‘భారతీయం’ కథా సమాహారంలో 22 భాషల నుంచి తీసుకున్న కథలున్నాయి. ఈ కథలన్నీ ఆయా భాషల్లో సుప్రసిద్ధ రచయితలు రాసినవి. ఆయా భాషల సాహితీ సౌరభాన్ని రంగనాథ రామచంద్రరావు గారు తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.
***
“భిన్న భాషల భారతీయ కథాతోరణం ఈ పుస్తకం. 22 భాషలలోని వివిధ కథలు మన గుండెల్ని గట్టిగానే తట్టి పలకరిస్తాయి. ప్రధాన భారతీయ భాషలే కాకుండా డోగ్రీ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, సంతాలీ, సింధి, తుళులాంటి తక్కువగా తెల్సిన భాషలలోని కథలను కూడా ఎన్నుకోవడం వల్ల సంకలనానికి భారతీయ భిన్నత్వంలోని ఏకత్వం చేకూరింది.
ఫన్నీ థింగ్‌లా అనిపించే ప్రియుడి చావు, ఎప్పటికీ తెరవని ఆఖరి ఉత్తరం చెప్పే రహస్యం, విధి తనను తల్లి కాకుండా ఆడ్డుకుంది కానీ, ఇంట్లో చెట్టుకి తన మాతృప్రేమ పంచకుండా ఆపలేదని తృప్తి పడే ఇల్లాలు, గుడ్డి ముసలాయన, ఆయన భార్యల బతుకుపోరాటం, పెళ్ళి బంధం కట్టేసిన స్వేచ్ఛ కోసం పరితపించే అమ్మాయి, తప్పని పరిస్థితుల్లో వదిలేసిన కొడుకు, మలిసంధ్యలో వెతుక్కుంటూ వచ్చినపుడు ఓ తల్లి పడే ఆవేదన ….
ఇలా చక్కటి ఇతివృత్తాల కథల్ని ఎంచుకుని అన్ని కిటికీ ద్వారాలు ఒకేసారి తెరిచిన రంగనాథ రామచంద్రరావుగారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే” అంటారు ‘ఛాయ’ కృష్ణమోహన్ బాబు.
“నీవు ప్రత్యేకమైనదానివని అనుకున్నాను. ఇప్పుడు నీలో ఎలాంటి ప్రత్యేకత కనిపించడం లేదు. పదిమందిలో పదకొండో దానివి. కోడి కొక్కురోకో అని కూస్తూ నేలను గెలకటం తన కోసం, తన పిల్లల కోసం అని యిప్పుడు తెల్సింది. సర్లే… సంతకాలు చేయడానికి యెప్పుడు వస్తారు?” – అస్తిత్వం, తుళు కథ.
♣
“నేనెందుకేడుస్తున్నానంటే… నేనింకా బతికి ఉన్నందుకు. ఆ రోజు నేను సాయం కోసం డి.సి.పి. దగ్గరికి వెళ్లకుండా ఉండివుంటే లాకప్‌లో బందీ అయివుండేవాడిని కాను. నేను ఊరిలోనే ఉండివుంటే మిగతావారితోపాటు చనిపోయేవాడిని. కానీ నాకా అదృష్టం లేదు.” – నష్టపరిహారం, ఉర్దూ కథ
“కానీ నా భార్య దృష్టిలో యిది తీవ్రమైన విషయమే. ఇలా చేయడం పురుషుల లక్షణం కాదంటుంది. ఓ స్త్రీ చేయాల్సిన పనిని ఓ పురుషుడు చేస్తుంటే, అలాంటి పురుషుడిని తను ప్రేమించలేనంటుంది. ఏ వస్తువుని ఎలా ఉంచుకోవాలో నాకు తెల్సినంతగా, ఏ బాంధవ్యాన్ని ఎలా ఉంచుకోవాలో నాకు తెలియదని విమర్శిస్తుంది. మా ఎడబాటుకు కారణం యిదే.” – కథ రాయడమెలా? సింధీ కథ
పైన ఉదహరించిన సంభాషణలు ఈ సంకలనంలోని కథలలోని నాణ్యతని ఎత్తి చూపించే కొన్ని ఉదాహరణలు మాత్రమే.
భారతీయం (భారతీయ భాషల అనువాద కథలు) తెలుగు సేత: రంగనాథ రామచంద్రరావు ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ. పేజీలు : 160, ధర : ₹ 125/- ప్రతులకు : పల్లవి పబ్లికేషన్స్, 59-1-23/2, అశోక్ నగర్, విజయవాడ – 520010, సెల్ : 9866115655
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™