[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
‘యానాదుల దిబ్బ’ చిన్న ఊరు. దాన్ని ఊరు అనడానికి కూడా కుదరదు. యానాదులు గిరిజనుల వర్గం క్రిందికి వస్తారు. వస్తుతః వారు సంచార జీవులు. కాని కొంతకాలంగా వారు ఆ ఊరిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు అది పెద్ద గిరిజన సమూహాలలో, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, వీరొకరు.
కోనేటయ్య తన గుడిసె ముందున్న నులక కుక్కి మంచం మీద కూర్చుని, కరీం బీడి తాగుతున్నాడు. ఇంటి ముందు రెండు మేకలు కట్టేసి ఉన్నాయి. ముందున్న పందిరిగుంజకు తాడుతో కట్టిన అవిసె మండల నుంచి, అవి ఆకును పెరుక్కొని తింటున్నాయి. గుడిసెలో తిరుపాలమ్మ జొన్నరొట్టెలు చేస్తూ ఉంది. గుడిసె వెనక పెరట్లో వాళ్ల కూతురు రమణమ్మ అంట్లగిన్నెలు కడుగుతూంది.
కోనేటయ్యకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో, రెండెకరాల మెట్ట చేనుంది. దాంట్లో జొన్నపంట వేశాడు. అది పూర్తిగా వర్షాధారం. వర్షాలు పడితే, సంవత్సరానికి సరిపడా జొన్నలు పండుతాయి. పడకపోతే ఎండుతాయి. అప్పుడు పంట గిడసబారి, కంకులు వేయక, పశువుల మేతకు పనికొస్తుంది.
పక్కన చిన్నకొట్టంలో ఒక ఆవు, గాడిపాడులో వేసిన జాడు (గిడసబారిన పచ్చి జొన్న దంట్లు) నింపాదిగా నములుతూంది. దాని పేరు సుభద్ర. అది చూలుతో ఉంది.
‘సుభద్ర ఈనితే, పాలసుక్కలకు లోటుండదు’ అనుకున్నాడు కోనేటయ్య. ‘నిన్న కూడా మేపడానికి తీస్కపోలేదు. పాపం కాళ్లు దోములు (తిమ్మిర్లు) ఎక్కుంటాయి’.
“య్యోవ్, రా, రొట్టెలు సల్లగైనాయి అంటావు మల్లా” అనరచింది తిరుపాలమ్మ.
ఆయన లేచి గుడిసెలోకి వెళ్లాడు. గుడిసె నేల మట్టిదే. కాని పేడతో అలకడం వల్ల, శుభ్రంగా ఉంది. దాని వల్ల గుడిసెలో మంచి వాసన వేస్తూ ఉంది.
జర్మన్ సిల్వర్ తట్టలో రెండు రొట్టెలు, పక్కన పుండుకూర (గోంగూర) పప్పు వేసి మగనికి యిచ్చిందామె. కర్నూలు జిల్లాలో గోంగూరను అట్లా అంటారు.
“పచ్చి ఉల్లిగడ్డ తుంటలు ఎయ్యి నాలుగు” అన్నాడు.
“ఉల్లిగడ్డలు కేజీ పది చెప్పినాడు మొన్న ప్యాపిలి సంతలో. అందుకే త్యాలేదు. ఏమన్న కోనేటట్లు ఉన్నాయా, తినేటట్లు ఉన్నాయా?” అన్నదామె
నిట్టార్పు వదిలాడు కోనేటయ్య. “సర్లె!” అన్నాడు.
వాండ్ల ఎనిమిదేండ్ల కొడుకు, వైనతేయ, కాకీనిక్కరు, తెల్లంగీ వేసుకొని, ప్లాస్టిక్ ఎరువుల బస్తా షీటుతో కుట్టిన పుస్తకాల సంచీ భుజాన తగిలించుకుని వచ్చాడు. వచ్చి, సంచీ ఒక పక్కన పెట్టి, తండ్రి పక్కన కూర్చున్నాడు.
“అమ్మా, బెరీన పెట్టు. బడికి టయిమయితాది” అన్నాడు.
వాడికీ రెండు రొట్టెలు, పప్పు ఏసి ఇచ్చింది తల్లి, వాడు తింటూ చెప్పాడు “నాయినా, సోషలుకు, సైన్సుకు, ఇంగ్లీషుకు వర్కుబుక్కులు కొనుక్కోమన్నాడు మా సారు. డబ్బులియ్యి.”
“అవి ల్యాకపోతే సదువు రాదా ఏందిరా?” అన్నాడు తండ్రి.
