[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


హిరణ్యగర్భ స్సమవర్త తాగ్రే
నమః శాంతాయ ఘోరాయ గూఢాయ గుణధర్మిణే।
నిర్విశేషాయ సౌమ్యాయ నమో జ్ఞానఘనాయ చ॥11॥
క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే।
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః॥12॥
సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే।
అసతాచ్ఛాయయాక్తాయ సదాభాసాయ తే నమః॥13॥
నమో నమస్తేఽఖిలకారణాయ
నిష్కారణాయాద్భుతకారణాయ।
సర్వాగమామ్నాయ మహార్ణవాయ
నమోఽపవర్గాయ పరాయణాయ॥14॥
గుణారణిచ్ఛన్నచిదుష్మపాయ
తతోక్షభవిస్ఫూర్జితమానసాయ।
నైష్కర్మ్యభావేన నివర్తితాగమ
స్వయంప్రకాశాయ నమస్కరోమి॥15॥
మాదృక్ప్రపన్న పశుపాశవిమోక్షణాయ
ముక్తాయ భూరికరుణాయ నమోఽలయాయ।
స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత
ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే॥16॥
(గజేంద్ర మోక్షం నుంచీ గజేంద్రుడు అందించిన స్తుతి – కొనసాగింపు)
తొలుత శ్రీ సత్యసంధ తీర్థుల వారి వ్యాఖ్య చూద్దాము..
॥ప్రజాపాలకత్వాత్ ప్రజాపతిః॥ – ప్రజలను పాలించు వాడు.
॥ప్రజానాం పాలనాద్విష్ణుః ప్రజాపతిరితీర్యత – ఇది షట్ప్రశ్న భాష్యోక్తేః॥ – లోకములన్నిటి యందు ఉన్న ప్రజలనందకను పోషించి పాలించు వాడు కనుక శ్రీమహావిష్ణువు ప్రజాపతి.
ఈ విషయం షట్ప్రశ్న భాష్యంలో ఉన్నది.
॥ప్రకర్షేణ జనయతీతి ప్రజః। న విద్యతే ప్రతిర్యస్య సోఽపతిః। ప్రజస్య అసౌ అపతిశ్చ ప్రజాపతిః॥
అధికముగా పుట్టించునట్టి వానిని ప్రజ అంటారు. అనగా సృష్టికర్త. తనకు ప్రభువు లేని వాడు – అపతి. అనగా సర్వోత్తముడు, ఎవ్వరి శాసనమునకు లొంగని వాడు, లొంగవలసిన అవసరం లేని వాడు – సృష్టికర్త.
ఇక శంకర భాష్యాన్ని చూద్దాము.
సమస్త ప్రజలకు పతియై ప్రజాపతి అని పిలువబడిన వాడు శ్రీహరి. పతియైనందున అందరి పోషణ భారం ఆయన మీద పడింది. భరించువాడు వాడు భర్త. అందుకే భర్తా (32) అను నామము కూడా స్వామికి ఉన్నది. సమస్త జీవజాలము (బ్రహ్మాది దేవతల నుంచీ సూక్ష్మజీవుల వరకూ, రాళ్ళూ రప్పలూ సహా) యొక్క బాధ్యతను భరించువాడు.
ప్రజలు అనగా బిడ్డలు. ప్రజాపతి అనగా ప్రజలకు తండ్రి వంటి వాడు. వంటి వాడు కాదు. తండ్రియే.
ఇక్కడ నుంచీ పరాశర భట్టర్ వ్యాఖ్య.
జన్మనిచ్చి తల్లి. పోషించి తండ్రి.
తల్లివి నీవే, తండ్రివి నీవే! అని సకల జీవరాశుల చేత కీర్తింపబడిన వాడు/విశ్వశక్తి ప్రజాపతి.
॥ప్రజానాం నిత్యసూరీణాం పతిః ప్రజాపతి॥ – ఇక్కడ ప్రజలుగా నిత్యసూరులు. వీరినే నిత్యముక్తులు అని కూడా అంటారు. అట్టి నిత్యముక్తులకు పతి – ప్రజాపతి.
వీరందరూ శాశ్వతంగా పరంధామంలో ఉంటారు. వీరిలో దివ్యసూరులైన వారు విష్వక్సేనాదులు) స్వామి ఆఙ్ఞపై జన్మ తీసుకుని నిర్దేశించిన కార్యములను నిర్వర్తించి మరల పరంధామమునకు చేరుకుంటారు కానీ, మిగిలిన నిత్యసూరులెవ్వరూ మరల జన్మ చక్రంలో పడరు.
