ఇతరులను మోసం చేసి తాను ఆనందిస్తే స్వార్థం. మరి తనని తాను మోసం చేసుకుంటూ అదే ఆనందం అనుకుంటేనో…
ఆత్మవంచన! ఆత్మవంచన అన్నింటికన్నా మహా పాపం.
అబద్ధాల ఇటుకలతో నిర్మించే ఆత్మవంచనా భవనానికి పునదులుంటాయా? అవి కలకాలం నిలుస్తాయా?
***
1990వ సంవత్సరం అది…
బడి గంట కొట్టారు.
పిల్లలంతా, పది పన్నెండు లోపు వాళ్ళే, విముక్తి పొందిన ఖైదీల్లా గేట్లోంచి పరిగెత్తుకొస్తున్నారు.
మాళవిక నీరజతో కలసి నడుస్తోంది.
అమ్మవారి గుడి ముందున్న రావిచెట్టు దగ్గరరికి రాగానే నీరజ “ఆగు… ఇప్పుడే వస్తా” అంటూ చెప్పులు వదిలి, పరికిణీ కుచ్చిళ్ళు పైకి పట్టుకుని చెట్టు దగ్గరకి పరిగెత్తింది.
మాళవిక ఆమె చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించింది.
నీరజ ఓ పెద్ద రాయి మీద చిన్న రాయి పెట్టి, భక్తిగా కళ్ళు మూసుకుని నమస్కరించింది. ఆ తరువాత వుషారుగా మాళవిక దగ్గరికి పరిగెత్తుకొచ్చింది.
“ఎందుకలా చేసావు?” అడిగింది మాళవిక.
“అలా చేసి మనసులో కోరికలు తీర్చమని అడిగితే అమ్మవారు తీరుస్తుంది” ఎంతో నమ్మకంగా అంది నీరజ.
“అయితే… ఆగు!” అంటూ మాళవిక కూడా వెళ్ళి అలాగే చేసి వచ్చింది.
మాళవిక రాగానే నీరజ ఎంతో ఉత్సాహంగా “నువ్వేం కోరుకున్నావు?” అని అడిగింది.
“నువ్వు ఏం కోరుకున్నావో ముందు చెప్పు” అంది మాళవిక.
“రేపు లెక్కల పరీక్షలో మంచి మార్కులు రావాలని!” చెప్పింది నీరజ.
“వస్తాయా?”
“ఆ! అమ్మవారు చాలా మహిమ గల తల్లి”
“చూద్దాం!”
“మరి నీ సంగతో… నువ్వేం కోరుకున్నావు?”
“రేపు లెక్కల పరీక్షలో నీ దగ్గర నన్ను కాపీ కొట్టనివ్వకపోతే మీ అమ్మ చచ్చిపోవాలని!”
“ఆ!!!” నీరజ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.
“ఏం… చూపిస్తావా?” అడిగింది మాళవిక.
నీరజ ఏడుపు గొంతుతో “అలా ఎందుకు కోరుకున్నావు?” అంది.
“నీలా మంచి మార్కులు రావాలని కోరుకున్నా నాకు రావు కాబట్టి” అంది మాళవిక.
నీరజ కన్నీళ్ళు తుడుచుకుంటూ, “అలాగే చూపిస్తాను… ఇంకెప్పుడూ అలా కోరుకోకే!” అని బ్రతిమాలింది.
“సరే!” అభయం ఇస్తున్నట్లుగా అంది మాళవిక.
నీరజ ఆ తర్వాత మాట్లాడకుండా నడిచింది.
‘భయపడటం దాని చాతకానితనం… దాన్ని వాడుకుని లాభం పొందడం నా తెలివి… ఇందులో మోసం లేదు! మనుషులు ఇంత అవివేకంగా ఎందుకు ప్రవర్తిస్తారో?’ అనుకుని నవ్వుకుంది మాళవిక.
అప్పుడామె వయసు పదేళ్ళు!
ఇరవై సంవత్సరాల తర్వాత…
రిప్ వేన్ వింకిల్!!! అనుకుంది మాళవిక.
చిన్నతనంలో చదువుకున్న కథ గుర్తొచ్చింది.
పీపాలో వున్న అతి పాత ద్రాక్షసారా త్రాగి వందేళ్ళు నిద్రపోతాడు అతను. లేచి వూళ్ళోకి వచ్చేటప్పటికి ఎవరూ గుర్తు పట్టరు, అతని పేరు చెప్తే. ఆ పేరు గల వ్యక్తి తన ముత్తాత ఒకడుండేవాడంటుంది ఒక అమ్మాయి! అద్భుతమైన రచనా చతురత. సారా త్రాగి వందేళ్ళు నిద్ర పోవడం. నవ్వుకుంది మాళవిక.
