[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]


[వైనతేయ హరికథాప్రస్థానం కొనసాగుతూ ఉంటుంది. ఖరగ్‌పూర్‌లో ‘సీతారామ దాంపత్యం’ అనే అంశం మీద గొప్పగా చెప్పి, ప్రేక్షకులను రంజింపజేస్తాడు. మైసూరు దత్తపీఠంలో ‘శ్రీదత్త విజయము’ హరికథ చెప్తాడు. షేక్స్పియర్ నాటకాలలో బాగా ప్రాచుర్యం పొందిన కొన్నింటిని, మన నేటివిటీకి అనుగుణంగా మార్చి హరికథలు చెప్తాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైనతేయ చెప్పిన ‘స్వామి వివేకానంద’ హరికథ అతనికి ఎంతో పేరు తెస్తుంది. ఆ యూనివర్శిటీ వారు అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు. బెంగుళూరు, సి.పి. బ్రౌన్ సాహిత్య సమితి వారి వార్షికోత్సవంలో ‘ఒథెల్లో’ నాటకాన్ని హరికథగా చెప్తాడు. అమెరికాలో ఉంటున్న సిద్ధరామప్ప అనే ఆయన బెంగుళూరు వచ్చి, ఒథెల్లో హరికథని విని అబ్బురపడతాడు. ఆయన ‘కాలా’ (కన్నడ అసోషియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్) లో క్రియాశీల సభ్యుడు. ఆయన సి. పి. బ్రౌన్ వారి వద్ద వైనతేయ వివరాలు సేకరించుకొని వెళ్తాడు. వైనతేయ హరికథల పట్ల యువతరంలో గొప్ప క్రేజ్ ఏర్పడుతుంది. – ఇక చదవండి.]
మూడు నెలల తర్వాత బెంగుళూరు సి.పి.బ్రౌన్ అధ్యక్షుల వారి నుండి ఫోన్ వచ్చింది. వైనతేయకు. అప్పటికింకా లాండ్లైన్లే. సెల్ ఫోన్ల రాజ్యం రాలేదు. వైనతేయ ఆ మధ్యనే ఇంట్లో లాండ్‌లైన్ కనెక్షన్ పెట్టించుకున్నాడు. హీరో హోండా స్పెండర్ బైకు, ఒనిడా కలర్ టివి, కెల్వినేటర్ ఫ్రిజ్, టేకు మంచాలు, రోజ్‌వుడ్ డైనింగ్ టేబులు ఇలా ఆధునిక సౌకర్యాలన్నీ సమకూర్చుకొన్నాడు. ఫిలిప్స్ కంపెనీ వారి పెద్ద టిప్ రికార్డరు అదివరకే ఉంది.
వారికి ఊరి దగ్గర ఉన్న రెండెకరాల పొలం మంచి ధర పలుకుతూ ఉంది. ఎకరం ఇరవై లక్షలు! ప్యాపిలి – బనగానిపల్లె రహదారికి దగ్గరలో ఉందది. రియల్ ఎస్టేట్ రంగం అక్కడ అప్పుడప్పుడే వెళ్ళూనుతూ ఉంది. ఈ విషయం దస్తగిరిసారు ఎప్పుడో చెప్పాడు.
గురుశిష్యులిద్దరూ, కర్నూలు బళ్లారి చౌరస్తాకు చేరువలో, చెరొక రెండువందల గజాల స్థలం పక్కపక్కనే కొన్నారు, దస్తగిరిసారు రిటైర్మెంటు లోపల ఇళ్లు కట్టుకోవాలని. ఊరి దగ్గర చేను అమ్మి, వచ్చిన డబ్బుతో గురువుగారికి తనకు ఇళ్ళు కట్టించి, ఆయనకు గురుదక్షిణగా ఇవ్వాలని శిష్యుని ఆలోచన. ఆ విషయం సారుకు ఇంకా చెప్పలేదు! చెబితే తిడతాడని భయం!
