[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
తిక్కన కవితా వైభవం
మనీషులు, యుగకర్తలు సమాజాన్ని అర్థం చేసుకుని, అభ్యుదయపథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచనలకు, భావాలకు, నిరంతర ప్రసరణం జరుగుతూంటేనే, సమాజం సజీవంగా, చైతన్య స్ఫూర్తితో తన అనుభవాలకు రూపకల్పన చేసుకుని పయనిస్తుంది. మనీషుల ఆలోచనలే ఉత్తమ సాహిత్య రూపాన్ని ధరిస్తాయి. ఆ ఉత్తమ సాహిత్యాధ్యయనం మనిషి వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేయగలుగుతుంది.


తిక్కన దేశి మార్గ పద్ధతులను, శైవ వైష్ణవ మతములను, సంస్కృతాంధ్ర భాషా రచనలను, కర్మ జ్ఞాన మార్గములను, చక్కగా పరిష్కరించి ఉభయతారకమైన మధ్యే మార్గమును నిర్దేశించాడు. పురాణమును కావ్యముగా తీర్చిదిద్దుట, ఆఖ్యాయికను నాటకీయముగా రచించుట, పాత్రలను విస్పష్ట రేఖలతో చిత్రించుట, మనస్తత్వమును నిశితముగా విశ్లేషించి నిరూపించుట, నానా రసములను పోషించుట – ఆయన సాహితీరంగంలో త్రొక్కిన కొత్త మార్గములు.


తిక్కన భారతంలోని కొన్ని మంచి పద్యాలను పరిచయం చేసి, యువభారతికి అందించిన డాక్టర్ పాటిబండ మాధవశర్మ గారు సుప్రసిద్ధ సాహిత్యాచార్యులు. సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా పండితులు. ఉత్తమశ్రేణికి చెందిన అధ్యాపకులు. ఛందశ్శిల్పమును గూర్చి పరిశోధనచేసి అపూర్వ రహస్యాలను వెలికిదీసిన పరిశోధకులు.
తిక్కన సాహిత్యంతో పరిచయం – భారతాత్మతో పరిచయం. సజీవమైన తెలుగు భాషతో పరిచయం. తెలుగు పలుకుబడికి తిక్కన భారతం ఒక గుడి.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.



శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.