Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్నాతకోత్సవం

[‘స్నాతకోత్సవం’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – కావ్య కడమె.]

లికాలపు శనివారం అంటే ఇలాగే మంచు పడుతుండాలి. ఉదయం కిటికీ తెర జరపగానే అన్ని వైపులా తెల్లటి దుప్పటి కప్పినట్టు కనిపించాలి. ఆరుష్‌కు గంతులు వేసేటంత సంతోషం కలగటం అప్పుడే. నేలమీద పడిన మంచు పొరలను అంగుళాల్లో కొలచి దాన్ని డాలర్లకు పరివర్తించి తన మనసులోనే సంతోషపడతాడు. ఫ్రానికి కిటికీ బయటి స్తబ్ద చిత్రం ఫోటో పంపి “ఏమంటావ్‌?” అని అడిగాడు. అటువైపు నుంచి కూడా కన్ను కొట్టి, ముద్దిచ్చే గుర్తున్న ఎమోజీ వచ్చినప్పుడు మరింతగా సంబరపడ్డాడు.

ఈ ఫ్రాని వాడి స్నేహితురాలు. హై స్కూల్లో ఆరుష్‌ తరగతిలోనే చదువుతోంది. వాడి ఇల్లు ఉన్న రోస్‌మెరి రోడ్డు అంచున ఆమె ఇల్లు ఉంది. ఒకే క్రాస్‌ దాటి మర్ఫి రోడ్డులో నివాసముంటే ఆమె వేరే స్కూలుకు వెళ్లాలికదా, అలా ఉంటే తామిద్దరూ కలిసే సందర్భం ఎంత తక్కువగా ఉండేదోనని ఆరుష్‌ – ఫ్రానిలు అనేకసార్లు దిగులు పడ్డారు. “అలా ఏం కాదులే, నా పియానో క్లాస్‌ పక్కనున్న దేవస్థానానికి పైజామా వేసుకుని తల దించుకొని వస్తావ్‌కదా ప్రతి ఆదివారం పేరెంట్స్‌తో కలిసి. అక్కడి నుంచైనా నిన్ను వెతికి తీసేదాన్ని” అని అతని జుట్టులో ముద్దుగా చేయి కదిలిస్తూ ఆమె ఆరుష్‌ను అల్లరి పెట్టేది.

ఫ్రాని ఇంటికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల ప్రవర్తనలో కలిగే మార్పును ఆరుష్‌ గుర్తించాడు. “హలో.. హలో..” అని ఊరకనే అన్నా కనుబొమ్మలు ముడివేసి ల్యాప్‌టాప్‌లో ముఖం దూర్చుకొని సోఫాలో కూర్చుంటాడు ఆరుష్‌ తండ్రి సురేష్‌, కనుబొమ్మల వక్ర రేఖల్లోనే ఏదో హెచ్చరికను తన భార్య రేవతికి చేరవేస్తూ. రేవతి గంటకు నాలుగు సార్లు ఆరుష్‌ గది తలుపులు తట్టి, “ఆరూ బాబూ, ఏదైనా స్నాక్స్‌ కావాలా? జ్యూస్‌ కావాలా? ఏమీ లేదు, కిటికీ క్లీన్‌ చేయడానికి వచ్చాను. చాలా దుమ్ముంది. నువ్వు హోమ్‌వర్క్‌ చేసుకో. నేనేమి డిస్టర్బ్‌ చెయ్యను” అని వస్తూనే ఉంటుంది. ఫ్రాని తండ్రి గురించి, ఆమె తల్లి ఎక్కడ పని చేస్తుందో అనటం గురించి ప్రతిసారీ అడిగి మరచిపోతుంటుంది. పదహారేళ్ల అబ్బాయి-అమ్మాయి ఇలా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నప్పుడు ఒదిగి ఏకాంతంలో ఏమైనా ఘటించవచ్చు అనే ఊహని ఆమెను పదిహేను నిమిషాలకు ఒకసారి కీ ఇచ్చినట్టు ఈ రూము తలుపులు దగ్గరికి తెచ్చి నిలబెడుతుంది. పదిహేను నిమిషాల లోపల ఏమీ జరగదనే నమ్మకం ఏదో గట్టిగా ఉన్నట్టు.

హోమ్‌వర్క్‌ ముగించి ఫ్రాని వెళ్లిపోయిన తర్వాత భోజనం టేబుల్‌ దగ్గర, సురేష్‌-రేవతీలు నెమ్మదిగా ఆ విషయం లేవనెత్తుతారు.

“అది కాదు ఆరుష్‌, నీకెవరు అమెరికన్‌ ఫ్రెండ్స్‌ లేరా?”

“వాట్‌ డు యూ మీన్‌ డ్యాడ్‌? ఫ్రాని ఉంది కదా? ఆమె పూర్వీకులు పది తరాల నుంచి అమెరికాలోనే పెరిగారు”

“అవునవును, ఫ్రాని, ఓహ్ వి లవ్‌ ఫ్రాని. నేను చెప్పేది ఏమిటంటే.. అమెరికన్‌ అంటే.. ఐ మీన్‌..” అని గొంతు సరి చేసుకుని, ఆ తర్వాత ఏం చెప్పాలో తోచక, చెబితే టీనేజ్‌ కొడుకు కోపానికి గురికావాల్సి వస్తుందని మౌనం వహించారు. ఆరుష్‌కు తెలుసు వారి మాటల పూర్తి అర్థం.