బుద్ధిజీవుల కన్ననూ, ముక్తజీవుల కన్ననూ ఎప్పుడూ బంధములో చిక్కుకోని ఈ నిత్యముక్తులు అధికులు. వారే ప్రజాః – అనగా నిత్యసూరులు. అలాంటి నిత్యసూరులచే సదా పరిచర్య చేయబడు వాడు ప్రజాపతిః.
ఈ సృష్ట్యాదిలో.. అంటే శ్వేతవరాహ కల్పంలో భూమిని ఉద్ధరించిన వరాహ మూర్తియే ప్రజాపతి. వేదవాక్యం ప్రకారం వరాహరూపమును ధరించి భూమిని ఉద్ధరించి అచట జీవజాలము ఏర్పడుటకు తోడ్పడిన వాడు కనుక ప్రజాపతి. నిజానికి ప్రజాపతి కనుకనే పరమాత్మ ఆ కార్యమునకు పూనుకొని యుండెను.
70. హిరణ్యగర్భః – రమణీయమగు స్థానమున నివసించువాడు. పరంధాముడు. సంపూర్ణానందమగు దానిని ప్రసాదించువాడు. చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
॥హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్॥ – ఇది శ్రీసూక్తములో వాక్యము.
హిరణ్యం అంటే బంగారము అనే కాదు, అత్యంత పవిత్రమైనది అని అర్థం. హిరణ్యవర్ణాం అనేది శ్రీసూక్తములో శ్రీమహాలక్ష్మికి చెప్పబడిన నామము.
గతంలో చెప్పుకున్నట్లు విష్ణు శక్తికి లక్ష్మి క్షేత్రము. పవిత్రమైన క్షేత్రమునకు ఆదారభూతుడై, అందు బీజముగా ఉండి సృష్టి జరుగుటను నిర్దేశించే వాడు.
ఆయన హిరణ్యగర్భుడు కనుకనే ఆయన యందు సమస్త సృష్టి బాధ్యతనూ నిర్వహించగలిగే బ్రహ్మగారు జన్మించారు.
ఇక సత్యసంధ తీర్థుల వారి భాష్యము చూద్దాము.
॥హిరణ్యం – సువర్ణాత్మకం బ్రహ్మాండం గర్భే యస్య సః హిరణ్యగర్భః॥ – సువర్ణాత్మకమైన బ్రహ్మాండమును గర్భమున ధరించినవాడు హిరణ్యగర్భుడు.
హర్య గతి-కాన్త్యోః ఇత్యస్మాత్ హర్యతే అనేన క్షాంతిరితి వ్యుత్పత్యా।
ఇక శంకర భాష్యాన్ని చూస్తే..
విశ్వగర్భమున నుండు వాడై విష్ణుమూర్తి హిరణ్యగర్భః అని కీర్తింపబడినాడు. అంటే విశ్వంలో ప్రతిదీ ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది. హిరణ్మయమైన అండములోపల ఉండేవాడు కనుక బ్రహ్మ హిరణ్యగర్భుడాయెను. ఆ బ్రహ్మకు ఆత్మయై యున్నందున ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు హిరణ్యగర్భుడని పేరుపొందెను.
ఋగ్వేద సంహిత ప్రకారము
॥హిరణ్యగర్భ స్సమవర్త తాగ్రే॥ – మొదట హిరణ్యగర్భుడే ఉండెను.
వటపత్రశాయి!
ఇక్కడ మళ్ళా Existence exists no matter whether observer exists or not.
ఆ Existence నుంచీ మొదట వచ్చిన జీవుడు చతుర్ముఖ బ్రహ్మ. అంటే బ్రహ్మ గారికి బీజం కూడా శ్రీహరియే. ఆ బీజం అత్యంత పవిత్రమైనది. అందుకే అది హిరణ్య గర్భం. Like emanates from like అనే విధంగా అందు నుంచీ ఆవిర్భవించిన బ్రహ్మగారు కూడా హిరణ్యగర్భుడని పేరుపొందెను.
ఇంతకీ ఈ బీజం అనేది ఎక్కడ మనకు చెప్పబడినది? భగవద్గీతలో.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్॥7.10॥
ఓ అర్జునా! సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.
