తేదీ 12 మార్చ్ 2025 న, కరీంనగర్ వాగీశ్వరీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో, బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు రచించిన పద్యకావ్యం, ‘శ్రీదేవీవైభవం’ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమం భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో జరిగినది.


సభకు ప్రముఖ కవి, శతాధిక గ్రంథ ప్రచురణకర్త, విమర్శకులు, డా. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షత వహించారు.
విశిష్ట ప్రధానవక్తగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, కాలమిస్ట్, ప్రవచనకర్త శ్రీ పాణ్యం దత్త శర్మగారు హాజరై, కావ్యాన్ని సమీక్షించారు. వ్యాస ప్రోక్తమైన దేవీభాగవతము లోని మూల శ్లోకాలను కిషన్ శర్మగారు, మధురమైన తెలుగులో ఎలా మలచారో దత్తశర్మ వివరించారు. కావ్యములో కవి సుసంపన్నం చేసిన శబ్దార్థాలంకారాలు, ఛందో వైవిధ్యాలు, అచ్చ తెనుగు పదాలు, మున్నగు వాటిని సమీక్షకుడు విశదీకరించారు. ఇటువంటి ఆముష్మిక సంపదను పద్యరూపంలో ఇవ్వడానికి, జగన్మాత అనుగ్రహం కావాలని, అది పెండ్యాల వారికి పుష్కలంగా దక్కిందని, దత్తశర్మ అభిప్రాయపడ్డారు.


ఈ కృతిని కవి, ప్రముఖ పండితులు, తెలుగు విశ్వవిద్యాలయ కేర్తి పురస్కార గ్రహీత శ్రీమాన్ గన్నమరాజు గిరిజామనోహరబాబు గారికి అంకితం ఇచ్చారు. కృతిభర్త, ఆయన సతీమణిని, కృతికర్త, ఆయన సతీమణి, వేదికపై ఘనంగా సన్మానించారు.
సభకు ముఖ్యఅతిథిగా బ్రహ్మశ్రీ డా. గర్రెపల్లి మహేశ్వర శర్మగారు, శ్రీ శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు విచ్చేసి కావ్యాన్ని ఆవిష్కరించి, పరాశక్తి ప్రాశస్త్యాన్ని వివరించారు.
విశిష్ట అతిథిగా ప్రముఖ సాహితీవేత్త, అవధాని, డా. గండ్ర లక్ష్మణరావుగారు హాజరై, పెండ్యాల వారి పద్య రచనా చాతుర్యాన్ని శ్లాఘించారు. ఆత్మీయ అతిథిగా ప్రముఖ కవి శ్రీ తుమ్మూరి రామ్మోహనరావుగారు వేదికపై ఆసీనులయ్యారు. కవిగారితో తమకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకొని, కవిగారి ఇతర రచనలు వరదాభ్యుదయము, సుందరకాండము అనే పద్యకావ్యాలను గుర్తు చేసుకున్నారు.
సభ అద్వంతమూ, సాహితీ పరిమళాలు వ్యాపించాయి. హృద్యమైన పద్యాలు వక్తల నుండి సద్యోజాతంగా వెలువడి, ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఎందరో పద్యాభిమానులు హాజరై సభకు నిండుతనం తెచ్చారు.
నగునూరి రాజన్న
కరీంనగర్