“యు మీన్‌, తెల్లరంగు జనం అనేకదా? ఫ్రాని ఆఫ్రికన్‌-అని మీకు అంతా కలవరం కదా? ఛీ, హౌ రేసిస్ట్‌, డ్యాడ్‌?” అని వాడూ ముఖం మీద కొట్టినట్టు చెప్పేవాడే ఈ సంభాషణ కొనసాగివుంటే. అయితే ఒక పక్షి సగానికి కట్టిపెట్టి వదిలి వెళ్ళిన గూడులా ఆ సంభాషణ అసంపూర్ణంగానే ఈ ముగ్గురి మధ్య మిగిలిపోయింది. ఇది యుద్ధంలో నిర్ణాయక అస్త్రం ఉన్నట్టు ఒక్కొక్క చివరి బాణాన్ని తుణీరంలో పెట్టుకొని ఇరువర్ణాల వాళ్లు వ్యతిరేకులుగా నిలుచున్నట్టు ఉంది.

***

ఇలా స్నో శవల్‌ చేసే (మంచు తొలగించే) చిన్నపాటి బిజినెస్‌ మొదలు పెడదామని మొదట ప్రణాళిక వేసింది ఫ్రానినే. తల్లితండ్రులు ఇచ్చిన డెబిట్‌ కార్డును గీచేటప్పుడు ప్రతి పైసాకు లెక్క ఇచ్చినట్టు అనిపిస్తుంది ఆరుష్‌-ఫ్రానిలకు. అది తప్ప ఇరుగుపొరుగు వారి స్నో తొలగించినపుడు వాళ్లు ఇచ్చిన 20-30 డాలర్ల టిప్స్‌లో ఖర్చు చేసేటప్పుడు ఒక విధమైన స్వేచ్ఛను కనుక్కున్నారు. ఇలా చేసి వారానికి ఒకదానికి బదులుగా రెండు ఐస్‌ క్రీములు తిన్నా దానికి కారణం అడిగే పెద్ద వాళ్ళ స్వాధీనం నుంచి విడిపించుకున్నట్లు సంతోషపడ్డారు. పరస్పరం చిన్న చిన్న గిఫ్ట్‌లను ఇచ్చుకున్నారు. ఒక గులాబీ పువ్వు, జెల్‌ పెన్‌, ఒక జత చెవి రింగులు, ఒక తెల్లటి రంగు టీ షర్టు ఈ కానుకలలో ఉన్నాయి.

రోజు మీరు రోడ్డులో ఎంత లేదనా 45 నుంచి 50 వరకు ఇళ్లు ఉండొచ్చు. అన్ని కూడా రెండంతస్తుల్లో విస్తరించిన విశాలమైన ఇండ్లు. ఆ ఇంటి యజమానులు అందరూ యాభై దాటినవారే. ఆరుష్‌ తల్లి తండ్రులైన సురేష్‌ – రేవతీలూ రెండేళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మొదట్లో వాళ్ళు ఇదే ఊరిలోని దక్షిణంలో ఉన్న చిన్న టౌన్లో ఉన్నారు. ఆరుష్‌ మిడిల్‌ స్కూల్‌ వరకు చదివింది అక్కడే. “మంచి హైస్కూలుకు వెళ్లిన తర్వాత, ప్రసిద్ధ కాలేజీలలో చదివే అవకాశం మా ఆరుష్‌ నుదుట రాసివుంటే దాన్ని తప్పించడానికి మేమెవరం? అతని హైస్కూల్‌ చదువు ముగిసిన తర్వాత వేరే చోటికి షిఫ్ట్‌ అయిపోతాం. లేకపోతే ఈ ఏరియాలోని ఆస్తి పన్ను కట్టటానికి ఇద్దరి జీతాలు వస్తున్న మాకే ఎంత కష్టమైతున్నప్పుడు…” అనే మాటలను తల్లిదండ్రుల నుంచి వింటూ ఆరుష్‌ పెరుగుతున్నాడు.

ఈ రోడ్డులో నివసించే జనం విశ్రాంతిగా వెళ్లి పక్కింటి తలుపులు కొట్టేవారు కాదు. తమ కమ్యూనికేషన్‌ కోసమే ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను అనుసరిస్తున్నారు. చలికాలంలో ఒకసారి అడుగుల కొద్ది మంచు పడినప్పుడు, “ఎవరికైనా స్నో తొలగించేవారు తెలుసా?” అనే ప్రశ్నను నలుగురైదుగురు ఇళ్ళ యజమానులు ఈ వెబ్‌సైట్లో అడిగే ఉంటారు.

అప్పటికే ఫ్రాని, ఆరుష్‌లు తమ ఇండ్ల గరాజులలో పెట్టిన స్నోను తవ్వే పారలను తీసుకొని ఈ ఇండ్లకు వెళతారు. “ఇంటి ముందరి మంచును ముందుగా తొలగించండ్రా” అని పెద్దవాళ్లంటే వీరికి దాని ధ్యాసే లేదు. ఇంటి పెద్దలు టిప్స్‌ ఇవ్వరు కదా! “టిప్సా? బాగుంది. మీకు తిండి పెట్టడమే ఎక్కువ” అని అవసరమైతే ముద్దుగానే వ్యంగ్యంగా అంటారు.