“రేపయినా కొనుక్కోకపోతే, సారు మోకాళ్ల మీద కుచ్చోబెడతానన్నాడు నాయినా. ఆ బుక్కులు శానా మంచివంట. టెక్స్టు బుక్కుల్లోని ఎక్సర్సైజులన్నీ దాంట్లో ఉంటాయంట. ఒక్కో బుక్కు పది రూపాయలు. మొత్తం ముఫై రూపాయలవుతాది. ఇయ్యి నాయినా!” నిస్సహాయంగా చూశాడు కోనేటయ్య కొడుకు వైపు. “ఈ రోజు పెదరెడ్డి నడుగుతాలే” అన్నాడు.
కుర్రవాడి ముఖం వికసించింది.
మధ్యాన్నం తినడానికి సత్తు క్యారియర్‌లో రాగిసంకటి, బుడ్డల ఊరిమిండి (వేరుశనగ పచ్చడి) కట్టిచ్చింది తల్లి.
కోనేటయ్య అక్కడికి నాలుగు మైళ్ల దూరంలోని కోటకొండ అనే ఊర్లో, శేషశయనా రెడ్డిగారింట్లో వంట చేస్తాడు. మధ్యాన్నం, రాత్రి భోజనం అక్కడే తింటాడు. మాంసం కూరలు వండడంలో కోనేటయ్య మొనగాడని పేరు.
పాత సైకిలు మీద కోటకొండకు బయలుదేరాడు కోనేటయ్య. మళ్ళీ వచ్చేది రాత్రికే.
“ఇయ్యాల సుభద్రను మేతకు అట్లా తిప్పుకు రమ్మను రమణమ్మను. కాళ్లకు నీరొస్తాది ల్యాకపోతే” అని చెప్పాడు భార్యకు.
“తీస్కపోతాదితే నీవు పో!” అన్నదామె.
రమణమ్మ కూడ రొట్టెలు తిని, ఆవు పలుపు తిప్పుకొని, బంజరు లోకి తీసుకుపోయింది. ఆవు బరువుగా కదులుతూ ఆ అమ్మాయి వెంట బయలుదేరింది.
తిరుపాలమ్మ కూడా రొట్టెలు తినేసి, పాతగుడ్డలో సంకటి కట్టుకొని, బయలుదేరింది జొన్న చేలో కలుపు తీయడానికి; కేశవన్న గౌడు వాండ్ల చేలో.
కోనేటయ్యది ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాంతం అయితే, వాండ్ల నాయన వెంకటేసు కర్నూలు జిల్లాకు వలస వచ్చాడు. ఆయన కూడా రెడ్ల ఇండ్లలో వంటలు చేసేవాడు. ప్యాపిలి శేషశయనా రెడ్డిగారి నాయిన కంబిరెడ్డి ఇంట్లో. ఆయన పనితనానికి మెచ్చి, కంబిరెడ్డి వెంకటేసుకు ఈ రెండెకరాల కొండ్ర రాసిచ్చినాడు.
వెంకటేసుకు అడవిలో మూలికలపై కూడా మంచి అవగాహన ఉండేది. పచ్చకామెర్లకు ఆయన పసరు మందు పోసేవాడు. డబ్బులు తీసుకునేవాడు కాదు. తీసుకుంటే మందు పనిచేయదనే వాడాయన.
యానాదుల గుడిసెలు శంఖం ఆకారంలో ఉంటాయి. దానికి వాకిలి ఉండదు. బాగా వంగితే తప్ప లోపలికి పోవడానికి వీలుండదు. ఒకప్పుడు వారిలో బహుభార్యాత్వం ఉండేదట. కోనేటయ్య తాతకు ముగ్గురు భార్యలుండేవారని చెప్తారు. వారు మాట్లాడే తెలుగు మాండలికం విభిన్నంగా ఉంటుంది. దీర్ఘాలు తీసి మాట్లాడతారు.
బ్రిటిష్ కాలంలోని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఆనాడు యానాదులు పోరాడారు. వారిని దొంగలుగా, వ్యభిచారులుగా, నేరస్థులుగా ముద్రవేసి, నిర్బంధించి హింసించేది బ్రిటిష్ ప్రభుత్వం. అట్లా వాళ్ళు వలస పాలకులకు ఎదురు తిరిగిన స్వాతంత్ర్యపోరాట యోధులు.
క్రమంగా యానాదులు వ్యవసాయం, పశుపోషణ వైపు మొగ్గారు. పెద్ద రెడ్ల యిండ్లల్లో వంటవాళ్లుగా వాళ్ళే ఉండేవారు.
