[శ్రీ ప్రశాంత్ రచించిన – తెలుగు ముత్యాల సిరి ముసి – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]


తెలుగు నేలలో ప్రధాన నదులు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి అయినప్పటికీ, ఉపనదులు కూడా ఎంతో చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అటువంటి ఉపనదులలో మూసీ నది చాలా ముఖ్యమయినది. తెలుగు చరిత్రలో మూసీ నది పాత్ర అమోఘమైనది, అత్యంత ముఖ్యమైనది.
ప్రపంచ మానవాళి దశ దిశ లేని పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల పర్యావరణ పరంగా, చారిత్రకంగా ఎంతో ముఖ్యమైన నదులను ఎట్లా కోల్పోతూ ఉన్నామో ముసి నది చరిత్ర ఒకసారి తరచి చూస్తే అవగతమవ్వును. పర్యావరణ పరిరక్షణ భావి తరాలకు ఎంతో అవసరము. అందుకు శాస్త్రీయ దృక్పథంతో పాటు మానవీయ, సాంస్కృతిక దృక్పథం కూడా అవసరం.
చారిత్రక సాంస్కృతిక అంశాల వల్ల మనం కోల్పోయిన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకొనవలెను అనే సంకల్పం మానవ సమాజంలో స్ఫురించుట సహజం. తద్వారా మన నదులను, గుట్టలను, చారిత్రక సాంస్కృతిక సంపదను కాపాడుట వల్ల ఒకరకంగా పర్యావరణ పరిరక్షణకు ప్రోద్బలం ఇచ్చినట్టే.
మూసీ నది పేరు వెనుక చరిత్ర:
తెలుగు నాట మూసి నది అంటే అది తెలుగు పేరు కాదేమో అన్న భావన ఉండి, మూసీ నది అసలు లేదా పాత పేరు ముచుకుందా నది అని అనుకుంటూ ఉన్నారు. కానీ చారిత్రిక ఆధారాలతో చూసినపుడు మూసినది పేరు “ముసి/ముశి, ముసి యేరు” అని సంస్కృత, తెలుగు శాసనాల ద్వారా తెలియ వస్తున్నది. మచ్చుకు సామాన్య శకం (సా.శ) 769 ప్రాంతంలో రాష్ట్రకూట రెండవ గోవిందా రాజు వేయించిన అలస్ తామ్రపత్ర శాసనం సంస్కృత భాషలో ఉన్నది. రాష్ట్రకూట చక్రవర్తి వేంగి పై యుద్ధం చేయుటకు, తన సైనిక పరివార స్థావరాన్ని “కృష్ణావేణ్ణా-ముసి” సంగమ క్షేత్రంలో ఏర్పాటు చేయబడినది అని శాసనములో కలదు [ఎపిగ్రాఫియా కర్ణాటికా వాల్యూం 6]. కృష్ణవేణి నదిని కృష్ణవేణ్ణ అని నాటి వాడుక. ఆ రెండు నదుల సంగమ క్షేత్రము నేటి వోడపల్లి లేదా వాడపల్లి క్షేత్రం, ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇక కాకతీయుల నాటి శాసనాల్లో, ముఖ్యంగా మూసి ఒడ్డున ఉన్న నాగులపాడు పట్టణంలోని శాసనాల్లో, మూసి నది నుంచి వేయించిన కాలువలను “ముసెడి/ముసేటి కాలువ” అన్న ప్రయోగం కలదు [తెలంగాణా శాసన సంపుటము 1,2, కార్పస్ అఫ్ ఇన్స్క్రిప్షన్స్ అఫ్ తెలింగానా డిస్ట్రిక్ట్స్ పార్ట్ 2]. పదునాలుగవ శతాబ్దిలో సా.శ. 1377లో రెడ్డి రాజ్యం పాలకులు అయిన అనవేమారెడ్డి గారు వాడపల్లి క్షేత్రంలో వేయించిన శాసనంలో వాడపల్లి క్షేత్రానికి “కృష్ణాముసి సంగమ క్షేత్రమయిన బదిరకాశ్రమము” అని కలదు [రెడ్డి సంచిక, వడ్డాది అప్పారావు, 1947] & [Annual report of the archeological department of his highness the Nizams dominions 1934-35 ]. ఇంకా పానుగల్లులో సా.శ. 1551 లో కుతుబ్‌షాహీలు వేయించిన ద్విభాషా శాసనంలో, తెలుగు శాసన భాగంలో, “ముసి యేరు” అని కలదు [Annual report of the archeological department of his highness the Nizams dominions 1927-28]. ఇక సా.శ. 1852 నాటి ఓడపల్లి (వాడపల్లి)లో కొందరు మరాఠీ భక్తులు వేయించిన తెలుగు శాసనంలో కృష్ణా నదిని గంగా నదితో, “ముశి” నదిని యమునా నదితో పోల్చి, తద్వారా కృష్ణాముసి సంగమస్థలి అయిన వాడపల్లి క్షేత్రాన్ని ప్రయాగతో పోలుస్తారు [ఇన్స్క్రిప్షన్స్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్, నల్లగొండ డిస్ట్రిక్ట్, వాల్యూం 2].