కారణమే కార్యమునకు బీజము అని చెప్పవచ్చు. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చు. మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమైన భగవంతుని శక్తులే. తెలివికలవారు తమ ఆలోచన మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞ ప్రదర్శించారు. వారి ఆలోచనలు తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి, తనే అని భగవానుడు అంటున్నాడు.
ఇక భట్టరు గారి వ్యాఖ్యానం చూద్దాము.
॥హిరణ్యస్య గర్భః హిరణ్యగర్భః॥ – సువర్ణ లోకమైన (అత్యంత పవిత్రమైన) పరంధామమునందు నివశించువాడు.
హిరణ్యకాంతితో నిత్యమూ ప్రకాశించు పరంధామము తన నిత్య నివాసముగా కలిగిన వాడు కనుక హిరణ్యగర్భుడు.
హిరణ్యవర్ణమైన కాంతి మనకు సూర్యమండలములో కూడా కనిపిస్తుంది. ఆ సూర్యులకు ఆ శక్తిని ప్రసాదించువాడు హిరణ్యగర్భుడే. ఆ శక్తిని స్వీకరించే వారే మహా తేజశ్శాలురు అయితే ఆ ప్రసాదించిన వాడు? అలవికాని తేజస్సుతో ప్రకాశిస్తాడు.
హిరణ్యగర్భుడైన భగవానుడి నుంచీ ఎలా బ్రహ్మగారు వచ్చారో, ఈ భూమి మీద (ఇంకా ఎన్నో భూముల మీద (విశ్వానికి ఒక భూమి)) జీవము ఆవిర్భవించటానికి కారణంగా సూర్యుడే ఉన్నాడు. అందుకే ఆయన కాంతి కూడా హిరణ్యవర్ణంలోనే ఉంటుంది.
॥భూతస్యజాతః పతిరేక ఆసీత్॥
అనగా సృష్టి ప్రారంభములో ఈ సమస్త విశ్వమునకూ అధిపతిగా హిరణ్యగర్భ రూపమున ఒక బంగారు గోళము వలె తిరుగుచుండెను. అదియే ఈ సమస్త సృష్టికినీ అధిపతి. పతిరేక ఆసీత్ – ఏకైక ప్రభువు.
ఆ బీజము హిగ్స్ బోసాన్ అని అనుకుంటున్నారు ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారం. అవునా కాదా అన్నది తేలాల్సి ఉన్నది. దానికి మూలమైనది ఇంకేమన్నా కనుగొనబడు వరకూ.
ఆ హిగ్స్ బోసాన్ కూడా హిరణ్యవర్ణంలోనే ఉంది. కవర్ ఇమేజ్ చూడండి.
June 28, 2012, న వచ్చిన ఒక వార్తకు భావార్థం ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
ఈ విషయం గురించి అన్వేషణలో ఆధునిక శాస్త్రవేత్తలు ఎంత పరిశ్రమ చేస్తున్నారో తెలుస్తుంది.
హిగ్స్ బోసాన్ కోసం అన్వేషణలో లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) వద్ద ATLAS మరియు CMS ప్రయోగాల నుండి తాజా ఫలితాలను ప్రకటించడానికి యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) జూలై 4న ఒక సెమినార్ నిర్వహించనుంది. ఫలితాల కోసం ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి, కానీ ఖచ్చితమైన ఫలితాలు అనిశ్చితంగా ఉన్నాయి.
గత డిసెంబర్లో, ATLAS మరియు CMS హిగ్స్ బోసాన్కు అనుగుణంగా ఉన్న సిగ్నల్స్ స్వల్పంగా ఉన్నాయని నివేదించాయి. అప్పటి నుండి, LHC అధిక శక్తి స్థాయిలలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది, డేటాను రెట్టింపు చేసింది. అయితే, కొత్త డేటా మునుపటి సంకేతాలను నిర్ధారించినప్పటికీ, కణం యొక్క స్వభావం మరియు దాని క్షయం నమూనాల కారణంగా హిగ్స్ బోసాన్ యొక్క ఆవిష్కరణ గురించి ఖచ్చితత్వం అస్పష్టంగానే ఉంది.
