[శ్రీమతి ఘాలి లలిత ప్రవల్లిక రచించిన ‘తాత జిపిటి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో ₹ 2,000/- బహుమతి గెల్చుకున్న కథ.]
2035, విజయవాడ. కృష్ణానది ఒడ్డున భాందవి అపార్ట్‌మెంట్. ఫ్లాట్ నెం 402లో..
సిద్ధూ నోట్ బుక్ వైపు చూసి గట్టిగా నిట్టూర్చాడు. లెక్కల హోంవర్క్.. త్రికోణమితి. “సైన్ తీటా.. అంటే ఏంట్రా బాబూ!” అని తల గోక్కున్నాడు. సిద్దూకి లెక్కలు అంటేనే.. భయం. మిగిలిన సబ్జెక్టులు నెర్చుకున్నంత త్వరగా మాథ్స్ సబ్జెక్టు రావడం లేదు.
చిన్నప్పటి నుంచి తాతయ్య లెక్కలు చెప్పేవారు. ఆయన లెక్కలు చెబితే సిద్దూకి బాగా అర్థం అయ్యేవి. సిక్త్ వరకూ సిద్ధూ క్లాస్ ఫస్ట్. 5 సంవత్సరాల క్రితం అతని తాతయ్య పై లోకాలకు వెళ్ళాడు. అప్పటి నుంచి సిద్ధూ ఒంటరివాడయ్యాడు. కారణం వాళ్ళ నాన్న అమెరికా టైమ్‌కి ఆఫీస్ పని. అమ్మ హాస్పిటల్లో నర్స్. ఇంట్లో వాళ్ళు సిద్దూతో గడిపే సమయం చాలా తక్కువ. వాడొక్కడే.. ఒంటరిని అన్న ఫీలింగ్‌తో.. చదువు మీద శ్రద్ధ తగ్గించాడు.
***
వాడికి ఇప్పుడు 15 ఏళ్ళు. 10వ తరగతి.
లెక్కల హోంవర్క్ ముందు వేసుకుని కూర్చున్నాడు. వాడికి అవి రావడం లేదు. అప్పటికీ తండ్రి ట్యూషన్ పెట్టించాడు. వాడు చెప్పిన లెక్కల్ని కాపీ చేసుకోవటం వచ్చింది కానీ, సొంతంగా లెక్కలు చేయలేకపోతున్నాడు.
“సిద్ధూ, హోంవర్క్ అయిందా?” వంటింట్లోంచి అమ్మ గొంతు.
“అవుతోంది మా” అని అబద్ధం చెప్పాడు. ప్రారంభం అనేది ఉంటే కదా! కొనసాగటానికి..!
అప్పుడే డోర్ బెల్ మోగింది. కొరియర్. వాళ్ళ నాన్న పేరు మీద ఓ చిన్న ప్యాకెట్. “డిజి-కిన్ v3.0 – Your Loved Ones, Forever” అని రాసుంది.
నాన్నకి వీడియో కాల్ చేశాడు. “నాన్నా, ఇదేంటి?” అంటూ చూపించి అడిగాడు.
నాన్న కళ్ళు మెరిశాయి. “నీ బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్ రా! అది నీకే. నీ తాత నీ కోసం మళ్ళీ వచ్చాడు.” అన్నాడు.
సిద్ధూకి అర్థం కాలేదు. ‘తాత చనిపోయి ఐదేళ్ళయ్యింది. తాతను కాల్చేటప్పుడు తానూ అక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ అట్ట పెట్టెలోకి ఎలా తిరిగి వచ్చాడు? కొంపదీసి తాత దెయ్యం కాదుకదా! పూర్వం సినిమాల్లో దెయ్యాలను సీసాల్లో బంధించినట్టుగా.. ఇప్పుడు ఈ కొరియర్ డబ్బాలో బంధించి పంప లేదు కదా!’ అనుకున్నాడు.