రోస్‌మెరి రోడ్డు కొనసాగి న్యూ జెర్సీ స్టేట్‌ హైవేలో కలుస్తుంది. అందువల్ల ఇక్కడ నివసించేవారు స్నో పడిన కొన్ని గంటల్లోనే తమ ఇంటి ముందరి కాలిబాటలోని మంచును తొలగించాల్సిందే. లేకపోతే టౌన్‌షిప్‌ వాళ్లు తాము శుభ్రం చేయించి దాని రసీదును వీళ్ళ ఇంటికి అతికించి వెళతారు. ప్రజలకు ఇబ్బంది కల్పించినందుకు ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు.

దారిలో పడిన రెండడుగుల మంచును తవ్వటానికి శారీరకంగా బలంగా ఉండాలి. అందువల్ల వృద్ధులైన ఇంటి యజమానులు ఇతరులను ఆశ్రయిస్తారు. ఆరుష్‌, ఫ్రాని ఇంటి ముందరి కాలిబాటలోని స్నోను తీయటానికి ఇరవై డాలర్లు చార్జ్‌ చేస్తారు. దాంతోపాటు ఇంటి ముందరి డ్రైవ్‌ వే కూడా బాగుచేయటానికి మరో ఇరవై డాలర్లు వసూలు చేస్తారు.

వీళ్ళిద్దరూ స్నో పడటాన్ని ఎదురు చూడటానికి డబ్బు కన్నా ముఖ్యమైన కారణం ఇంకొకటుంది. అది స్నో కారణంగా స్కూలు, ఇల్లు దినచర్యకు బాహ్యంగా ఇద్దరికీ కలవడానికి సాధ్యం కావడం. హోమ్‌వర్క్‌ అనో, అసైన్‌మెంట్‌ అనో ఇంటివాళ్లకు కారణం చెప్పాలంటే కొన్ని గంటల కాలమైనా కలిసివుండగలిగే అవకాశమే రోమాంచనాన్ని కలిగిస్తుంది.

ఈ రోడ్డు మిస్టర్‌ డేవిడ్‌సన్‌, మిసెస్‌ గుప్తా, మిస్టర్‌ స్టీవెన్సన్‌ మాత్రం ఆరుష్‌, ఫ్రానిల పెర్మనెంట్‌ కస్టమర్లు. సహచరులను పోగొట్టుకొన్న ఈ ముగ్గురికి ఎనభై ఏళ్లు దాటడం వల్ల మంచును తవ్వే పారలను ముట్టకూడదని వీళ్ల డాక్టర్లు గట్టిగా చెప్పారు. తమకు సహాయం చేయడానికీ, కొద్దిసేపు తమతో కాలం గడపటానికి వచ్చే ఈ టీనేజ్‌ పిల్లలను టిప్స్‌ ఇవ్వడానికి వీళ్ల దగ్గర డబ్బు కూడా ధారాళంగా ఉంది. తమ ప్రాంగణంలో స్నో తీసిన తర్వాత కూడా వీళ్లు కబురు చెప్పుకుంటూ నిలబడితే, మంచును ఒత్తి ఒత్తి బంతులను చేసుకుని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కోలాహలం రేపితే, ఈ పెద్దవాళ్లు కిటికీ తెర నుంచి తొంగి చూసి చిరునవ్వు నవ్వుతారు. ఆరుష్‌, ఫ్రానిల ఆగమనం ఈ చలిలోనూ వారికి వసంత రుతువును గుర్తుచేస్తుంది.

ఇరుగుపొరుగు ఇళ్లల్లో నివసించే మిస్టర్‌ డేవిడ్‌సన్‌, మిసెస్‌ గుప్తా ఎప్పుడు పరస్పరం వంటింటి కిటికిలో చిక్కుకుంటారు కదా అనే వ్యంగ్యం ఇంటి పెద్దల అడ్డమాటల్లో దొర్లినప్పటికీ ఆరుష్‌, ఫ్రానిలకు, ఆ విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. వారి కుతూపలమంతా మిస్టర్‌ స్టీవెన్స్‌గారి మీదనే.

మిస్టర్‌ స్టీవెన్స్‌గారికి ఒక అసాధారణమైన ఆలోచన ఉంది. ఈ ఎనభై ఎనిమిదేళ్ల్ల వయస్సులోనూ దేశవిదేశాల నానా విశ్వవిద్యాలయాలనుంచి డిస్టెన్స్‌ ఎడ్యుకేషనల్‌ కోర్సులను తెప్పించుకొని, చదివి ఆన్‌లైన్లోనే పరీక్షలు రాసి అక్కడి నుంచి డిగ్రీలు తీసుకోవడం. పోస్టులో వచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లను ఫ్రేమ్‌ కట్టించి, గోడలకు తగిలించడం. మొత్తం గోడంతా నిండిపోయిన ఈ సర్టిఫికెట్లను చూసి ఆరుష్‌, “నూటా యాభై అయినా ఉండొచ్చు కదా?” అని ఫ్రాని చెవిలో గుసగుసగా అన్నాడు.

