[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – ‘తుఖ్ఖాపంచకం’ కవయిత్రి తుఖ్ఖాజి – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]


రాజుల కథలన్నీ ‘అనగనగా ఒక రాజు’ అంటూ జనంలో ‘ట’ కార ప్రయోగంతోనే వ్యాప్తిలో ఉంటాయి. ఈ కథల్లో నిజాలకన్నా కథకుల వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వేదంలో హరిశ్చంద్రుడు మాటమీద నిలబడని అబద్ధాలకోరు. కానీ కావ్యంలోకి వచ్చేసరికి సత్యవ్రత సంజాతుడిగా కనిపిస్తాడు. కవుల చేతుల్లో పడితే ఈ కథలు మౌలిక స్వభావాన్ని కోల్పోతాయి. చివరికి అవే చరిత్రగా చెలామణీ అవుతాయి కూడా!
కృష్ణదేవరాయలు గజపతిని ఓడించి, అతని కూతుర్ని పెళ్ళాడాడనే కథ కూడా అటువంటిదే! ఆమె పేరు తుఖ్ఖాదేవి అని, అన్నపూర్ణ అని, వరదమ్మ అని పేర్లున్నాయి. తుఖ్ఖ – తుర్మ- తూర్క అనేవి దుర్గమ్మకు తెలుగు రూపాలు. ప్రతాపరుద్రుడు దుర్గమ్మ భక్తుడని, దుర్గమ్మ వరప్రసాది అని ఆయనకు బిరుదు కూడా ఉన్నదని చెప్తారు.
‘కృష్ణరాయవిజయము’ వ్రాసిన కుమార ధూర్జటి (ధూర్జటి గారి మనుమడు) రాయలు పెళ్ళాడిన గజపతి కూతురు పేరు ‘తుఖ్ఖాజి’ అని, రాయవాచకంలో జగన్మోహిని అనీ, టైలరు దొర ‘రుచీదేవి’ అనీ, కొన్ని విజయనగర కడితాల్లో లక్ష్మీదేవి అనీ, ‘నరపతి రాజుల చరిత్రం’లో లుఖాదేవి అనీ, నాదిండ్ల గోపమంత్రి ప్రబోధ చంద్రోదయంలో సుభద్ర అనీ వ్రాశారు.
వారి వివాహం రాయలు పొట్టునూరు జయించాక అనీ, కనిగిరిని జయించాక అనీ భిన్నాభిప్రాయాలున్నాయి. రాణీ చిన్నాదేవి మరణానంతరమే అన్నపూర్ణాదేవితో వివాహం జరిగిందని కొందరు వాదిస్తారు. కీర్తిశేషురాలైన పెద్దరాణి చిన్నాదేవి స్థానాన్ని అన్నపూర్ణా దేవి భర్తీ చేసిందనే వాదన కూడా ఉంది. ఆ అన్నపూర్ణ గురించి కృష్ణరాయలు, తన ఆముక్తమాల్యదలో ప్రస్తావించటాన ఈ వివాహం యుద్ధాలు ఆగి శాంతి కుదిరాకే జరిగిందని, అప్పుడే రాయలవారు ఆముక్తమాల్యద రచన ప్రారంభించి ఉంటారని భావించవచ్చు.
గజపతితో రాయలవారి యుద్ధం 1517లో జరిగింది. సా.శ.1442 (క్రీ.శ. 1521), నాటి తిరుమల శాసనం ప్రకారం పట్టపురాణి తిరుమల దేవి శ్రీ వేంకటేశ్వరస్వామికి విలువైన ఆభరణాలు సమర్పించుకుంది. ఆ సమయానికి అన్నపూర్ణ గానీ తుఖ్ఖా గానీ లేరు. కాబట్టి వీరి వివాహం యుద్ధం తరువాత చాలాకాలానికి జరిగి ఉండాలి.
ఈ అన్నపూర్ణాదేవి గజపతి కుమార్తే అనటానికి విదేశీ యాత్రికుల వ్రాతలు కొంత ఆధారం, ఈమె అసలుపేరు తుఖ్ఖా లేక జగన్మోహిని అని ఉండగా, వివాహానంతరం ఈమెకు అన్నపూర్ణాదేవి అనే నామకరణం చేశారనే వాదన కూడా ఉంది.