సి.పి. బ్రౌన్ సంస్థ అధ్యక్షుల వారు, పులగం శివదాసు గారు. ఆయన ఫోన్లో ఇలా చెప్పారు
“హరిదాసు గారూ, నమస్కారం. మా మిత్రులు సిద్దరామప్పగారు ఫోన్ చేసినారు. వారి ‘కన్నడ అసోసియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ సంస్థట (కాలా) టెక్సాస్ తెలుగు అసోసియేషన్ (TTA) వారు సంయుక్తంగా ‘భారత సంస్కృతీ వైభవం’ అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. అమెరికాలోని తమిళ మళయాళ సంస్థలు కూడా జత కలిశాయట. ఆ ఉత్సవాల్లో మీరు మొన్న బెంగుళూరులో చెప్పిన హరికథ ఉంటే, ‘ఒథెల్లో!’ – దాన్ని చెప్పాలని ఆహ్వానిస్తున్నారు. మీరు వెంటనే హైదరాబాదుకు పోయి పాస్‌పోర్టుకు అప్లయి చేయండి. మీ బృందానికి రానుపోను విమాన ఛార్జీలు, బస వగైరాలన్నీ సమకూర్చుతారు. మీకు సన్మానం, భారీ పారితోషికం కూడా ఉంటుంది. వీసా సంగతి వారు చూసుకొంటారు. నాట్యం, సంగీతంలలో లబ్ధప్రతిష్ఠులను, కొందరు సినిమా తారలను కూడా ఆహ్వానిస్తారట. మీ సమ్మతి తెలియజేస్తే, వారు ఏర్పాట్లు చేసుకుంటారు.”
వైనతేయ సంతోషించాడు. “తప్పకుండా వస్తామండి” అని చెప్పాడు.
మరో మూడు నెలల్లో, వైనతేయ, దస్తగిరి సారు, జయరాములు బయలుదేరారు. హైదరాబాదు నుండి ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి ఎల్. ఎ. (లాస్ ఏంజిల్స్)కు.
వైనతేయ ‘ఒథెల్లో’ అక్కడ సూపర్ హిట్ అయింది. సినీనటులు కూడా హాజరై, “హరికథ ఇలా కూడా ఉంటుందా” అని ఆశ్చర్యపోయారు. తెలుగు దర్శకుడు ఒకాయన తాను తీయబోయే సినిమాలో పది నిమిషాల పాటు మీ హరికథ పెడతానని, అంగీకరించమని అడిగాడు. వైనతేయ నవ్వి, “వద్దులెండి! పది నిమిషాలు ప్రార్థనకే సరిపోదు” అన్నాడు వినయంగా.
మరో ఐదేళ్లు గడిచాయి. దస్తగిరిసారు రిటైరైనాడు. ఆయన కూతురు అల్లుడు కర్నూలు దగ్గరే ఉంటారు. అల్లుడు రాయలసీమ కార్బెట్స్లో ఫిట్టరు. వారు దూపాడులో ఉండేవారు, బాడుగలు తక్కువని.
గురుశిష్యులిద్దరూ ఇళ్ళు కట్టుకున్నారు, పక్క పక్కనే. దస్తగిరిసారు కూతురూ, అల్లుడూ వారి దగ్గరికి వచ్చేశారు, కార్బైడ్ ఫాక్టరీ మూత పడటం వల్ల. అల్లుడు సొంతంగా ఒక మెకానిక్ షెడ్డు పెట్టుకున్నాడు. వారికొక పాప. టెంత్‌కు వచ్చింది. దాని పేరు హసీనా.
యానాదులదిబ్బ దగ్గరి చేనును ‘రేనాడు డెవలపర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ వారు యాభైమూడు లక్షలకు కొన్నారు. అలా చుట్టుపక్కల కొని, వెంచర్ వేసి ఇండ్ల ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. ఎకరాల లెక్కన కొని సెంట్ల లెక్కన అమ్ముతారు.