“సరిగ్గా నూటా ముప్ఫయి మూడు” అని స్టీవెన్స్‌ సరిదిద్దారు. “ఇంకొన్ని డిగ్రీలు ఇంకా పోస్టులో రావలసి ఉంది. నా శ్రద్ధాంజలిలోను రెండు వందల డిగ్రీల సర్దార్‌ అని హెడ్‌లైన్‌లోలో రావాలి చూడు” అనే తమాషా చేశారు. హార్డ్‌వర్డ్‌, స్టాండ్‌ ఫోర్డ్‌తో పాటు ఇజ్రాయిల్‌కు చెందిన హిబ్రూ యూనివర్సిటీ, నైజీరియాలోని విబదాన్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ దేశాల విద్యాసంస్థలు… ఈ గోడ మీద ఏది లేదు? చైనా నుంచి వచ్చిన కొన్ని సర్టిఫికెట్ల ఒక్క అక్షరమూ చదవడానికి రాని ఆరుష్‌ పిచ్చి పట్టించేలా ఉంది.

“మీ తల్లితండ్రులు కన్నడిగులు అని చెప్పావు కదా, చూడు, కావాలంటే వారి భాషను కూడా మాట్లాడతాను” అని, కాస్త ఆగి “ఎలా చేస్తున్నావ్‌ నాయనా?” అని అడిగారు. “ఓహ్! నో వెయిట్‌ ఎ బిట్‌, అది తప్పు” అని ఆపి మరొకసారి ఆలోచిస్తున్నట్టు “ఏమి చూస్తున్నావు కూతురా, ఎలా ఉన్నావు కుమారా” అని అడిగారు.

ఆరుష్‌కు డ్యాడి కొన్నిసార్లు తన బాస్‌ గురించి మాట్లాడుతూ చెప్పే ‘కొడకా’ అని అంతమయ్యే కన్నడ తిట్లు ఒకసారి గుర్తుకొచ్చి కళ్ళు చికిలించి స్టీవెన్స్‌గారిని ఒకసారి చూశాడు. ఫ్రాని మాత్రం వారి భాషలోని విభిన్నమైన ఒత్తులను చూసి ఫక్కుమని నవ్వేసింది.

“అంతెందుకు, భారత్‌లో సంస్కృతం అనే ప్రాచీన భాష ఉంది కదా. ఆ భాషలో కోర్సును కూడా చేశాను. క్యాటామస్టి భవాన్‌? కృపయాలిఖతు. ఆ సర్టిఫికెట్‌ కోసమే ఎదురుచూస్తున్నాను. వచ్చిన వెంటనే మీ తల్లిదండ్రులకు చూపించడానికి వస్తాను” అన్నారు.

ఈ సుఖాలన్నిటినీ ఎదుర్కోవటం సాధ్యమయ్యేది శనివారం ప్రాతఃకాలంలో మంచు పడినప్పుడు మాత్రమే. ఆదివారమైతే మరుసటి రోజు స్కూలనీ, వారంలోని ఇతర రోజులైతే స్కూల్‌ వర్కింగ్‌ డేస్‌ అనీ, ఇంటివాళ్లు బయటకు వెళ్లడానికి అడ్డు చెబుతారు.

***

అయితే ఈ శనివారం శనివారాల్లాంటిది కాదు. ఒక నెల నుంచి ఈరోజు కోసం ఆరుష్‌ ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరు నుంచి బామ్మ కూడా కిందటి వారమే వచ్చింది. కాలిఫోర్నియా నుంచి సుబ్బు అంకుల్‌, వాణి ఆంటీ కూడా స్నో మధ్యనే వణుకుతూ వచ్చారు. ఇక సురేష్‌-రేవతీల స్నేహితులు, వారి పిల్లలతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. సమీపంలోని హొయ్సళ ఇండియన్‌ క్యుసీన్‌ నుంచి భోజనం కొద్దిసేపట్లో రాబోతోంది.

“మామ్‌, ఒక అరగంట స్నో శవల్‌ చేసి వస్తాను”

“నో నో ఆరూ, ఈరోజు చాలా పవిత్రమైన దినం. నువ్వు బయటకు పోవడానికి లేదు…”

రేవతి ఇంకేమో చెబుతున్నప్పటికీ ఆరుష్‌ చెవిన అది పడటం లేదు. కారణం తల్లి ఇలా పట్టు చీర కట్టుకొని, తాళి వేసుకున్నప్పుడు, షార్ట్స్‌ ధరించే బాబ్‌కట్‌ అమ్మ కన్నా మరో విధంగా ప్రవర్తిస్తుందని చాలా సంవత్సరాల అనుభవంతో వాడు తెలుసుకున్నాడు. చీర కట్టుకున్న ఈ అమ్మ ముందు వాదించటం అసాధ్యం. నడక వేగంలో, ధ్వని తీవ్రతలో, పాత్రను సింకులోనో, టేబుల్‌ మీదనో పెట్టే తీరులో అమ్మ అపరిచితమైన వ్యక్తిత్వం చోటుచేసుకుంది. ఎన్నడూ అలా చేయనిది ఆరోజు గుడ్లు చూపి బెదిరించినా బెదిరించొచ్చు”

“ఐ యాం సారీ ఫ్రాని, ఈరోజు కుదరదు. అదేమిటో రిలీజియస్‌ గ్యాదరింగ్‌ ఉండొచ్చు”

“నేనూ రావచ్చా?”

“మామ్‌, క్యాన్‌ ఫ్రాని కమ్‌?”

“………”

“ఏమీ జవాబు చెప్పడం లేదు. అలాగంటే రావద్దనే కావచ్చు”

“ఓహ్! సరేలే, ఇంతకీ ఏం జరుగుతోంది? దీపావళి సెలబ్రేషనా”

“లేదు, అదేమిటో ఉప్యానో అట”

“వాట్స్‌ ఉప్యానో?”

