Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి శ్రీమతి రమా శాండిల్య ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘నా వంగదేశ యాత్ర’ అనే పుస్తకం వెలువరించిన రమా శాండిల్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం రమా శాండిల్య గారూ.

రమా శాండిల్య: నమస్కారం.

~

‘నా వంగదేశ యాత్ర’ పేరిట మీ ఆరవ పుస్తకం వెలువరించినందుకు అభినందనలు. ఈ పుస్తకం ప్రచురణ నేపథ్యాన్ని వివరించండి.

జ: నా యాత్రలు 1998 నుంచీ మొదలయ్యాయి. తరచూ యాత్ర చేస్తూ, ఆ చిత్రాలన్నీ FB లో పోస్ట్ చేస్తూ నా ఉనికిని నా కుటుంబసభ్యులకు తెలియజేస్తూ ఉండేదానను.

2019, 2020 కరోనా సమయంలో అప్పటికే పద్దెనిమిది సార్లు దర్శించిన కాశీలో నా యాత్రానుభవాలు, ‘ముక్తిక్షేత్రం’ అనే శీర్షికన వ్యాసాలుగా పోస్ట్ చేస్తుండేదానను. అవి చాలామంది అంటే ముప్పై వేలమంది చదివేవారు. కొంతమంది పుస్తకంగా తీసుకురమ్మని సలహాయిచ్చారు. అదే పేరుతో, ‘ముక్తిక్షేత్రం’ అనే పుస్తకం వేసాను. అది ఇప్పటి వరకూ 25,000 కాపీలు బయటకు వెళ్ళింది.

కానీ, ఆ పుస్తకానికి ప్రచురణ సంఖ్య వెయ్యాలి అనిపించక వెయ్యలేదు. ఎవరైనా చనిపోయినప్పుడు రోజులలో పంచటానికి, కార్తీకమాసంలో, శివక్షేత్రాలలో పంచిపెట్టటానికి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ పుస్తకాలు ఇస్తుంటాము, నేను, నా స్నేహితులు. అలా మొదటి పుస్తకం నేపథ్యం. అప్పటితో ఆపేద్దామానుకుంటే, చంద్రిక అనే స్నేహితురాలు, “రమగారు, మీరు చాలా నిజాయితీగా చూసింది చూసినట్లు వ్రాస్తున్నారు. మీ పుస్తకాలు, చారిత్రిక సాక్ష్యాలు, కనుక వెయ్యండి” అంటూ చాలా ప్రోత్సహించింది. అలాగే, ఎడిటింగ్ సుందరీనాగమణి చేసి ఇస్తుంది. ప్రచురణలో మంచి సలహాలు జ్యోతి వలబోజు ఇస్తుంది.

మరొక సంఘటన కూడా పుస్తకం ప్రచురించటం వెనుక ప్రోత్సాహంగా ఉంది. వేదుల సుబ్రహ్మణ్యం గారని DRDL లో పనిచేసి, రిటైర్ అయిన ఒక పెద్దమనిషి, సోషల్ మీడియాలో నాకు ఫాలోవర్. ‘ముక్తిక్షేత్రం’ వ్రాస్తున్నప్పుడు వారు నా ఫోన్ నెంబర్ తీసుకుని, “ఈ పోస్ట్‌లు అన్నీ తప్పకుండా పుస్తకంగా తీసుకురండి. అది గ్రంథాలయాలలో ‘ఒక యోగి ఆత్మకథ’ వంటి పుస్తకాలను ఆనుకుని ఉంటుంది.” అని చెప్పారు. ఆ మాటలు ఎంత సత్యాలుగా నా జీవితంలో చూసాను.

ఒకసారి గుంటూరు కొడాలి వీరభద్రయ్యగారి ఆహ్వానంతో గుంటూరు క్షేత్రాలన్నీ దర్శించటానికి వెడితే, అక్కడ అన్నమయ్య గ్రంథాలయాన్ని చూడటం జరిగింది. అక్కడ శ్రీ లంకా సూర్యనారాయణ గారు, లక్షల్లో పుస్తకాలను సేకరించి చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. వారికి నా ప్రచురణలు ఇద్దామని తీసుకువెళ్లాను. వారికి నమస్కరించి పుస్తకం ఇద్దామని ఆయన చేతిలో పుస్తకం పెట్టబోతే, కాశీమజిలీ కథలు, శివాపురాణం మధ్యనుంచి ముక్తిక్షేత్రం పుస్తకం తీసి చూపి, నన్ను ఆయన వెనుకే రమ్మని, దేవికి సంబంధించిన ఆరల నుంచి నమామి మాతరం అనే అష్టాదశ శక్తిపీఠాలు పుస్తకం, గోవా గురించిన అనేక పుస్తకాలున్న అరనుంచి, గోవాటికా, హిమాలయ చరిత్రలున్న పుస్తకాల అరనుంచి హిమశ్శివాయ మొదలయిన పుస్తకాలు తీసి చూపిస్తూ, “బావున్నాయమ్మా.. నువ్వు తీర్థయాత్రలు చేస్తూ అవి పుస్తకాలుగా ప్రచురిస్తూ, భావితరాలకు చరిత్రను చేర్చు.” అని చెప్పారు. అది నా జీవితంలో చాలా గొప్ప అనుభవం.

పుస్తకం చదివి ఆ దేవాలయాలకు వెళ్లి ఆ ఆలయశిఖరాన్ని నాకు వీడియో కాల్ చేసి చూపించే పాఠకులైతే వందల్లో ఉన్నారు. ఆ పుస్తకాన్ని వారితో పాటు తీసుకువెళ్లి, “మీరు చెప్పిన ఆలయం ఇక్కడ లేదమ్మా” అనే వారు కూడా చాలామంది ఉన్నారు. కాశీ విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. ద్వాదాశాదిత్యుల ఆలయాలు, కారిడార్ నిర్మాణంలో ఆ ఆలయాలు కనుమరుగయ్యాయి. అలా పుస్తకం వెనుక పాఠక బంధువుల చాలామంది ప్రోత్సాహం ఉంది. మరొక కథ.. బెంగుళూరులో జాలాది శైలకుమార్ అనే అబ్బాయి నాకు మంచి స్నేహితుడు. అతను రెగ్యులర్‌గా నెలకొకసారి కాల్ చేసి, అక్కా, కొత్త పుస్తకం రాలేదంటూ గొడవచ్చేస్తాడు. విచిత్రం, అతను నేను FB లో వ్రాసే పోస్ట్ లన్నీ చదువుతాడు. అయినా సరే కొత్త పుస్తకం కావాలి, దానికి వెయ్యి నూటపదహార్లు ఆడపడచు కట్నంగా చదివిస్తాడు కూడా!

ఇలా, ఇప్పుడు వచ్చిన నా కొత్త పుస్తకం వెనుక, అనేక కథలున్నాయి.

ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన పై ఆసక్తి ఎప్పటినుంచి కలిగింది? మన దేశంలో ఏ ఏ క్షేత్రాలు దర్శించారు?

జ: నా విషయంలో క్షేత్ర దర్శనం అనేది, కుటుంబ నేపథ్యం.. బంధు మిత్రుల సాంగత్యము, పరిసరాలు అని చెప్పవచ్చును.. మా ఇంట ఏ శుభకార్యమైన మొదట కులదైవనికి, గ్రామదేవతకు మొక్కించటం అలవాటు. ఆ అలవాటు, అశుభం జరిగినప్పుడు కూడా మనుషుల కంటే, దైవమైతే తొందరగా ఆ కష్టం నుంచి కడతేరుస్తాడు, అనే పెద్దల మాట ప్రకారం శుభాశుభాలకు, ఏ ఎమోషన్ వచ్చినా క్షేత్ర దర్శనం అలవాటైపోయింది.

