్గళంగా రామాయణ, మహాభారత పద్యాల ఉటంకింపులతో ఆకర్షణీయంగా సాగుతోంది. శ్రోతలు మంత్రముగ్ధులతున్నారు. సీతావనవాస ఘట్టం ఉపన్యాసకుడు చెబుతున్నపుడు శ్రోతలు కన్నీరు కారుస్తూ రుమాళ్ళతో, చేతులతో ముఖాలని తుడుచుకోవటం కనిపించింది. ఆ వక్త మాటలు వింటున్నపుడు దేబరాజ్ బాబు మనసులో కొన్ని ఆలోచనలు రూపు దిద్దుకున్నాయి. దీనితో ఆ వక్త తన ప్రసంగం ఎప్పుడెప్పుడు ముగిస్తాడా? తను ఎంత తొందరగా మైక్ పట్టుకుందామా అని దేబరాజ్ ఎదురు చూడసాగాడు.

సరే! ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. అధ్యక్షుడు దేబరాజ్ బాబుని ప్రసంగించటానికి రమ్మని ఆహ్వనించాడు. దేబరాజ్ తన ఉపన్యాసం ఇలా మొదలెట్టాడు.

“ప్రియమైన మిత్రులారా, నన్ను సభాధ్యక్షుడు మాట్లాడమని ఆహ్వానించినపుడు నేను కొంత ఖంగారు పడిన మాట వాస్తవం. అందుకే తర్వాత మాట్లాడతానని అన్నాను.

దానికి కారణం, నాకు సంస్కృతి గూర్చి ఏం తెలీదనే భావం బలంగా ఉండడమే! నాకు ముందు మాట్లాడిన పండితుడు నాకు ఒక తోవ చూపించాడు. ప్రాచీన వాఙ్మయంలో ఆయా గ్రంథాలలో ఉన్న సంస్కృతిని గూర్చి ఆయన వివరించాడు. అందువల్ల నేను ఆయనని గురువుగా భావించి నమస్కరిస్తున్నాను.

నేను రామాయణం గురించి మాట్లాడతాను. మనకి స్వాతంత్య్రం రాకముందు ఒక ఊళ్ళో రామలీల నాటక ప్రదర్శన జరుగుతోంది. ఆ నాటకం వీక్షించటానికి ఒక బ్రిటిష్ అధికారి భార్యతో పాటు అతిథిగా వచ్చాడు. నాటక నిర్వాహకులు వారిని ఆహ్వనించి, ముందువరసలో కూర్చోపెట్టారు. దొరగారిని సంతోషపెడితే తమకి ఏదైనా బహుమతి ఇస్తాడనే ఆశ కూడా వారి మనసుల్లో ఉంది.

నాటకం ప్రారంభమైంది. వేదిక మీదికి హనుమంతుడు గంతులేస్తూ, వచ్చాడు. దొర, దొరసాని ఇద్దరూ చప్పట్లు కొట్టారు. దానితో హనుమంతుడి పాత్రధారి పొంగిపోయి స్టేజీ మీద ఇంకా కుప్పిగంతులు వేస్తూ అనేక విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత హనుమంతుడు గెంతుతూ తెర వెనక్కి వెళ్లగానే దొర, దొరసానీ ఇద్దరూ ఒకేసారి “మరో కోతిని తీసుకురండి” అని అరిచారు.

డైరెక్టర్‌కి ఏం చేయాలో తెలీలేదు. రామలీల నాటకం స్క్రిప్ట్‌లో రెండోసారి హనుమంతుడికి వేదిక మీదకి వచ్చేది లేదు. కానీ ఇప్పుడు దొర కోతే స్టేజి మీదకి రావాలంటున్నాడు. దర్శకుడు లక్ష్మణుడిని హనుమంతుడికి ఉన్నట్లు తోక అమర్చుకుని కాసేపు స్టేజి మీద గెంతమని చెప్పాడు. దానికి లక్ష్మణుడు అంగీకరించి, రంగస్థలం మీదకి వచ్చి తనకి తోచినట్లు కుప్పిగంతులు వేశాడు.