అంతలో పట్టు పంచె కట్టుకొని, చెవులలో తవల్‌ చివరను కసకసమని ఆడిస్తూ సురేష్‌ స్నానాల గది నుంచి బయటకు వచ్చాడు.

“అయ్యో నీ, ఉప్యానో అంట. ఉపనయనం అనరా సరిగ్గా. ఏమి కర్మమో, చెప్పింది సరిగ్గా వింటే కదా?”

“మై డాడ్‌ సేస్‌ ఉపనేనా. అదేమిటో పూజ కావచ్చు. ప్రతి సంవత్సరం చేస్తారు కదా సత్యనారేణ అనేమో. అలాంటిది ఒకటి. ఐ విల్‌ కాల్‌ యూ లేటర్‌” అని చెప్పినవాడు ‘లవ్‌ యూ’ అనే పద బంధాన్ని గొంతులోనే ఆపుకున్నాడు.

“ఇక్కడ చూడు ఆరుష్‌, తొందరగా స్నానం చేసిరా. నేనే పంచె కట్టిస్తాను. నా కొలీగ్‌, అదే రామచంద్ర అంకుల్‌ తెలుసు కదా, ఆయనే దీక్ష ఇవ్వడానికి అంగీకరించారు. ఇది నీ జీవితంలోనే ప్రత్యేకమైన రోజు. ఇట్‌ విల్‌ బి ఫన్‌. వెళ్ళు తొందరగా తయారవ్వు” అనే సురేష్‌ హడావుడి చేశాడు. తండ్రి భుజం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అడ్డదారాన్ని విచిత్రంగా చూస్తూ ఆరుష్‌ స్నానాల గదికి వెళ్లాడు.

వాడు తయారై వచ్చేటంతలో ఇంటి నిండా దాదాపు యాభై మంది చేరారు. అందరూ తెలిసిన వారే. చిన్నప్పటి నుంచి కన్నడ సంఘంలో, దేవాలయాల్లో ఆ ఆంటీ, ఈ అంకుల్‌ అని పరిచయం చేసుకున్నవారే. అందరూ భారతీయుల దుస్తులు, ఆభరణాలలో, స్లీవ్‌ లెస్‌ బ్లౌజు, కాటన్‌ జుబ్బా, గాఢమైన కుంకుమ, మేకప్‌లలో తళతళ మెరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏ ఏ సంవత్సరంలో మొదటిసారిగా భారత్‌ నుంచి మొదటిసారి అమెరికాకు విమానం ఎక్కారో, అదే కాలపు ఫ్యాషన్ను తమ దృష్టిలో ఇప్పటికీ అనుసరించటం స్పష్టంగా కనిపిస్తోంది. “మరి? మేము ఇక్కడ ఉండి ఇంత మాత్రం చేయడం గొప్పే, తెలుసా?”, “ మేము కాక ఇంకెవరు కాపాడాలో చెప్పండి?”, “అంతేకాకుండా పోయిన సంవత్సరం మైసూర్‌కు వెళ్ళినప్పుడు మన లక్ష్మి లక్షణంగా లంగా, జాకెట్టు, ఓణి వేసుకొని తిరుగుతోంది. మైసూర్‌లోనే పెరుగుతున్న మా మరిది కూతురు శాన్వి ఇంత చిన్న షార్ట్స్‌ వేసుకుని, ఐపాడ్‌లో ఏదో వీకెండో పాకెండో పాప్‌ వింటూ, అబ్బబ్బా, మీరు చూడాల్సింది, ఇక్కడ ఉన్న వారికన్నా వారి దర్పమే ఎక్కువ..”, “అబ్బా, మేమైతే ఇద్దరి పిల్లలకు హిందుస్తానీ క్లాస్‌ ఒక్క వారం కూడా తప్పించనే, లేదు” మొదలైన మాటలతో అక్కడి అనేక చిన్న చిన్న గుంపులు కోలాహలం రేపుతున్నాయి. భారత్‌, భారతీయులు ఎలా ఉండాలి అనే విషయం గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కావాలంటే ఒక్కొక్క గంట ఉపన్యాసం ఇవ్వగలరు.

ఆ గుంపుల మధ్య రేవతికి గుర్తు పట్టలేనంతగా ఒక్కటైపోయినట్టు ఆరుష్‌కు అనిపించింది. అక్కడ గుమిగూడిన వారంతా కన్నడిగులే అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఏదో గ్రహణం నుంచి వచ్చివుండాలి అన్నట్టు బెంగళూరు బామ్మ మాత్రం మూగగా కాస్త ముడుచుకున్నట్టే కూర్చునివుంది.

లివింగ్‌ రూమ్‌ కర్టెన్లన్నీ రోజు కన్నా విశాలంగా తెరిచారు. బయటి మంచు సూర్యుడి వెలుతురికి ప్రతిఫలించి అన్ని వైపులా ట్యూబ్‌ లైట్లు వెలిగించినట్లు తెల్లగా తెల్లవారింది. లివింగ్‌ రూమ్‌ మధ్య ఒక ఇనుప కుండను పెట్టారు. అందులో చిన్నగా అగ్ని మండుతుంది. చుట్టూ రంగురంగుల ముగ్గులు, పూలరాశి. ఎప్పుడూ దేనికీ సమయమే లేదన్నట్టు ప్రవర్తిస్తున్న తల్లితండ్రులకు ఇదంతా నిర్వహించటానికి ఎలా సమయం దొరికిందని ఆరుష్‌ ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడూ జీన్స్‌లో మాత్రమే కనిపించే రామచంద్ర అంకుల్‌ చొక్కా కూడా వేసుకోకుండా ఒట్టి ఛాతీతో అగ్ని పక్కన కూర్చున్నాడు. ఒక చిన్న సెంటెడ్‌ క్యాండిల్‌ వెలిగించినా అయ్యయ్యో అనే అమ్మనాన్నలు దీనికి ఎలా ఊరుకున్నారోనని ఆశ్చర్యపోయాడు.