హిగ్స్ బోసాన్ అనేది హిగ్స్ క్షేత్రంతో అనుబంధించబడిన కణం, ఇది ఇతర సూక్ష్మకణాలకు (ప్రాథమిక కణాలకు) ద్రవ్యరాశిని ఇస్తుంది. బిగ్ బ్యాంగ్ వద్ద, సమరూపత-భగ్నం కావటం వలన (symmetry breaking event) వివిధ ద్రవ్యరాశులు కలిగిన కణాల ఆవిర్భావానికి దారితీసింది. హిగ్స్ బోసాన్ను ప్రామాణిక నమూనా ద్వారా అంచనా వేస్తారు కానీ దాని ఖచ్చితమైన ద్రవ్యరాశిని ప్రయోగాత్మకంగా నిర్ణయించాలి (2012 July నాటికి).
హిగ్స్ బోసాన్ను గుర్తించడం సవాలుతో కూడుకున్నది ఎందుకంటే ఇది ఇతర కణాలలోకి అత్యంత వేగంగా క్షీణిస్తుంది, సంక్లిష్ట క్షయ నమూనాలను సృష్టిస్తుంది. వివిధ క్షయ మార్గాల సంభావ్యత (probability) మారుతూ ఉంటుంది, కొన్ని హిగ్స్ ద్రవ్యరాశిపై ఆధారపడి ఇతరులకన్నా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 125 GeV ద్రవ్యరాశి కలిగిన హిగ్స్ దిగువ క్వార్క్లు, W బోసాన్లు లేదా టౌ కణాలుగా క్షయమయ్యే అవకాశం ఉంది, అయితే వీటిని గుర్తించడం చాలా కష్టం.
ATLAS మరియు CMS రెండు-ఫోటాన్ మరియు నాలుగు-లెప్టన్ ఛానెల్ల వంటి హిగ్స్ క్షయ నమూనాల కోసం వెతుకుతున్నాయి, ఇవి తక్కువ సంభావ్యత కలిగి ఉంటాయి కానీ తక్కువ నేపథ్య శబ్దం కారణంగా గుర్తించడం సులభం. LHC యొక్క అధిక ఢీకొనే రేటు, అధునాతన డేటా ఫిల్టర్లు ఈ అరుదైన సంఘటనలను గుర్తించడంలో సహాయపడతాయి.
బర్కిలీ ల్యాబ్ రూపొందించిన ATLAS ఇన్నర్ డిటెక్టర్, ఢీకొన్న కణాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ATLAS మరియు CMS ప్రయోగాలకు US గణనీయమైన సహకారి, బర్కిలీ ల్యాబ్ నుండి పెద్ద బృందంతో సహా 1,500 మందికి పైగా పాల్గొంటున్నారు.
ఈ సెమినార్ యొక్క ఫలితాలు హిగ్స్ బోసాన్ యొక్క లక్షణాలు మరియు సూపర్సిమెట్రీ, డార్క్ మ్యాటర్, సూక్ష్మ కాల బిలాలు (black holes) మరియు అదనపు మితులు (extra dimensions) వంటి భౌతిక శాస్త్రంలోని ఇతర అన్వేషించని రంగాలలో మరింత అన్వేషణకు నాంది పలుకుతాయి.
CERNలో నిర్వహించిన పరిశోధన విశ్వం యొక్క ప్రాథమిక స్వభావం గురించి మన అవగాహనను మెరుగుపరుస్తుందని హామీ ఇస్తుంది.
ఈ హిగ్స్ బోసాన్ గురించి పూర్తి వివరాలు (దాని గురించి సరిగ్గా తెలిసిన తరువాత వచ్చినవి) తల్లివి నీవే తండ్రివి నీవే! 32: సర్వం విష్ణుమయం జగత్ 3 లో ఇవ్వబడినవి.
కణాలకు మూలమైన (అని అనుకుంటున్న) హిగ్స్ బోసాన్ గురించి తెలుసుకున్నారు కానీ, దాని వెనుక దాగి ఉన్న అసలు కారణాలను తెలుసుకోలేక పోయారు ఇంత వరకూ. ఇక ఈమధ్య కాలంలో చూసిన ప్రాణ సంబంధమైన నామాలలో మనం జీవావిర్భావానికి కారణం మన శాస్త్రాల ప్రకారం, ఆ పైన అలగ్జాండర్ ఒపారిన్ వంటి వారు చేసిన పరిశోధనలు, ప్రకటించిన సిద్ధాంతాలు ఎలా జీవావిర్భావానికి దైవేతర హేతువును వెతుకుతున్నారో తెలుసుకున్నాము.