పిల్లనిచ్చిన మామగారు ప్రతాపరుద్ర గజపతా లేక వీరరుద్ర గజపతా అనే విషయంలో కూడా వివాదం ఉంది. ఆ ఇద్దరూ తండ్రీ కొడుకులని, ప్రతాపరుడ్రుడే లొంగిపోయి తానే కూతుర్ని ఇస్తానన్నాడని ఒక కథనం, రాయలే బలవంతంగా వీరరుద్ర గజపతి కూతుర్ని ఎత్తుకు పోయాడని, ఇంకో కథనం ఉన్నాయి.
సెట్టి లక్ష్మీనరసింహం గారు ఉగాది కానుకలు పేరుతో ఈ వివాహం పైన ఒక చక్కని కథ రాశారు. వీరరుద్ర గజపతి కుమార్తె అన్నపూర్ణాదేవిని రాయలు వివాహం చేసుకున్నాడని, కానీ, అది మాయా వివాహం అనీ, వేరే వ్యక్తికి ఆమె వేషం వేసి కూతురు వివాహం జరిపించి శోభనం రాత్రి బావిపైన వదులు మంచం వేసి రాయలవారిని చంపాలనే కుట్ర జరిగిందని వ్రాశారాయన. ‘పానుపు వెలితి’ అని అన్నపూర్ణ ఓ సందేశం ద్వారా రాయల్ని హెచ్చరించటంతో ఆ ప్రమాదం నుండి రాయలు బైటపడ్డారు.
“పడకటింటను నోప్రభూ! పాన్పు వెలితి
పేరటాండ్రు నారులు గారు, వీరకులము
తొందరించిన పను లెల్ల తోన చెడును
సావధానత నే హాని జరుగబోదు”
అని, ‘పానుపు వెలితి’ సందేశం గురించిన ఓ చాటువు కూడా ఉంది.
కపిలేశ్వర గజపతితో వైరం ప్రారంభం
ప్రతాప రుద్రగజపతి ముత్తాత కపిలేశ్వర గజపతి. చంద్రగిరి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం ఖమ్మం ఓరుగల్లు కోటల్ని విజయనగరం రాజుల్నుంచి గెలుచుకుని తన సామ్రాజ్యాన్ని రామేశ్వరం, శ్రీరంగం దాకా విస్తరించిన గొప్ప యోధుడు. కపిలేశ్వర గజపతి కొడుకు పురుషోత్తమ గజపతి (1470-1497) కంచిని పాలించే రాజుగారి కుమార్తెని తనకిమ్మని అడిగాడట.
గజపతి మౌలికంగా శివభక్తుడు. కానీ, పూరీ జగన్నాథుడి విషయాని కొచ్చేసరికి విష్ణుభక్తిని కూడా ప్రదర్శించేవాడు. భక్తికొద్దీ రథం తిరిగే ప్రాంతాన్ని స్వయంగా ఊడ్చేవాడట. కంచి రాజు విష్ణుభక్తుడు. కాబట్టి, శైవులకు తన పిల్లనివ్వనన్నాడు. పైగా, వీధులు ఊడ్చే వాడికి అసలివ్వనన్నాడు. దాంతో కోపించి పురుషోత్తమ గజపతి కంచిని జయించి, రాకుమారిని బంధించి తీసుకుపోయి, ఆమెని వీధు లూడ్చే వాడికే ఇచ్చి పెళ్ళి చేస్తానని శపధం చేశాడు.
అంతలో, పూరీ జగన్నాథ రథోత్సవం వచ్చింది. యథావిధిగా రాజు భక్తికొద్దీ రథ మార్గాన్ని ఊడ్చి శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో కంచి రాకుమారిని అక్కడకు తెచ్చి, వీధులూడుస్తున్న గజపతి ప్రక్కన నిలబెట్టి, అతని మంత్రి “ఈమెను ఇప్పుడు పెళ్ళాడితే, వీధులూడ్చే వ్యక్తికిచ్చి పెళ్ళిచేస్తానన్న మీ శపథం, ఈమెను పెళ్ళాడాలనే మీ కోరికా తీరతాయి” అని సూచించాడట.