‘యానాది దిబ్బ’లో యాభై కుటుంబాలుంటాయి. ఆ ఊరు ప్యాపిలి మండలం క్రిందికి వస్తుంది. ప్యాపిలి మండలకేంద్రం. హైదరాబాదు – బెంగుళూరు జాతీయ రహదారిపై, డోన్ – గుత్తిల మధ్య ఉంటుంది. అది ఒక మేజర్ పంచాయితీ, పెద్ద ఊరు.
***
వైనతేయ, అక్కడికి రెండు కిలోమీటర్ల లోని జలదుర్గం ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ క్లాసు చదువుతున్నాడు. అది ఏకోపాధ్యాయ పాఠశాల. ఐదవ తరగతి వరకు ఉంటుంది. ఆ చుట్టుపక్కల జెడ్.పి.హైస్కూలు ప్యాపిలిలో మాత్రమే ఉంది. జూనియర్ కాలేజి డోన్‌లో, గుత్తిలో ఉన్నాయి. ఆ రెండూ టవున్లు.
దస్తగిరి సారు ప్యాపిలి నుంచి జలదుర్గానికి రోజూ వచ్చి, పాఠాలు చెప్పి, పోతుంటాడు. ఆయన దూదేకుల కులానికి చెందినవాడు. దూదేకుల వారి వృత్తి, దూది పరుపులకు కావలసిన పత్తిని దూదిగా ఏకడం, పరుపులు కుట్టడం. అది ఒకప్పుడు, కాని వారంతా రకరకాలుగా జీవనం సాగిస్తున్నారు.
దూదేకులవారు మౌలికంగా ముస్లింలు అయినా, హిందూ సాంప్రదాయాలను పాటిస్తారు. పండుగలు జరుపుకుంటారు. వారి తెలుగులో కూడా ఉర్దూ యాస అసలు ఉండదు. ముస్లింలలో వారిని కొంత తక్కువ స్థాయిగా పరిగణిస్తారు.
జలదుర్గం స్కూల్లో, ఐదు తరగతులకూ కలిసి వందకు లోపే పిల్లలుంటారు. స్కూలంతా ఒకే పెద్ద హాలు. అందులోనే విడివిడిగా పిల్లలను కూర్చోబెడతాడు దస్తగిరి సారు. ప్రేయరు బెల్లు కొట్టాడు ప్యూన్ మద్దిలేటి. అతడే ఆ స్కూలుకు ప్యూన్, వాచ్‌మన్, స్వీపర్, అన్నీ.
పిల్లలందరూ బిలబిలమని వెళ్లి స్కూలు ముందున్న చింత చెట్టు కింద, తరగతుల వారీగా నిలబడినారు. ప్రతి క్లాసు ముందు వారి లీడరు. వాటిని సి.పి.ల్ అంటారు. క్లాస్ ప్యూపిల్ లీడరన్నమాట.
యస్.పి.యల్. అంటే స్కూల్ ప్యూపిల్స్ లీడరు. ఆ పిల్లవాడు ఐదవ తరగతివాడై ఉంటాడు. వాడూ వచ్చి అందరికీ ముందు నిలబడ్డాడు. దస్తగిరి సారు వచ్చిన వెంటనే
“స్కూల్ అటెన్షన్”
“స్టాండ్ అట్ ఈజ్”
అని ఐదారుసార్లు పిల్లలందరితో భంగిమలు మార్పించినాడు. తర్వాత “ప్రేయర్!” అని అరిచినాడు.
నాల్గవ తరగతిలోనించి వైనతేయ వచ్చి యస్.పి.ఎల్ జయరాముని పక్కన నిలబడినాడు. గొంతెత్తి, శ్రావ్యంగా, కల్యాణి రాగంలో, ఈ పద్యాన్ని పాడినాడు.
ఉ:
“ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”
దస్తగిరి సారు పద్యం పాడుతున్న ఆ పిల్లవాని వైపు మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు. రోజూ విన్నా. ఆయనకు తనివి తీరదు. ఆ పద్యాన్ని వాడికి నేర్పించింది సారే. ఆయనకు సంగీతంలో ప్రవేశముంది. హార్మోనియు వాయించడం కూడా వచ్చు. డోన్ – కర్నూలు మధ్య వెల్దుర్తి అని ఒక ఊరుంది. అక్కడ వెంకట నర్సు నాయుడని ఒక ప్రముఖ రంగస్థల నటుడున్నాడు. ఆయన ‘గయోపాఖ్యానం’ లో అర్జున పాత్రకు పేరు. కృష్ణుడిగా షణ్ముఖి ఆంజనేయ రాజుగారు. వెంకట నర్సు నాయుని శిష్యుడు దస్తగిరి సారు. ఆయన దగ్గరే, హార్మోనియం, రంగస్థల పద్యాలు పాడడం నేర్చుకున్నాడాయన.
