సత్యజిత్ రాయ్ తీసిన “పథేర్ పాంచాలి” చూసిన వారెవరైనా ఆ ముసలామె పాత్ర వేసిన చునీబాలాదేవి ని మరచిపోలేరు. అంత అద్భుతంగా నటించింది ఆవిడ. తను నిజంగానే వో స్టేజ్ ఆర్టిస్టు. అంత వయసు వచ్చినా నటించడానికి కారణం, రాయ్ నుంచి తనకు దొరికే నశ్యం సరఫరా. నశ్యం కాకపోతే మరొకటి. కానీ ఆ వ్యామోహంతో నటిస్తానని ఒప్పుకుని మన జ్ఞాపకాలలో నిలిచిపోయింది. నాకైతే ఆ పాత్ర మరో ఆలోచనను కలిగించింది. క్రూరత్వమంటే ఏమిటి? మనం ఆ పదాన్ని ఎలాంటి సందర్భాలకూ, క్రియలకూ అన్వయిస్తామో దానికంటే చాలా విస్తృతమైన పరిధి కలది క్రూరత్వం. ఇందులో హరిహర రాయ్ పక్కవూళ్ళో పని చేస్తుంటాడు. వూళ్ళో భార్య శర్బోజాయ తన ఇద్దరు పిల్లలనూ, చుట్టమైన ఓ ముసలామెను చూసుకుంటూ వుంటుంది. ఆ ముసలామె వంటగదిలోంచి తిండి దొంగలించి తినడం, ఆ కారణంగా శర్బోజాయ మాటలు పడటం అనేది అక్కడ ఎంతటి బీదరికం వుందో చెబుతుంది. అలాంటి పరిస్థితులు మనుషులను క్రూరులుగా కూడా మారుస్తాయి. ఆ ముసలామె పట్ల క్రూరత్వమే నలో ఆ ఆలోచన కలిగేలా చేసింది. కానీ శర్బోజాయ కూడా నిస్సహాయరాలు. స్వతహాగా అలాంటి మనుషి కాదు.
ఒక్క ముక్క చెప్పడానికి ఇంత కథ వ్రాయవలసి వచ్చింది. సందర్భం ఏమిటంటే ఈ రోజు చూసిన “టీస్పూన్” అనే లఘు చిత్రం కూడా అలాంటి భావాలే రేపాయి నాలో. భర్త రాజీవ్ (వక్వర్) ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తుంటాడు. తరచూ వూళ్ళు తిరగాల్సి వచ్చే ఉద్యోగం. క్లైములు వస్తే ఇన్స్పెక్ట్ చెయ్యాలి, అందులో దొంగ క్లైములున్నవాళ్ళు ఒకోసారి బెదిరిస్తారు కూడా, అంటే కాస్త రిస్కీ జాబ్. ఇంట్లో మామగారు (బోమీ దోతీవాలా) పక్షవాతం వచ్చి పడక మీదనే అన్నీ, మాట్లాడలేడు. ఏమి కావాలన్నా స్పూన్ తో మంచం పక్కన కొట్టి వ్యక్త పరుస్తాడు. ఇక మిగిలింది ఎవరు? భార్య కవిత (శ్రీస్వర). గృహిణి అన్న మాటే గానీ క్షణం తీరిక వుండదు. ఇంట్లో వుండి చేయగల మార్కెటింగ్ పని చేస్తుంటుంది. హోల్‌సేల్‌గా కొనుక్కుని లిప్‌స్టిక్ లాంటివి ఫోన్ మీద ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తుంటుంది. అదంగా ఆ స్పూన్ చేసే టక్కుటక్కులకు స్పందిస్తూ ఆయనకేం కావాలో అమర్చి పెట్టడం. ఇందులో ఆమెకు ఏ సాయమూ వుండదు. ఒక పక్షపాతం వచ్చిన వ్యక్తిని 24 గంటలూ చూసుకోవడమనేది ఎలాంటి కష్టమో ఊహించడం కష్టం. ఆ స్పూన్ టక్కుటక్కు శబ్దాలు ఆమెను పిచ్చిదానిలా మార్చేస్తాయి. వీటి పరిణామాలు ఏమిటన్నది మిగతా కథ.