ఆ పురుషోత్తమగజపతి మనుమడు ప్రతాపరుద్రగజపతి. కులనిందకు గురైన అనుభవం ఉన్న కుటుంబమే! అతను రాయల కులాన్ని ఈసడించారంటే నమ్మబుద్ధి కాదు. ఒరియా చరిత్రకారులు తుఖ్ఖాజీ రాయలవారి భార్యల్లో ఒకరని, ఆమెను రాయలవారు ఏ కారణం చేతో పరిత్యజించారనీ ఒప్పుకుంటారు. కానీ పానుపువెలితి కథని ఖండిస్తారు. ఎవరి ఇంటి గొడవలు వారివి.
Epigraphical Glossary on Tirumala Tirupati Devasthanams Inscriptions గ్రంథంలో ప్రతాపరుద్ర గజపతి వంశావళి గురించిన వివరాలున్నాయి.
[The genealogy of Pratäparudra Gajapati.]
|—————————————————————|——————————————-|
|
Timmarāja
|
Pratāparudra (the king of Utkala)
1. the daughter of Pūsapăți Rāchīrāja
| |
Prince Virabhadra Annapūrņā(alias Tukkādavi) (m. Krishnarāya)
Parvatarāhutta (alias Tirumalarähutla)
On 25th October 1515 A. D., Krishņarāya captured alive this Virabhadrarāya, son of Prataparudra Gajapati along with Naraharideva, the son of Kumara. Hamvīrapātra, Rāchüri Mallukhān, Uddaudakhān, Janyāla Kasavapätra and other chiefs after the occupation of the fort of Udayagiri, Addańki, Vinikonda, Bellamkonda, Nāgārjunikonda, Tangēda, Kētavaram and other forts in one single attack during his eastern expedition
1515 అక్టోబర్ 25న కృష్ణదేవరాయలు ఉదయగిరి, అద్దంకి వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ తంగెడ, కేతవరం, కోటల్ని జయించి ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రరాయ గజపతిని, హంవీరపాత్ర గజపతి, నరహరిదేవ గజపతి, రాచూరి మల్లుఖాన్, ఉద్దౌదఖాన్, జన్యాల కసవపాత్ర ఇంకా ఇతర అధికారుల్ని బంధించాడు. ఇవన్నీ ఒకే దెబ్బతో వశం అయ్యాయని ఉంది. దక్షిణ దిగ్విజయ యాత్ర నుండి కటక్ విజయం వరకూ ఏడున్నర ఏళ్ళపాటు ప్రతాపరుద్రుడితో రాయలవారు పోరాడినట్టు ఒడియా రికార్డులు చెప్తున్నాయి. ఉదయగిరిని జయించినప్పుడు అక్కడ భూమిలో రాయలవారి కొక బాలకృష్ణుని విగ్రహం దొరికిందట. దాన్నిబైటకు తీయించి గుడి కట్టించి పూజలు చేయించాడని కూడా ఒరియా గ్రంథాల్లో ఉంది.
పోర్చుగీస్ యాత్రికుడు నూనిజ్ వ్రాసిన విషయాన్నే ఒరియా చరిత్రకారులూ స్వీకరించారు. రాయలవారికీ ప్రతాపరుద్రగజపతికీ మధ్య ఒప్పందం ప్రకారం కృష్ణానది వరకూ గజపతి తన అధికారాన్ని కొనసాగించేందుకు రాయలు అంగీకరించాడు. విజయనగరంలో బందీలుగా ఉన్న గజపతి రాణీని ఇతర అధికారుల్ని విడుదలచేశాడు. కానీ, ప్రతాప రుద్రదేవుడు తన కూతుర్ని రాయల కిచ్చి వివాహం చేయక తప్పింది కాదట!
ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రుడు తన విజేత రాజు కృష్ణదేవరాయల ఆదేశం మేరకు వివాహ పన్నుని రద్దు చేసినట్టు చిత్తల్దుర్గ జిల్లాలోని దేవనాగరి తాలూకాలో ఒక శానం ఉందని ఒరియా చరిత్రకారులు వ్రాశారు.