వివరాలు తెలుసుకునే ఆసక్తి ఉన్నవారికి హిగ్స్ బోసాన్ గురించి, దాని లిమిటేషన్స్ గురించి ఇస్తున్నాను. చదవండి.
గమనిక: ఎవరైనా కొత్త సైన్సు విషయాలు బైటకు రాగానే మన పురాణాలు తిరగవేసి ఏవేవో కనక్షన్లు తీస్తారు అని విమర్శించే వారికి, ఇక్కడే సైన్స్ ఇంకా ఏమేమి చేయాలో వివరాలు ఇస్తున్నాను చూడండి. నిజానికి ఒకానొక సందర్భంలో నికోలా టెస్లా “ఉపనిషత్ లను సంపూర్తిగా అవగాహన చేసుకుని వాటి సహాయంతో ఆధునిక సైన్సు పరిశోధనలు చేస్తే మరింత వేగంగా సైన్సు తన గమ్యం చేరుతుంది,” అని చెప్పాడు. ఆ మాటలు ఆయన చివరి రోజుల్లో చిత్తభ్రాంతితో మాట్లాడినవని కొట్టిపడేశారు. హిగ్స్ బోసాన్ ను దాటి కనీసం మరో రెండు కణాల గురించి రాబోయే 250 సంవత్సరాలలో పరిశోధనలు చేయబడతాయి. గుర్తుంచుకోండి. 2050 నుంచా ఈ పరిశోధనలు ఊపందుకుంటాయి.
ఇది చదవండి..
హిగ్స్ క్షేత్రం అనేది విశ్వంలోని ప్రతి ప్రాంతంలోనూ ఉందని నమ్ముతున్న ఒక శక్తి క్షేత్రం. ఈ క్షేత్రం హిగ్స్ బోసాన్ అనే ప్రాథమిక కణంతో కలిసి ఉంటుంది. అంటే ఈ క్షేత్రానికి శక్తినిచ్చే బీజమే హిగ్స్ బోసాన్. ఈ క్షేత్రం ఎలక్ట్రాన్లు, క్వార్క్లు మొదలైన ఇతర ప్రాథమిక కణాలతో నిరంతరం సంకర్షణ చెందుతుంది. సరళంగా చెప్పాలంటే, అవి విభజించలేని కణాలు ఈ క్షేత్రంతో సంకర్షణ చెందినప్పుడు, అవి ద్రవ్యరాశిని పొందుతాయి.
[పరమాత్మ నుంచీ జీవాత్మలు శక్తిని పొందునట్లు. ప్రతిక్షణం మనం పరమాత్మ అనే విశ్వశక్తితో సంకర్షణం చెందుతూనే ఉంటాము]
హిగ్స్ క్షేత్రం ద్రవ్యరాశిని సృష్టించదు.
[ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. హిగ్స్ బోసాన్ ద్రవ్యరాశిని సృష్టించదు. తనతో సంకర్షణం చెందే వాటికే ద్రవ్యరాశిని ఇస్తుంది. పరమాత్మ అలా కాదు. అన్నిచోట్లా, అన్నింటా ఉంటాడు].
అలా అయితే (సృష్టించే పని అయితే), ఇది పదార్థము/శక్తి నిత్యత్వ నియమాలను ఉల్లంఘిస్తుంది (పదార్థం లేదా శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము). వాస్తవానికి, హిగ్స్ క్షేత్రం హిగ్స్ బోసాన్తో పరస్పర చర్య చేయడం ద్వారా కణాల ద్వారా ద్రవ్యరాశి పొందబడుతుంది. హిగ్స్ బోసాన్ శక్తి రూపంలో సాపేక్ష ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ద్రవ్యరాశి లేని కణం క్షేత్రంతో సంకర్షణ చెందినప్పుడు, కణం యొక్క ద్రవ్యరాశి విపరీతంగా (exponentially) పెరుగుతుంది కాబట్టి కణం నెమ్మదిస్తుంది. హిగ్స్ క్షేత్రం లేకపోతే, కణాలకు ద్రవ్యరాశి ఉండదు. కాంతి వేగంతో అలా తేలుతూ ఉంటాయి.
బిగ్ బ్యాంగ్ తర్వాత వెంటనే హిగ్స్ క్షేత్రం సున్నా. అంటే లేనే లేదు.
[విశ్వావిర్భావ సమయంలో బ్రహ్మ గారు ఉండరు. పుట్టలేదు కనుక].