ఇక మన దేశంలో ఉన్న ఆలయాలు లెక్కపెట్టలేనన్ని దర్శించానని చెప్పవచ్చు. అందరూ దర్శించే ఆలయాలే గాక, ఎవరూ దర్శించని ఆలయాలు కూడా దర్శిస్తూ ఉంటాను. ఒక రకంగా ఇంటికంటే గుడి పదిలం అనే నమ్ముతుంటాను.

ఏ ఏ క్షేత్రాలు అంటే లెక్క చెప్పటం కష్టం. ఒక ఉదాహరణ చెబుతాను. 2023లో మా అబ్బాయికి కేన్సర్ వచ్చింది. అప్పుడు ఒక మొక్కు మొక్కుకున్నాను. కడుపు చలవ కోసం, సహస్ర గ్రామదేవతల ఆలయాలు దర్శిస్థానని. 2025 కల్లా పూర్తిచేసేసాను, ఆ మొక్కు. ఇలాగే ఉంటాయి నా మొక్కులు, చెల్లింపులు కూడా! కానీ, ఇవన్నీ నేను చేసాను, చూసాను అనుకోవటం భ్రమ. అంతా ఆ భగవంతుని దయే!

ఆలయం వెళ్ళటానికి పరిస్థితులు కూడా అలాగే వచ్చేవి. మావారు చనిపోయినప్పుడు, మా పెద్దనాన్నగారింటికి వెళ్లాను. అక్కడ మా వదిన నాకు సమవయసు ఉన్నామే స్నేహితురాలు కూడా, తను, “దుఃఖం వచ్చినప్పుడు అమ్మవారి ముందు కూర్చుని ఏడు. అందరితో నవ్వుతూ ఉండు,” అని చెప్పింది. అందుకే మరీ ఎక్కువైంది ఆలయానికి వెళ్ళటం. అంటే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఆలయానికి వెళ్ళిరావటం అలవాటు. అది ఏ దేవాలయం అయినా, ఏ ఊరు ఆలయంలోని భగవంతుడు గుర్తుకొస్తే వారి దగ్గరకు వెడుతుంటాను.

అలాగే నది పుట్టిన చోటునుంచీ, సముద్రాన కలిసే చోటువరకు సాధ్యమైనన్ని దేవాలయాలు దర్శించటం అలవాటైంది. అంటే, ఇప్పుడంటే గూగుల్ ఉంది. కానీ, నేను యాత్రలు చేసేటప్పుడు అదీ లేదు కదా! అప్పుడు, అట్లాస్, ఆలయాల ముందు అమ్మే యాత్రాదర్శిని పుస్తకాలు కొనుక్కుని అవి చదువుతూ, ఆ దేవాలయాలకు ఎలా వెళ్లాలో కనుక్కుని, డబ్బు తక్కువగా ఖర్చయ్యే మార్గంలో, ఎక్కువ రోజులు ప్రయాణంలో, తక్కువ ఆలయంలో గడిచేవి. అలా నేర్చుకున్న విషయం, “జీవితమనే ప్రయాణంలో గమనించాలిసింది గమనం మాత్రమే, గమ్యం కాదని”.

‘నారాయణీయము’ కాకుండా గతంలో మీరు విలువరించిన నాలుగు పుస్తకాలు కూడా ఆధ్యాత్మిక యాత్రా గాథలే. వివిధ క్షేత్రాలను సందర్శించటంలోనూ ఆ దివ్యనుభూతులను సమహృదయులతో పంచుకోవడంలోనూ మీకు ప్రేరణ ఎలా కలిగింది?

జ: మొట్టమొదటి జవాబు, ‘భగవదేచ్ఛ’. కానీ, అనేక కారణాలు ఉన్నాయి. మనిషి వయస్సులో ఎంత పెద్దవాడైనా కూడా, బాల్యంలో తాను పెరిగిన పరిస్థితులు దాటలేరు అనేది నా విశ్వాసం. ఉదాహరణకు, మా చిన్నప్పుడు, మధ్యతరగతి, బ్రాహ్మణ, ఉమ్మడి కుటుంబ నేపద్యం మాది. మేము, పదహారు మంది పిల్లలం. మేము అల్లరి చెయ్యకుండా చూసుకునే బాధ్యత అందరిలోకి చిన్నకోడలు, మా పిన్నిది. ఆమె మమ్మల్ని కూర్చోబెట్టి బోలెడు కథలు, కబుర్లు, చెప్పి ఊహలోకాన్ని చాలా పెంపొందించింది. ఆ ఊహలోక అన్వేషణే యాత్రా దర్శనం, అది సమహృదయులతో  పంచుకోవటం కూడా పిన్ని నుంచే వచ్చింది. అమ్మ, నానమ్మా కూడా యాత్రలు ఇష్టపడేవారు, అమ్మ వెళ్లి వచ్చేసేది కానీ పెద్దగా మాట్లాడేది కాదు. నానమ్మ వెళ్లిన యాత్రలను గురించి మాకందరికీ కథలు కథలుగా చెప్పేది. అలా యాత్ర అనేది మా ఇంట్లో ఉంది. మా తాతగారు కాకినాడ నుంచీ మద్రాసు సైకిల్ మీదే వెళ్లి వచ్చానని చెబుతుండేవారు. ఇవన్నీ నామీద ప్రభావం చూపి ఉండొచ్చును.

నిజానికి వినేవారికి కథ చెప్పటంలో వచ్చే ఆ కిక్కే (ఈ పదం ఇక్కడ వాడవచ్చానుకుంటున్నాను. భక్తి కూడా ఒక కిక్కే నా దృష్టిలో) వేరప్పా, అనుకుంటూ చెబుతున్నానేమో మరి. ఇప్పటికీ మా మనవలతో కూర్చుని ఆటలు, పాటలు, కథలు పంచుకోవటం అలవాటుంది.

మా పుట్టింట, మేమేవరమైనా, సినిమా చూస్తే, మొదటి, ‘పిపిపిం’ అనే శబ్దం నుంచీ, జనగణమన వచ్చేవరకూ ప్రతీది వివరిస్తూ చెప్పుకునే అలవాటుండేది.

అత్తవారింట సినిమాలు తీసి జనానికి చూపించే అలవాటుంది. సినీ నిర్మాతలం మేము. వీటన్నిటి ప్రభావం వలన ఈ పంచుకోవటం అలవాటై ఉంటుంది.

ఏదైనా క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నప్పుడు, అక్కడి ఆధ్యాత్మిక విశేషాలను, చరిత్రని, స్థానిక సంస్కృతిని ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? అంటే ఆ భక్తి పర్యటన తర్వాత వ్యాసం రాయాలన్న ఆలోచనతో ముందస్తుగానే సిద్ధమవుతారా లేక క్షేత్ర దర్శన సమయంలో సేకరించిన వివరాలతో యాత్రాగాథ వ్రాస్తారా?

జ: మొదట నావి యాత్రా గాథలు, కథలు కావేమోనండి. అనుభవాలను పంచుకుంటున్నానంతే!