రాయలవారి మొదటి భార్య తిరుమలాదేవి శ్రీరంగపట్నం పాలకుడు కుమార వీర శ్యామరాయని కుమార్తె. వారి వివాహం రాయలు పట్టాభిషిక్తుడు కాక మునుపే జరిగింది. రెండవరాణి చిన్నాజి. ఆమె కుటుంబ వివరాలు తెలియవు. రాయలు ఆమెని పట్టాభిషిక్తుడయ్యాక వివాహమాడాడు. 1517లో రాయల దిగ్విజయ యాత్ర సమయంలోనో పూర్తయ్యాకో ఆమె మరణించింది, ‘చిన్నాదేవి మరణం తరువాతే కటకం జయించిన రాయలు ప్రతాపరుద్రగజపతి కుమార్తె అన్నపూర్ణ/తుఖ్ఖాదేవిని వివాహ మాడాడు’ అనేది ఎక్కువమంది పరిశోధకుల అభిప్రాయం.
ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మగారు ఆంధ్రకవయిత్రుల చరిత్రలో ఈ తుఖ్ఖాదేవే చిన్నాదేవి అనీ, హత్యాయత్నంలో పాల్గొన్నది ఆమేనని భావించారు. రాయలవారి నిరాదరణతో, ఆమె పుట్టింటికి పోకుండా కడప దగ్గర ఆగిపోయింది. అక్కడే ఒంటరిగా జీవించింది. అక్కడ గ్రామీణులతో కలిసిపోయి వారి బాగోగులు చూసుకుంటూ బతుకు వెళ్ళదీసుకుంది.
అక్కడ నాలుగు కొండల మధ్య ప్రజల అవసరార్థం ఒక చెరువు త్రవ్వించే బాధ్యత తీసుకుంది. ఎంత ప్రయత్నించిన పనులు ముందుకు సాగటం లేదు. దాంతో ఒక ముసలావిడ ఈ తటాకం నరబలి కోరుతోందేమో అంది. అందరూ ముఖాలు చూసుకున్నారు. అప్పుడా ముసలమ్మే అంది.. ఊరుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. తటాకం పూర్తవ్వాలంటే, నరబలి జరగాలి నా ఇద్దరు బిడ్డలు పెదకంబయ్య, చిన కంబయ్యల్ని బలి ఇవ్వటానికి నేను సిద్ధమే అంది. అలా, ఆ తటాకానికి అటూఇటూ పెదకంబం, చినకంబం అనే రెండు ఊర్లు ఆ ఇద్దరి పేరునా వెలిశాయని ఐతిహ్యం.
నిజానికి, రాయలకూ ఈమెకీ మధ్య వైరం ఈమె తండ్రి గజపతి వలనే కలిగింది. కూతురు ద్వారా రాయలును అంతం చేయదలిచాడు గజపతి. కానీ, రాయలు ఆ హత్యాయత్నంలోంచి తప్పించుకున్నాడు. ఫలితంగా రాయలే ఆమెను వదిలేశాడో, లేక కులం తక్కువ వాడని ఆమే రాయల్ని వదులుకున్నదోగానీ, ఆమె కడపజిల్లా కంబం దగ్గర ఉండిపోయింది.
కొంత ఆవేశకావేషాలు చల్లారాక తుఖ్ఖాపంచకం లేదా భృంగపంచకం పేరుతో ఐదు శ్లోకాలు వ్రాసి రాయలకు పంపింది. రాయలు తనను నిర్లక్ష్యం చేసిన ఆవేదన, దానితోపాటు ఆమెలో కలిగిన పరివర్తన ఇందులో కనిపిస్తాయి. ఆ ఐదు శ్లోకాలూ ఇవి:
1.
“చరన్వనాంతే నవ మంజరీషు న షట్పదో గంథఫలీ మజిఘ్రత్
సాకిం నరమ్యా న చ కిం న రంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా”
ఈ అడవిలో పూలగుత్తులమీద వ్రాలే తుమ్మెద సంపెంగ పువ్వు మీద కూడా వాలింది గానీ, దాన్ని ఆఘ్రాణించటం లేదు, సంపెంగపువ్వుకు మంచి రంగు, రుచి సువాసన కూడా ఉన్నాయి. అయినా తుమ్మెదకు దాని మీద ఆసక్తి లేకపోవటానికి విధి కారణం. ఈశ్వరాజ్ఞ ఆవిధంగా ఉంది.