తర్వాత “ప్రతిజ్ఞ!” అని అరిచాడు యస్.పి.ఎల్.
మూడవ తరగతిలోంచి ఒకమ్మాయి వచ్చి వైనతేయ పక్కన నిలబడింది. అందరితో ప్రతిజ్ఞను పలికించసాగింది.
“భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు..”
తర్వాత నేషనల్ యాంథమ్.
పిల్లలందరూ జనగనమణ సుస్వరంగా పాడారు. తర్వాత, “స్కూల్ డిస్పర్స్, జైహింద్” అని యస్.పి.ఎల్. అనగానే పిల్లలందరూ స్కూల్లోకి వెళ్లిపోయారు.
తర్వాత ప్రారంభమైంది దస్తగిరి సారు అష్టావధానం. ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేయడం కత్తి మీది సాము! ఐదు తరగతులను సంబాళించుకోవాలి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్లాసులు సాగాయి. ‘అన్నం బెల్లు’ కొట్లాడు మద్దిలేటి. పిల్లలందరూ క్యారియర్లు విప్పుకుని కూర్చున్నారు. సారు కూడా తన బల్ల మీదే భోజనం చేశాడు.
ఇంకా ఇరవై నిమిషాలుంది మధ్యాహ్నం సెషనుకు. “మద్దిలేటి, వెళ్లి వైనతేయ గాడిని రమ్మని చెప్పు” అన్నాడు సారు. వాడు వచ్చి చేతులు కట్టుకొని నిలబడినాడు.
“ఒరేయ్, నిన్న నేను నేర్పిన పద్యం ప్రాక్టీసు చేసినావా?” అని అడిగినాడు సారు.
“చేసినా గాని సార్, అక్కడక్కడా సరిగ్గా రావడంల్యా” అన్నాడు వాడు తల గోక్కుంటూ.
“ఏదీ ఒకసారి అను.”
వాడు పాడుతుంటే వినడానికి చాలామంది పిల్లలు వచ్చి నిలబడినారు. సారు వారినేమీ అనలేదు. వైనతేయ మోహన రాగంలో అందుకొన్నాడు. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం లోని పద్యం అది.
“వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు బాలఱాతిగో రీకడ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే యాకటిచిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ నోకద! వానికై వగవ డొక్కండు; దాచదు కాటినేలయున్”
“గుడ్! ‘గోరీ కడ’ అన్నచోట శృతి తప్పింది. మొదట్లో, ‘వాకొనరాని’ అనడం, నేను చెప్పినట్లు రాలేదు. సాయంత్రం బడి వదిలిన తర్వాత కొంచెం సేపు కూర్చుందాము” అన్నాడు సారు.
వాడు వెళ్లింతర్వాత సారు ఆలోచించినాడు. ‘వీడిలో దైవదత్తమైన గళం, మాధుర్యం ఉన్నాయి. రాగప్రస్తారాన్ని చక్కగా అనుసరిస్తాడు వెధవ. వీడిని సరిగ్గా సానబడితే వజ్రం అవుతాడు. డి.వి. సుబ్బారావు గారిలాంటి ఉద్ధండులు పాడిన పద్యాన్ని అలవోకగా పాడేసినాడు. వీడిని తీర్చిదిద్దాలి.’
ఆ గురువర్యుని మోములో ఒక వజ్ర సంకల్పం!
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
The Real Person!
“శ్రీమద్రమారమణ” సీరియల్ మొదటి భాగమే ఆకట్టుకునేటట్లు రాశారు. ఆ ఇంటి వర్ణన, వారి జీవన విధానం కళ్ళముందు కనబడుతున్నట్లు వర్ణించారు. బాగుంది. (సత్యహరిశ్చంద్ర నాటకంలో పద్యం గుర్రం జాషువా గారి స్మశానం ఖండకావ్యం లోనిది. హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారు రాసినది కాదు.)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
చిరుజల్లు 16
నువ్వు చచ్చిపోతే?
ఆకాశం నిర్ఘాంతపోయింది
క్వీన్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్… మేడమ్ భికాజీ రుస్తుంజీ కామా
అంతరిక్షంలో మృత్యునౌక-7
ఆజ్ఞ మేరకు!
మా బాల కథలు-1
జీవన రమణీయం-146
డా. గ్రేస్ నిర్మల – ఒక జ్ఞాపకం
కల్పవృక్షంలో సీతాదేవి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®