ఇవే కాకుండా, విదేశీ యాత్రికులు కూడా ఈ నది గురించి విశేషంగా చెప్పినారు. 17వ శతాబ్దంలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుని రచనలో, మూసి నదిని “రివర్ ఆఫ్ భాగ్నగర్” అని ప్రస్తావన కలదు [Travels in India by Tavernier, Jean-Baptiste]
ట్రావెర్నియర్ తాను గోల్కొండ రాజ్యంలో ఎన్నో చెరువులు చూసినట్టు, వరి & మక్కజొన్న పంటలు పుష్కలంగా పండుతున్నట్టు రాసినాడు. భాగ్నగర్లో ఉన్న నది & ఆ పైన ఉన్న వంతెనలు ప్యారిస్ నగరం అందాలతో ఏమాత్రం తీసిపోదు అని కూడా చెప్పినారు. ఇక థేవనాట్ అనే మరో ఫ్రెంచి యాత్రికుడు సా.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో గోల్కొండ నగరం సందర్శించి, అక్కడ రాజు కోట, గోల్కొండ పేరు చరిత్ర కూడా కొంత చెప్పును. ఇది తర్వాతితరం చరిత్రకారులకు ఎంతో ఉపయుక్తం అయింది. థేవనాట్ రచనలో కూడా మూసి నదిని “రివర్ ఆఫ్ భాగ్నగర్” అని ప్రస్తావిస్తారు [Indian travels of Thevenot and Careri: being the third part of the travels of Jean de Thevenot into the Levant and the third part of a voyage round the world by John Francis Gemelli Careri]. అయితే, ఇందులోనే వారి యాత్రలో గోల్కొండ నుంచి మచిలీపట్నంకు పయనించిన దారి గురించి చెప్పినపుడు ఆమనగల్లు దాటిన తర్వాత మూసి నది (“moucy”, “mousi” అని వారి పుస్తకంలో రాసినారు) ఉండెను అని చెప్పినారు.
గోల్కొండ రాజ్యంలో వర్షాకాలంలో పడేటి వర్షాలు చాలా ఎక్కువ అని, ఆ వానల వలన చెరువులు నిండి, నదులకు వరదలు వస్తాయని చెప్పినారు. ఇట్లా తగిన నీటిలభ్యత వల్ల రాజ్యం సస్యశ్యామలంగా మారునని రాసినారు. అయితే ఆయన దర్శించిన సంవత్సరంలో వర్షపాతం తీవ్రంగా ఉంది వరదలు వచ్చినాయి అని, భాగనగర్లో ఉన్న నదికి (river of bhaganagar) విపరీతమయిన వరదలు వచ్చి రెండు వేల ఇండ్లు కొట్టుకుపోయినట్టు, నది పైన ఉన్న వంతెనలు కూడా దాటే వీలు లేకుండా వరదలు వచ్చినట్టు చెప్పినారు.
సా.శ. 1830లో కాశీ యాత్రలో భాగంగా హైదరాబాదు నగరాన్ని సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య గారు నది పేరును ముచికుందా అని చెప్తూ, స్థానికులు ఆ నదిని “ముసి” అని పిలుస్తారు అని, ముసి గొప్ప నది అని, వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో సంగమించునని చెప్పినారు [కాశీ యాత్రా చరిత్ర]. పైగా 1829లో మూసి నదికి పెద్ద వరద వచ్చి, ఆ వరద ఉధృతికి మూసినది మీద 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మూసి నది మీద కట్టబడిన వంతెన కొట్టుకుపోయిన విషయం తెలియజేసినారు. పైగా బేగం బజారును, నగరంలోని కొన్ని వీధులను కూడా ముసి నది ముంచేసి పోయినది అని కూడా చెప్పినారు. పైగా కుతుబ్‌షాహీల కాలంలో రాళ్లతో బలంగా ఏనుగుల గుంపు కూడా నది మీది నుంచి పోయే విధంగా బలమయిన వారధి బేగం బజారు వద్ద కుతుబ్షాహి రాజులు కట్టినారు అని చెప్తారు. అది నేటి పురానాపూల్.
ఇక సూర్యాపేట జిల్లాల్లో స్థానికులు, మూసి నది ఒడ్డున ఉండే ప్రజలు ఆ నదిని “ముసి వాగు లేదా ముశి వాగు” అని అంటారు. ఇంతకు ముందు వివరించిన విషయం ఆధారంగా, థేవనాట్ అనే యాత్రికుడు కూడా సూర్యాపేట ప్రాంతం దగ్గర ఆమనగల్లు పక్కన మూసి నది ఉండెను అనే చెప్పెను కదా! అక్కడికి దగ్గర్లో నాగులపాడు ఆలయంలో కాకతీయ శాసనములు కూడా ముసి యేటి కలువ అని చెప్పుట వలన నేటి ప్రజల జన బాహుళ్యములో ఉన్నది ప్రాచీన పేరే అని అర్థం అగుచున్నది. ఇది ఎంత మంచి విషయం! తరతరాలుగా ఎన్నో భాషలు, రాజ్యాలు వారి కొత్త పేర్లు మొదలయిన ప్రభావములతో నిమిత్తం లేకుండా స్థానిక ప్రాచీన పేరు ప్రజల్లో, శాసన ఆధారాల్లో మారకుండా అట్లనే ఉండుట ఎంతో ఆశ్చర్యకరమయిన, అద్భుతమయిన విషయం. ఈ పేరు అనే కాక ఎన్నో సాంస్కృతిక ఆధ్యాత్మిక అంశాలు దక్కన్ ప్రాంతంలో పాలక రాజ్యాల మతముతో ప్రభావంతో లుప్తం కాకుండా నిరంతరంగా కొనసాగుట ఇక్కడి స్థానిక సాంస్కృతిక వేర్లు ఎంత ప్రబలంగా ఉన్నవో చెప్పకనే చెప్పును.