విశ్వం యొక్క ఉష్ణోగ్రత ఒక పరిమిత విలువ కంటే తగ్గడంతో, హిగ్స్ క్షేత్రం తక్షణమే మొదలైంది.
[పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు తత్ క్షణమే బ్రహ్మగారు ఆయన నాభి కమలం నుంచీ ఉద్భవించారు. అర్థాత్! Higgs Boson is not God’s particle. Or God Particle. అంటే సైన్సు అనుకుంటున్న దైవ కణం ఇది అయినా, భవిష్యత్ లో అసలైన దైవకణం కోసం అన్వేషణ సాగించక తప్పదు].
ఈ క్షేత్రంతో సంకర్షణ చెందడం ద్వారా ప్రాథమిక కణాలు ద్రవ్యరాశిని పొందడం ప్రారంభించాయి. ఒక ప్రాథమిక కణం ఆ క్షేత్రంతో ఎంత ఎక్కువగా స్పందిస్తుందో, అది అంత బరువుగా మారుతుంది.
1960ల నుండి, భౌతిక శాస్త్రవేత్తలు అంతుచిక్కని ‘దైవ కణం’ కోసం శోధించారు. హిగ్స్ బోసాన్ చాలా అస్థిరంగా ఉంటుంది. తక్షణమే క్షయమౌతుంది. అందువల్ల, దానిని గుర్తించడం లేదా గమనించడం సులభం కాదు. CERNలోని కణ త్వరణ యంత్రాలు (Particle Accelerators) ఆ కణాన్ని కనుగొనడానికి నిరంతర ప్రయోగాలు నిర్వహించాయి. 40 సంవత్సరాల శోధన తర్వాత, జూలై 4, 2012న, LHC (లార్జ్ హాడ్రాన్ కొలైడర్) వద్ద CMS మరియు ATLAS ప్రయోగాల ద్వారా ఖచ్చితమైన లక్షణాలు (హిగ్స్ బోసాన్) కలిగిన ప్రాథమిక కణం కనుగొనబడింది [పైన ఇచ్చిన పత్రికా వార్త సారాంశం చూడండి].
125 GeV సమీపంలోని ప్రాంతంలో శాస్త్రవేత్తలు కొత్త కణాన్ని గమనించారు.
కనుగొనబడిన కణం సైద్ధాంతిక హిగ్స్ బోసాన్ యొక్క లక్షణాలకు అనుగుణంగా ఉంది. అయితే, ఆ కణం స్టాండర్డ్ మోడల్ అంచనా వేసిన హిగ్స్ కణమేనా కాదా అని నిర్ధారించడానికి మరిన్ని విస్తృతమైన అధ్యయనాలు చేయవలసి ఉంది.
2013లో, హిగ్స్ క్షేత్రం గురించి, హిగ్స్ బోసాన్ గురించి ప్రతిపాదించినందుకు పీటర్ హిగ్స్ (Peter Higgs) మరియు ఫ్రాన్స్వా ఎంగ్లెర్ట్లకు (François Englert) సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది. వారు ‘కణాలు వాటి ద్రవ్యరాశిని ఎలా పొందుతాయి?’ అనే సైద్ధాంతిక భూమికలను అభివృద్ధి చేశారు. LHC యొక్క పరిశీలనా ఫలితాలు వారి అంచనాను నిర్ధారించాయి.
ఇకపోతే
Proteins can appear violet, blue, yellow, orange, or brick red when tested using different chemical solutions. వీటన్నిటినీ కలిపినా, లేదా వాటిలో ప్రధానమైన వాటిని చూసినా వాటి వర్ణము కూడా హిరణ్య వర్ణమే.
RNA can appear as bright orange bands in an ethidium bromide-stained gel that has been exposed to UV rays.
ఈ RNA ను గుర్తించటంలో వివిధ పరికరాల ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా వివిధ రంగులు ఏర్పడటం వల్ల గుర్తించ వచ్చు. కానీ వీటి రంగు ప్రదానంగా హిరణ్యవర్ణానికి దగ్గరగా ఉంటుంది.
In 3D models of RNA alignments, bars are coloured according to the composition of bases in that alignment column. For example, red, orange, and yellow indicate complementary base pairs.
అన్నిటికీ బీజం ఆ హిరణ్యగర్భుడే!