సురేష్‌ పంచ కట్టిస్తానని చెప్పినప్పటికీ పల్చటి టవల్‌ మాత్రం చుట్టుకొని, “ఈరోజు ఇలాంటిదే కట్టుకోవాలి వెళ్ళు” అని బయటికి తరిమేడు. కాలిఫోర్నియాకు చెందిన సుబ్బు అంకుల్‌ మెడకు ఒక డి.ఎస్‌.ఎల్‌.ఆర్‌. కెమెరా వేలాడదీసుకొని తిరుగుతూ అందరి ఫోటోలు తీసుకున్నాడు. ఫోటో అందంగా రావాలని అతను ఇంటి నుంచే ప్లాస్టిక్‌ పూలదండ, చెవికి నొక్కే ప్రెస్‌ చెవుల దుద్దులు తెచ్చాడు. దాంతోపాటు ఒక చదరపు వస్త్రాన్ని రెండు అంచుల్లో రెండు వేణువులను అతికించి, ఆ బట్ట మీద చిరంజీవి ఆరుష్‌ అని రాసి ఆహ్వాన పత్రికలు తయారు చేసుకుని వచ్చాడు. పౌరాణిక సినిమాలలో మంత్రులు రాజుకు సందేశాన్ని చదివి చెబుతారుకదా, అలాంటి తాటాకుల పత్రాల చుట్టను ఆ ఆహ్వాన పత్రిక పోలుతూ ఉంది.

“ఈమెయిల్‌ కాలంలో ఆహ్వానం అన్నదే మరిచిపోయాం చూడు. నాంది కోసం అవసరం అవుతుందని చేసుకొని వచ్చాను. నువ్వే భద్రంగా పెట్టుకో” అని దాన్ని ఆరుష్‌ చేత్తో పట్టించి, నానా కోణాలలో ఫోటో తీశారు. మధ్యలో ఎవరో వచ్చి నుదుట మంత్రాక్షతల బొట్టు పెట్టిపోయారు. ఇంకెవరో గంధం పూశారు. గత నాలుగు సంవత్సరాలలో తల్లిదండ్రుల ముందు కూడా నగ్నమైన ఛాతీతో నిలబడని ఆరుష్‌కు ఈరోజు ఇలా నడుముకు మాత్రమే పల్చటి తుండుగుడ్డ కట్టుకొని నిలబడటం ఎలాగో అనిపించింది. ఆ బట్ట ద్వారా అతని స్పైడర్‌ మాన్‌ అండర్‌వేర్‌ నీలి-ఎరుపు బొమ్మ అక్కడ చేరిన అందరికీ అస్పష్టంగా కనిపిస్తోంది.

“ఇంకేమి, వచ్చేనెల వాడికి పదహారేళ్లు నిండుతాయి. అందువల్ల ఈ నెలలోనే చేయాలని నిర్ణయించుకున్నాం”

“ఏరా, ద్విజుడవుతావు ఈరోజు. తెలుసు కదా?”

“చూడు, రోజుకు మూడుసార్లు సంధ్యావందనం చేయాలి, తెలుసుకదా?”

“ఊళ్లోనే చేసివుంటే బాగుండేది. అక్కడ చేసినట్టు ఇక్కడ చేయడానికి ఎలా సాధ్యం?”

“ఒకసారి ధరిస్తే చాలు. మరెప్పుడూ తీయడానికి లేదు. అమెరికాలో ఉంటే ఏంటంట?”

“అది కాదు, సింబాలిక్‌గా చేస్తే చాలు. ఇండియా ఫ్లయిట్‌ ఎక్కడానికి మొదలు మా ఇండ్లలో అయ్యయ్యో నా జంధ్యం ఎక్కడికి పోయిందని బొబ్బులు పెడతారు”

“బ్రహ్మచర్యాన్ని పాటించాలి తెలుసు కదా” అని ఒకరిద్దరు అనడంతో ఒక పెద్ద నవ్వుల అలా ఎగిసిపడిరది.

ఈ మాటలన్నిటివల్ల ఆరుష్‌కు ఆరోజు సమారంభపు తాత్పర్యం తెలిసిపోయింది.

“ఓహ్! డాడ్‌, ఇదేనా త్రెడ్‌ సెరమని అంటే?” అని గుంపులో ఉన్న తండ్రిని అడిగాడు. ఆ మాటలకు అక్కడ చేరిన గుంపు మరొకసారి వినోదంలో మునిగిపోయింది.

