[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పెద్దాడ సత్యనారాయణ గారి ‘సర్ప్రైజ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“ఏమైందిరా అలా నీరసంగా ఉన్నావు?” సుధీర్‌ని అడిగింది తల్లి రమణమ్మ.
“ఏమీ లేదు” అన్నాడు సుధీర్ ముభావంగా.
“ఈసారి కూడా ఇంటర్ తప్పాడు” అని అసలు విషయం చెప్పాడు తండ్రి నారాయణ.
“సరేలెండి, ఒరేయ్ సుధీర్” అని దగ్గరికి వెళ్లి భోజనం వడ్డించి తిను అని చెప్పి, తను తింటుంది.
“ఏమండీ, ఈసారి వాడికి ట్యూషన్ పెట్టించండి” చెప్పింది రమణమ్మ
“సరేలే నేను కనుక్కుంటాను” అన్నాడు నారాయణ .
మరుసటి రోజు సుధీర్ తల్లి దగ్గరికి వెళ్లి “అమ్మా నాకు చదువుకోవాలని లేదు” అన్నాడు.
“సరే మరి ఏం చేయదలుచుకుంటున్నావు?” అడిగింది రమణమ్మ.
“ఏమోనమ్మా నాకేం చేయాలో అర్థం కావటం లేదు” అన్నాడు సుధీర్.
“సరే నేను మీ నాన్నగారితో మాట్లాడుతాను. నీవు బెంగపడవద్దు” అంది రమణమ్మ.
సుధీర్ రెండుసార్లు ఇంటర్ తప్పాడు. తను ఇంటర్లో ఉన్నప్పుడు వికాస్ అనే మిత్రుడు తన మేనమామ రాజు చెన్నైలో సుజాత సినీ స్టూడియోలో పని చేస్తున్నాడు అని చెప్పాడు. తను ఒకసారి షూటింగ్ చూసానని కూడా చెప్పాడు. సినిమా వాళ్లు డబ్బులు బాగా సంపాదిస్తారు అనే విషయం కూడా చెప్పాడు.
సుధీర్ ఇంట్లో కొన్ని డబ్బులు తీసుకుని ఉత్తరం రాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. “నేను బాగా డబ్బులు సంపాదించి ఇంటికి వస్తాను” అని ఉత్తరoలో రాసి సంతకం చేశాడు.
పొద్దున్నే ఆ ఉత్తరం చూసి రమణమ్మ బోరున ఏడ్చింది. భర్త నారాయణతో కలిసి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇంకా మార్కెట్లో వెతికింది. ఎక్కడా సుధీర్ జాడ కనిపించదు.
***
మూడేళ్ళు గడిచాయి.
రమణమ్మ కొడుకు వస్తాడని మూడు సంవత్సరాలు దాకా నమ్మకంతో ఎదురుచూసింది. తర్వాత కూడా రాకపోయేసరికి డిప్రెషన్‌కి గురయింది.
నిద్రలో ఉలిక్కిపడి లేవడం చేతిలో ఉన్న వస్తువులు విసిరేయడం మొదలకు పనులు చేస్తోంది.
***
అక్కడ సుధీర్ తన మిత్రుడు చెప్పిన వివరాలు ప్రకారం సుజాత స్టూడియో దగ్గరికి వెళ్ళాడు. వాచ్‌మన్ దగ్గరికి వెళ్లి రాజు అనే వ్యక్తి గురించి అడిగాడు.
“ఇక్కడ నలుగురు రాజులు ఉన్నారు” అని చెప్పాడు వాచ్‌మన్.
మరుసటి రోజు సుధీర్ వచ్చి రాజు అనే పేరు గల ఆ నలుగురితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించమన్నాడు. సరేనన్నాడు వాచ్‌మన్.
ఇద్దరు రాజు అనే వ్యక్తులను “మీకు వికాస్ తెలుసా?” అని అడిగాడు సుధీర్.
“మాకు తెలవదు” అని అన్నారు వాళ్ళు.
మరుసటి రోజు మూడో వ్యక్తిని కూడా “మీకు వికాస్ తెలుసా?” అని అడిగాడు
“తెలుసు. నీవు ఎందుకు అడుగుతున్నావ్?” అని ఎదురు ప్రశ్న వేశాడతను.
సుధీర్ సంతోషంగా ఆయనకి తన సంగతి, వికాస్ సంగతి, తన విషయాలు చెప్పాడు .