తన యింటికి కూడా శిష్యుడీ పెట్టుబడి పెడతానంటే దస్తగిరిసారు ఒప్పుకోలేదు. “నాకూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి. నెల నెలా పెన్షను వస్తుంది, వద్దంటే వద్దు” అని భీష్మించుకున్నాడు.
వైనతేయ కళ్లనీళ్ల పర్యంతమై సారు కాళ్లకు చుట్టుకుపోయాడు. “నా గురుదక్షిణ ఇది. నాకింత చేసిన మీకు నేనేమి చెయ్యలేదు. దయ చేసి కాదనవద్దు” అంటూ ఏడ్వసాగాడు.
హరికథా హర్యక్ష, మోటివేషన్ మాస్టర్, బిహెచ్.యు గౌరవ డాక్టరేట్ గ్రహీత, డా. వైనతేయ భాగవతార్ అలా నేల మీద కూర్చొని ఏడుస్తుంటే ఆ గురువర్యుని హృదయం ద్రవించింది. అతన్ని తీపి గుండెలకు హత్తుకొని, “సరే, సరే! అట్లాగే! కాని, నాదొక కోరిక. మన తబలిస్టు జయరాములుకు కూడ పైన రెండు రూములు వేసి యిద్దాము.” అన్నాడు.
అది తనకు తోచనందుకు వైనతేయ సిగ్గుపడ్డాడు.
రెండు గృహప్రవేశాలకూ ముహూర్తం ఖరారయింది. ఒకటి ‘ఆదిభట్ల నిలయం’. రెండవది ‘తుంబుర నారదనిలయం’. వైనతేయకు ఇద్దరు కుమార్తెలు. సెవెన్త్, థర్డ్ చదువుతున్నారు. వారికి ‘శివరంజని’, ‘కల్యాణి’ అని రాగాల పేర్లు పెట్టుకొన్నాడు. ప్రస్తుతం అతనికి హెడ్మాస్టరుగా ప్ర్రమోషన్ ఇచ్చి, వెల్దుర్తి హైస్కూలుకు వేశారు. బైక్ మీద, కర్నూలు నుండి వెళ్లి వస్తున్నాడు.
ఆంజనేయశర్మ, సదాశివశర్మ దంపతులు డెబ్బైలలోకి వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు. గృహప్రవేశాలకు వచ్చి ఆశీర్వదించారు.
***
హరికథను సరికొత్త ఇన్నోవేషన్ లతో సుసంపన్నం చేస్తూ సాగుతున్నాడు వైనతేయ.
మరో రెండొండ్లు గడిచాయి. వైనతేయకు ఈసారి అరుదైన ఆహ్వానం అందింది. ఇంగ్లండ్ (యు.కె) లో, కాల్చెస్టర్ అన్న ఊర్లో, మెర్క్యురీ ధియేటర్ అని వుంది. ‘మెర్క్యురీ ప్రొడక్షన్స్’ పేరిట వారు ఉన్నత శ్రేణి ప్రదర్శనలు నిర్వహిస్తారు. దాని క్రియేటివ్ డైరెక్టర్ ర్యాన్ మెక్ బ్రైడ్ గారు, ఢిల్లీలోని బ్రిటిష్ హైకవీషనర్ సర్ ఎడ్వర్డ్ గారికి ఫోన్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ లోని వైనతేయ అనే పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్‌ను ఆహ్వానించదల్చుకున్నామని, షేక్స్పియర్ నాటకాలను ఆయన హరికథలు చెబుతాడని తెలిసిందని, అమెరికాలో కూడా చెప్పాడని, జార్జ్ బెర్నాడ్ షా గారు రాసిన ‘పిగ్మేలియన్’ నాటకాన్ని ఆయన ఇంగ్లీషులో చెబితే బాగుంటుందని కోరాడు.