మంత్ర రహస్యార్థముగా తీసుకుంటే హిరణ్య అంటే హీం + రీం = హ్రీం అన్న సృష్టికి శుభ సూచకమైన మహాలక్ష్మి బీజాక్షర స్వరూపమే! తల్లి గర్భమున ధరింపబడు జీవుడు ఈ హిరణ్యమగు ప్రాణ స్వరూపముగా ఉంటాడు. ఆ ప్రాణ స్వరూపము వర్ణముకూడా హిరణ్యవర్ణమే. ఆ స్వరూపంలో గర్భంలో ఉంటాడు.
॥ప్రజాపతిశ్చరితి గర్భే అంతః॥ – అనగా ప్రజాపతి గర్భములో జీవుడిగా సంచరించును.
అందుకే గర్భవతి అయిన స్త్రీ శరీరములో ఒక వింత కాంతి కనిపిస్తుంది సహజంగా. అంటే చాలా సందర్భాలలో. ఇది మనం ప్రతి స్త్రీ వియయంలో గమనించవచ్చు. అది కేవల సంతోషం వలన వచ్చే కాంతి కాదు. గ్రహించాలి.
అన్ని జీవులను ఆకర్షించు పరమాత్మ ఆత్మ రూపంలో (జీవాత్మ స్థాయిలో లేశమాత్ర శక్తిని పంపి) స్త్రీ క్షేత్రముగా ఆమె గర్భమున ఉంటాడు కనుక, ఆ గర్భధారణ శక్తిని కలిగి ఉంటారు కనుకనే స్త్రీలు అందరికీ ఆకర్షణీయంగా కనబడతారు. ఎందుకంటే హిరణ్యవర్ణమున ఉండే జీవాత్మ శక్తిని ధరించగలిగే (భరించ) శక్తి వారికి మాత్రమే ఉంది కనుక. ఆ సమయంలో వారు పరబ్రహ్మశక్తికి అత్యంత దగ్గరగా ఉంటారు.
అందుకే గర్భధారణ అనేది అత్యంత పవిత్రమైన విషయంగా సనాతన ధర్మము పరిగణిస్తుంది.
సూర్యమండలము గురించి చూశాము కొద్ది సమయం ముందే.
ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ
నారాయణః సరసిజానన సన్నివిష్టః
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృత శంఖ చక్రః
ఆయన సూర్యమండలమునకు మధ్య స్థితుడైయుండును. మూడు వేదములు ఆయనను స్తుతించును. గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆ విష్ణువునకు (ఎలాంటి వాడా విష్ణువు? కమలముల వంటి కన్నులు కలవాడు, కేయూరములు ధరించిన వాడు, మకరకుండలములు కలిగిన వాడు, శంఖ, చక్రములు ఆయుధాలుగా ఉన్నవాడు, కిరీటమును ధరించి యున్న) నేను భక్తితో నమస్కరించుచున్నాను.
రజోగుణము లేకుండా పరిశుద్ధమైన ముక్తస్వరూపమైన ఙ్ఞానమే అంతరాత్మగా కలిగిన వాడే హిరణ్యగర్భుడైన పరమాత్మ. సూర్య చంద్రులు లేకున్నను, వారి కాంతి వెలవెలపోయేంత కాంతితో నిండి ఉన్న పరంధామమే హిరణ్య లోకము. దానికి కేంద్రముగా ఉండువాడే హిరణ్యగర్భుడు.
లౌకికముగా తీసుకుంటే మనకు హిరణ్యవర్ణములో అగుపించే ఆ సూర్యుడే హిరణ్యగర్భుడు. అతని వల్లనే ఈ భూమి మీద సకల జీవ కోటి మనుగడ సాగించగలుగుతోంది. ఈ భూమికి తన పరిభ్రమణ కేంద్రంగా ఉంటూ భరించు వాడు భూగర్భః. ఈ సూర్యుడు అదే అనుకుంటే ఆ సూర్యమండలంలో శక్తినిస్తూ ఉండే శ్రీహరే భూభర్త.
అందుకే శ్రీదేవి, భూదేవి (అంటే అనేక విశ్వములలో ఉండే భూ లోకములన్నిటి అధిష్టాన దేవత) శ్రీమన్నారాయణుని పత్నులు.
అందుకే తరువాతి నామము..
71. భూగర్భః – భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు. విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
ఆది వరాహ స్వామి అలా కాపాడిన సంగతి మనకు తెలిసిందే.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య