19వ శతాబ్దంలో హైదరాబాదు నగరం, ముసి నది గురించి ఎందరో బ్రిటిష్ అధికారులు, ఉద్యోగులు రాసిన వ్యాసాలు, పుస్తకాల్లో సమాచారం చూడవచ్చు. 1844 లో హైదారాబాద్ రాష్ట్రం, హైదారాబాద్ సికింద్రాబాద్ నగరాల గురించి అక్కడి ఆరోగ్య పరిస్థితుల గురించి చర్చించే సందర్భంగా ఈ ప్రాంత భౌగోళిక వ్యవసాయ సమాచారం గురించి చెప్పినారు. అందులో కూడా ఈ నది పేరు “moosey” గా రాసినారు [Report on the Medical Topography and Statistics of the Northern, Hyderabad and Nagpore Divisions, the Tenasserim Provinces, and the Eastern Settlements, 1844]. మరో బ్రిటిష్ రచనలో బ్రిటిష్ అధికారులు హైదారాబాద్ నగర పరిసరాలు ఎంత సుందరంగా వరి పొలాలు, చెరువులు, గుట్టలు, కుంటలు, మూసి నది కాలువలు గురించి వివరణ అత్యంత రమణీయంగా ఉండును [Researches into the causes, nature, and treatment of the more prevalent diseases of India : and of warm climates generally by Annesley, James, Sir, 1780-1847 ]. ఇందులో కూడా నది పేరు “mosee” అనే చెప్పబడెను.
1908లో ముసి నది మీద వచ్చిన భయంకరమైన వరదల వలన జన జీవనం అస్తవ్యస్తమైంది. అపుడు జగిత్యాల లోని కవి జైశెట్టి రాజయ్య గారు నాటి పరిస్థితి, నాటి రాజు పెద్ద మనసుతో స్పందించిన తీరు వివరిస్తూ ముచుకుందా ప్రళయ తాండవం అనే కవితని రాసినారు. నాటి పత్రికల వార్తల్లో, తర్వాతి అధ్యయన పత్రాల్లో కూడా “moosy floods” అనే రాయబడెను.
మూసి నది పరిసరాలలో ప్రాచీన బౌద్ధ ఆరామాలు, జనావాసాల ఆనవాళ్లు దొరకుట చేత ఈ నదీ పరివాహక ప్రాంతముకు ప్రాచీన కాలం నుంచే జనసాంద్రతతో పాటు ప్రాముఖ్యత ఉన్నదని తెలియవచ్చును. ఈ విధంగా చారిత్రక శాసన విషయాల ఆధారంగా, సా.శ. పూర్వం 1 వ శతాబ్దం (1st century BCE) నాటి ఖారవేలుని హాతిగుంఫా శాసనంలో ప్రస్తావించబడిన ముసికానగరం, ముసి నది వెంబడే ఉండొచ్చు అని చరిత్రకారులు చెప్పినారు [ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూం 22]. ప్రాచీన కాలంలో చెప్పబడిన మూషకదేశం మూసి పరివాహక ప్రాంతమే అని కూడా అవగతనవ్వును.
ఈ విధంగా చరిత్ర చూసినపుడు, స్థూలంగా మనకు తెలియవచ్చిన విషయం ఏమిటి అంటే- ప్రాచీన కాలం నుంచి సంస్కృతి మరియు తెలుగు శాసనాలల్లో మూసి నది పేరు “ముసి” అనే తెలియ వస్తున్నది. పైగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసి నది పరివాహక ప్రాంతంలో “ముసిపట్ల”, “ముసివొడ్డు సింగారం” వంటి గ్రామాల పేర్లు బట్టి ముసి అనేది స్థానిక ప్రాచీన వాడుక అని అర్థం అగుచున్నది. కుతుబ్‌షాహీల కాలం నుంచి “మూసీ & మూసా”గా ప్రస్తావన చూడవచ్చు, అయినప్పటికీ ప్రజల వాడుకలో ముశి అనే వాడుకలో ఉంది అని అవగతమవుతున్నది. పైగా కుతుబ్‌షాహీ కాలంలో కూడా అత్యంత ఎక్కువ శాతం కూడా ముసి అనే ఈ నదిని సంబోధించినట్టు శాసన, సాహిత్య ఆధారాల ద్వారా తెలియ వస్తున్నది. ముసి నదికి ముచుకుందా అన్న పేరుకు తగిన శాసన అధరాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదు కాబట్టి అది కొంత అర్వాచీన ప్రయోగము అని నిర్ధారించవచ్చు. పైగా మూసి నది ఎంతో ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉన్నదని కూడా తెలియవస్తున్నది.
మూసినది వ్యవసాయ, తాగునీటి రంగం:
తెలుగు నాట చారిత్రకంగా ఎక్కువ ఆనకట్టలు, కాలువలు మూసి నది వెంబడే కట్టబడినవి. మూసి నది కాలువల ద్వారా నల్లగొండ ప్రాంతం సుక్షేత్రమయి, ధాన్యపు సిరులు పండించెను అని నాటి శాసనాల ద్వారా అవగతమవుతుంది. పైగా వ్యవసాయ సమృద్ధితో పాటు ఆర్థిక, రాజకీయ ప్రగతి కూడా మూసి నది పరివాహకంలో మెండుగా ఉండెను. తత్ఫలితంగా తెలుగు నాట ప్రాచీన కాలంలో ఎన్నో ప్రాచీన నగరాలు మూసి నది తీరంలో & మూసి పరివాహకంలో ఎన్నో అభివృద్ధి చెందినవి. తెలుగు నేలలో అతి పెద్ద కాలువ అయిన “రాజకాలువ” భువనగిరి జిల్లాలో ఇందుపుకేల సీమ (ఇందుల స్థలం) లోని నమిలె ఆనకట్ట వద్ద నుండి మొదలు అయ్యి నల్లగొండ పట్టణం పక్కన ఉన్న చారిత్రిక పానుగల్లు నగరం యొక్క పానుగల్లు చెరువు వద్దకు, అక్కడి నుంచి కృష్ణా నదికి వేయ బడినది.