లక్ష్మణ పాత్రధారి తెర వెనక్కి వెళ్లాడో లేదో దొర – దొరసానీ ఇద్దరూ “మళ్లీ ఆ కోతిని తీసుకురండి” అని కేకలు పెట్టారు.

దర్శకుడికి అసలు సంగతి అర్థమైంది. దొర దంపతులకి రామాయణం కథేమీ తెలీదు. రామలీల నాటకంలోని పాత్రధారులకి విషయం చెప్పి స్టేజి మీదకి ఒకరి తరువాత ఒకరిని వెళ్లమన్నాను. రాముడు కూడా స్టేజి మీదకి వచ్చి కోతి లాగా గెంతటానికి ప్రయత్నం చేశాడు కాని అభ్యాసం లేకపోవడం వల్ల బాగా గెంతలేక పోయాడు. ఇంకో దారి లేక గెంతులు వేశాడు. దొర కొన్నాళ్లకి వాళ్ల దేశం తిరిగి వెళ్లిపోతాడు. తమ గురించి మంచిగా అనుకుంటే బావుంటుంది అనే ఉద్దేశ్యం కూడా అతడి మనసులో ఉంది. రామ పాత్రధారి స్టేజి వెనక్కి వెళ్లగానే దొరసాని మళ్లీ కేక పెట్టింది.

“మంచి కోతిని తీసుకురండి”.

ఈసారి హనుమాన్‌గా సీత పాత్రధారి ఎక్కాల్సివచ్చింది. సీతని హనుంతుడిగా మారమని దర్శకుడు చెప్పాడు. “ఇలా రా. చీర తీసెయ్. రొమ్ముకి కట్టుకున్న కొబ్బరి చిప్పలు లాగి పడేయ్. దగ్గరగా రా! నడుముకి ఈ తోక కట్టిగా కడతాను. ఆలస్యం చెయ్యొద్దు. మగ కోతిలా వేదిక మీద గంతులెయ్యాలి. సీతమ్మ తల్లి సంగతి మరిచిపో” అన్నాడు.

అయితే సీత పాత్రధారి ఈ చుట్టు పక్కల ఊళ్ల సముదాయంలో ఉన్న ఒకే ఒక్క ఆడంగి మనిషి. దర్శకుడి మాట విన్న వెంటనే ఆ అబ్బాయి డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక మూలకి వెళ్లి వెక్కివెక్కి ఏడవటం మొదలెట్టాడు. ఈ అబ్బాయి సిగ్గుపడుతూ, ముక్కుతో మాట్లాడతాడని దర్శకుడు ఇతడిని సీత పాత్రకి ఎంపిక చేశాడు. అబ్బాయి ఆడపిల్లలా అందంగా చక్కగా ఉంటాడు. దర్శకుడి దగ్గరగా రావటానికి ఇష్టపడకుండా కట్టుకున్న చీరని,

పమిట కొంగుని లాగి గట్టిగా పట్టుకున్నాడు, అలాగ పమటని లాగి పట్టుకోవటం వల్ల ఆడపిల్లలా కన్పించటానికి పెట్టుకున్న కొబ్బరి చిప్పలతో కూడిన రొమ్ము పదహారేళ్ల అమ్మాయి రొమ్ములా ఆకర్షణీయంగా కన్పిస్తోంది. దర్శకుడు సీత పాత్రధారిని ఒప్పించటానికి ప్రయత్నం చేశాడు. ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకి దిగాడు. అదీ ఫలించలేదు. లాభం లేక, బ్రతిమాలాడు కూడా!

ఒక పక్క దర్శకుడికి చెవుల్లో తుపాకుల శబ్దం వినిపిస్తోంది. అడిగింది దొర మరి! ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. ఆ సమయంలో విభీషణ పాత్రధారి ముందుకొచ్చాడు. అతడిది తనకి దక్కిన ఒక సువర్ణావకాశంగా భావించాడు. తను వేసుకున్న విభీషణుడి దుస్తులు తీసేశాడు. దర్శకుడితో అన్నాడు, “సీతను ఇంత బతిమాలటం ఎందుకు? ఆ అబ్బాయికి ఇష్టం లేదు కదా! మగాడైనా ఆడదానిలా ఉంటాడు కదా! వయసు పెరుగుతున్నా గడ్డాలు – మీసాలే మొలవలేదు. దొర అతడిని కోతి వేషంలో చూస్తే కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోతాడు. నన్ను ఒక్కసారి స్టేజి మీదికి పంపి చూడండి. నేను బాగా గెంతగలను. దొరని మెప్పిస్తాను. చెప్పాలంటే హనుమంతుడి వేషధారి కంటే నేనింకా బాగా చేస్తా.”