2.
“మా కింశుర ‘ప్రకట యాత్మ నిమేషమాత్రం మన్మస్తకే విహర తీతి మధు వ్రతోయమ్
కిం మాలతీ విరహవేదనయా త్యదీయమ్ దృష్ట్వా ప్రసూన మచిరా దనలభ్రమేణ”
ఓ మోదుగ పువ్వా! ఈ తుమ్మెద తలమీదే తిరుగుతోందని విసుక్కుని ముకుళించాలని చూడకు. ఒక్కక్షణం ఆగు! మాలతి వలన విరహాగ్నిని పొందిన తుమ్మెద నిన్ను చూసి అగ్ని అనుకుంటుంది.
3.
“భ్రమర భ్రమతా దిగంతరాళే క్వచి దాస్వాదిత మీక్షితం శ్రుతంవా
వద సత్య మపాస్య పక్షషాతం యది జాతీకుసుమానుకారి పుష్పమ్”
ఓ తుమ్మెదా! దిగంతరాళాలన్నీ తిరుగుతుంటావు కదా! ఎక్కడైనా జాతికుసుమం (జాజిపువ్వు) లాంటి పువ్వుని చూశావా? విన్నావా? ఆస్వాదించావా? పక్షపాతం లేకుండా నిజం చెప్పు.
4.
“కుసుమాని లిఖంతే నామ చిత్రే కతిచి త్కారువిశేషరూఢ శిక్షాః
సురభిత్వ మమూని కిం న లభన్తే కిముచైతేషు రసం పిబన్తి భృంగాః”
బొమ్మలు గీసే చిత్రకారులు ఎన్నెన్నో పువ్వల్ని అందంగా చిత్రిస్తారు కదా! కానీ ఆ పూలకు పరిమళం ఉంటుందా? ఆ బొమ్మ పూలలో తేనెని తుమ్మెదలు తాగగలవా?
5.
“కిం మాలతీం మాయసి మాం విహాయ చుచుంబ తుంబీకునుమం షడంఘ్రి:
లోకే చతుర్చి శ్చరణైః పశు స్స్యాత్ స షడ్భి రత్యన్త పశు ర్నకింస్యాత్”
ఆరు కాళ్ళున్న తుమ్మెద మాలతీ పుష్పాన్నీ, నన్నూ వదిలేసి తుమ్మిపూలను ముద్దాడుతోంది. ఆ తుమ్మెదకు కొంచెమైనా బుద్ది ఉందా! నాలుగు కాళ్ళున్న వాటిని పశువులంటారు. ఈ ఆరుకాళ్ల తుమ్మెద అంతకంటే అధమం.
“వీనిని గూర్చి విమర్శింపవలె నన్న నెంతేని చేతినిండ పని కలుగగలదు. కాని యివన్నియు తుఖ్ఖాదేవీ కృతములు కావనియు, రెండు వల్లభ దేవుని సుభాషితాలయందును, ఒకటి ముకుళభట్టు అభిధావృత్తి మాతృక యందును కనబడుచున్న వనియు శ్రీ ఆండ్ర శేషగిరిరావు ఆంధ్రవిదుషీమణులలో బయల్పరచిరి. ఇక రెండు మిగిలినవి. స్త్రీ కర్తృకము లగునో కాదో యని సందియమున కెడమిచ్చిన వీని విమర్శనకే కాలము వ్యయింపనేల? ఎప్పటికై న కాలము నిర్ణయించు నని యోపిక వహింతము” అన్నారు లక్ష్మీకాంతమ్మ.
కృష్ణదేవరాయల పుట్టుక, కులం, భాష, పెళ్ళిళ్ళు, పరిపాలనకు సంబంధించిన కథలన్నీ ఇంచుమించు పుక్కిటి పురాణాలుగానే కనిపిస్తాయి. ఈ కల్పిత గాథల్లో రాయలు తుఖ్ఖాల సంసార వ్యవహారం కూడా ఒకటి.