అబన్ భరూచా దేవ్హంస్ దీని రచయితా దర్శకుడూ నూ. చాలా బాగా చెప్పాడు కథను దృశ్యపరంగా, శబ్దపరంగా. ఆ సౌండ్ డిజైన్ కూడా బాగుంది. మొదట్లో ఆమె ఫోన్ మీద స్నేహితురాలితో మాట్లాడుతూ వుంటుంది, వేరే ఏ శబ్దమూ లేదు వంటింట్లో పని తప్ప. ఇంతలో వినిపిస్తుంది స్పూన్ చప్పుడు. ఆమె బిజీగా వుండి, ముఖం చిట్లిస్తూ ఫోన్ పెట్టేసి మామగారి దగ్గరికెళ్తుంది. అక్కడి నుంచి ధ్వని పెరుగుతూ ఒక క్రెసెండో ని చేరుకుంటుంది. ఆ తర్వాత లిటరల్ గా శ్మశాన నిశ్శబ్దం. తర్వాత రోదన. మరలా ఆ స్పూన్ చప్పుడు. ఒక circular structure ఇవ్వడం, ఒక ఆవృతంలో ఆరోహణా అవరోహణా చూపించడం లాగా. రజత్ ఢోలకియా, రాజేష్ సింఘ్ లు సంగీత దర్శకులు. ఫిరాక్, మిర్చ్ మసాలా, హోలీ లాంటి చిత్రాలు చేసిన రజత్ ఢొలకియా అందరికీ తెలిసిన వాడే. రాజెష్ సింఘ్ నాకు కొత్తే. బిష్వదీప్ చటర్జీ సౌండ్ దిజైన్ చేసాడు. వి నారయణన్ చాయాగ్రహణం కాస్త జాగ్రత్తగా గమనిచాల్సినది. ఈ విషయంలో దర్శకుడూ DOP ఇద్దరూ కలిసి చేసే పని వుంటుంది. ఆ మిజాన్ సెన్ లు కథను చాలా బలంగా చెబుతాయి. సోఫాలో కూర్చుని వున్న ఆమె, అటూ ఇటూ చిన్న దిళ్ళు, కాస్మెటిక్ సామాన్లు, ఎదట బల్ల మీద పరచిన కాస్మెటిక్ సామాన్లు, కవర్లలో. కిక్కిరిసి వుంటుంది ఆ ఫ్రేం. ఒక పుస్తకంలో లెక్కలన్నీ వ్రాసి వుంచే పని. వచ్చిన ఆర్డర్లకు తగ్గట్టుగా అన్నీ పేక్ చేయడం చేస్తుంటుంది. ఈ లోగా ఫోన్ మోగితే దాన్ని వెతకడానికి అన్నీ కదపాల్సి రావడం. ఇది ఒక దృశ్యం మాత్రమే. ఇలాంటివెన్నో. చాలా సీన్లు మనలో ఒక claustrophobic effect తెస్తాయి. దానికి శబ్దం కూడా అంతే సాయం చేస్తుంది. ఆ స్పూన్ చప్పుళ్ళు ఆమెతో పాటు మనల్ను కూడా గాభరాకు గురిచేస్తాయి. ఇక ఈ క్లాస్ట్రోఫోబియాను అనుభవిస్తున్న ఆమె గురించి ఆలోచించండి. అందరూ ఒక టీం గా మనకు మంచి చిత్రాన్ని అందించారు. ఈ అబన్ భరూచా దేవ్ హంస్ పేరును గుర్తుపెట్టుకోవాల్సిందే.
Spoiler alert ఆమె కష్టం ఎవరికీ అర్థం కాదు. మామూలుగానే గృహిణిని పని చేయని వ్యక్తిగా చూస్తారు. మాట్లాడితే వంట కూడా పెద్ద పనేనా అన్నట్టుగా వుంటుంది ధోరణి. అలాంటిది ఇంటినుంచే వ్యాపారం చేస్తూ, లెక్కలు వ్రాస్తూ, వంటా ఇతర పనులు చేస్తూ, భర్తకు వేళకు అన్నీ అందిస్తూ, ఒక పక్షపాతం వచ్చిన మనిషిని కూడా చూసుకోవడం అంటే ఎంత పెద్ద బరువో ఎవరూ గ్రహించరు. ఆమె ఇల్లు వదిలి బయటికి పోవడానికి లేదు. ఈ సారి నాలుగు రోజులు ఖండాలా తిరిగి వద్దామంటే మరి నాన్నో అంటాడు భర్త. ఓల్డ్ ఏజ్ హోం లో పెట్టి వెళ్దామంటుంది. ఎంత ఖర్చో తెలుసా అని కసురుకుంటాడు. ఆమె సరిహద్దు ఇంటి వసారా నే. పక్కింటావిడతో వసారాలోనే నిలబడి కబుర్లు చెప్పుకుంటుంది. మరో ముఖం చూడడానికి వుండదు. ఖైదు. పగలూ రాత్రి భర్త అడుగుతుంటాడు నాన్నకు అంతా బాగుంది కదా అని. ఆమె ఫిర్యాదు చేసినా నువ్వు పెద్దది చేసి చెబుతున్నావంటాడు. ఎవరూ నమ్మరు గాని ఆ పెద్దాయన కూడా కొడుకు ఇంట్లో ఉన్నంత సేపూ బుధ్ధిగా వుంటాడు, అతను వెళ్ళిన తర్వాతే స్పూన్ చప్పుళ్ళు. ప్రతి చిన్న దానికీ. ఆమె వచ్చే దాకా ఆగే ప్రసక్తే లేదు చప్పుడు చేస్తూనే వుంటాడు, చేతిలో పని చప్పున మానేసి రావాలి ఆమె. ఒక సారి కోపంగా ఆ స్పూన్ లాగేసుకోవాలి చూస్తుంది, దాన్ని అంతే గట్టిగా హృదయానికి దగ్గరగా పట్టుకుంటాడతను. ఈ సీన్ చాలా ప్రభావవంతంగా వచ్చింది. ఏ కాస్మెటిక్ కంపెనీ దగ్గరినుంచి ఆమె సామాన్లు కొంటుందో అతనితో పేచీ వస్తుంది, లెక్కల విషయమై. ఫోన్లో గట్టి గట్టిగా వాదిస్తుంటుంది. శబ్దం కూడా ఇప్పుడు తీవ్రంగా వుంది. మనకు కూడా ఒక urgency, trepidation లాంటి అనుభూతులు కలుగుతాయి. అంతలో స్పూన్ చప్పుడు మొదలవుతుంది. ఆమె కోపంగా తర్వాత మాట్లాడుతాను అని ఫోన్ పెట్టేసి మామగారి దగ్గరికెళ్తుంది. క్షణికావేశంలో అక్కడున్న దిండు తీసుకుని అతని ముఖం పై పెట్టి నొక్కేస్తుంది. తక్షణం పోతాడా పెద్దాయన. ఆమెకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇది ఆమె ఊహించనిది. ఆమె చర్య కూడా అనాలోచిత చర్య, frustration కారణంగా చేసినది. ఇన్ని రకాలుగా వేదనలకు గురైన ఆమెకు ఇప్పుడు guilt అనే అదనపు బరువు. తర్వాతి షాట్లు చూడండి. ఒక ఫ్రేం లో బోల్డన్ని చెప్పులు. తర్వాతి ఫ్రేం లో తెల్ల చీరలు కట్టుకుని కూర్చున్న ఆడవారు. ఆ తర్వాతి షాట్ లో వాళ్ళ ముందు రాజీవ్, ఏడుస్తున్న కవిత. పన్నెండు రోజులైపోయాయి, కవిత ఏడుపు తగ్గట్లేదు. భర్త కసురుకుంటాడు ఆయన బ్రతికున్నప్పుడు ఏమీ చెయ్యలేదు, ఇప్పుడు ఈ ఏడుపు డ్రామా ఆపు అంటాడు. ఇక క్లైమేక్స్. ఆమె టీ చేసి భర్త కిస్తుంది. మరలా వంటగదిలోకెళ్ళి వేరే పని చేస్తుంటుంది. ఇంతలో స్పూన్ చప్పుడు. ఆమె పిచ్చిదానిలా మామగారి గదిలోకెళ్ళి చూస్తుంది. ఎవరూ లేరు. ఇల్లంతా చూసి చివరికి భర్త దగ్గరికి వస్తుంది. అతను పేపర్ చదువుతూ ఎదట వున్న సాసర్ మీద స్పూన్ తో అనాలోచితంగా శబ్దం చేస్తున్నాడు. ఆ పెద్దాయన పోయినా ఆమెకు మాత్రం విముక్తి లేదు. ఎందుకంటే ఆమెకు ప్రతివైపునుంచీ ఈ “దాడి” వుంటుంది.


లింక్:
https://www.dailymotion.com/video/x4dgqov

సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
2 Comments
Annapurna
sarigga ilati musalavida oka bandhuvu vundedi. aavidaki asale chadastam.danto into andarinee vepuku tinedi karmakali jaripadi nadumu virakkottukundi.mancham ekkindi. ede bhagotam. ala aedellu batiki into vallani chamindi.vunnaru ilativallu.
aavida bhartaki moodobharya. aayanamatram tombhaiellu batiki sunayasamga tirugutoo evarinee kastapettakunda poyadu. adi gurtuvachhindi.
Annapurna
marichipoyanu aavida spoonukadu peddagaritato sabdam chesedi ika aasound entatido….