ముందుగా ఏది తెలుసుకోను.. అన్నీ అనుకోకుండానే జరుగుతుంటాయి. ఉదాహరణకు, ఒకసారి అమరకంఠక్, క్రియాయోగా పూరి వారు, నర్మదానది ఒడ్డున ఉన్న ఆశ్రమంలో దేశ, విదేశీయులతో ఒక రిట్రీట్ నిర్వహించారు. దానికోసం నేను, నా స్నేహితురాళ్లు వెళ్లే టిక్కెట్ మాత్రమే తీసుకుని వెళ్ళాము. మూడు రోజుల సమావేశాలు ముగిశాకా అందరూ వెళ్లిపోయారు. మేము ముగ్గురం పదిహేను రోజులు ఆశ్రమంలో స్వామీజీల సమక్షంలో క్రియా సాధన చేస్తూ, పరిసరాలన్నీ పర్యటిస్తూ, నర్మదలో రోజూ స్నానం చేస్తూ, అక్కడి దేవాలయాల దర్శనం చేసుకుంటూ ఉండిపోయాము. ఇది ఏది కూడా మా ప్లాన్ కాదు. అంతా ఆ పైవాడి దర్శకత్వంలో నేను నటిస్తున్నాను అనుకుంటాను. చెప్పాలంటే ఇలాంటి సంఘటనలే నా జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అక్కడ సన్యాసులకు భోజనం మా చేతులతో మేమే వండి, వడ్డించాము. అలాగే మొన్న యమున పుష్కరాలకు వెళ్ళినప్పుడు కటాపత్తర్ అనే చోట భధ్రకాళీ ఆలయంలో స్వయంగా సన్యాసులకు భోజనం వండి వడ్డించే అవకాశం వచ్చింది. ఇవేవి ప్లాన్ చేసుకుని చెయ్యని సంఘటనలే.

మరొక విషయం నాకు చిన్నప్పటినుంచి డైరీ రాసుకునే అలవాటుంది. అది 2009 లో FB వచ్చాక వదిలేసాను. ప్రతీరోజు నేను వెళ్లొచ్చిన స్థలాలు, కలిసిన మనుషులను గురించి FB లో పంచుకోవటం అలవాటైంది. నచ్చిన వారు చదువుతారు, లేకపోతే లేదు. దానిమీద ధ్యాస లేనే లేదు. ఉండదు కూడా!

ఇక ఆధ్యాత్మిక విషయాలు, దేవాలయాల చరిత్రలు, ప్రాంతీయ ముచ్చట్లు మాత్రం ఆలయంలో దర్శనానికి వచ్చిన అక్కడి వారిని మాట్లాడించి తీసుకుంటాను. అందుకే లోకల్ వారి సంస్కృతి, సాంప్రదాయము కూడా సహజమైనవే వ్రాయగలుగుతాను. నేను తీసుకునే కారు డ్రైవర్ లోకల్ వాడైతే అక్కడి విశేషాలు వారి ద్వారా మరింతమందిని పరిచయం చేసుకుని వివరాలు వ్రాసుకుంటుంటాను. షాపులవారు, పూజారులు, దర్శనానికి వరుసలో నుంచున్నప్పుడు, లోకల్స్ నుంచీ సేకరించిన సమాచారమే ఎక్కువ ఉంటుంది. అది ఏదైనా వ్రాసేటప్పుడు ఉపయోగించుకుంటుంటాను. ఒకోసారి మరచిపోతాను కూడా!

ఉదాహరణకు కలకత్తా లోని లైబ్రరీ గురించి వ్రాయటం మరచాను. అతి పెద్ద గ్రంథాలయము, అందులో అతి చిన్న భగవద్గీత, రామాయణం మొదలయిన ఎన్నో పుస్తకాలున్నాయి. అరుదైన ఎన్నో పుస్తకాలు అక్కడ దొరుకుతాయి. అది వ్రాయటం మరచిపోయాను.

ముందుగా ఏదీ  ఆలోచించను.  భూత, భవిష్యత్‌ల మీద పెద్దగా నమ్మకం లేదు. వాస్తవంలో ఉంటూ ఆస్వాదించే మనస్తత్వం నాది.

ఒకోసారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళేటప్పుడు వారి ప్లాన్ తోనే వెడతాను, అవసరమైనప్పుడు అక్కడి విశేషాలు చెబుతుంటానంతే!

ప్రయాణమే ప్లాన్ లేకుండా చేస్తాను. ఇక అక్కడ విశేషాలేం ముందుగా తెలుసుకుంటాను, కదా!

నా యాత్రాలన్నీ సాధారణంగా ప్లాన్ లేకుండానే జరిగినవే! దర్శించి వచ్చాక అయినా అక్కడి క్షేత్రాల వివరాలు మాత్రం చాల రకాల ప్రయత్నాలు చేసి తెలుసుకుంటుంటాను.

కోల్‌కత్తా గురించి చెప్తూ, “వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో రకంగా చూశాను” అని అన్నారు. ఇది భౌతిక దృక్పథం నుంచా లేక ఆధ్యాత్మిక దృక్కోణం లోంచా? మార్పుని మీలో చూశారా లేక నగరంలో చూశారా?

జ: కలకత్తా అనే కాదు భారతదేశంలో గత నలభై సంవత్సరాలుగా మనుషుల్లోనూ, రాగాద్వేషాలలోనూ కూడా నాకు మార్పు కనిపిస్తోంది. అది నాలో కూడా వచ్చి ఉంటుంది. కానీ, కలకత్తాలో జనసాంద్రత చాలా ఎక్కువ. మొదటిసారి కలకత్తా వెళ్ళినప్పుడు నా అనుభూతి, చీమల పుట్ట చెదిరితే బయటకు వచ్చే చీమలు, చెదపురుగులు గుర్తుకొచ్చాయి. అలాగే ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే జనాభాని చూస్తే తేనెటీగల తుట్ట కదిపితే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాగే అనిపించింది. 2023 లో వెళ్ళినప్పుడు అలాంటి అనుభవాలేమి లేవు. అదే కలకత్తా నగరంలో ఆ తేడా నాదే అయి ఉండవచ్చును. మొదట్లో విసుగుగా అనిపించే సంఘటనలు ఇప్పుడు ఓర్పు పట్టటం చేతయిందేమో మరి. అలాగే కాళికా మాత గుడిలో ఒకోసారి ఒక్కొక్క అనుభవాన్ని అనుభూతి చెందాను. అన్నిటికీ కామన్ మాత్రం అమ్మవారు ఎక్కడున్నారని అనుభూతి చెందటం మాత్రం ఒక్కటే!

ఇన్ని సంవత్సరాలుగా యాత్ర చేస్తూ ఉన్నాను. కనుక మొదట్లో దుఃఖం నుంచీ పారిపోతూ చేసాను. ఇప్పుడు అక్కడుండే శక్తిని అనుభూతి చెందటానికి వెడుతున్నాను.

ఒక మనిషిని తెలుసుకోవటానికే కొన్ని సంవత్సరాలు పడుతోంది. మరి క్షేత్రంలోని శక్తిని తెలుసుకుని అనుభూతి చెందటానికి ఇంకెన్ని సంవత్సరాలో, యుగాలో పట్టవచ్చు. అందుకే తరచూ యాత్ర చెయ్యటం నాకు అలవాటుగా మారింది.

మార్పు నాలో అయినా, నగరంలో అయినా సహజ లక్షణంగా జరుగుతోంది. దాన్ని గమనించే తత్వం కూడా వృద్ధి చెందుతోందనుకుంటున్నాను.

గంగానదిని చూస్తూ, మన జీవితానికి నదీ గమనానికి చాలా పోలికలున్నాయని అనుకున్నారు. ఏ రకంగా? పాఠకులకు మరింతగా వివరిస్తారా?