“ఇంజన్ వేడెక్కిపోయిందమ్మా… నీళ్ళు తీసుకొస్తాను” అన్నాడు కారు డ్రైవర్.
“ఆ!” అంది నిర్లక్ష్యంగా.
గాలికి ముంగురులు నుదుటి మీద మూగి చిరాకు పెడ్తున్నాయి. చాలా సేపటి నుండీ ముడుచుకు కూర్చోవడం మూలాన కాళ్ళు నెప్పులు పెడ్తున్నాయి. కాసేపు దిగి క్రింద నిలబడాలనిపించింది.
దిగి చుట్టూ చూసింది.
డ్రైవర్ ఓ పాక హోటల్ దగ్గరకి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నాడు.
అక్కడ చెక్క బెంచీల మీద కూర్చున్న కుర్రాళ్ళు డ్రైవర్ని ఏదో అడుగుతున్నారు.
మాళవిక తలకి కట్టుకున్న స్కార్ఫ్ తీసి జుట్టు సవరించుకుంటూ వుండగా, ఆ కుర్రాళ్ళు తన వైపు రావడం కనిపించింది.
“మీరు… మీరు ప్రసిద్ధ రచయిత్రి మాళవిక గారాండీ!” ఆనందంగా అడిగాడు ఓ కుర్రాడు.
ఆమెకి ఇది అలవాటే. తల వూపింది.
“మీ ఆటోగ్రాఫ్ కావాలండీ!” అతను జేబు లోంచి ఓ కాయితం తీస్తూ అన్నాడు.
ఆమె ఆటోగ్రాఫ్ చేసి ఇస్తూ వుండగా, మరో నలుగురు చుట్టూ మూగారు. రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు.
డ్రైవర్ వచ్చి “మీరు లోపలికి వెళ్ళండమ్మా… ఊర్కోండయ్యా… వెళ్ళి మీ పని చూస్కోండి” అంటూ వాళ్ళని అదిలించాడు.
మాళవిక కార్లో కూర్చుని అనుకుంది ‘ఈ గుర్తింపు కోసం… పాపులారిటీ కోసం నేనెంత తపన పడ్డానో నా ఒక్కదానికే తెలుసు!’
“ఈ సన్మానాలూ… అభినందన సభలూ మన వూళ్ళోనే పెట్టాలని చెప్పాలండమ్మా మీరూ!” డ్రైవర్ కారు స్టార్టు చేస్తూ అన్నాడు.
మాళవిక మాట్లాడలేదు.
దాంతో డ్రైవర్ ఇంక సంభాషణ కొనసాగించే ధైర్యం చెయ్యలేకపోయాడు.
కారు నిర్మానుష్యాన్ని ఛేదిస్తూ దూసుకుపోతోంది. డ్రైవర్ ఆన్ చేసిన క్యాసెట్ ప్లేయర్ నుండి ఏవో బీట్స్‌తో కూడిన గందరగోళం మ్యూజిక్ వినిపిస్తోంది.
మాళవిక దూరంగా కనిపిస్తున్న కొండల కేసి చూస్తోంది. ఆ కొండల నడుమ గడిపిన తన బాల్యం గుర్తు చేసుకుంటోంది.
స్వంత ఊరు… కన్న తల్లీ… బాల్యంలో మధుర స్మృతులూ అపురూపం… అనిర్వచనీయం అంటూ అందరూ తెగ గోల పెట్టేస్తుంటారు, మరి నాకెందుకలా అనిపించదూ? అనుకుంది.
వర్తమానాన్ని అనుభవించలేని వాళ్ళు గతాన్ని స్మరించి అదే ఆనందం అనుకుంటారు… అనిపించింది.
తను వర్తమానాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుంది. భవిష్యత్తును ప్రేమిస్తుంది! మరింక గతంతో పనేమిటీ? ఏవుందా గతంలో?
కుక్కిమంచంలో పడుకుని ఆయాసంతో రొప్పుతూ, పిల్లికూతలు పెడ్తూ, వుండుండీ పెద్దగా “నే పోతున్నారోయ్…” అని అరిచే బామ్మా… వీధి అరుగు మీద పిల్లల్ని కూర్చోపెట్టుకుని ప్రైవేట్లు చెప్తూ లోపలికి తొంగి చూసి విసుక్కునే నాన్నా… దిగుళ్ళన్నీ తన మీదనే వేసుకుని భరించడానికే పుట్టినట్లుగా భుజాలు ఒంగిపోయి పొయ్యి దగ్గర కూర్చునే అమ్మా… ఏం తీపి సంగతులు నెమరేసుకోనూ? అనుకుంది మాళవిక.