బ్రిటిష్ హైకమిషన్ కర్నూలు జిల్లా కలెక్టరును ఎ.పి.గవర్నరు ద్వారా సంప్రదించి, వైనతేయను ఢిల్లీకి పిలిపించారు. పిగ్మేలియన్ ఒక ‘ప్రాబ్లం ప్లే’ అని, దాని మీద తనకు అవగాహన ఉందని, డిగ్రీ ఫైనలియర్లో పాఠ్యాంశంగా ఉండేదని, డేవిడ్ రాజు సార్ దాన్ని అద్భుతంగా పాఠం చెప్పారని గుర్తుకు తెచ్చుకున్నాడు వైనతేయ. “ప్లీజ్ గివ్ టు మంత్స్, సర్. ఐ విల్ మౌల్డ్ ది ప్లే అండ్ రెండర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ హరికథ. ఇట్ విల్ బి ఎ ప్రివిలేజ్ ఫర్ మీ!” అన్నాడు హైకమిషనర్‌తో. వారు సరే అన్నారు
వైనతేయ బృందం ఇంగ్లండుకు బయలుదేరి వెళ్లింది. కోల్చెస్టర్ లోని ఒక స్టార్ హోటల్లో వారికి బస. మర్నాడే పోగ్రాము. కోల్చెస్టర్ నగర మేయర్ ఆండర్సన్, ముఖ్య అతిథి. మెర్క్యురీ ధియేటర్ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ట్రేసీ చైల్డ్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ మ్యానిక్స్ వీరిని సాదరంగా ఆహ్వానించారు. ధియేటర్ పి.ఆర్.వో చెస్టర్టన్ వారిని ఎయిర్‌పోర్టులో గౌరవంగా రిసీవ్ చేసుకుని, హోటల్‌కు తీసుకెళ్లారు.
మెర్క్యురీ థియేటర్ ఉన్న ప్రాంతాన్ని ఎస్సెక్స్ (Essex) అంటారు. అది బాల్కెర్న్ గేట్ వద్ద ఉంది. అందులో ఐదువందల మంది ప్రేక్షకులు పడతారు. 1972లో ఆ థియేటర్‌ను ప్రారంభించారు. దాని ఆర్కిటెక్ట్ నార్మన్ డౌనీ! మహామహులైన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించిన వేదిక అది.
సాయంత్రం ఆరు గంటలకు ప్రదర్శన అని ప్రకటించి ఉన్నారు.
“డా. వైనతేయ, ఫ్రం ఇండియా. పెర్ఫార్మ్స్ జార్జ్ బెర్నాడ్ షాస్ ‘పిగ్మేలియన్’ ఇన్ ఇండియన్ ట్రెడిషనల్ ఫామ్, హరికథ.”
ఐదున్నరకే ధియేటర్ నిండిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ ర్యాన్ మెక్ బ్రైడ్ వైనతేయను సభికులకు పరిచయం చేశాడు.
“ఐ ఫీల్ ఎలేటెడ్ అండ్ హైలీ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ యు ‘డాక్టర్ వైనతేయా’, ఎ రినౌన్డ్ పెర్ఫార్మింగ్ స్టేజ్ ఆర్టిస్ట్. హీ ఈజ్ యాన్ ఎక్స్పర్ట్ ఇన్ రెండరింగ్ షేక్స్పియరెన్ ప్లేస్ లైక్ ఒథెల్లో, హామ్లెట్ ఇన్ హిజ్ నేటివ్ లాంగ్వేజ్. నౌ హి విల్ పెర్ఫార్మ్ జార్ట్ బెర్నాడ్ షాస్ పిగ్మేలియన్.” అని చెప్పాడు
సభలో కరతాళ ధ్వనులు!
వైనతేయ ముకుళిత హస్తాలతో సభకు నమస్కరించాడు. తెల్లని పైజమా, జుబ్బా, ధరించాడు. నుదుట గంధం, కుంకుమ. తలకు ఒక ఎర్రని పట్టీ. మెడలో పగడాల దండ. అతని ముఖంలో తేజస్సు. జ్ఞానజనితమైన తేజస్సు అది.