జ: ముప్పై సంవత్సరాలుగా గంగానదితో స్నేహం చేస్తున్నాను. అందుకనేనేమో నాకు నది జలధారగా కాక ఒక స్త్రీమూర్తిలాగే కనబడుతుంది. మా చిన్నప్పుడు, మామ్మ,  తాతగారు, అమ్మా కూడా, మేము స్నానం చేసేటప్పుడు ఆరు పవిత్ర నదులను తలుచుకుంటూ స్నానం చెయ్యటం నేర్పించారు. దాని వలన నదిమీద ఒకరకమైన ప్రేమ కలిగింది. అలాగే స్కూల్‌లో తెలుగుమాష్టారు గంగాస్తవం అర్థసహితంగా నేర్పించారు. దానితో నదంటే ఒక స్త్రీ అనే భావనే కలిగింది. అలాగే, మొదటి సారి గంగోత్రికి వెళ్ళేటప్పుడు గంగానది 16 ఏళ్ల బాలికలా సర్వాలంకార భూషితగా, అంటే తెల్లని మంచుతో నిండిన కొండలు, ఆకుపచ్చని చెట్లు, నీలం రంగు ఆకాశం, స్వచ్ఛమైన నీటిలో తెలుతున్న మంచుముక్కలు, ఆ కొండల్లో చక్కని శబ్దం చేస్తూ పారే నదీ జలాలు చూస్తుంటే, తెల్లని వస్త్రాలు ధరించిన యవ్వన వతియైన స్త్రీలాగే అనిపిస్తుంది గంగమ్మ. అలాగే గంగోత్రి నుంచీ తిరిగి వచ్చేస్తుంటే మన చెయ్యి పట్టుకుని వీడికోలు చెబుతున్నట్లు ఉంటుంది.

గంగోత్రి నుంచీ ఋషీకేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్వచ్ఛత తగ్గి, జనజీవనస్రవంతిలో తాను ఒకటిగా మారిపోతుంది.

అక్కడి నుంచీ కాశీకి వచ్చేసరికి ఎన్నో మలినాలు పొట్టన దాచుకుని, కుటుంబంలో పెద్ద స్త్రీలా అనిపిస్తుంది. అంటే, కుటుంబంలో ఉన్న అందరి గురించీ అన్నీ తెలిసినా ఏమి తెలియనట్లుండే అమాయకత్వంతో అనిపిస్తుంది,

కలకత్తా గంగా సాగర్ దగ్గర సముద్రంలో కలిసేటప్పుడు అన్నీ తెలిసిన వృద్ధురాలైన స్త్రీమూర్తిలా అసహాయ స్థితిలో అన్నీ తెలిసినా తెలియనట్లు ఒదిగి ఉన్నట్లనిపిస్తుంది. అందుకే ఆమె గమనం, మన జీవనంలాగే అనిపిస్తుందని వ్రాసాను.

“దక్షిణేశ్వరం చూడగానే, ముందు రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద, రాణి రాసమణి దేవి గుర్తుకువస్తారు. తర్వాతే భవతారిణి మాత మీదకి దృష్టి వెడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఇలా జరగడానికి కారణం ఏమై ఉండవచ్చని మీరు భావిస్తారు?

జ: గురు గోబీంద దోనోమ్ ఖడే, కాకే లాగు పాయ్!

బలిహారీ గురు అపనో దొనో బతాయ్!

అనే కబీర్ దోహేలో గురువుయొక్క భక్తిని తెలియజేస్తాడు. అంటే, నా మార్గంలో నాకు గురువు, దేవుడు ఇరువురు ఎదురైతే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే దేవుడిని ఎక్కడ వెతకాలో నాకు మార్గం చూపించింది గురువే! అంటాడు కబీర్!

రామకృష్ణ పరమహంస జీవిత కథలు చదివితే కూడా కాళీమాతను ఆయన చెప్పాకే ఆమె గురించి తెలిసిందని అనుకుంటూ ఉంటాను. మొదట రామకృష్ణుడు, శారదా మాత, రాణి రాసమణి కథలు అన్నీ భవతారిణిని గురించి మనకు చెబుతున్నట్లు అనిపిస్తాయి. నాకు, ఊహ తెలిసినప్పటినుంచీ మా యింట్లో రామకృష్ణ పరమహంస కథలు మా పినతల్లి చెబుతూ ఉండేవారు. కథ అయ్యాక ఆయన కాళీకా అమ్మవారికి మహా భక్తుడు అని ముగించేది మా పిన్నమ్మ. అంటే ఎక్కడ కాళీ ఆలయం చూసినా ముందుగా రామకృష్ణులు, వివేకానందుడు గుర్తుకురాక మానరు. అందుకే అనుకుంటా దక్షిణేశ్వరం అంటే రామకృష్ణులవారు, వివేకానంద, శారదా మాత, రాణీరాసమయి తరువాత భవతారణి గుర్తుకు వచ్చేది.

గురువును గుర్తుచేసే అమ్మవారు భవతారిణి నా విషయంలో!!

దక్షిణేశ్వరం లోని భవతారిణి మాత, కాళీఘాట్ లోని కాళిక ఇద్దరూ ఒకే శక్తిస్వరూపాలు కదా. రెండు మందిరాలలో అమ్మవారి పూజా విధానాలలో తేడాలేమైనా ఉన్నట్టు మీ దృష్టికి వచ్చిందా?

జ: ఎందుకుండదు? ఎడమ, కుడి – తాంత్రికము, ఆగమన – మాంసాహారా, శాకాహారా తేడాలుంటాయి. దక్షిణేశ్వరం అమ్మవారి ఆలయ విధానాలు, కాళీఘాట్ గ్రామదేవత ఆలయ విధానాలతో పూజలు జరుగుతాయని అక్కడి పాండాలు చెప్పారు. (పాండాలంటే పూజారులు. )

ఆ తేడా ఎలా తెలిసిందంటే, ఒకసారి నేను వెళ్ళేటప్పటికి కాళీఘాట్ అమ్మవారి జాతరవుతోంది. అది మన గ్రామదేవతల ఆలయాలలో జాతరలాగా, పసుపు, కుంకుమ, వేపాకు, జంతువులకు అలంకరించి, బలి కొరకు తీసుకువెడుతున్నారు. బలి ఎక్కడ వేశారో మాత్రం నేను చూడలేదు. మేము అదే రోజు, కాళీ అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకుని, అమ్మవారిని చాలా దగ్గరగానే చూసాను. ఎందుకో తెలియదు, నాలుక జాపి ఉన్న ఆ అమ్మవారిని చూస్తున్నప్పుడు, బయట బొట్టు పెట్టి ఉన్న జంతువులు గుర్తుకొచ్చి వెన్నుపూస వణుకు వచ్చింది. మళ్ళీ నాకు నేనే, ‘చల్లని తల్లిని చూసి భయపడటం ఏమిటీ?’ అనుకున్నాను. అదే రోజు దక్షిణేశ్వరం లోని అమ్మవారిని చూస్తే రంగునీళ్ళు చల్లుకుంటూ ఆవరణలో ఎర్రంచు తెల్లచీర కట్టుకున్న మహిళలు, సాంబ్రాణి వేసిన నిప్పు కుండలతో నృత్యం చేస్తున్నారు. అప్పుడు అక్కడి పాండాలను అడిగాను. వారు చెప్పినదే మొదట నేను చెప్పినది. వామాచార, దక్షిణాచార పూజలు జరుగుతాయని.

రెండు ఆలయాలలో దసరా నవరాత్రులు జరుగుతాయి. ఏ ఆలయ విధానం ఆ ఆలయానిదే ఉంటుంది, పూజాల విషయంలో. రెండింటిలోనూ స్త్రీలు పాటలు పాడుతూ నృత్యం చేయటం మాత్రం ఒకలాగే ఉంటుంది.