ఈ కాలువ చాలా పెద్దది, 80 కిలోమీటర్ల పొడవు, అందుకే కాలువల్లో రాజు వంటిది అని ఆ పేరు కలదు [Udyasamudram: king of canals by K.S. Sobhan, Journal of Andhra historical research society, volume 39], [Hyderabad Affairs Vol.1 by Ali, Moulvie Syed Mahdi 1883].
ఇట్లా ప్రాచీన, మధ్య యుగ రాజ్యాలు అయిన కందూరు చోళ, కల్యాణి చాళుక్య, కాకతీయ, గోల్కొండ రాజ్యాల పాలన వలన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 74 మైళ్ళు ముసి నది ప్రవహిస్తే, అందులో 18 చోట్ల ఆనకట్టలు కట్టి, 40 రిజర్వాయిర్లు కట్టినట్టు నల్లగొండ & ఆంధ్ర ప్రభుత్వ ఇంజినీర్లు చెప్పినారు [ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ ప్రాజెక్టులు, మాదల వీరభద్రరావు, 1957].
ఈ కాలువ తొలుత కందూరు చోళుల కాలంలో కట్టబడినది, కాకతీయుల కాలాన అభివృద్ధి చేయబడినది, తర్వాత కుతుబ్‌షాహీలు మరమ్మత్తు చేయించినారు. ఈ కాలువ వలన మూసి కృష్ణా నదుల మధ్య నడిగడ్డ సుక్షేత్రము అయినది. కాకతీయుల గణపవరం శాసనం ద్వారా ఇక్కడ కాలువలు, చెరువులు ద్వారా వరిపంట బంగారు వర్ణంతో శోభిస్తూ ఉండెనని శాసనాల్లో కలదు. . 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం తొలి దశాబ్దాల వరకు హైదరబాద్ రాష్ట్రంలో ఉన్న రెండు ముఖ్య కాలువలు; మొదటిది మంజీర నది మీద మహాబూబ్ నహార్ కాలువ ప్రాజెక్టు అయితే రెండవది- ముసి నదిపైన ఈ ఆసిఫ్ నహర్ కాలువ ప్రాజెక్టు [Report On The Administration Of H E H The Nizams Dominions For The Year 1331 Falsi Vol Ii, 1933 ].
రాజకాలువనే నిజాము రాజుల కాలంలో ఆసిఫ్ నహర్ (అరబిక్‌లో గొప్ప నది అని అర్థం) అని పేరు మార్చినారు [Report On The Administration Of H E H The Nizams Dominions For The Year 1331 Falsi Vol Ii, 1933 ]
ఇక బ్రిటిష్ అధికారులు 1840వ దశకంలో హైదరాబాదుకు వచ్చినపుడు మూసి నది నుంచి కాలువలు ఉండేవని వాటి ద్వారా వారి పంట పండుతూ ఉండేదని రాసినారు [An Indian olio by Burton, E. F. (Edmund Francis), 1888]. ఇందులోనే సికింద్రాబాద్‌కి కొన్ని మైళ్ళ దూరంలో ముసినది తీరంలో ఉన్న కొర్రెమూల గ్రామ ప్రస్తావన కలదు. ఆ గ్రామంలో ముసి నది కాలువలు అన్నట్టు, అక్కడ చిట్టడవి ప్రాంతాల్లో రకరకాలైన పక్షులు, చిన్న జంతువులు అన్నట్టు రాసినరు.
1844, 1855 నాటి బ్రిటిష్ రచనల్లో హుస్సేన్ సాగర్ చెరువు మూసి నది ఉపనదులు వంటి వాగు మీద కట్టిన పెద్ద చెరువు. సికింద్రాబాద్‌ను హైదరాబాదును వేరు చేస్తున్న పెద్ద చెరువు అని , ఆ చెరువు నుంచి మొదలుకుని తూర్పు దిక్కు 8 నుంచి 10 మైళ్ళ వరకు నిరంతరాయంగా వారి పొలాలు ఉప్పల్ వరకు ఉన్నాయి అని చెప్పినారు.
హుస్సేన్ సాగర్ ఆ పొలాలకు చిన్న కలువల ద్వారా నీరు అందించును అని, పొలాల తర్వాత ఆ నీటి కాలువలోని నీరు ముసి నదిలో కలిసి పోవునని కూడా చెప్పినారు [Report on the Medical Topography and Statistics of the Northern, Hyderabad and Nagpore Divisions, the Tenasserim Provinces, and the Eastern Settlements, 1844], [ Researches into the causes, nature, and treatment of the more prevalent diseases of India: and of warm climates generally by Annesley, James, Sir, 1780-1847].