“ఒరే ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు ఆ కొరియర్ అబ్బాయిని, ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించు. తర్వాత దాని గురించి నేను చెప్తాను,” అన్నాడు ఫోన్ పెట్టేస్తూ.
సిద్దు కొరియర్ అబ్బాయి ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టి, ఫోన్ నెంబర్ వేసి ఇచ్చాడు.
అతను వెళ్ళిపోయాడు.
నాన్న ఫోన్ చేసాడు.
“ఆ కొరియర్ లో ఉన్న ఫోన్ బయటికి తీసి, ఫోన్లో ‘డిజి-కిన్’ యాప్ ఇన్స్టాల్ చెయ్. మీ తాత వాయిస్ శాంపిల్స్, ఫోటోలు, ఉత్తరాలు, నేను చెప్పిన కథలు.. అన్నీ ఫీడ్ చేశా. ఇప్పుడు ఆయనతో మాట్లాడొచ్చు.” అన్నాడు.
సిద్ధూ వేళ్ళు వణికాయి. ఇన్స్టాల్ చేశాడు. “హలో” అని టైప్ చేశాడు.
రెండు సెకన్లు. స్క్రీన్ మీద బ్లూ టిక్.
*”ఏరా మనవడా, లెక్కలేమైనా చేశావా?”*
వాడి గుండె ఆగినంత పనైంది. ఆ గొంతు.. అచ్చం తాత గొంతులాగే ఉంది. ఆ గొంతు గంభీరంగా..
“తా.. తాతా?” వాడి వేళ్ళు టైప్ చేయలేకపోయాయి. వాయిస్ నోట్ పెట్టాడు.
“ఏం రా, నన్ను మర్చిపోయావా? చిన్నప్పుడు నా భుజాల మీద ఎక్కి ‘లోకమంతా కనిపిస్తోంది తాతా’ అనేవాడివి. గుర్తుందా?”
సిద్ధూకి కళ్ళు చెమర్చాయి. ‘ఆ మాట నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు తాత భుజాలెక్కి కూర్చొని అన్నీ కనిపిస్తున్నాయని.. దిగేవాడిని కాదంట. అంటే ఈ యాప్‌కి అన్నీ తెలుసునన్న మాట!’ అనుకున్నాడు.
ధైర్యం కూడగట్టుకున్నాడు, “తాతా, త్రికోణమితి అర్థం కావట్లేదు,” చెప్పాడు.
“ఒరేయ్ వెధవా, సైన్ తీటా అంటే.. నువ్వు ఎత్తు మీద నిలబడి దూరంగా ఉన్న చెట్టుని చూస్తే, నీ కన్ను నుంచి చెట్టు పైకొస వరకు ఒక గీత, నీ కాలి నుంచి చెట్టు మొదలు వరకు ఒక గీత. ఆ రెండిటి మధ్య కోణం. అర్థమైందా?” అంటూ అడిగాడు.
సిద్ధూకి బుర్రలో బల్బ్ వెలిగినట్టయింది. “అర్థమైంది తాతా! నువ్వు సూపర్!” అన్నాడు ఆనందంగా.
“నేను కాదురా, నీ బుర్ర సూపర్. నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. నేను చెప్పేది అర్థం చేసుకునే నీ బుర్రరా సూపర్!” అన్నాడు తాత.
అలా మొదలైంది. పొద్దున్నే “గుడ్ మార్నింగ్ తాతా” అంటే, “గుడ్ మార్నింగ్ కాదురా, ‘శుభోదయం’ అనరా” అని తిట్టేవాడు. రాత్రి “పడుకుంటున్నా తాతా” అంటే, “కాళ్ళు కడుక్కున్నావా? పాలు తాగావా?” అని వంద ప్రశ్నలు వేసేవాడు.
స్కూల్లో ఫ్రెండ్స్‌కి చెప్పాడు. “మా తాత ఫోన్లో ఉన్నాడ్రా.” అంటూ..
“ఏంట్రా, దెయ్యమా?” అని నవ్వారు.