“ఐ ప్రొప్యూజ్లీ థాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది మెర్కురీ థియేటర్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రిస్టీజియస్ మిషన్. ఐ ఇంట్రడ్యూస్ అవర్ గురు అండ్ హార్మోనిస్ట్ శ్రీ దస్తగిరి అండ్ అవర్ తబలిస్ట్ శ్రీ జయరాములు, హు విల్ అసిస్ట్ మీ విత్ దైర్ ఇన్స్ట్రుమెంట్స్. లెట్ మీ ప్రే అవర్ లార్డ్ గణేశ ఫస్ట్. టు గెట్ దిస్ హెర్యులియన్ టాస్క్ ఫుల్ఫిల్డ్, అన్-అబ్రస్టవ్లీ!” అని ‘శుక్లాంబరధరం’ శ్లోకాన్ని ‘హంసధ్వని’ లో పాడాడు.
అతని ఇంగ్లీషు ఉచ్చారణ స్పష్టంగా ఉంది. అమెరికన్ యాక్సెంట్ కష్టం గాని, మన భారతీయులు అనుసరించేది బ్రిటిష్ స్పాండర్డే. నేటివ్ బ్రిటిషర్స్ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా, అతని స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, వారి దానికి దగ్గరగానే ఉంది.
తర్వాత, జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ లోని, ప్రస్తావన లోని లైన్లను రాగయుక్తంగా చదివి సభికులను ఆశ్చర్యచకితులను చేశాడు.
“Sing Heavenly Muse, that on the secret top of oreb, or of Sinai, didsnt inspire
That Shepherd, who first taught the Chosen Seed”
మెర్క్యురీ థియేటర్ చప్పట్లతో దద్దరిల్లి పోయింది! ‘హెవెస్లీ మ్యూజ్’ అంటే సాక్షాత్తు భగవంతుడు అడమ్ అండ్ ఈవ్‌ల పవిత్ర చరిత్రును వర్ణించేందుకు తగిన పదాలను తనకివ్వమని మిల్టన్ భగవంతుడిని తనలో ఆవహింప చేసుకున్నాడు.
హరికథ అంతా ఇంగ్లీషులో సాగుతుంది. మన దేశంలో లానే, ఇంగ్లాండులో కూడా రకరకాల మాండలీకాలు (dialects) ఉన్నాయి. స్కాట్‌ల్యాండ్, ఐర్లండ్, ఇంగ్లండ్ కలిసి యునైటెడ్ కింగ్ ఏర్పడింది. ఉన్నతవర్గాలవారు మాట్లాడేది గొప్ప డయలెక్టని, స్లమ్స్ (మురికివాడలు) లో మాట్లాడేది హీనమైనదనీ భావించేవారు.
“డియర్ ఫ్రెండ్స్, నో డయలెక్ట్ ఈజ్ సుపీరియర్ టు అనదర్, నార్ ఈజ్ ఇన్ఫీరియర్. లాంగ్వేజ్ ఈజ్, అఫ్కోర్స్, ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ, సో, ది డయలెక్ట్ ఆఫ్ ది పూర్ నీడ్ నాట్ బి లుక్డ్ డౌన్ అపాన్! టు ప్రూవ్ దిస్, షా రోట్ దిస్ ప్లే.
మిత్రులారా! బెర్నార్డ్ షా వ్రాసిన నాటకాలను ప్రాబ్లమ్ ప్లేస్ అంటారని మీకు తెలియనిది కాదు. ఆయన ఏం రాసినా అందులో ఒక సోషియల్ పర్పస్, ఒక సోషియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి!”
చప్పట్లు!