హైదారాబాద్ నగర తాగునీటి అవసరాలకు 1806లో నగరానికి పశ్చిమ భాగాన ఒక పెద్ద చెరువును నాటి హైదారాబాద్ రాష్ట్ర ప్రధాని మీర్ ఆలం తన పేరిట కట్టించినారు. మూసి నది నుంచి నీటిని అందించేటి ఒక కాలువ ద్వారా నింపపడేటట్టు నిర్మించిన పెద్దదైన చెరువు అది. మీర్ ఆలం చెరువుకు బలమయిన రాతి కట్ట ఉంది అని, ఆ రాతికట్ట ఆకృతిలో అడ్డంగా 21 తోరణాల వంటి (arches) కట్టడాలు ఉన్నట్టు చెప్పినారు. అది వర్షాకాలంలో నిండినపుడు చాలా ఎక్కువ విస్తీర్ణం వ్యాపించునని చెప్పెను [Report on the Medical Topography and Statistics of the Northern, Hyderabad and Nagpore Divisions, the Tenasserim Provinces, and the Eastern Settlements, 1844]. నేటి చాదర్‌ఘాట్ ప్రాంతం దగ్గర మూసి నది పైన ఒకపుడు మూసి నది పైన చెక్ డ్యాం ఉండేది, దాని పై నుంచి మూసినీరు జారీ పడుతుంటే, ఒక చెద్దరు లాగ కనిపించేదట, అందుచేత ఆ ప్రాంతం పేరు చాదర్‌ఘాట్ అయింది [Times of India, When Musi river had a 12-feet waterfall falling like a chadar…City |Syed Akbar | TNN | Sep 2, 2017]
ఇపుడా ఆనకట్ట లేదు. కానీ హైదరబాద్ నగరంలో ఆ ఆనకట్ట పక్కన ఉన్న స్థలానికి చాదర్‌ఘాట్ అన్న పేరు నిలిచిపోయింది.
ఆధునిక కాలంలో 1908 వరదల తర్వాత, మూసి నది వరదలు హైదరాబాదు నగరం పైన ప్రభావము చూపకుండా హైదరాబాద్‌కు పశ్చిమాన, మూసి ఎగువన ఉన్న రెండు ప్రధాన ఉపనదుల పైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే పెద్ద చెరువులు కట్టించినారు. నాటి నుంచి ఆ జంట జలాశయాలు హైదారాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన వనరులుగా మారినవి.
మొత్తంగా కళ్యాణి చాళుక్యుల కాలం నాటి నుండి కాకతీయులు, రాచకొండ రాజులూ, కుతుబ్‌షాహీలు, నిజాం రాజుల వరకు మూసి నది పైన 40 కి పైగా ప్రాచీన ఆనకట్టలు, కాలువలు కట్టినట్టు నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల నిపుణులు నిర్థారించినారు. శాతవాహన కాలంలో మరియు విష్ణుకుండిన కాలంలో ముసినది తీరప్రాంత వైభవం దివ్యంగా వెలిగింది. ప్రాచీన ముషక దేశం ఈ మూసి తీరప్రాంతము అని చరిత్రకారుల అభిప్రాయము.
మూసి నది ప్రాచీన యుగ చారిత్రక & సాంస్కృతిక వైభవం:
ముసి నది తీరంలో చరిత్రలో గోల్కొండ, హైదరాబాదు వంటి నగరాలు వెలసిన సంగతి తెలుగు చరిత్రలో తెలిసిందే.
ముసి నది & ముసి యొక్క ఉపనదుల వెంబడి & ముసి నది నుంచి తవ్వబడిన కాలువల వెంబడి ఎన్నో ముఖ్య ప్రాచీన రాజ నగరాలు, వ్యాపార కేంద్రాలు చారిత్రకంగా వెలసినవి. ఇంద్రపురము, గోవిందరాజ విహార, వాడపల్లి (ఓడపల్లి), కొలనుపాక, అనుమగల్లు, చిలుకూరు, నాగులపాడు, పిల్లలమర్రి, పానుగాల్లు, చిలుకూరు, అమ్మనబ్రోలు రాచకొండ, మొదలయినవి. వాటిల్లో కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ముసికనగరం – శాతవాహన కాలంలో ఖారవేలుని సేనలు కృష్ణానది (కన్న బెన్న) దాటి వచ్చి “ముసికనగరం” ను కాల్చినట్టు చెప్పబడినది. ఆ మూసిక నగరం ముసినది ఒడ్డున ఉన్న ఏదయినా ఒక ప్రాచీన నగరం అని చరిత్రకారుల అభిప్రాయము.
బీ ఎన్ శాస్త్రి గారు ఇంకా చాలా మంది చరిత్రకారులు ముసి నది కృష్ణ నదిలో సంగమించే ప్రదేశంలో ఉన్న ప్రాచీన వాడపల్లి/వోడపల్లి అని చెప్పినారు. ఈ ఓడపల్లి ప్రాంతం కాలం నుంచే ప్రముఖ నదీ రేవు పట్టణంగా అన్నట్టు చారిత్రక ఆధారాలు ఎన్నో కలవు. ఈ ముసి కృష్ణా సంగమ క్షేత్రం గురించి రాష్ట్రకూట, కందూరు చోళ, కాకతీయ, రెడ్డి రాజులు, కుతుబ్‌షాహీల & అసఫ్జాజీల కాలం శాసనాలు బట్టి స్పష్టంగా తెలియవస్తున్నది. కాకతీయ శాసనాల్లో ఈ క్షేత్రం పేరు స్పష్టంగా వోడపల్లి అని ఉన్నది. దీన్ని బట్టి ఆ పేరు అంతకు ముందు నుంచే అంటే రాష్ట్రకూటుల కాలం నుంచే వాడుతున్నట్టి అర్థం చేసుకోవచ్చు.