తన నటనతో దొర దంపతులను మెప్పించలేక పోయిన రాముడి వేషధారికి సీత వేషధారిపై కొంత అభిమానం ఉంది. అతడి ఇబ్బందిని గమనించిన రాముడు విభీషణుడిని సమర్థించాడు.

దర్శకుడికి అంతా అయోమయంగా ఉంది. ఒక పక్క దొరసాని “నాకు చూడాలని ఉంది. మరో కోతిని తెండి” అని అరుస్తోంది.

విభీషణ పాత్రధారికి హనుమంతుడిలా నటించాలని ఎప్పటి నుంచో ఉంది. తను బాగా గెంతితే దొరసాని తనకి గోల్డ్ మెడల్ ఇస్తుందని ఆశ పడుతున్నాడతను. అలాటి గుర్తింపు ఇవాళ లభిస్తే రామలీల నాటకంలో హనుమంతుడి పాత్ర ఎప్పటికీ తనదే అవుతుందన్న ఆశా ఉంది. గోల్డ్ మెడల్ సంపాయించాక కూడా దర్శకుడు తనని హనుమ పాత్రికి ఎంపిక చెయ్యకపోతే జనం చూస్తూ మౌనంగా ఉంటారా ఏంటి? దర్శకుడి ముఖాన ఊస్తారు. ఇలా ఆలోచిస్తూ విభీషణుడు నడుముకి తనంతట తనే తోకని గట్టిగా కట్టుకున్నాడు. అద్దం ముందు నిలబడి హనుమంతుడిలాగా తనే మేకప్ వేసుకున్నాడు. అద్దంలో చూసుకుని మురిసిపోయి – తర్వాత

యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నట్లు పెద్దగా హుంకారాలు చేస్తూ అంతెత్తున ఎగురుతూ స్టేజి మీదకి వచ్చాడు. ఈ హుంకారాలకి భూమ్యాకాశాలు ఒక్కసారిగా కంపించినట్లైంది. తెరచాటున ఉన్న లక్ష్మణుడు బెదిరిపోయి, ఈ హనుమంతుడిని హెచ్చరించాడు.

“ఒరేయ్.. ఎందుకు అంత ఉత్పాతం? నరాలు తెగిపోతాయి. వేదిక మీదే పైకి పోతావ్. రక్తం కక్కుకుంటావ్. నీ కొత్త పెళ్లాం విధవ అవుతుంది. నీ వంశం ఇంతటితో నాశనమైనట్టే.”

నిజంగానే ఈ హనుమని చూసి దొర దంపతులు మంత్రముగ్ధులయ్యారు. బహుమతులేవో ఇచ్చారు. గోల్డ్ మెడల్ ఇవ్వలేదు. ఇస్తే బాగుండేది. అది మెడలో వేసుకుని ఇతడు వీదుల్లో గర్వంగా తిరిగేవాడు.

అయితే దొర దంపతులు మాత్రం ఊరుకోకుండా, “మరొక కోతిని తీసుకురండి” అని అరిచారు.

అప్పటికే రామలీల నాటకంలో నటులందరూ స్టేజి మీదకి వచ్చి వెళ్లటం జరిగింది. చివరగా దర్శకుడు హనుమంతుడి వేషంలో స్టేజి మీదకి రావలసివచ్చింది. తన దురదృష్టానికి చెంపలేసుకున్నాడు దర్శకుడు. అతడసలు ఒళ్ళు అలవకుండా డబ్బులు అందరి దగ్గరా లాగే రకం! హనుమంతుడిలా గెంతలేడు. స్టేజి మీద రెండుసార్లు గెంతగానే అతడికి ప్రాణం పోయినట్లయింది. శరీరమంతా చెమటలు పట్టాయి. శ్వాస తీసుకోవటం కష్టం అవుతోంది.