“ఇదేమిటిరా ఇలా అంటావు? పెళ్ళికొడుకు నాదేనా పెండ్లి అని అడిగినట్లుగా ఉంది”

 ఆరుష్‌ మండిపోతున్నవాడిలా ఒక్కసారి, “డాడ్‌, అలాగైతే మనం బ్రాహ్మణులమా?” అని పెద్ద కంఠంతో అడిగేశాడు. గుసగుసలన్నీ ఆగిపోయి సూది కింద పడిన శబ్దం అయ్యేటటువంటి మౌనం అక్కడ నెలకొంది.

డాడికి అవమానం కలగటం అతని ముఖకవళికల వల్లనే ఆరుష్‌ గుర్తించాడు. నోరు తెరిచి ఎవరూ అడగకుండా, చెప్పకుండా అయితే వేరువేరు రకాలుగా ఊహించడానికి సాధ్యమయ్యే ఈ ఒక గుర్తుపట్ల కొడుకు ఇలా అందరి ముందు అడగటం సురేష్‌ ఊహించలేదు. అయితే ఇప్పుడు అక్కడ గుమిగూడిన అందరి కళ్ళూ సురేష్‌ మీద నిలిచాయి. రామచంద్ర అంకుల్‌ మీసాల చాటునే నవ్వుతూ, కనుబొమ్మలు పైకెత్తి, ఈ నాటకాన్ని చూస్తున్నారు.

సురేష్‌, “లేదు, వైశ్యులం నాయనా. అక్కడే దగ్గరి దగ్గరికి వస్తాం కదా, హ్హ హ్హ “ అని గంభీరమైన వాతావరణాన్ని హాస్యానికి మరల్చడానికి చూశాడు.

“ఓహ్, అంటే బ్రహ్మ పొట్ట నుంచి పుట్టినవాళ్ళని అర్థమా?”

“ఛ, అవివేకి” అని సురేష్‌ కొడుకును మనస్సులోనే తిట్టుకున్నప్పటికీ ఈ సంభాషణను ముందుగానే కొడుకు దగ్గర మాట్లాడి ఉంటే బాగుండేదని అనుకున్నాడు.

 అది చాలదన్నట్టు ఇంతసేపు మౌనంగా కూర్చున్న బెంగళూరు బామ్మ, “అది కాదు, అంత తొందరగా బ్రాహ్మణులు కాదని ఎందుకు చెప్పాలి? మనదీ, వాళ్లదీ తీరుతెన్నులలో ఏమీ తేడా లేదు. చూడండి, మేమూ తొమిమదిన్నర గజాల చీరనే కట్టుకుంటాం. ఆరు గజాల చీరను మన ఇంట్లో ముట్టుకోనిచ్చేవారుకాదు. ఏదో చేపలు తినడం నిజమే. అయితే బుధవారం తప్ప మరో రోజు చేపలను ముడితే నా మీద ఒట్టు. నియమ నిష్ఠలు ఎన్నడూ తప్పించలేదు”

రామచంద్ర అంకుల్‌ కళ్ళు తమ భార్య వసుధారతో ఏదో రహస్యాన్ని పంచుకున్నట్టు అనిపించింది. రేవతి నిలుచున్న చోటనే సతమతమవుతోంది.

“అది కాదు, రక్తంలో ఒకసారి చేప అంశం చేరిపోయిన తర్వాత..” అని ఏమో అపస్వరం గుంపు వెనకనుంచి వచ్చింది అక్కడే తేలిపోయింది.

ఆరుష్‌కు పెద్దల ఈ తడబాటు అర్థం కాలేదు. అమెరికాలోనే పుట్టి పెరిగిన అతనికి కులాల గురించి గూగుల్లో కానీ, పుస్తకాల్లో కానీ, చదివింది మాత్రమే తెలుసు. అందులోని లోపలి పొరలు, మూలాలు కనీకనిపించనట్టు ఉన్న వ్యవహార సూక్ష్మాలు అతనికి అర్థం కానివి. అదొకలాంటి ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లు ఉన్నట్టు. మనం మ్యాంగో గుంపువాళ్ళ. వాళ్లు స్ట్రాబెరీ వాళ్లు, ఇంకొకరు పిస్తా వాళ్ళు. అంటే అందులో అంతగా బుర్ర పాడుచేసుకుని అవమానపడటం ఏముందో అతనికి తెలియలేదు.

కొడుకు నోటి నుంచి ఇంకా ఏమేమి పుణ్య సూక్తులు రాలుతాయో అని సురేష్‌ భయపడ్డాడు.

“ఎక్కడ, తొందర తొందరగా, రా ఇక్కడ కూర్చో, పీట మీద. రేవతి వచ్చావా?” అని తొందర పెట్టాడు.

ముగ్గురూ అగ్నిగుండం ఎదుట కూర్చున్న మరుక్షణం రామచంద్ర అంకుల్‌ జాగ్రత్త పడ్డాడు. ఆరుష్‌నే తదేకచిత్తంతో చూశారు.

“చూడండి, మీ వైపున ఎలా చేస్తారో తెలియదు. అయితే మాలో మాత్రం జుట్టు తీయకుండా దీక్షను ఇవ్వటం నిషిద్ధం. ఈ కార్యానికి కేశాలు అమంగళకరం” అనే గొడవ లేవనెత్తాడు.

 బామ్మ మాటలు కొనసాగిస్తూ –

“అవునవును, మాలోనూ అలాగే చేస్తారు. ఏం సురేష్‌, నీకు గుర్తు లేదా? మన సురేష్‌, సుబ్బు ఇద్దరిదీ ఒకేసారి గోకర్ణలో చేశాం. జుట్టు తీయాల్సిందే. ఆ తర్వాత స్నానం చేసి మడిగా రావాలి. రేవతి, నీకూ తెలియలేదా?” అని కోడల్ని లాక్కొని వచ్చింది.