సముద్రం నుంచి ఓడలు కృష్ణా నది ద్వారా ఇక్కడకు వచ్చేటివి అని, తద్వారా చారిత్రకంగా అంతర్జాతీయ వ్యాపారము వాణిజ్యం బలంగా సాగిన తెలుగు రేవు పట్టణాల్లో ఓడపల్లి కూడా ఒకటి అని అర్థం అగుచున్నది. గత సంవత్సరం వోడపల్లికి అత్యంత దగ్గరలో ముడిమాణిక్యం అనే ఊరిలో బాదామి చాళుక్యుల నాటి అపురూప ఆలయాలు, మరియు ఆ ఆలయాల్లో సామాన్య శకం 7-8వ శతాబ్దం నాటి లఘు శాసనాలు కూడా వెలుగులోకి వచ్చినాయి
[https://www.google.com/amp/s/www.newindianexpress.com/amp/story/states/telangana/2024/Feb/25/1300-year-old-inscription-found-in-ancient-nalgonda-temple]. పైగా వోడపల్లి కృష్ణా ముసి సంగమ స్థలోకి దగ్గరలోనే ఈ కృష్ణాతీరంలో కుతుబ్షాహిలనాటి శాసనం వెలుగులోకి వచ్చింది. ఆసక్తిదాయకంగా ఆ శాసనము ఒక ప్రాచీన దీపస్థంభానికి చెక్కబడి ఉన్నది [ https://www.google.com/amp/s/timesofindia.indiatimes.com/india/historic-discovery-telugu-tamil-inscription-on-17th-century-lamppost-unearths-trade-links/amp_articleshow/107494475.cms ].
ప్రాచీన, మధ్య యుగ కాలాల్లో ఇక్కడ వచ్చే వ్యాపార ఓడలకు నైసర్గిక దిక్సూచిగా ఆ దీప స్తంభం ఉండేది అని చరిత్రకారులు చెప్పినారు. ఇంత ప్రాముఖ్యత వాడపల్లి క్షేత్రానికి ఉంది కాబట్టే ఇటు తెలంగాణ కర్ణాటక ప్రాంతాలను ఏలిన రాజులతో తూర్పు తీరంలో కళింగ, తీరాంధ్ర ప్రాంత రాజులు కూడా ఈ ముసికా నగరం అయిన వాడపల్లి పైన ఆధిపత్యం కోసం ఎంతో ప్రయత్నం చేసినారు. ఈ వాడపల్లి క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాలు మరిన్ని ఇదే వ్యాసంలో తర్వాత మాట్లాడుకుందాం.
ఇంద్రపుర – విష్ణుకుండినుల తొలి మహా రాజధాని నగరము: ముసి నది తీరాన ఉన్న నేటి ఇంద్రపాలనగరం ఒకప్పటి ఇంద్రపురి [ శాసనాల సంపుటి 1,2 , బీ ఎన్ శాస్త్రి].
తుమ్మలగూడెం, ఇంద్రపాలగుట్ట, ఇంద్రపాలనగరంగా పేరు ఉన్న ఊరు ఉమ్మడి నల్గొండ జిల్లా ముసి నదితీరం అయిన వలిగొండ ప్రాంతం. ఈ ఇంద్రపాలనగరం ప్రాచీన విష్ణుకుండిన మహారాజుల రాజవైభోగాల నెలవు అని ఇక్కడ దొరికిన 5,6 శతాబ్దాల నాటి తామ్ర శాసనాల ఆధారంగా తెలియవస్తున్నది. ఇచ్చట రెండు తామ్ర శాసనాలు లభించినవి. మొదటిది అయిదవ శతాబ్ధంలో గోవిందావర్మ వేయించింది. రెండవది ఆరవ శతాబ్దంలో విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించింది.
విష్ణుకుండిన విక్రమేంద్ర భట్టారక వర్మ సామాన్య శకం 566లో వేయించిన తామ్ర శాసనము ద్వారా ఈ నగరానికి ఇంద్రపురము/ఇంద్రపుర అని పేరు ఉండెనని, ఇక్కడ విష్ణుకుండినులు మహారాణి పేరిట పరమభట్టారికా మహావిహారము అనే గొప్ప బౌద్ధ క్షేత్రాన్ని నిర్మించినట్టు తెలియవస్తున్నది. ఈ శాసనంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే సింహాహ్వయ అనే పల్లవరాజుపై యుద్ధం జయించిన అనంతరం ఆరవ శతాబ్దంలో విష్ణుకుండిన మహారాజు విక్రమేంద్రభట్టారక వర్మ తిరిగి శక్రాభిధానపురముకే (ఇంద్రపురికే) వచ్చినట్టు అవగతం అవుతున్నది. ఆ శాసనములో ఈ ఇంద్రపురముకు మరో పేరుగా అదే అర్థం వచ్చే శక్రాభిధానపురము అని వాడినారు. శక్రాభిధానుడు అంటే ఇంద్రుడు. కాబట్టి శక్రాభిధానపురము అంటే ఇంద్రపురము.
అయితే మరో ముఖ్య అంశం ఈ తామ్ర శాసనములో చెప్పబడిన ఇంద్రపురము నేటి ఇంద్రపాల నగరము అని రూఢి చేసుకోడానికి తర్వాతి తరం శిలా శాసనాలు తోడ్పాటును ఇచ్చినాయి. ఇక్కడి ఇండ్రపాల గుట్టలో ఎన్నో ప్రాచీన ఆలయాలు, కోటల శిథిలాలు కలవు., గుట్ట కింద ప్రాచీన శిథిలాలు ఎన్నో ఉన్నాయి. పైగా ఇక్కడ ఆలయాల్లో, గుహల్లో కల్యాణి చాళుక్యుల, కాకతీయుల, కుతుబ్ షాహీల కాలం నాటి శాసనాలు లభించినవి. అవి ఈ ప్రాంత ప్రాచీనతను చరిత్రను తెలియజేయును. కాకతీయ నాటి శాసనాలలో ఈ ఊరి పేరు ఇందుప్పురాల అని ఉన్నది. కుతుబ్ షాహీ నాటి శాసనంలో ఇందుపురము అని ఉన్నది [Inscriptions of AP, Nalgonda district, Volume 1]. పానుగల్లులోని సా.శ 1551 నాటి శాసనంలో నమిలే ఆనకట్ట ఉన్న ప్రాంతాన్ని ఇందుపుకేల సీమ అని, ఇందుల పాల పడ్డ అని ప్రస్తావించినారు [1934 the Annual report of archeology, Hyderabad State].