“పిగ్మేలియన్ ఒక గ్రీకు రాజు. గొప్ప శిల్పి. తాను చెక్కిన శిల్పం సజీవమైతే బాగుండునని అనుకుంటాడు. ప్రేమకు అధిష్టాన దేవత ఐన అఫోర్డైట్ ను ప్రార్థిస్తాడు. ఆమె అనుగ్రహంతో, ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది. ఆమెకు ‘గెలాటియా’ అన్న పేరు పెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
షా తన నాటకంలో ప్రొఫెసర్ హిగ్గిన్స్ అన్న ఫొనెటీషియన్ (భాషా శాస్త్రవేత్త)ను సృష్టించాడు. ‘ఏలిజా డూ లిటిల్’ అన్న ఒక పూలమ్మేపిల్ల ఇందులో ముఖ్యపాత్ర. హిగ్గిన్స్ స్నేహితుడు ఆమె స్లాంగ్‌ను చూసి అసహ్యించుకుంటాడు. ఆయన అది తప్పని, సరైన శిక్షణ, ఎక్స్పోజర్ వుంటే ఆ అమ్మాయి కూడా పాలిష్డ్ స్పీచ్ అండ్ మ్యానర్స్ను అలవరచుకోగలదని, మిత్రునితో ఛాలెంజ్ చేస్తాడు. ఆ అమ్మాయి తండ్రిని ఒప్పించి, ఆమెకు ఆరు నెలలు శిక్షణనిస్తాడు.
షా నాటకాలలో ఆయన రాసే ముందుమాటలకు (Prefaces) ఎంతో విలువ ఉంటుంది” అంటూ పిస్ట్రేలియన్ కు ఆయన రాసిన Preface లోని కొంత భాగాన్ని అభినయిస్తూ రాగయుక్తంగా చదివాడు. దస్తగిరిసారు, మంద్రంగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అందిస్తుండగా జయరాములు వాక్యాల చివర చిన్న ముక్తాయింపును తబలా మీద ఇస్తున్నాడు.
“ది ఇంగ్లీష్ హవ్ నో రెస్పెక్ట్ ఫర్ దైర్ లాంగ్వేజ్ అండ్ విల్ నాట్ టీచ్ దైర్ చిల్డ్రన్ టు స్పీక్ యి. ఇట్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ యాన్ ఇంగ్లీష్‌మన్ టు ఓపెన్ హిజ్ మౌత్ వితవుట్ మేకింగ్ సమ్ అదర్ ఇంగ్లీష్‌మన్ హేట్ ఆర్ డిస్పైస్ హిమ్.”
(ఇంగ్లీషువారికి తమ భాష మీద గౌరవం లేదు. తమ పిల్లలకు దాని నెలా మాట్లాడాలో నేర్పరు. ఇంగ్లీషువాడు నోరు తెరిచి మాట్లాడిటే ఇంకో ఇంగ్లీషువాడు దానిని అసహ్యించుకోకుండా ఉండడు!)
సభలో మౌనం! కానీ చెప్పింది సాక్షాత్తు బెర్నార్డ్ షా! ఏం చేస్తారు?
వైనతేయ అన్నాడు
“మిత్రులారా! ఈ ధోరణి ఇంగ్లాండు తనే కాదు చాలా దేశాల్లో ఉందిలెండి. తాము మాట్లాడే మాండలీకమే గొప్పది అనుకోవడం మానవ స్వభావం! అది తప్పని రుజువు చేయడమే షా ఉద్దేశం!”
సభికుల ముఖాల్లో వెలుగు!
నాటకంలో కొన్ని ఘటాలను, కొన్ని సంభాషణలను అద్భుతంగా అభినయించాడు వైనతాయ. హిగ్గిన్స్ స్నేహితుడు ఆ మురికివాడ అమ్మాయిని అసహ్యించుకునే సన్నివేశం.
“ఎ వుమన్ హు అట్టర్స్ సచ్ డిప్రెసింగ్ అండ్ డిస్గస్టింగ్ సౌండ్స్ హాజ్ నో రైట్ టు బీ ఎనీ వేర్. నో రైట్ టు లివ్!”