సౌర వంశానికి చెందిన రాజ వంశస్థుడిననే భావన ప్రతాపరుద్రదేవుడిలో ఉండి ఉంటుంది. తన అహాలన్నీ చంపుకుని చైతన్యమహాప్రభుకు సాష్టాంగపడి, తనని తానే సమర్పించుకున్న ఆ చక్రవర్తికి తాను సూర్యవంశ క్షత్రియుణ్ణనే అహం మిగిలి ఉన్నదా.. అంటే ఆశ్చర్యమే! రాయలవారి చుట్టూ ఆవరించి ఉన్న కట్టుకథల్ని ఆయనా నమ్మి ఉండవచ్చు. కృష్ణదేవరాయలు అన్ని విధాలా శూద్రుడు, తక్కువ కులానికి చెందిన సైన్యాధిపతి మరియు దాసి (సేవకురాలు) యొక్క ప్రణాళిక లేని సంతానం లాంటి కథలు ఆయన బుర్రలో బలంగా నాటుకుని ఉండవచ్చు.
కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రగజపతి ఇద్దరు గొప్ప విష్ణుభక్తులే! రాయలు రామానుజ సిద్ధాంతాలకు, ప్రతాపరుద్రగజపతి చైతన్యమహాప్రభు సిద్ధాంతాలకు అంకితమైన భక్తులు. ఇద్దరూ సాహితీ కళా ప్రియులు. కవులు కూడా!
కృష్ణదేవరాయల కథలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమించాయి. ఆయన్ని భోజుడితో సమానంగా ఆంధ్రభోజుడని కీర్తించాయి. కానీ, ప్రతాప రుద్రుడి కథలు చైతన్య మహాప్రభు చుట్టూ పరిభ్రమించాయి.
ప్రతాపరుద్రుడు చైతన్యమహా ప్రభును అమితంగా ఆరాధించాడు. చైతన్యప్రభువు పూరీ నుండి బృందావనానికి వెళ్ళినప్పుడు, ప్రతాపరుద్రుడు ఎంతగా విరహం పొందాడంటే, అప్పటికప్పుడు చైతన్యుని విగ్రహాన్ని తయారు చేయించి, గుడి కట్టించి, 54 మంది పూజారుల్ని నియమించి పూజలు చేయించాడు, అలాగే దాని నిర్వహణ కోసం పెద్ద భూమి ఇచ్చాడు. ఇప్పటికీ ఈ దేవాలయం పూజలందుకుంటోంది. ఇంతగా దాసోహం కావటాన ప్రతాప రుద్రుడి యశస్సు చైతన్యుడి ముసుగులో మరుగునపడిపోయింది.
1532లో చైతన్యమహాప్రభు మరణం తరువాత దుఃఖంలో కూరుకుపోయి, ఆ విషాదంలో రాజ్యాన్ని పాలనా వ్యవస్థనూ నిర్లక్ష్యం చేసి చివరికి గజపతి సామ్రాజ్యానికి చిట్టచివరి ప్రభువుగా మిగిలిపోయాడు ప్రతాపరుద్రగజపతి. రాయలవారు కూడా తన కుమారుడి మరణంతో దుఃఖసాగరంలో మునిగి మరణించాడు. శక్తీ, జ్ఞానం, ప్రతిభ మూడూ ఉన్నప్పటికీ ఈ రాజులిద్దరూ అంతిమ ఘడియల్లో స్వీయ నియంత్రణ కోల్పోయారు.
రాయలవారు ఆముక్తమాల్యదలో విష్ణుభక్తి ప్రచారం కన్నా సామాజిక చిత్రణ, పటిష్టమైన పాలనా వ్యవస్థ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత నిచ్చాడు. రాజనీతి గురించి రాయలవారు చెప్పిన పాఠాలు ఈ నాటికీ ప్రభుత్వాధినేతలు, మంత్రులు రాజకీయ నాయకులు తమ కార్యాలయాలో గోడలమీద రాసి పెట్టుకోవాల్సినవి. వాటికి బహుశా రాయలు జీవించి ఉండగానే అమిత ప్రాచుర్యం వచ్చి ఉండాలి! రాయలు జీవించి ఉన్నంత వరకూ ఆయన యశస్సు దేశ విదేశాల్లో పరివ్యాప్తం కావటం వలన వాణిజ్యంలో ఆయన ఆధిక్యత కొనసాగింది.
