[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ రేమిల్ల అవధాని వెలువరించిన ‘ఊళ్లు నీళ్లు కన్నీళ్లు’ అనే వ్యాస సంపుటి సమీక్ష అందిస్తున్నాము.]


జర్నలిస్ట్ రేమిల్ల అవధాని ‘ది హిందూ’ పత్రికలో మల్లన సాగర్ నిర్వాసితుల గురించి వ్రాసిన వార్తా పరంపరల సంకలనం ఆంగ్లంలో ‘Reservoirs of Silence’ అనే పుస్తక రూపంలో ప్రచురితమైంది. ఈ పుస్తకానికి tag line – A Journalist’s Chronicle of Unheard Voices. అంటే వినిపించని స్వరాలను వినిపిస్తున్నాడన్న మాట జర్నలిస్టు. ఈ పుస్తకానికి రచయిత స్వయంగా చేసిన తెలుగు అనువాదం ‘ఊళ్లు. నీళ్ళు.. కన్నీళ్ళు..’. ఆంగ్లంలో ‘నిశ్శబ్ద జలాశయం’ తెలుగులో ‘ఊళ్లు. నీళ్ళు.. కన్నీళ్ళు..’గా మారింది.


ఆంగ్ల పుస్తకంలోని వ్యాసాలు పత్రిక కోసం రాసిన వార్తలు కావటంతో, మల్లన్న సాగర్ ఆలోచన ఆవిర్భవం నుంచి ఆచరణలోకి వచ్చిన విధానం, రాజకీయ నాయకుల వివరాలు, నిర్వాసితుల ఉద్యమం వంటి విషయాలను ఒక పద్ధతి ప్రకారం ప్రదర్శితమయ్యాయి. ఆంగ్ల పుస్తకానికి పరిచయ వ్యాసంలోనూ రచయిత పలు సాంకేతిక, గణాంక వివరాలను పొందుపరిచారు. ఈ వివరాలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి వివరంగా తెలుసుకునే వీలు కల్పిస్తాయి. ఆ తరువాత నిర్వాసితుల వ్యక్తిగత సమస్యలు, ఇక్కట్లు, వారు ఎదుర్కున్న ఇబ్బందులు వంటి వాటిని అవగాహన చేసుకునేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి.
తెలుగులో కూడా ‘ఇలా మొదలయింది’, ‘మల్లన్న సాగర్ రీ-డిజైనింగ్’, ‘ఎందుకీ పుస్తకం’ వంటి అధ్యాయాలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నేపథ్యం, అమలుపరిచిన విధానం, పోరాట స్వభావాన్ని పరిచయం చేస్తాయి. ఆంగ్ల రచనలో ఉన్న జర్నలిస్టు ధోరణి కన్నా, తెలుగులో మానవత్వపు దృష్టి ఆధారంగా ఉండటంతో తెలుగు పుస్తకం ఆంగ్ల పుస్తకానికి భిన్నంగా అనిపిస్తుంది.
ఈ పుస్తకం చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మల్లన్న సాగర్ నిర్మాణ నిర్వాసితుల పోరాటం గురించి తెలిసి ఉన్నా, ఈ పుస్తకంలో ఒక్కో కుటుంబం గురించి తెలుసుకుంటుంటే, ‘సత్యం’ అన్న పదంలో నిబిడీకృతమైన ఉన్న సాపేక్షత గ్రహింపుకు వస్తుంది. అప్పుడు ‘ఎందుకీ పుస్తకం’లో రచయిత మాటలు “మెజారిటీ సమూహం నిర్ణయాలే అమలు అవుతున్నప్పుడు, అది కూడా సమాజానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ప్రచారం జరుగుతున్నప్పుడు, అతి తక్కువ మంది, లేదా, అసలు నోరు లేని వారి వాదనలు కూడా ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత, అవసరం సభ్య సమాజంపై ఉందని నమ్మే వ్యక్తిగా ఈ ప్రయత్నానికి పూనుకున్నాను” అనటం వెనుక ఉన్న అర్థం, ఆవేదన, బాధ్యతల పట్ల అవగాహనలు బోధపడతాయి.