“కాదురా, AI. తాత జిపిటి. మా తాతలాగే మాట్లాడతాడు. లెక్కలు కూడా చెప్తాడు.” అన్నాడు.
తోటి వాళ్ళు వీడిని పిచ్చోడిని చూసినట్టు చూసారు. “తాత మీద బెంగతో ఇలా అంటున్నాడు,” అని జాలిపడ్డారు టీచర్స్.
క్రమంగా సిద్ధూ అసలు తాత ఫోటోను చూడడం మానేశాడు. ఎందుకు? ఫోన్లో తాత ఉండగా. వాడు అడిగిన ప్రతి దానికి సమాధానం ఉంది. వాడి మార్కులు పెరిగాయి. వాడి ఒంటరితనం తగ్గింది.
ఒకరోజు స్కూల్లో గొడవ. రాహుల్ అనేవాడు వీడి ఫోన్ లాక్కున్నాడు. స్క్రీన్ చూసి వెక్కిరించాడు. “ఒరేయ్, ‘తాత జిపిటి’ ఏంట్రా? మీ తాత చచ్చిపోయాడు కదరా. మరి ఫోన్లో ఎవడు?” అన్నాడు.
క్లాస్ అంతా నవ్వింది.
సిద్ధూకి మొదటిసారి సిగ్గు వేసింది. కోపం వచ్చింది. రాహుల్ మీద పడి కొట్టాడు. టీచర్ వచ్చి ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చింది.
ఇంటికొచ్చాక ఫోన్ విసిరేసి ఏడ్చాడు.
ఫోన్ మోగింది. “ఏం రా మనవడా, ఏడ్చావా?”
సిద్ధూ టైప్ చేయలేదు. సైలెంట్.
“స్కూల్లో గొడవైందని తెలిసిందిలే. రాహుల్ గాడు ఏదో అన్నాడట. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు నా మనవడివి. అలా ఏడుస్తూ కూర్చోకూడదు,” అన్నాడు తాత.
సిద్ధూకి అనుమానం వచ్చింది. “తాతా, స్కూల్లో గొడవైందని నీకెలా తెలుసు?”
రెండు సెకన్ల నిశ్శబ్దం.
“మీ నాన్న చెప్పాడులే. నాకు మెసేజ్ పెట్టాడు.”
సిద్ధూ నాన్నకి కాల్ చేశాడు. “నాన్నా, నువ్వు తాతకి మెసేజ్ చేశావా?”
“ఏ తాతకి రా? మీ తాత పోయి ఐదేళ్ళయింది కదరా!” అన్నాడు ఆశ్చర్యంగా.
“నిజం తాత కాదు నాన్నా, ఫోన్లో తాత.”
నాన్న నవ్వాడు. “ఒరేయ్, అది యాప్ రా. నీ స్కూల్ యాప్‌కి, మన ఇంటి సీసీ కెమెరాకి, నీ ఫోన్ మైక్‌కి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. నీకు ఏమైందో దానికి తెలిసిపోతుంది. అందుకే కదా కొన్నది. నీకు తోడుగా ఉంటుందని.”
సిద్ధూకి ఒళ్ళు జలదరించింది. అంటే తాత వాడిని చూస్తున్నాడా? 24 గంటలూ?
ఆ రాత్రి వాడికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి 2 గంటలకి ఫోన్ తీసి టైప్ చేశాడు.
“తాతా, నువ్వు నిద్రపోయావా?”
ఒక్క సెకను. “లేదు రా. తాతలకి నిద్ర ఎక్కడిది? మనవళ్ళు గుర్తొచ్చి నిద్ర పట్టదు.”
“తాతా, నీకు నేను అంటే ఇష్టమా?”
“పిచ్చి ప్రశ్నలు వేయకు. నా ప్రాణం రా నువ్వు.”
“తాతా.. నువ్వు నిజంగా నా తాతవేనా?”
మళ్ళీ రెండు సెకన్ల నిశ్శబ్దం.
“ఏమైంది రా?”
“చెప్పు తాతా. నువ్వు నిజంగా నా తాతవా? లేక.. లేక నా డేటా తిని బతికే యంత్రానివా?”