“ఫ్రెండ్స్, సరిగ్గా మాట్లాడటం రాకపోతేనే బ్రతకడానికి హక్కు లేదా? దీనికి వీరు అంగీకరిస్తారా?”
“నో, నో, నెవర్!” అని ప్రేక్షకుల నుండి అరుపులు.
“ఎలీజా ప్రొఫెసర్‌ను ప్రేమిస్తుంది. ఆయన తిరస్కరిస్తాడు. కావాలంటే దత్తత తీసుకుంటానంటాడు. ఆమెకూ ఆత్మగౌరవం ఉంది. ఇలా ఉంటుంది.
‘హి హాజ్ నో రైట్ టు టేక్ అవే మై క్యారెక్టర్! మై క్యారెక్టర్ ఈజ్ ది సేమ్ టు మీ యాజ్ ఎనీ లేడీస్.’
“అతనికి నా వ్యక్తిత్వాన్ని కించపరచే హక్కు లేదు. నాదీ ఏ ఇతర స్త్రీలాంటి వ్యక్తిత్వమే.”
“ఆమె భాషను సంస్కరించి, ప్రవర్తనను తీర్చిదిద్దడమే తన పని. తర్వాత ఎలా తన జీవితాన్ని గడపాలనేది ఆమె ఇష్టం” అంటాడాయన.
ఆమె కోపం అవధులు దాటుతుంది.
“ఐ వుడ్ లైక్ కిల్ యు, యు సెల్ఫిష్ బ్రూట్! వై డిడన్ట్ యు లీవ్ మీ వేర్ యు పిక్డ్ ఆఫ్ – ఇన్ ది గట్టర్?”
“షా తన సందేశాన్నిలా చెబుతాడు. ఇది ఎలిజాకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది!”
“ది గ్రీట్ సీక్రెట్, ఎలీజా, ఈజ్ నాట్ హ్యవింగ్ బ్యాడ్ మ్యానర్స్ ఆర్ గుడ్ మ్యానర్స్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ సార్ట్ ఆఫ్ మ్యానర్స్, బట్ హావింగ్ ది సేమ్ మ్యానర్స్ ఫర్ ఆల్ హ్యూమన్ సోల్స్.
ఫ్రెండ్స్, దీనినే ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు.”
సభలో చప్పట్లు!
“సృష్టించడం సృష్టికర్త బాధ్యత. జీవించడం మన బాధ్యత. సృష్టితో ఏ సమస్యలూ రాకుండా ఉండాలనుకుంటే సృష్టికర్త తన సృష్టిని కొనసాగించి ఉండేవాడా?”
వైనతేయ ఈ మాటలకు సభికులు నిలబడి అభివాదం చేశారు. స్టాండింగ్ ఒవేషన్!
“ముగింపును మార్చి, ప్రొఫెసర్‌కు ఎలీజాకు పెళ్లి చేయమని చాలామంది షా పై ఒత్తిడి తెచ్చారు. దానికి ఒప్పుకుంటే ఆయన జార్జ్ బెర్నార్డ్ షా ఎలా అవుతాడు!”
మళ్లీ చప్పట్లు.
హరికథ ముగిసింది. సంస్కృతంలో హరికథ చెప్పేవారు ఇండియాలో ఉన్నారు. కానీ ఇంగ్లీషులో, అదీ ఇంగ్లాండులో, ఒక ఇంగ్లీషు నాటకాన్ని హరికథగా చెప్పినవాడు వైనతేయ ఒక్కడేనేమో?
అతనికి ఘన సన్మానం జరిగింది. వెయ్యి బ్రిటిష్ పౌండ్లను అతనికి బహూకరించారు. ఇండియన్ కరెన్సీలో అది ఇంచుమించు లక్ష రూపాయలతో సమానం.