మాళవికకి నందిని గుర్తొచ్చింది. నందిని మాళవిక చెల్లెలు. ఎప్పుడూ పుస్తకం పట్టుకుని చదువుకుంటునో, అమ్మ దగ్గర కూర్చుని పని చేస్తూనో కనిపించేది. తను అది కావాలీ… ఇది కావాలీ… అని అమ్మానాన్నల దగ్గర హఠం చేస్తుంటే అది మాత్రం ఒద్దికగా నిలబడి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుండేది! నందిని తన కన్నా అందమైనది, ఓ ఛాయ ఎక్కువ! తన కన్నా ముందు ఎస్.ఎస్.సి. పాసయింది! తన కన్నా ముందు పెళ్ళి చేసుకుంది… త్వరలో తల్లి కూడా అవుతుంది. అందులో ఏవుంది కష్టం? నవ్వుకుంది.
కారు ఆగగానే కొంతమంది పూలదండలతో ఆమెకి ఎదురొచ్చి ఆహ్వానించారు.
‘కుమారి మాళవిక సన్మాన సభ’ అని వెనుక బ్యానర్ కట్టారు. అక్కడికి దగ్గరే అవుట్ డోర్ షూటింగ్లో వున్న ఓ సినిమా ఏక్టర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్.ఎల్.ఎ. గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా వచ్చారు. ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసే సాంస్కృతిక సంస్థ చిన్న పిల్లల చేత నృత్య రూపకం చేయిస్తోంది.
స్టేజి మీద ఆమె పక్కనే కూర్చున్న ఓ ప్రసిద్ధ జ్యోతిష్కుడు ఆమె మీదకి వంగి ఆమె భవిష్యత్తు చెప్పేస్తున్నాడు! ఆమె చేతిని సాధ్యమయినంతగా నలిపేస్తూ.
ఈ ఊళ్ళో నా విద్యార్థి జీవితం గడిపాను… అనుకుని జనం వైపు చూసింది మాళవిక. మొదటి వరుసలో కూర్చున్న వృద్ధుడిని తన స్కూల్లో తెలుగు మేస్టారుగా గుర్తించింది. ఆయన చాలా ఆసక్తిగా ముందుకి వంగి కూర్చున్నాడు.
అందరూ మాళవిక వ్రాసిన ‘ఓ స్త్రీ… మేలుకో!’ పుస్తకాన్ని సమీక్షించి మాట్లాడుతున్నారు. ఆమె ‘న భూతో న భవిష్యత్ రచయిత్రి’ అని పొగుడుతున్నారు.
“స్త్రీ వాదం ఆమె వూపిరి… స్త్రీ స్వేచ్ఛ ఆమె జీవిత ధ్యేయం… ఇలాంటి మాళవికలు ఇంకా ఎందరో తయారవుతేకానీ స్త్రీలలో చైతన్యం పుట్టదు! స్త్రీలల్లో అణగారిన జ్ఞాన జ్యోతి ప్రచండంగా వెలుగొందదు!” అని ఆవేశంగా ఉపన్యసించారు.
చివరిగా మాళవిక మాట్లాడింది. “భారతదేశం ఇంతగా వెనుకబడి వుండడానికి కారణం పురుషాహంకారమే! స్త్రీ తనని తాను తెలుసుకుంది. సృష్టికి మూలస్తంభం అయిన తన మీద జరిపే అరాచకాలనీ, దౌష్ట్యాలనీ ఇక నుండీ భరించదు! దగా పడిన మహిళలూ… అన్నార్తులైన అక్కచెల్లెళ్ళూ ఇక వుండరు… స్త్రీ చైతన్యమే జన చైతన్యం… ఒక్క మహిళ విద్యావంతురాలైతే ఒక కుటుంబమే జ్ఞానవంతం అవుతుంది. స్త్రీ శక్తి స్వరూపిణి! నా రచనల ద్వారా స్త్రీకి ఆమె నడవాల్సిన బాట చూపిస్తాను… అనాదిగా పురుషుడి దురహంకారం ముందు తల వంచుకున్న స్త్రీ ఒళ్ళు విరుచుకుని ఆ శక్తిని ఎదిరించేటట్లు చేస్తాను” అని ప్రసంగాన్ని ముగించింది.