“వాట్స్‌ గుండా?” అని ఆరుష్‌ గొడవకు ఎవరూ జవాబు ఇవ్వలేదు. సుబ్బు అంకుల్‌ స్నానాలగది నుంచి ఎలెక్ట్రిక్‌ రేజర్‌ తెస్తూ, “అదెంతసేపటి పని, ఇక్కడికిరా ఆరూ” అన్నాడు.

“అలాగే ఆ పల్చటి మీసాలు గడ్డాలు తీసేయించు, పిలక వదలాలి. తెలుసు కదా?”

ఆ మాటలతో ఆరుష్‌ చప్పున లేచి నిలుచున్నాడు.

“ఏమిటి? నో నో నో నో. నా జుట్టును అలా షేవ్‌ చేయడానికి నేను ఒప్పుకోను. ఆర్‌ యు కిడ్డింగ్‌ మీ? ఐ యాం సీరియస్‌ డ్యాడ్‌. మామ్‌, నువ్వయినా వీళ్లందరికి చెప్తావా? లేదా?”

చీర కొంగును ఒళ్లంతా కప్పుకొని కూర్చున్న రేవతికి ఇదంతా ఒకసారి ముగిసిపోతే చాలనిపించింది. ఈ ఆభరణాలన్నీ లాగిపారేసి ఖజానా ధరించాలని ఎదురుచూస్తోంది. ఇప్పుడు నోరు తెరిస్తే అందరూ తనను బలి చేస్తారనే అవగాహనతో మౌనంగా భుజాలు కుదిరింది.

“నో నో” అంటూ ఆరుష్‌తో, “అది జుట్టు రా, వారంలోనే పెరుగుతుంది” అని సుబ్బు అతని వెనుక వెనక ఇల్లంతా జరగడం అక్కడ చేరిన వారందరికీ వినోదాన్ని కలిగించింది. మధ్యలో ఒకరు “ముహూర్తం దాటి పోతుంది” అన్నప్పుడు దొరికిపోయాడు అన్నట్టున్న ఆరుష్‌ మెయిన్‌ డోర్‌ తెరుచుకుని బయటికి పారిపోయాడు.

చల్లటి గాలి ఒక్కసారిగా ఒంటిని తాకి చెక్కిలిగింతలు పెట్టినట్టయి అతన్ని క్షణం మాత్రం నిలిపి, గుమ్మంలోనే ఉన్న ఒక జత చెప్పులు కడుక్కొని రోజ్‌ మేరీ రోడ్డు వెంబడి పరిగెత్తసాగాడు.

“ఆగరా, ఇప్పుడే పరిగెత్తకు. కాశియాత్రకు ఆ తర్వాత వెళ్లాలి” అని సుబ్బు కూడా వాడి వెనకే పరిగెత్తాడు.

చలిలోనూ ఆరుష్‌ ఒళ్లంతా చెమటలు పట్టింది. ఫోటో కోసం వేసిన ప్లాస్టిక్‌ దండ మెడలో వేలాడుతోంది. చేతిలో తాటాకుల పత్రం చుట్ట ఉండిపోయింది. రాత్రంతా పొరలు పొరలుగా పడి పడి ఇప్పుడు స్తబ్దమైన మంచు మీద చెప్పుల గుర్తులు లోతుగా ఏర్పడుతున్నాయి. చలితో దవడలలో వణుకు పుడుతుంది.

ఆరుష్‌ పరిగెత్తాడు. ఎక్కడ కూడా నిలబడకుండా పరిగెత్తాడు. సుబ్బు నుంచి తప్పించుకోవటం ఎలా అని ఆలోచిస్తూ పరిగెత్తాడు. మిస్టర్‌ పీటర్సన్‌ ఇల్లు దాటాడు, పటేల్‌ ఇంటిని దాటాడు, గుప్తా – డేవిడ్సన్‌ ఇల్లు కూడా దాటాడు.

ఇంకేమీ ఫ్రాని ఇల్లు రానేవస్తుంది. ఆమెకు ఈ వేషంలో కనిపించటానికి ఆరుష్‌ సిద్ధంగా లేడు. అంతలో స్టీవెన్స్‌ గారి మెయిన్‌ డోర్‌ సగం తెరిచి ఉండటం కనిపించింది.

వెంటనే లోపలికి దూరి తలుపులు వేసుకున్నాడు. కిటికీలో పెట్టిన బేసిల్‌ మొక్కకు నీళ్లు వేస్తున్న మిస్టర్‌ స్టీవెన్స్‌ ఏమాత్రం కలవరపడకుండా, “ఓ వచ్చారా? ఈమెయిల్‌ లో మీ విశ్వవిద్యాలయంవారు తెలిపారు. సంస్కృతంలో డిగ్రీ ఇవ్వడానికి మీరు యతి అవతారంలోనే వస్తారని. అనుగ్రహితోస్మి” అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఆరుష్‌ దగ్గర ఉన్న తాళపత్రాల చుట్టూ తీసుకొని గర్వంగా నవ్వుతూ ప్రమాణ పత్రాన్ని వేలాడదీసే గోడ వైపు నడిచారు.

కన్నడ మూలం: కావ్య కడమె

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

Exit mobile version