నైజాము ప్రభుత్వ రికార్డుల్లో ఇందర్పరాల్ అని ఉన్నది [The Hyderabad Affairs]. వీటిని బట్టి ఇంద్రపాలగుట్టగా నేడు పిలవ బడుతున్న ఊరికి ప్రాచీన కాలం నుండి ఇంద్రపురము అన్న పేరు ఉన్నట్టు అవగతమవుతున్నది. పైగా శక్రాభిధానపురము అని కూడా మరో పేరు ఈ నగరానికి విష్ణుకుండిన కాలంలో కలదు. ఇంద్రునికి మరో పేరు శక్రాభిధాన. అంటే ఇంద్రుని పేరు మీద ఉన్న నగరం ఇది అని తెలియస్తున్నది. మరి విష్ణుకుండిన శాసనాల్లో పేర్కొన బడిన అమరపురము కూడా ఈ ఇంద్రపురము అయ్యే అవకాశం ఉంది అని ఈ రచయిత అభిప్రాయం. ఎందుకు అంటే, నాటి విష్ణుకుండిన శాసనంలో ఉన్న ఇంద్రపురము తర్వాతి కాకతీయ కుతుబ్ షాహీ శాసనాల్లో ఇందుపురం ఉండుట. దీనికి ఇంకో బలమయిన ఆధారం ఉమ్మడి పాలమూరు కర్నూలు జిల్లాల సరిహద్దులో దొరికిన 7వ శతాబ్దపు బాదామి చాళుక్య తామ్ర శాసనములో “ఇందుపుర ఘటికా” ప్రస్తావన. వేద విద్యలో ఆరితేరిన ఇందుపుర ఘాటికా వాసుడు అయిన మాలరేశ్వర స్వామి అనే పండితుని పుత్రుడయిన మాబుగణస్వామికి తుమ్బెయలూరు వద్ద కొన్ని ఊర్లు దానం ఇచ్చిన, సమాచారం ఈ శాసనంలో కలదు [COPPER PLATE INSCRIPTIONS OF ANDHRA PRADESH GOVERNMENT MUSEUM , HYDERABAD (Vol. 1) By Sri М. RAMESAN] [Inscriptions of Andhra Pradesh, Mahabubnagar district, Volume 1].
దక్కన్ ప్రాంతంలో 6వ శతాబ్దంలో ఇంద్రపురంగా పిల్వబడ్డ ఊరు, తర్వాత కాలం కాకతీయ, కుతుబ్‌షాహీ, నిజాం ప్రభుత్వం కాలములలో ఇందుపురంగా ఉండుట, ఇప్పటికీ స్థానిక వాడుక ఇంద్రపాల నగరం అని ఉండుట వల్ల బాదామి చాళుక్యుల నాటి ఇందుపురం స్థలము విష్ణుకుండిన రాజధాని ఇంద్రపురమే అని శాస్త్రీయంగా చెప్పవచ్చు. పైగా అచట విహారాల వల్ల అది విద్యా కేంద్రంగా విలసిల్లినట్టు తెలియవస్తున్నది, నాటి కాలంలో విద్య కేంద్రాలను ఘాటిక అని సంబోధించుట కలదని చరిత్ర చెప్పును.
గోవిందరాజ విహారము:
గోవిందరాజ విహారము అని హైదారాబాద్ నగరంలో మూసి నది తీరంలో చైతన్యపురి ప్రాంతంలో ఉన్న కోసగుండ్ల ఫణిగిరి నరసింహ స్వామి ఆలయ గుట్టపైన ఉన్న గుండ్ల పైన కల ప్రాచీన ప్రాకృత శాసనం ద్వారా తెలియ వస్తున్నది [భారతి సంపుటం 60 సంచిక 7, హైదరాబాదు గోవిందరాజ విహారము]. ఈ శాసనం తెలుగు చరిత్రకు, విష్ణుకుండిన చరిత్రకు ఎంతో ముఖ్యం. విష్ణుకుండిన చరిత్రలో తొలితరం రాజుల గురించి అర్థం చేసుకోడానికి ఎంతో ఉపయుక్తం. నేటి ఘట్కేసర్, ఒకప్పటి ఘటకేశ్వరము, విష్ణుకుండినుల నాటి ఘఠిక, విద్యా కేంద్రము.
చిలుకూరు:
రాష్ట్రకూట & కల్యాణి చాళుక్య కాలంలో మూసి నది తీరంలో ఉన్న లొంబలిక-70 అనే ప్రాంతానికి ముసి తీరానికి దగ్గర ఉన్న చిలుకూరు రాజధాని [Corpus of Inscriptions of Telingana districts, part 4]. కళ్యాణి చాళుక్యుల సామంతులు ఇక్కడ పాలిస్తూ శైవ, జైన మతాలను పోషిస్తూ, చోళ యుద్ధాల్లో చాళుక్య సేనలో సేవలు చేసి ఎన్నో బిరుదులు పొందినట్టు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి [ state and society in andhra under the kalyana chalukyas (973 a.d. 1162 a.d.) by n saibabu, 2011]. గత కొన్ని దశాబ్దాలుగా వీసా బాలాజీ ఆలయం ద్వారా ఈ ఊరు తెలుగు వారికి సుపరిచితమే. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు 5 శతాబ్దాల నాటిది. అయితే చిలుకూరు చరిత్ర ఎన్నో శతాబ్దాల నాటిది. రాష్ట్రకూట & కల్యాణి చాళుక్యుల కాలంలో ఎంతో ముఖ్య వాణిజ్య & విద్యా కేంద్రము. కాలముఖ శైవ ఆచార్యులు తెలంగాణములో అలంపురం, వేములవాడ క్షేత్రాలతో పాటు చిలుకూరులో కూడా ఉండిరి అని తెలియా వస్తున్నది [S.V.U. ORIENTAL JOURNAL VOL:-28 PART:-1&2 by SRI MANANARAYANA MURTY.M, 1985].