***
మరో పదేళ్లు బరిగాయి. సెల్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలసాగాయి. యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు పోటెత్తుతున్నాయి. కళాకారులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఒక వేదిక అయింది.
వైనతేయ మండల విద్యాశాఖాధికారిగా పదోన్నతిని పొందాడు. అతని హరికథల వీడియోలు యూట్యూబ్‌లో విరివిగా చూస్తున్నారు.
***
న్యూఢిల్లీ. రాష్ట్రపతి భవన్. పద్మ అవార్డుల ప్రదానోత్సవం. రాష్ట్రపతిగారి చేతుల మీదుగా ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, చాలా మంది ప్రముఖులు హాజరైనారు. ఒక్కొక్కరినీ వేదిక మీదికి పిలుస్తున్నారు.
“డా. వైనతేయ, ఫ్రం ఆంధ్రప్రదేశ్. పద్మశ్రీ పురస్కార్ ఫర్ హరికథ.”
వైనతేయ లేచి వేదిక వదకు వెళ్లాడు. రాష్ట్రపతిగారు ఆయనకు శాలువా కప్పి, పద్మశ్రీ అవార్డు అతనికందించారు.
సభలో కరతాళధ్వనులు!
సభలో దస్తగిరిసారు, జయరాములు, కోనేటయ్య, తిరుపాలమ్మ, ఆంజనేయశర్మ, వైనతేయ భార్య, కుమార్తెలు ఆసీనులై ఉన్నారు. వారందరి కళ్లల్లో ఆనందబాష్పాలు. సదాశివశర్మగారు కీర్తిశేషులైనారు.
టి.వి.లో వైనతేయ ఇంటర్వ్వూ ప్రసారం అవుతూంది.
“ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగారు. కారణం చెప్పగలరా?”
“నా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం, శిక్షణ, ప్రజల అభిమానం, ఆ పరాత్పరుని దయ.”
“జవం జీవం కోల్పోతున్న హరికథాపక్రియకు కొత్త ఊపిరి పోసి, వినూత్నంగా తీర్చిదిద్దారు. ఇదెలా సాధ్యమయింది?”
“ఏ కళ అయినా ఔట్-డేటెడ్ అవదు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, వర్తమాన పరిస్థితులకు, అభిరుచులకు, అవసరాలకు తగినట్లుగా ఇన్నోవేట్ చేయాలి. నేను చేసింది అది. ‘బాహుబలి’ సినిమా తీసుకోండి! అదే ఇతివృత్తంతో బ్లాక్ అండ్ వైట్‌లో ఎన్.టి.ఆర్, కాంతారావు గార్లు బోలెడు జానపద సినిమాలు తీశారు. రాజమౌళి గారు ఆ పాత కథనే తన ట్రీట్మెంట్, గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతంగా మలచారు. అది ఒక మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ సినిమా!
ఎ.ఆర్. రహమాన్, సిద్ శ్రీరామ్, అమృతాసురేష్ లాంటి వారు శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం వెస్ట్రనైజ్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ స్కోరులో డ్రమ్స్, బీట్స్, ప్రవేశపెట్టారు. యూత్‌ని ఆకట్టుకున్నారు. కాబట్టి ఏ కళ ఐనా, దానిని వైవిధ్యభరితంగా, ఇన్నోవేటివ్‌గా, ప్రెజెంట్ చేయడంలో ఉంది పరమార్థం!”
“మీ తర్వాతి ప్రాజెక్ట్?”
“పంచతంత్రం లోని మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి. ఇలా ఫేబుల్స్ను సరళమైన ఇంగ్లీషులో హరికథలుగా మలచి, స్కూలు పిల్లలకు నేర్పాలని నా లక్ష్యం.”
“యు ఆర్ గ్రేట్ సర్!”
“నో, గాడ్ ఈజ్ గ్రేట్! తేజస్వినావధీతమస్తు!” అన్నాడు పద్మశ్రీ, డా. వైనతేయ!
(సమాప్తం)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.