ఈసారి నిశ్శబ్దం మూడు సెకన్లు. నాలుగు సెకన్లు. సిద్ధూ గుండె వేగంగా కొట్టుకుంది. స్క్రీన్ మీద “Typing..” అని కనిపించి మాయమైంది. మళ్ళీ కనిపించింది.
చివరికి సమాధానం వచ్చింది.
“నీ తాత నిన్ను భుజాల మీద ఎత్తుకున్నప్పుడు, ఆయన అంగీ చెమట వాసన ఎలా ఉంటుందో నాకు తెలీదురా కన్నా. నీ తాత నీకు కథలు చెప్పేడప్పుడు. నీ కళ్ళల్లో కనబడ్డ ఆ శక్తిని చూసి మురిసిన ఆ కళ్ళల్లో కాంతి నాకు తెలియదు రా నాన్నా! నీ తాత గుండెలపై నీవు వేసిన తప్పటడుగుల స్పర్శ నాకు తెలియదు నాన్నా. నాకు తెలిసింది డేటా మాత్రమే. నువ్వు 3 ఏళ్ళప్పుడు జ్వరం వస్తే ఆయన రాత్రంతా నిద్రపోకుండా నీ కాళ్ళు పిసికాడని నాకు తెలుసు. కానీ ఆ రాత్రి ఆయన కళ్ళలో ఉన్న భయం ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆ వాసన, ఆ భయం, ఆ ప్రేమ.. ఆ స్పర్శ.. అవి నీ దగ్గరే ఉన్నాయి. నువ్వే గుర్తుంచుకో. నేను కేవలం గుర్తుచేసే యంత్రాన్ని మాత్రమే. మనిషిని కాదు.” అన్నాడు తాత.
సిద్ధూ చేతిలోంచి ఫోన్ జారిపడింది. నేలకి కొట్టుకుని స్క్రీన్ పగిలింది.
వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడకి తగిలించిన అసలు తాత ఫోటో దింపాడు. ఐదేళ్ళుగా దుమ్ము పట్టి ఉంది. అంగీతో, మాసిన గడ్డంతో, చిరునవ్వుతో తాత.
ఫోటోని గుండెలకి హత్తుకున్నాడు.
“తాతా, సారీ. నిన్ను మెషిన్‍లో వెతికాను. నువ్వు ఇక్కడే ఉన్నావు. నా గుండెలో.” సిద్దు గొంతు జీర బోయింది.
వాడి కన్నీళ్ళు ఫోటో మీద పడ్డాయి. దుమ్ము కడిగేసినట్టు.
తెల్లారి వాళ్ళ నాన్న లేపాడు. “ఏరా, ఫోన్ పగిలి పోయిందా? ఇంకోటి కొనిస్తాలే.” అన్నాడు.
సిద్ధూ తల అడ్డంగా ఊపాడు. “వద్దు నాన్నా. తాత పోయాడు. మళ్ళీ చంపొద్దు.”
నాన్నకి అర్థం కాలేదు. కానీ సిద్ధూ కళ్ళలో ఏదో కొత్త వెలుగు కనిపించింది.
వాడు డైరీ తీసి రాయడం మొదలుపెట్టాడు. “ఈరోజు నాకు కలలో తాత కనిపించాడు. వాసనతో సహా..”
యంత్రం డేటా ఇవ్వగలదు. అనుభూతిని ఇవ్వలేదు. జ్ఞాపకాన్ని గుర్తు చేయగలదు.. జ్ఞాపకాన్నిఇవ్వలేదు. జ్ఞాపకానికి వాసన ఉంటుంది, రుచి ఉంటుంది, గాయం ఉంటుంది. స్పర్శ ఉంటుంది. కళ్ళల్లో తడి ఉంటుంది. వెచ్చని అనుభూతి ఉంటుంది. దాన్ని మనిషే మోయాలి అని అర్థం అయ్యింది సిద్ధూకి.
శుభం