ప్రతాపరుద్రుడు కూడా సాహితీ ప్రియుడే! అతని రచనలుగా చెలామణిలో ఉన్న వాటిలో సరస్వతీవిలాసం, ప్రతాప-మార్తాండ, కౌస్తుక-చింతామణి, నిర్ణయ-సంగ్రహం వగైరా ఉన్నాయి. కానీ, ఒరిస్సా చరిత్రకారులు వీటిలో సరస్వతీ విలాసం గ్రంథాన్ని లొల్ల లక్ష్మీధర పండితుడు వ్రాసిందేనని అంగీకరించారు. లక్ష్మీధర కవి తన ఇతర రచనల్లో సరస్వతీ విలాసాన్ని తన రచనగానే పేర్కొనటం తిరుగులేని సాక్ష్యం అయ్యింది.
రాయలతో సమానంగా రాజనీతిని వ్రాయగలనని అనిపించుకోవాలనే భావన ప్రతాపరుద్రుడిలో ఉండి ఉండటాన, దర్మశాస్త్ర గ్రంథం అయిన ఈ సరస్వతీ విలాసాన్ని తన రచనగా ముద్ర వేయించుకునే ప్రయత్నం చేశాడు ప్రతాపరుద్రగజపతి. ఇవన్నీ ప్రతాపరుద్రుడు రాయలవారిపట్ల అసూయాగ్రస్థంగా ఉన్నాడనటానికి సాక్ష్యం.
సరస్వతీవిలాసం వ్రాసిన లొల్ల లక్ష్మీధరుడు ప్రతాపరుద్రుని ఓటమి తరువాత కృష్ణదేవరాయ ఆస్థానంలో చేరాడు. తుఖ్ఖాదేవితో పాటు అరణంగా వచ్చాడనేది ఒక ఐతిహ్యం!
ఈ వైరాలమధ్య అమాయకురాలు తుఖ్ఖాదేవి బలిపశు వయ్యిందనిపిస్తుంది. ఆముక్తమాల్యదలో రాయలవారు ప్రస్తావించిన మూడవరాణి అన్నపూర్ణ ఈ తుఖ్ఖాజీ ఒక్కరే అయినట్లైతే వారి కథ సుఖాంతం అయినట్టే!
తుఖ్ఖా పంచకం వ్రాసినంత మాత్రాన శ్రీ రాముడు సీతాదేవిని అడవులకు పంపినట్టు తుఖ్ఖాదేవిని రాయలవారు పరిత్యజించారనే వాదానికి చాలినంత తార్కాణం కాదు. ప్రతాపరుద్రగజపతి తెలుగు నేలపైన తన ఏలుబడిలో ఉన్న కోటలన్నింటినీ తుఖ్ఖాదేవికి పెళ్ళి కానుకగా ఇచ్చేశాడని ఒకవాదన ఉంది. కాబట్టి, ఆమె రాయలవారి సామంతురాలే!
రాయలవారు తుఖ్ఖాజీ కలుసుకున్నారో లేదో తెలీదు. అంతలో తెలుగు ప్రజలంతా మ్రాన్పడేలా రాయలవారు కాలం చేశారన్న వార్త హఠాత్తుగా వచ్చింది. తన అల్లుడైన కృష్ణరాయలు చచ్చిపోయిన విషాదంలో విజయనగరం ఉన్నప్పుడు సుల్తాన్ల కన్నా ముందే గజపతి విజయ నగరం మీదకు దాడి వచ్చాడని, ఈ తుఖ్ఖాజీయే తండ్రిమీదకు సైన్యాన్ని నడిపించి వీరపత్ని అనిపించుకుందని ఒక చాటువుంది. అంతఃపుర గాథలు జనంలో యధాతథంగా ఉండవు. గొప్పవారి గోత్రాల గురించి జనం అల్లుకునే కథలే ఎక్కువ! వాటిలో రాముడూ-రజకుడూ కథలూ ఉంటాయి.

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.