పిల్లలమర్రి:
ముసినది తీరమున ఉన్న ప్రాచీన నగరాలలో పిల్లలమర్రి ఒకటి. తెలుగు రాష్ట్ర రాజధానుల మధ్య ఉన్న ప్రధానమైన హైదారాబాద్ విజయవాడ జాతీయ రహదారి నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట పట్టణానికి అతి సమీపంలో ఉండును పిల్లలమర్రి అనే కాకతీయ నగరం. కాకతీయుల నాటి అద్భుతమయిన ఆలయాలు ఇక్కడ కలవు. కాకతీయ శాసనాలు కలవు. ఇది కాకతీయ కాలంలో పండితులతో అలరారిన నగరం. రేచెర్ల వంశ రెడ్డి రాజులు ఏలిన ప్రాంతం. ఇక్కడి ఎరాకేశ్వర ఆలయ శిల్ప సంపద కాకతీయ శైలిలో నిర్మాణం కాబడిన ప్రముఖ ఆలయాల్లో ఒకటి. పిల్లలమర్రి పినవీర భద్రుడు ఆమె కవి ఈ నగరము వారే అని చరిత్ర చెప్పును.
ఉండ్రుగొండ:
ముసి నదికి 11/12 కిలోమీటర్ల దూరంలో, సూర్యాపేట కు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాచీన నగరం, మహాగిరి దుర్గము ఉండును. ఈ దుర్గము చాలా ప్రాచీనమైనది, కాకతీయులకు, రేచెర్ల పద్మానాయక రాజులకు ముఖ్య గిరి దుర్గాల్లో ఒకటి.
మూసి ఉపనది ఆలేరు. ఆలేరుకి బిక్కేరు అని మరో పేరు కలదు. అంటే బౌద్ధ భిక్షువులు గోదావరి నుంచి కృష్ణా నదికి ఈ ప్రాంతం గుండా పోయేవారని, అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు అని తెలుస్తున్నది [ఆలేటి కంపణం చరిత్ర, శ్రీ రామోజు హరగోపాల్]. ఈ ఆలేరు తీరం వెంబడి అతి ప్రాచీన ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు అయిన గాజుల బండ, ఫణిగిరి కలవు.
ఫణిగిరి:
తెలుగు నాట అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి ఫణిగిరి. ఇది సూర్యాపేట జిల్లాలో జనగామ రహదారికి దగ్గర్లో ఫణిగిరి గుట్ట పైన ఉన్నది ఈ బౌద్ధ క్షేత్రం. దక్షిణ భారతదేశ అతి ప్రాచీన సంస్కృత శాసనాల్లో ఒకటి ఫణిగిరిలో కలదు. ఇక్కడ అద్భుతమయిన చైత్యములు, విహారములు, ప్రార్థనా మందిరాలు కలవు. ఇది విద్యా, వ్యాపార కేంద్రం అనుటకు ఎన్నో ప్రాచీన రోమన్ నాణేలు కూడా ఇక్కడ లభ్యం అయినాయి. హైదారాబాద్ రాష్ట్రంలో పురావస్తు శాఖ వారు స్వాతంత్ర్యం ముందు జరిపిన పరిశోధనల్లో, తవ్వకాల్లో వెలుగు చూసిన ప్రాచీనయుగపు కట్టడాల్లో ఫణిగిరి, సంగారెడ్డి దగ్గర్లో కొండాపురం ముఖ్యమయినవి.
ఫణిగిరి యందు సుమారు 6 అడుగుల బుద్ధుని విగ్రహం బయటపడింది.
https://www.thenewsminute.com/telangana/rare-stucco-buddhist-sculpture-excavated-telangana-100971].
ఇంకా శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన నాటి ఎన్నో చారిత్రక అవశేషాలు కూడా ఫణిగిరిలో ఉన్నాయి.
మధ్యయుగంలో చాళుక్య కాకతీయ కాలంలో ఇక్కడ ఫణిగిరి గుట్ట వద్ద ప్రసిద్ధ రామాలయం నిర్మింపబడినది. ఈ ఆలయం తెలంగాణలో ప్రముఖ రామాలయంలో ఒకటి. భద్రాచల రామాలయానికి ఈ ఫణిగిరి రామాలయానికి సాంస్కృతిక సంబంధం కలదు.
ఒక శతాబ్దం పూర్వం, భద్రాద్రిలో వరదల్లో సీతమ్మ వారి విగ్రహం దొరకకుండా పోతే, అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఫణిగిరి రామాలయంలో పంచలోహ పాత్రను తీసుకుని భద్రాచల సీతమ్మ విగ్రహం మరల తయారు చేసిరి. ఇక్కడ హోలీ పున్నమకు రామ కళ్యాణం జరుపుట విశేషం.
గాజులబండ:
ఫణిగిరికి దగ్గర్లో, బిక్కేరు (ఆలేరు) నదికి దగ్గరలో ఉన్న మరో అద్భుత బౌద్ధ క్షేత్రం. జనగ్గమ జిల్లాలో ఉన్నది. ఇక్కడ వెడల్పయిన మహాస్తూపం, విహారం గుట్టపైన ఉన్నవి.
(సశేషం)