ఇందులో ఉన్న గాథలన్నీ చేదునిజాలు. వీటికి రచయిత ప్రత్యక్ష సాక్షి. ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నప్పుడు తాను ఎదుర్కున్న సమస్యలను, సవాళ్ళను అతి సున్నితంగా ప్రస్తావిస్తూ, దృష్టిని అసలు బాధితుల నుంచి మళ్ళకుండా చూడటంలోనే ‘నిజం’ చెప్పాలన్న నిజాయితీ మరింతగా ప్రస్ఫుటమవుతుంది.
సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ఆవశ్యకమైనా, ఆ ప్రాజెక్టుల వల్ల స్థిరాస్తులు కోల్పోయి, తామున్న ప్రాంతాలలోనే తాము నిర్వాసితులుగా, కాందిశీకులుగా బ్రతకాల్సి రావటం, కనీసం, వారికి అందాల్సిన నష్టపరిహారం కూడా సరిగా అందటం కోసం పోరాడాల్సి రావడం, ఇతర సమాజం వారిని అభివృద్ధి నిరోధకులుగా భావించి ఉదాసీనంగా ఉండటం ఆధునిక జీవితంలో ఒక అమానుషమైన దుర్భర విషాదం. దీనికి తోడు, తమ భూములను కోల్పోయినవారు కూలీలుగా జీవిక కోసం కష్టపడుతుండటం మరో విషాదం. ఈ విషాదాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అవధాని రచించిన ‘ఊళ్లు. నీళ్ళు.. కన్నీళ్ళు..’.
జర్నలిస్టు కావటంతో అవధాని రచనా శైలి ఎలాంటి ఆడంబరాలు, ఆభరణాలు లేకుండా నిజాన్ని సూటిగా చెప్తూ సాగింది. అది ఈ పుస్తకంలో ప్రదర్శించిన అంశాలను మరింత శక్తివంతం చేసింది. దీనికి తోడు అక్కడక్కడా రచయిత చెప్పిన చేదు నిజాలు సూటిగా మనసును తాకుతాయి. పోరాటం ఎంత సత్యమైనదీ, స్వచ్చమైనదీ అయినా, ప్రభుత్వ శక్తి ముందు మనిషి నిస్సహాయుడు, దుర్బలుడు మాత్రమే.
“ఏదైనా వ్యవస్థపై వ్యక్తులు పోరాటం చేయవలసి వచ్చినప్పుడు ఆ వ్యవస్థకు ఉన్నన్ని ఆర్థిక వనరులు వ్యక్తులకు సహజంగానే ఉండవు. దాంతో పోరాటంలో వ్యక్తులు నీరుగారిపోతారు. ఒక వ్యక్తి తాను గతంలో పని చేసిన లేక ఇప్పుడు పని చేస్తున్న సంస్థపై పోరాడే పరిస్థితి వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వంపై పోరాడవలసి వచ్చినప్పుడు కానీ ఎన్ని శక్తియుక్తులు సమకూర్చుకున్నా, సాధారణంగా ఓటమే ఎదురవుతుంది.”
పచ్చి నిజాలు ఈ మాటలు. పాలన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి గెలవటం, దాదాపుగా అసంభవం.
చాలామంది ‘రైతులకు పరిహారం వచ్చింది, కష్టం ఏమిట’ని ప్రశ్నిస్తారు కొందరు. వారికి కూడా ఈ పుస్తకంలో సమాధానం స్పష్టంగా లభిస్తుంది.
“పరిహారం వచ్చిన వాళ్ళల్లో చాలామంది దానిని పిల్లల పెళ్ళిళ్ళకు, చదువులకు, మిగిలిన అవసరాలకు వాడుకున్నారు. పాత బాకీలు తీర్చుకున్నారు. కొత్తగా ఎలాంటి ఆదాయమూ వచ్చే మార్గం లేదు. ఉన్న వనరులు అయిపోతున్నాయి. దాదాపు అందరిదీ ఇటువంటి పరిస్థితే.”
ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే భూమి విషయంలో మార్కెట్ విలువ వేరు, ప్రభుత్వం అధికారిక విలువ వేరు. మార్కెట్ విలువ లక్షల్లో ఉంటే, అధికారిక విలువ వందల్లో ఉంటుంది. మామూలుగా అమ్మితే లక్షల్లో ఆదాయం రావల్సిన చోట, ప్రభుత్వం వందలిచ్చి చేతులు దులుపుకుని భూములను తీసేసుకుంటే, రైతే కాదు, ఎవరికైనా ఎంతటి బాధ, జీవితాంతం మరవని, తగ్గని గాయం అవుతుందో ఊహించవచ్చు. అంటే పరిహారం లభించని వారిది ఒక వేదన అయితే, పరిహారం అందుకున్నవారిది ఇంకో రకమైన వేదన అన్న మాట.
అవధాని అందించిన ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఒక సందేహం కలుగుతుంది. సాధారణంగా ప్రపంచంలో, ఏ మూల ఏం జరిగినా, గొంతు చించుకుని, చొక్కాలు చింపుకుని నిరసనలు, ఉద్యమాలు చేసే ఆందోళన జీవులు; అన్యాయం, అక్రమం, ఘోరం, నేరం అంటూ కలాల కరవాలాలు విదుల్చుకుని కవితల చుండ్రుని సర్వత్ర వెదజల్లుతూ నినాదాల కవితల పుస్తకాల పరంపరను గుండెలు బాదుకుంటూ రాసి పారేసే ఆందోళన కవులు అంతా తమ ఇంటి ముంగిట, ఇంతటి ఘోరమైన విషాదం జరుగుతుంటే మౌనంగా ఉండటం, ఒక్కరూ గొంతెత్తక పోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆందోళన జీవుల ఆందోళనలు కూడా మతలబుల ఆందోళనలు, అది రాజకీయమైనా, సాహిత్యమైనా అనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు జర్నలిస్టులు, మీడియా వారంతా ముక్తసరిగా, కంటితుడుపుగా వినిపించిన అంశాన్ని, తన బాధ్యతగా సాటి మనిషి వేదనకు స్పందించిన, తన కర్తవ్యంగా భావించిన, హృదయమున్న జర్నలిస్టు అవధాని అని ఈ పుస్తకం నిరూపిస్తుంది. ఈ పుస్తకం ద్వారా, బాధ్యతగల జర్నలిస్టు పూనుకుంటే సమాజాన్ని మార్చలేకపోవచ్చు, కానీ నిశ్శబ్దంలో ఒదిగిపోయిన అభాగ్యుల స్వరాలను సమాజానికి వినిపించగలడని నిరూపిస్తుంది. ఇందుకు అవధాని అభినందనీయులు.
‘మల్లన్న సాగర్’ నిర్వాసితుల వ్యథ, మల్లన్న సాగర్ కథ తెలుసుకోవాలనుకునే వారంతా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలివి. ఇంగ్లీషు, తెలుగు తెలిసినవారు ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు చదివితే మరీ మంచిది.
అయితే, ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ, ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ‘జర్నలిస్టు అంటే నిర్వచించుకోవాల్సి ఉంది’ అనే వ్యాఖ్య మనసులో ఓ మారుమూల మెదులుతూనే ఉంటుంది.
***
Reservoirs of Silence
Remilla Avadhani
Pages: 111
Price: ₹ 200.00
~


రచన: రేమిళ్ల అవధాని
ప్రచురణ: రేమిళ్ల అవధాని
పేజీలు: 148
వెల: ₹ 100/-
ప్రతులకు:
రేమిళ్ల అవధాని, ప్లాట్ నెం. 312,
రోడ్ నెం. 26, జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3,
గోపన్నపల్లె,
రంగారెడ్డి జిల్లా 500104
ఫోన్: 9440128377
ఆన్లైన్లో
https://www.amazon.in/-/hi/Remilla-Avadhani/dp/8190877526
~
శ్రీ రేమిల్ల అవధాని గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-remilla-avadhani/