ఇదే చివరిసారి గెంతటం అని ప్రకటించి దర్శకుడు స్టేజి మీద నుంచి కిందకి గెంతి దొరసాని కాళ్లు మీద పడ్డాడు. వెంటనే తెర వేసేశారు. దొర దర్శకుడిని పైకి లేపి, ‘సెభాష్’ అంంటూ ప్రశంసించాడు. దొర నాటకం అంటా చూశాడని జనాలు భావిస్తూ నిశ్శబ్దంగా ఇళ్ళకి వెళ్ళిపోయారు.

కొద్ది రోజుల తర్వాత దొర దంపతులు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఒక రోజు వాళ్లు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ‘రామలీల నాటకం – అనుభూతి’ చర్చకు వచ్చాయి. అప్పుడు వారు చెప్పిన మాటల సారాంశం ఏమంటే రామాయణం ద్వారా మనకి మన శరీర ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఏం చేయాలో మనకి అది దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకని రామాయణం ప్రతులని మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ముద్రించి – అన్ని స్కూళ్ళలోని డ్రిల్ మాస్టర్లకి ఇవ్వాలి. ఆ మాస్టర్లు రామాయణం చదివి ఎలా వ్యాయామం చెయ్యాలో నేర్చుకుని పిల్లలకి ఆ కిటుకులు నేర్పుతారన్న మాట.”

దేబరాజ్ బాబు పై విధంగా మన దేశ సంస్కృతిని ఆవిష్కరించాక ప్రేక్షకులందరూ పెద్దగా నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు. కధలో దొరసాని అరుపుల కంటే ఇవే పెద్దగా అనిపించాయి కూడా! ఇలా మన సంస్కృతిని అపహాస్యం చేస్తూ, ఒక కథ చెప్పి అందరినీ నవ్వించాడని కొందరు పెద్దమనుషులు అనుకున్నారు.

కరతాళ ధ్వనులు ఆగాకా, దేబరాజ్ బాబు అన్నాడు “ప్రియమైన మిత్రులారా, నేను చెప్పిన కథలో దొర వెర్రిబాగులవాడని అనుకోవద్దు. తెల్లవాళ్లకి మన రామాయణం – సంస్కృతిని గూర్చి తెలీకపోవటం వల్ల ఇలా విచిత్రమైన భాష్యం చెప్పారు, కానీ మనం వేదికల పైనుంచి ఈ ఉదంతం చెబితే నేటి తరం వాళ్లు నిజంగానే రామాయణం అంటే కోతుల ఆట అని భావిస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం – నేటి తరం వాళ్లు మన ముందు తరాల వాళ్ళు పాటించిన సాంప్రదాయాలను, అలవాట్లని పాటించటం లేదు. సమాజం చాలా వేగంగా పరిణామం చెందుతోంది. కాబట్టి భవిష్యక్ తరాల భారతీయులు భారతదేశంలో ఉండేవారు విదేశీయులలాగా జీవితం గడుపుతారు.”

చివరగా దేబరాజ్ బాబు నవ్వుతూ ఇలా అన్నాడు – “మిత్రులారా వెనకటికి ఎవడో రామాయణం అంతా విన్నాక సీత ఆడదా లేక మగాడా అని అడిగాడట! అందరూ పెద్దగా నవ్వి ఆ వ్యక్తి వట్టి మూర్ఖుడు, తెలివితక్కువ వాడని తేల్చారట! మీరే మహామూర్ఖులనే నింద నుంచి తప్పించుకోవటానికి ఇలాంటి నిందలు ఎవరి మీద వెయ్యొద్దు అని నేను మీకు – ప్రార్థనాపూర్వకంగా చెబుతున్నా. ఇప్పుడు నేను మీకు ఒక రామాయణం కథ చెప్పాను కదా! దాన్నిబట్టి సీత ఆడదా లేక మగాడా అన్నది తెలుసుకోలేక పోయి ఉంటారు! అవునా?”

~

ఒడియా మూలం: డా. నిఖిలానంద పాణిగ్రాహి
తెలుగు అనువాదం: డా. తుర్లపాటి రాజేశ్వరి

Exit mobile version