గంగాసాగర్ రెండోసారి దర్శించినప్పుడు, గంగమ్మ గురించి, ప్రకృతి గురించి (పేజీ 42) చక్కని వాక్యాలు రాశారు. ఈ అవగాహన మీలో కలగడానికి ఏది దోహదం చేసింది, ఎంత కాలం పట్టింది?

జ: మొదటిసారి నేను, గంగాసాగర్ వెళ్ళటం గురించి, ‘ముక్తిక్షేత్రం’ అనే, ‘కాశీ యాత్రానుభవాలు’ అనే పుస్తకంలో వ్రాసాను.

మొదటిసారి వెళ్ళింది, 2002 లో అని గుర్తు. రెండవసారి 2023 లో వెళ్లాను. అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత వెళ్ళటం కనుక, ప్రకృతి మారింది, నా ఆలోచన చాలా మారింది.. అది కాక నదీ సముద్రం కలిసేచోట భూమి కోతకు గురై ప్రకృతిలో చాలా మార్పులోస్తాయి. ఆ మార్పులను ఎక్కువ యాత్రల కోసం తిరిగే నేను, గమనిస్తుంటాను. ఆ గమనింపులో నాలో దృష్టి మార్పులు జరిగాయి, కానీ, గంగమ్మలో అదే ప్రవాహం, అవే అలలు, అవే ఊరుకులు, పరుగులు.. ‘నీరు పల్లమెరుగు’ అనేది తెలిసిన సత్యం. ఎత్తైన హిమాలాయాలనుంచి, సముద్రమట్టంతో కొలిచే లోతు వరకూ గంగానది యుగాలుగా ప్రవహిస్తూనే ఉంది. మార్పులు నాలోనే కదా! అదే అనుకుంటూ ఉంటాను, గంగమ్మను చూసినప్పుడల్లా! ఆమెలాగే ప్రవహిస్తూనే ఉన్నాను.. సముద్రానికి చేరటమే తరువాయి..

*

ఇక్కడ మీరు అడగని ప్రశ్నకు ఇంకో జవాబు కూడా చెబుతాను. ఎవరు చెప్పారో తెలియదు గానీ, పాతిక సంవత్సరాలలో వచ్చిన మార్పులతో, అంధభక్తి. దానివలన వచ్చే పరిణామాలు ప్రకృతిని చాలా భ్రష్టు పట్టిస్తున్నాయి.

గంగమ్మను దేవతగా కొలిచే మన వాళ్ళే, కట్టుకుని విడిచిన చీరలు, పిల్లల డైపర్లు, బహిష్టుతో ఉండే స్త్రీల పేడ్‌లు, గంగమ్మకు చీర అంటూ, నైలాన్ చీరలు నదిలో విడిచిపెడుతూ, నదిని కలుషితం చేసేస్తున్నారు. ఇది ఈ ఇరవై సంవత్సరాల ప్రగతా? అని ప్రశ్నించుకుని, బాధపడ్డాను. ఈమధ్య ఉత్తరఖండ్ యాత్రలో, గట్టున కూర్చుని కంటతడి పెట్టుకున్నాను.

ఒకసారి జలప్రళయమే చవిచూసాము, 2013లో ఉత్తరఖండ్ వరదల్లో జరిగిన బీభత్సం, అయినా మనకు బుద్ధి రాలేదే అనిపించింది. ఏదైనా, ప్రకృతితో ఆటలాడటం ఎప్పటికైనా ప్రమాదమే అనేది నా అభిప్రాయం.

ప్రకృతిని మనం రక్షిస్తే, ప్రకృతి మనను రక్షిస్తుంది అనేది నిర్వివాదాంశమే కదా!

ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనతో పాటుగా, నగరంలోని ఇతర చారిత్రిక ప్రదేశాలు, ప్రసిద్ధ కట్టడాలు వంటివి దర్శించినప్పుడు మీ మనోవైఖరి ఎలా ఉండేది? ఆధ్యాత్మిక తలం నుంచి భౌతికతలం లోకి మారడం కష్టమైందా?

జ: మనం ఒక విందుభోజనానికి వెడతాము. అక్కడ పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదంగా, మసాలా వడ, పకోడీతో పాటు మిగిలిన పదార్థాలు ఉంటాయి. ప్రసాదం కళ్ళకద్దుకుని భక్తిగా తింటాము. మిగిలినవి రుచిని ఆస్వాదిస్తూ తింటాము. దేని ఎమోషన్ దానిదే, ఒకదానితో మరొకటి కలపను.

‘ముక్తిక్షేత్రం’లో ఒక సంఘటన వ్రాసాను. ఆదికేశవ ఘాట్‌లో సూర్యోదయం చూడటానికి, కేదార్ ఘాట్ నుంచీ ఊరుకులు పరుగులు పెట్టి, ఆటో మాట్లాడుకుని అక్కడ అత్యంత భక్తితో, ఆధ్యాత్మికతతో ఉండే వాతావరణంలో, అంతే భక్తి ఆధ్యాత్మికతతో శ్రద్దగా సూర్యోదయం చూసి బయటకొచ్చి రిక్షా అబ్బాయితో రెండు రూపాయల కోసం బేరమాడి, ‘అమ్మయ్యా, నేను మామూలుగానే ఉన్నాను’ అనుకునే వైఖరితోనే ఉన్నాననుకునే మామూలు మనిషినే అనుకుంటూ ఉంటాను. అందుకే, నా ఆలోచనా విధానం ఒక ‘జలం’ లాగా ఎక్కడ ఉంటే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. నీరని ఎందుకంటున్నానంటే, చెంబా, పళ్లేమా, నుయ్యా, చెరువా, నదా, సముద్రమా అనుకొదట. అలాగే నాకు కూడా ఆ ఆలోచనలు రావు. ఏది చూసినా thorough గా చూస్తానంతే! ఇది, ‘క్రియాయోగ’ సాధన చెయ్యటం వలన వచ్చిన అలవాటై ఉండవచ్చును. నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు.

చిన్నప్పటి నుంచీ ఒక అలవాటు చేశారు మా పెద్దవారు. చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టి చెయ్యటం. అదే అలవాటు నాకు అన్ని విషయాలలో ఉంటుంది.

అలాగే, ఆధ్యాత్మిక గురువులైన, ‘శివానందమూర్తి’ గారి మాట, ‘కళ్ళు మూస్తే దేముడు, కళ్ళు తెరిస్తే దేశం’ అనేది నాకు శిరోధార్యమే!!.

ఒకే రోజునాడు జరిపిన విక్టోరియా మ్యూజియమ్, నేతాజీ గృహం, మహారుషి భవన్ సందర్శనలలో ఎదురైన విభిన్నమైన అనుభవాలు మీకెలా అనిపించాయి. నేతాజీ గృహం గురించి మరింత చెప్తారా?