“నీవు తిరిగి మీ ఊరు వెళ్ళిపో” అని సలహా ఇచ్చాడు రాజు.
“సార్ నాకు ఏదైనా చిన్న పని ఇప్పించండి” అని బతిమాలాడు సుధీర్.
సరేనని తనకి తెలిసిన డైరెక్టర్ దగ్గర బాయ్ కింద చేర్పిస్తాడు
సుధీర్ మూడు సంవత్సరాలు చాలా నమ్మకంగా ఆ డైరెక్టర్ దగ్గర పని చేశాడు. సుధీర్ పనితీరు నచ్చి ఒకరోజు సుధీర్‌ని పిలిచి “ఇవాల్టి నుంచి నీవు నా అసిస్టెంట్వి” అని చెప్పాడాయన.
వెంటనే సుధీర్ ఆయన కాళ్ళకి నమస్కారం చేసి “నన్ను ఆశీర్వదించండి” అన్నాడు.
ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత సుధీర్ సొంత కారు, అద్దె ఇంట్లో ఉండే స్థితికి వచ్చాడు.
***
‘ఇప్పుడు నా పరిస్థితి బాగుంది’ అని తన మీద తనకే నమ్మకం కుదిరి అమ్మను చూసేందుకు బయలుదేరాడు.
కారులో ఇంటి ముందు దిగి లోపలికి వెళ్ళాడు. “అమ్మా” అని సంతోషంగా అరిచాడు.
ఇంతలో తండ్రి నారాయణ వచ్చి ఆశ్చర్యంగా కొడుకుని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. సుధీర్ తండ్రిని గట్టిగా కౌగిలించుకుని “డాడీ మమ్మీ ఎక్కడ?” అని అడిగాడు.
“తర్వాత చెప్తాను” అని, “నువ్వు ఎలా ఉన్నావురా?” అడిగాడు నారాయణ.
“డాడీ ప్లీజ్ మమ్మీ గురించి చెప్పండి” అన్నాడు సుధీర్.
“సరే, పద, నువ్వు నాతో రా” అన్నాడు నారాయణ. ఇద్దరూ కారులో బయలుదేరుతారు.
“డాడీ ఇంకెంత దూరం?” అడిగాడు సుధీర్.
“ఆ లెఫ్ట్ సైడ్ సందులో ఆపు” చెప్పాడు నారాయణ.
“డాడీ ఇది మెంటల్ హాస్పిటల్ కదా?” అడిగాడు సుధీర్.
“అవును. నువ్వు లోపలికి నడు” అన్నాడు నారాయణ.
ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బెంచి మీద రమణమ్మ కూర్చొని నీళ్లు తాగుతూ కనబడింది.
సుధీర్ ఒక్కసారిగా “అమ్మా” అని దగ్గరికి వెళ్లబోయాడు.
రమణమ్మ గట్టిగా “ఎవడివిరా నీవు?” అని అరుస్తూ గ్లాసు విసిరేసింది
ఈ హఠాత్పరిమాణానికి ఏమనాలో అర్థం కాలేదు సుధీర్‌కి. మరల “అమ్మా” అని దగ్గరికి వెళ్లబోయాడు.
ఈసారి రమణమ్మ రాయి విసరబోయింది
ఇంతలో ఇద్దరు ఆయాలు వచ్చి రమణమ్మని తీసుకుపోయారు.
సుధీర్ తండ్రి దగ్గరికి వచ్చి “ఇలా జరిగింది ఏంటి డాడీ?” అన్నాడు.
“నీవు మీ అమ్మకి సర్ప్రెజ్ ఇద్దామనుకున్నావు. కానీ ఏ తల్లికి సర్ప్రైజ్ అక్కర్లేదు. కొడుకు అమ్మా అని పిలిస్తే అదే కొండంత బలం. నీవు చాలా పెద్ద తప్పు పని చేశావు” అన్నాడు నారాయణ.
“ఇప్పుడేం చేయాలి?” అన్నాడు సుధీర్.
“నీవు ఇక్కడే ఉండి డాక్టర్ గారితో మాట్లాడి మీ అమ్మని పూర్వ స్థితికి వచ్చే ప్రయత్నం చేయి” చెప్పాడు నారాయణ.
“డాడీ, నేను అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను.” అని తండ్రి చేతిలో చేయి వేసి చెప్పాడు సుధీర్.