[ఆంగ్లంలో శ్రీ అశ్మిత్ మాలిక్ వ్రాసిన కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
వసంత ఋతువు – ప్రేమను, త్యాగాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా మా అక్కని, ఆమె ప్రార్థనలని, ఆమె కాగితపు పడవలను నాకెప్పుడూ గుర్తుచేసే ఋతువు.
ఎనిమిది వసంతాల క్రితం, నేను, మా అక్క కలిసి కాగితపు పడవలు తయారు చేసి దగ్గర్లో అందమైన పువ్వులతో నిండిన పచ్చిక బయళ్ళ మధ్య ఉన్న చిన్న వాగులో వదిలేవాళ్ళం. మేము ఆ పడవ వెంట ఆ బయళ్ళల్లో పరుగెత్తేవాళ్ళం, కొన్నిసార్లు పడవలను అందుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళం. అంటే, అప్పుడు మేం పిల్లలం కదా! ఏదో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు చిన్న పాపలం. ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉండేది. కొన్నిసార్లు దగ్గు ఎంత ఎక్కువగా ఉండేదంటే, నొప్పి లేకుండా రెండు రోజుల పాటు మాట్లాడలేకపోయేదాన్ని. ఆ సమయంలో మా అమ్మమ్మ మమ్మల్ని బాగా చూసుకునేది. మాకు ‘గ్రానీస్ మాజికల్ రెసిపీ’ లాంటి సూప్ ఇచ్చేది. అక్కా, నేను క్రాఫ్ట్ పేపర్‌తో పడవలు తయారు చేసుకుని ఒకరివి ఒకరు మార్చుకునేవాళ్ళం. నేను తన పడవను నీటిలో వదిలితే, తను నా పడవను నీటిలో వదిలేది.
ఒకే ఒక్క తేడా ఏమిటంటే, నేను ఏదీ తయారు చేయలేకపోవడం. మా అక్క ఎప్పుడూ, నాకు కాగితం పడవ ఎలా తయారు చేయాలో నేర్పించేది, కానీ ఆ విద్య నాకు ఎప్పుడూ పట్టుబడలేదు. కాగితం పడవ తయారు చేయడంలో నాకు సహాయం చేసి, అది నాదే అనుకుని తను కూడా దాన్ని నీటిలో వదిలేది. కానీ నిజానికి అది నాది కాదు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ, జీవితం బాగానే ఉండేది. కానీ ఒక రాత్రి మా అమ్మమ్మ మా అక్క పడుకుని ఉన్న మరో గది వైపు పరుగెత్తుకుంటూ రావడంతో నాకు మెలకువ వచ్చింది. అక్క ఆరోగ్యం బాగా పాడైంది. నాకు భయమేసింది. ఎలా సహాయం చేయాలో తెలియలేదు. బల్లకి ఉన్న ట్రేలో కొన్ని పేపర్‌క్రాఫ్ట్స్ ఉండటం చూసి, వాటితో కాగితపు పడవను తయారు చేయడానికి ప్రయత్నించాను.
మరోసారి. సరిగ్గా మా అక్క నాకు నేర్పినట్లే.
నేను కాగితాన్ని జాగ్రత్తగా, ఖచ్చితత్వంతో, ప్రేమతో, ఆశతో, అన్నింటికన్నా ముఖ్యంగా నా ప్రార్థనతో ఎంతో కష్టపడి మడిచాను. కాగితపు చివరి మడతతో నేను చివరకు దాన్ని సరిగ్గా చేయగలిగాను. కనీసం కొంతవరకైనా.
మా అక్క చాలా సంతోషపడి, బాగుపడి, చివరికి నా గురించి గర్వపడుతుందని ఆశతో, దాన్ని చూపించడానికి నేను తన దగ్గరికి పరుగెత్తుకెళ్లాను.
కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తను నిశ్చలంగా ఉంది. దగ్గు లేదు. తన పక్కన నిల్చుని ఉన్న అమ్మమ్మ ఏడుస్తోంది.
***
మా అక్క నా కోసం చేసిన ఆ కాగితపు పడవలు ఒక రకమైన ప్రార్థన అని నాకు, ఇప్పుడు, పెద్దయ్యాక అనిపిస్తుంది. మా అక్క నా కోసం చేసిన ఆ కాగితపు పడవలే నా ప్రాణాన్ని కాపాడాయి.
నేను కూడా అలాగే చేయలేకపోయాననే విషయం నన్ను ఇప్పటికీ బాధిస్తుంది, వెంటాడుతోంది. తన కోసం ఒక కాగితపు పడవను తయారు చేసి, ఆ కాగితపు పడవను నా ప్రార్థనలతో నింపాను. సోఫా పక్కన ఉన్న టేబుల్ అరలో ఆ ప్రార్థనల నిధి ఇప్పటికీ నా దగ్గర ఉంది.
బయట అందాల పూలకారులో పూలన్నీ వికసించగా, మా ఇంట్లోని అత్యంత సుందరమైన పువ్వు వాడిపోయింది.
కానీ ఆ పూవులో ఒక భాగం మిగిలిపోయింది. అదే నేను.
నా మనసులోని వసంతం వడలిపోయింది.
ఆంగ్ల మూలం: అశ్మిత్ మాలిక్
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
(ఆంగ్ల మూల కథని ఈ లింక్ లో చదవవచ్చు.)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