జ: పూర్వం నేను ఒంటరిగా  ప్రయాణం చేసాను. అప్పుడు నావద్ద చాలా తక్కువ డబ్బుండేది. అలాగే శక్తి చాలా ఎక్కువ ఉండేది. వాటితో ఎంతవరకూ తిరగగలిగితే అంతవరకూ క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేదానను. అప్పట్లో చేతిలో ఫోన్ కూడా లేదు. అందుకే విక్టోరియా మ్యూజియం వెళ్ళినప్పుడు చాలా వివరంగా చూడగలిగాను. అప్పట్లో శిలలకు ఒక గది, శిలాజాలకు ఒక గది, చెక్కతో చేసిన ఫర్నిచర్ కోసం ఒక గది, మన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కథలను, చరిత్రలను తెలియజేసే గదులు ఉండేవి. ఇంకా విదేశీ నాయకుల పాలరాతి శిల్పాలు క్రిందనే మ్యూజియంను హైలెట్ చేస్తూ ఉండేవి. ఇదంతా, 2006 లో చూసాననుకుంటున్నాను. అప్పుడు, చాలా గదులుండేవి. ఉదయం వెడితే సాయంత్రం వరకూ చూసినా సమయం సరిపోలేదు. కానీ, 2023 లో వెళ్ళినప్పుడు విచిత్రంగా విదేశీ నాయకుల పాలరాతి విగ్రహాలు చెక్కుచెదరకుండా మెరుస్తూనే ఉన్నాయి. కానీ, శిలలు, శిల్పాలు, శిలాజాలు, చెక్క సామానులు మాత్రం కనిపించలేదు. ఎంతో విలువైనవి, మన దేశం గురించి తెలియజేసే ఎన్నో వస్తువులను, కరోనా సమయంలో తెరవటానికి లేక భద్రపరచవలసి వచ్చిందని, అడిగితే అక్కడి క్యూరేటర్ చెప్పారు. నేనే కాకుండా, నాలాగే పూర్వం వివరంగా చూసినవారు కొందరు కూడా నాతో పాటే అడిగి, చూడలేనందుకు చాలా బాధపడ్డారు. అలా చాలా సార్లు చూడటం వలన ఎప్పుడు ఏ వస్తువు ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. మ్యూజియం చూడటం నాకు అలవాటు.. హైదరాబాద్ మ్యూజియం మొట్టమొదటి సారి 1976లో చూసాను.. చివరగా 2025 లో చూసాను. మధ్యలో ఏడాదికి రెండుసార్లైనా వెడతాను. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక తేడా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే, కలకత్తా విక్టోరియా మ్యూజియం కూడా అనుకుంటుంటాను. మార్పులు సహజమే కదా అనుకుంటూ చూస్తుంటాను.

*

మహరుషిభవన్ చూస్తున్నంతసేపు కలకత్తా పూర్వవైభవం చూస్తుంటే నేను పెరిగిన మధ్యతరగతి కుటుంబానికి, ఇక్కడి ఈ వైభవోపేతమైన జీవనవిధానానికి ఉన్న వైవిధ్యాన్ని గమనిస్తూ తిరిగాను. రవీంద్రుని కవితాగానం వింటూ ఆ గదులన్నీ తిరగటం అదొక సంతోషమే! ఆయన వెంట తిరుగుతున్న ఆయన శిష్యులు అనేక దేశాలవారని, అనేక దేశాల యూనివర్సిటీలలో గౌరవ ఉపన్యాసకుడిగా ఉండేవారని, వారి ఉపన్యాసమే కాక ఆహార్యాన్ని కూడా వారి శిష్యులు ఇష్టపడే వారని తెలియజేసే గదులు దేశానికొక గది చొప్పున ఉన్నాయక్కడ. ఏ దేశపు పేరున్న గదిలో ఆ దేశపు యూనివర్సిటీ విద్యార్థులతో అనేక రకాలైన ఫోటోలున్నాయి. అవన్నీ చూసాకా బెంగాలీలు,  పురుషులు చాలా విలాసవంతంగా జీవించి ఉండవచ్చును అనిపించింది. ఆఖరికి వారు చనిపోయిన శిల్పాన్ని శవంగా పడుకోబెట్టి వారి కవితలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసి నాకు ఆయన సాహిత్య సంపద, ఆయన సంపాధించుకున్న ప్రపంచ నలుమూలల నుంచీ మనుష్య సంపద, చివరికి నోబెల్ బహుమతి ఇవేవి కానీ, అంతర్ నిశ్శబ్దన్ని సాధించిన ఉంటారు. అందుకే మహరుషి అయ్యారు అనిపించింది.

వీటన్నిటి కంటే, రవీంద్రనాధ్ ఠాగూర్ భార్య మృణాళిని 29 సంవత్సరాల వయస్సులోనే చనిపోవటం. ఈమె మంచి గాయకురాలు, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న స్త్రీమూర్తిగా, కొంచెం నిరాదరణ కూడా ఎదుర్కొన్నట్లుగా, ఉమ్మడి కుటుంబపు సవాళ్ళను ఈమె కూడా చవిచూసిందని అక్కడి చిత్రాలు, చిత్ర కథనాల వలన తెలుసుకోవచ్చును.

మృణాళిని దేవి చిత్రాలు వారి వంటగది సామానులున్న గదిలో గోడకు ఉన్న చిత్రమే చెబుతున్నది. ఈమె అసలు పేరు, ‘భబతారిణి దేబి’ 1874 మార్చ్ 1 న పుట్టి 1902 డిసెంబర్ లో చనిపోయిందట.

రబీంద్రనాధ్ ఠాగూర్‌కు నోబెల్ ప్రైజ్ 1913లో వచ్చింది. సాహిత్యనికి వచ్చిన బహుమతది. ఆయన బెంగాలీలో వ్రాసిన గీతాంజలికి ఇంగ్లీష్‌లో వ్రాసిన దానికి వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతది. కానీ, కాపాడుకోలేకపోయాము. అది ఎలా పోయిందో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదని శాంతనికేతన్‌లో చెప్పారు.

*

ఒకేరోజు మూడు విభిన్నమైన భవనాలను చూసిన నాకు, భారతదేశం అంటే ఉన్నగౌరవం అధికమైనదని చెప్పవచ్చును.

సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇప్పటికీ యువకులందరికీ ఆదర్శ పురుషుడే ఈయన. సాయుధపోరాటం ద్వారా బ్రిటీషర్స్‌ను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చిన దేశభక్తుడీయన.

వివేకానందుడి బోధనలకు ప్రేరణ పొంది దేశంకోసం పోరాటం సలిపిన వారిలో మొదటిస్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చును. వీరి స్ఫూర్తితో, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో చేరి అనేకమంది దేశస్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపే చిత్ర కథలెన్నో ఉన్నాయి, వారి భవనంలో.

సుభాష్ చంద్రబోస్, పుట్టుకే గానీ, చావు లేని వీరనాయకుడిగా ఈయనను చెప్పుకోవచ్చును.

జపాన్ వెడుతూ తైవాన్‌లో విమానప్రమాదంలో మరణించినట్లు ప్రకటించినా ఎవరూ నమ్మలేదు.

1921 నుంచీ, 1941 వరకూ పదకొండుసార్లు స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడీయన. అంతే కాదు ‘జై హింద్’ అనే నినాదాన్ని, ‘చలో ఢిల్లీ’, అనే నినాదాన్ని, ‘నీ రక్తం నాకివ్వు, స్వాతంత్రాన్ని నీకిస్తా’ అనే నినాదంతో పిలుపునిచ్చి, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అత్యంత విలువైన నాయకుడీయన.

1939 లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. బ్రిటీషర్స్‌కు కొంచెం కంటగింపయింది ఈ పార్టీ వలననే!

బోస్ గారికి భార్య ఏమిలి షేంకెల్. ఈమె ఆస్ట్రియా దేశానికి చెందిన స్త్రీ. ఈమెను వియత్నాంలో కలుసుకున్నారు మొదట. చంద్రబోస్ గారికి కొన్నాళ్ళు సెక్రటరీగా పనిచేసింది. తరువాత ఈమెను ఆష్ట్రియాలోనే వివాహం చేసుకున్నారు. వీరికి అనితా బోస్ అనే కుమార్తే ఉన్నది. సుభాష్ చంద్రబోస్ తన భార్యకు వ్రాసిన ఉత్తరాలు ఒక పుస్తకంగా ప్రచురితమాయ్యాయి. ‘లెటర్స్ టూ ఏమిలీ షేంకెల్’ అనే పేరుతో!

ఏది ఏమైనా, అతి విలువైన దేశనాయకుడిని అర్ధాంతరంగా మాయం చేసుకున్న ఘనత కూడా స్వాతంత్ర్య పోరాటంలో నమోదు చేసుకున్నాము మనం అనిపించింది.

ఒకటే రోజున ఇలా విభిన్నమైన ప్రదేశాలు తిరిగి చూడటం వలన అప్పుడేమి అనిపించలేదు గానీ, సుభాష్ చంద్రబోస్ గారింట ఉన్న వింటేజ్ కార్లు, రవీంద్రుని ముంగిట ఉన్న కార్లు రాత్రంతా కలలోకి వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ కట్టుకున్న అనేక డ్రస్సులు, బేడ్జ్‌లు నా చుట్టూ తిరుగుతున్నట్లనిపించాయి. లేచి, ప్రాణాయామం చేసుకుని పడుకుంటే మళ్ళీ సామానులన్నీ వాటివాటి స్థానాలకు, నేనేమో శాంతిగా నిద్దట్లోకి వెళ్లిపోయాము.

శాంతినికేతన్ సందర్శన సందర్బంగా – ఊహకి వాస్తవానికి ఆమడ దూరం ఉంది అన్నారు, శాంతినికేతన్‌ని చూసి రాత్రి హోటల్‌లో విశ్రమించినప్పుడు – మనసులో నిరాశ కల్గిందని రాశారు. అక్కడ కొత్తగా చేసిన మార్పులను మీరు ముందుగా తెలుసుకోలేకపోయారా? అందువల్లనే నిరాశాభావం తలెత్తిందా?

జ: నేను ఆరో, ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆంధ్రప్రభ అనే వారపత్రికలో అనుకుంటా, అరెకపూడి కౌసల్యగారి శాంతినికేతన్ సీరియల్ వచ్చేది. దానికోసం మా అమ్మ ఆ పత్రిక తెప్పించుకునేది. చుట్టుప్రక్కల ఉన్నవారందరూ ఆ సీరియల్ గురించి మాట్లాడుకునే వారు. ఆ మాటల్లో మిగిలిన కథ కంటే, శాంతినికేతన్ వర్ణన నా మనస్సు మీద చాలా ప్రభావం చూపించింది. అలా శాంతినికేతన్ నా ఊహల్లో ఒక అందమైన ఊహ చిత్రంగా ఉంది. దానికి తోడు భారతదేశమంతా సంచరించే యాత్రికురాలినయ్యాను. ఎన్నో దర్శించాను. నా ఊహల్లో నేను ఊహించిన శాంతినికేతన్ మహరుషి, చెట్టు క్రింద కూర్చుని కవితలు రాసుకుంటూ, పెద్దగొంతుతో సూర్యోదయ, సూర్యస్తామయాల్లో పాడుకుంటూ, చిన్నారి విద్యార్థులను స్నేహంతో పలకరిస్తూ ఉండే శాంతినికేతన్. వాస్తవంలో ఒక బోర్డు నడిపే స్కూల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటూ, శిల్పకళ, చిత్రకళ, సాహిత్యము కూడా బోధన చేస్తున్న ఒక స్కూల్ అనిపించింది.

ఉత్సాహము, ఉత్తేజం ఉండే ఒక నిశ్శబ్ద శాంతి వనంగా ఊహ ఉంటే నిశ్శబ్దం మాత్రమే అక్కడ కనుపించిన వాస్తవం.

శాంతినికేతన్‌ను రవీంద్రుని తండ్రి స్థాపించిగా, విశ్వభారతి అనే యూనివర్సిటీని రవీంద్రనాధ్ టాగూర్ నిర్మించారు. ఇక్కడ అనేక కళలు క్లాస్ రూమ్ పాఠాలుగా కాకుండా సహజంగా, ప్రకృతిలో, ప్రకృతినుంచి నేర్చుకోవటానికి అనుగుణమైన పరిస్థితులుండేవట. ఇది అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. విదేశీ విద్యార్థులు చాలా మంది ఈ విశ్వవిద్యాలయానికి ఆకర్షితులై ఇక్కడ విద్యని అభ్యసించటానికి వచ్చేవారని అక్కడివారు చెప్పారు.

ఇప్పుడు ఇది ప్రపంచ హెరిటేజ్ సంపాదగా గుర్తింపు పొందింది.

నాకు మాత్రం ఎందుకో తెలియదు గానీ నిరాశగా అనిపించింది. ముఖ్యంగా అక్కడ అన్నీ తెలిసిన వారుండి, దగ్గరుండి, ఆ క్లాసూ గదులు, మ్యూజియం, యూనివర్సిటీ భవనం, అన్నీ వివరంగా చూపిస్తూ, వివరాలు చెబుతుంటే కొంచెం ఉత్సాహంగా ఉండేదేమో! అదే కాక సమఉజ్జీలైన వారు ప్రక్కనుండి చెబుతుంటే కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటుందేమో మరి..

రాంచిలో యోగానంద ఆశ్రమం దర్శించినప్పుడు, “చైతన్యం నిండిన ఏకాంతం కాకుండా ఒంటరితనం ఫీలయ్యాను” అని రాశారు, “ఆ నిశ్శబ్దం కూడా భయపెడుతుంది ఒక్కొసారి” అని అన్నారు. రాంచీ పర్యటన మొత్తం మీకు ఒంటరితనమే అనుభవంలోకి వచ్చిందని రాశారు. మీకీ భావన కలగడానికి కారణమేమిటి?

జ: కలకత్తా నుంచీ రాంచీకి చాలా సంతోషంగా వచ్చాము. రాంచి చేరిన కొద్దిసమయానికి మా అబ్బాయి నుంచి ఒక ఫోన్ కాల్ భయంకరమైన నిజాన్ని మోసుకొచ్చింది. అది మా అబ్బాయికి ‘కేన్సర్’ అనే బాధను, అలాంటి సంతోషకరమైన ప్రయాణంలో, ఆ ఆశ్రమంలో వినిపించటం మనస్సు నిశ్శబ్దనికి, వేదనకు, ఒంటరితనానికి కారణం.

అక్కడ ఆ యోగానందా ఒడిలో ఆ కష్టాన్ని చెప్పుకోవటంతో మనసు మూగపోయినా ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ కు కారణమై కథ సుఖాంతంగా ముగిసింది.

నేను నమ్మిన గురువులు, దేవతలు అబ్బాయి వెంట ఉండి వాడిని క్షేమంగా ఉంచాడని నా నమ్మకం. అదే నమ్మకంతో మా అబ్బాయి కూడా, పద్దెనిమిదిమంది అమ్మవార్ల శక్తిపీఠాలు ఒక సంవత్సరం గడువులో పూర్తిచేసి అమ్మవార్ల ఆశీస్సులు పొందాడని నాకనిపిస్తుంటుంది.

ఆ దర్శనాలకు ముందు నా వద్దకొచ్చి, “అమ్మా, నీవు అందరు దేవీ, దేవతలను ప్రార్థించటం వలన నా ఆరోగ్యం కుదుటపడింది. అలాగే నా తరువాత తరాలకు పాజిటివ్ శక్తి చేరాలంటే నేను కూడా అమ్మవార్లను దర్శించుకుంటాను” అని చెప్పి మరీ దర్శించుకున్నాడు.

ఈ విషయ్యాలన్నిటీ వలన రాంచీలో ఒంటరితనం, దుఃఖం కలిగాయి.

పూర్వం కూడా రాంచి వెళ్లాను. అప్పుడూ మంచి అనుభవాలే కలిగాయి. ఆశ్రమంలో స్వామీజీ కూర్చునే లీచీ వృక్షం క్రింద కూర్చుని ధ్యానం చేసుకోవటం ఒక మంచి అనుభవం. మా మేనమామ అల్లుడు, క్రికెటర్ ధోనీ నైబర్స్‌గా ఉండేవారు. ధోనీ ఇంట అతని తల్లితండ్రులు మా మామ కూతురి కుటుంబంతో పాటు నాకూ ఆతిథ్యం ఇవ్వటం, మేము స్వీకరించటం ఒక గొప్ప అనుభూతినిచ్చిన అనుభవమే అది.

రాంచి, నాకు ఇలా అనేక సంఘటనల, అనుభూతులను, అనుభవాలను ఇచ్చింది.

బిష్ణుపూర్ లోని ఛిన్నమస్తాదేవి ఆలయం సందర్శించినప్పుడు వెన్నులోంచి జలదరింపు భావన కలిగిందని రాశారు. అమ్మవారి విగ్రహం క్రోధంగా, అక్కడక్కడ రక్తపు మరకలతో ఉన్నందువల్ల ఈ భావన కలిగిందా? అమ్మవారి ఇతర ఆలయాలు సందర్శించినప్పుడు కలగని ఈ భావనకి కారణం ఈ ఆలయం తాంత్రిక దేవాలయం కావడమేనని అనుకోవచ్చా?

జ: బిష్ణుపూర్ అమ్మవారి గుడి అంత శక్తివంతంగా కనిపించటానికి కారణాలు అనేకం ఉన్నాయి. మొదట మా క్రియాయోగా దీక్షాగురువు చాముండి ఆలయ పూజారీగారు. వారు నాకు దీక్ష ఇచ్చింది ఉత్తరకాశిలోని అమ్మవారి త్రిశూలం దగ్గర. అప్పుడు కూడా ఇలాగే అయింది నాకు. అప్పటినుంచి, ఎక్కడ దశమహావిద్యల అధిదేవతల విగ్రహామూర్తులను చూసినా నాకు శరీరమంతా శక్తి ప్రవాహంగా అనిపిస్తుంది. దానికి తోడు నా యాత్రలలో దేవీ దర్శనాలు అనుకోకుండా ఎక్కువే జరుగుతుంటాయి. ఆ రోజు కూడా అలాగే అమ్మవారిని దర్శిస్తుంటే, అనిపించింది. వెళ్ళేటప్పటికి గంటల చప్పుడు, సాంబ్రాణీ పొగతో ఆలయం నిండిపోయింది ఉంది. ఆ సువాసన, పంచాహారతి ఇస్తున్న పూజారి ఎర్రని బట్టల్లో, నిలువెత్తు అమ్మవారు ఎర్రని రంగులో తల చేతిలో పట్టుకుని.. ఆ పరిసరాలు ఒక డీప్ ఆధ్యాత్మీకానుభవం కలగాక మానదు ఎవరికైనా! క్రియాయోగా చెయ్యటం వలన అమ్మవారితో ఒక దగ్గరితనం కలిగి వెన్ను జలదిరించింది.

ఇలా నాకు అనేకసార్లు అనుభవాలవుతుంటాయి. కానీ, అన్ని అనుభూతులు ఒకేలా ఉండక పోవచ్చు. ఏదైనా అరవై అయిదు సంవత్సరాలు దాటినా కూడా హిమాలాయాల్లో ఉన్న ఆ కొండా, నదీ దర్శించే ఆ ఓపిక అమ్మవార్ల దర్శనం నుంచే వస్తున్నదని నా నమ్మకం.

అష్టాదశ శక్తిపీఠాలు గానీ, వెయ్యిమంది గ్రామదేవతల ఆలయాలు గానీ, మరేదైనా అమ్మవారి దేవాలయం గానీ దర్శించేటప్పుడు ఒక శక్తిని నేను అనుభూతి చెందుతుంటాను. ఆ అనుభూతి కొరకే ఎన్ని దేవాలయాలైనా దర్శిస్తూనే ఉంటాను.

తాంత్రిక దేవాలయాలు కూడా చాలా దర్శించాను. అన్నిటిలో ఒకలా అనుభూతి చెందాలన్న రూలు లేదనే విషయం తెలిసిన దానను. కానీ, అమ్మవారి ఆలయందర్శనం మాత్రం మనలోని పాజిటివ్ ఎనర్జీనీ వృద్ధి చేస్తుంది, ఆ వైపుగా ఆలోచిస్తే! వ్యతిరేకతకు కూడా అదే విధమైన ఫలితం ఉండవచ్చు అనుకుంటుంటాను.

బిష్ణుపూర్ నాకొక క్రొత్త అనుభవాన్నే ఇచ్చింది. అబ్బాయికి బాగాలేదని తెలిసాక వెళ్లిన ఆలయమిది. ఆమెనే వేడుకున్నాను.. ‘అబ్బాయికి ఏది మంచిదైతే అదే ఇవ్వమ’ని. ఆమె కృపా వీక్షణమే వాడిపైన సంపూర్ణంగా ఉన్నదని అనిపించింది. ఆపరేషన్ రోజు కూడా, నేను క్రియా చేసుకుంటుంటే అమ్మ స్వయంగా నా వెన్నెముకను, బాబు వెన్నెముకను తాకినట్లు అనుభూతి చెందాను. అంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నాను. అలాగే అన్ని సర్దుకుని, అబ్బాయి ఆరోగ్యంగా పద్దేనిమిదిమంది అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నాడు. అమ్మవారుంది అనుకోవటానికి నాకు ఇటువంటి అనుభవాలెన్నో ఉన్నాయి. అన్ని ఆలయాల దర్శనం ఒకేలా ఉండదు. అలాగే అన్ని ఆలయాలలో అనుభవాలు, అనుభూతులు కూడా ఒకేలా ఉండవు. ఒకోసారి ఒకోలా ఉంటుంది.

బిష్ణుపూర్ అమ్మవారి దర్శనం మాత్రం, నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చింది.

సాహిత్యరంగాలలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? మరో ట్రావెలాగ్ ఏదైనా ప్రచురించే ఆలోచన ఉందా?

జ: సాహిత్యం గురించి ఆలోచించటం లేదండి. ఆలయానికి వెడితే ఆ ఆలయం గురించి పదిమందికి తెలియజేయటం ఒక అలవాటు. అలాగే ఇప్పటివరకూ సాగింది. ఇకముందు కూడా ఇలాగే వ్రాస్తుంటాను.

తరువాతి పుస్తకాలకు విషయమంతా తయారుగా ఉన్నది.

నేపాల్ యాత్రను గురించి, ‘అద్వైత శక్తిస్థల్’ అనే శీర్షికన ఒక పుస్తకం సెప్టెంబర్‌లో ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నాను. ఆ పైన అమ్మవారి దయ!.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రమా శాండిల్య గారూ.

రమా శాండిల్య: ధన్యవాదాలు.🙏.

***

నా వంగదేశ యాత్ర (కళ-కత్తా)
రచన: రమా శాండిల్య
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 120
ధర: ₹ 150/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు బుక్స్, హైదరాబాద్
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
నవోదయ బుక్స్,
కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 9000413413
రచయిత్రి: 9618766600

Exit mobile version