ఆడవాళ్ళు ఆపకుండా చప్పట్లు కొట్టారు.
పురుషులు కూడా మర్యాదకి మెచ్చుకున్నట్లు తల వూపారు.
మాళవికకి సన్మానం జరిగింది.
ప్రెస్ వాళ్ళ వైపు చూసి మాళవిక చిరునవ్వులు చిందించింది. ఇదంతా ఓ టీ.వీ. ఛానెల్ వాళ్ళు కవరేజ్ ఇచ్చారు. ఆ తర్వాత మాళవిక గెస్ట్ హౌస్‌కి వెళ్ళి తనకి కేటాయించిన రూంలో రిలాక్స్ అయింది.
వాసుదేవరావు లోపలికి వచ్చాడు. అతను ‘సంపెంగ’ పత్రిక ఎడిటర్.
“ఉష్… ష్… అబ్బా ఏర్పాట్లూ అవీ చూసేసరికీ బాగా అలసిపోయాను” అన్నాడు.
మాళవిక మర్యాదకి కూడా లేవలేదు!
“అంత కష్టపడ్డారా?” అంది పడుకునే.
వాసుదేవరావు జవాబు చెప్పలేదు. అతని దృష్టి ఆమె గుండెల మీద పడింది. పైట స్థానభ్రంశం చెంది అవి తల వంచని మేరు నగాల్లా ధాటిగా వున్నాయి.
“ఏమిటా చూపు?” కవ్విస్తున్నట్లు నవ్వింది మాళవిక.
వాసుదేవరావు కళ్ళతో మాట్లాడాడు.
“సీరియల్ సంగతేం చేసారు? మిగతా వాళ్ళకిచ్చినంతే ఇస్తే నేను వ్రాయను” అంది.
“నీకూ వాళ్ళకీ పోలికా?” వాసుదేవరావు కళ్ళల్లో కోరిక చారికై వెలిసింది.
“కొత్త ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను” చెప్పింది మాళవిక.
“రేపే ఆఫీసుకొచ్చి ఎడ్వాన్స్ తీసుకో!” ఆమె పాదాల మీద చెయ్యి వేస్తూ అన్నాడు.
“ఏవిటా తొందరా… తలుపు గడియ పెట్టకుండా?” అంది.
అది గ్రీన్ సిగ్నల్‌గా భావించి అతను చప్పున తలుపు వైపు వెళ్ళాడు.
ఇంతలో తలుపు తోసుకుని ఓ ముసలాయిన లోపలికి వచ్చేసాడు. ఆయన వెనకాలే వచ్చిన ఓ అబ్బాయి కంగారుగా… “మేడంగారు రెస్ట్ తీసుకుంటున్నారూ… ఇప్పుడు కలుసుకోవడం కుదరదు అంటున్నా ఈ ముసలాయిన వినిపించుకోకుండా లోనికి తోసుకోచ్చేస్తున్నాడండీ” అన్నాడు.
వాసుదేవరావు కోపంగా, “ఇప్పుడు ఆవిడ మాట్లాడరండీ” అన్నాడు.
మాళవికకి తెలుగు మేస్టారు కనపడగానే, ఆమె లేచి నిలబడింది.
“ఆయనను రానీయండి” అంది.
ఆయన చిరుగుల పంచని జాలిగా చూస్తూ… ‘తన స్టూడెంట్ ఇంత గొప్పదై పేరు ప్రఖ్యాతులు పొందుతున్నదంటే గురువుకి గర్వం కదా! పాపం… కాసేపు మాట్లాడదాం’ అనుకుంది.
వాసుదేవరావు తన చిరాకుని దాచుకోకుండా, “రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళండి” అన్నాడు.
ఆయన ముందుకి వచ్చి “అమ్మా… నా పేరు సీతారామయ్య. ఇక్కడ హైస్కూల్లో తెలుగు మేస్టారుగా పని చేసి రిటైరయ్యాను” అన్నాడు.
ఆయన తనని గుర్తించలేదని మాళవికకి తెలిసింది.
“నాకు తెలుసు… నేను మీ స్టూడెంట్‌నే! కలెక్టర్ ఆఫీసులో మా నాన్నగారు పనిచేసేవారు… ఆయన పేరు శ్రీనివాసరావు. నేను మాళవికని… కాశీపతి గారి నీరజ పక్కన కూర్చునేదాన్ని!” అని ఆయనకి గుర్తు చేసింది.
“ఆ… నీరజ గుర్తుంది!” అన్నాడు వెంటనే.
మాళవిక ముఖం ఎర్రబడింది.
“చూడమ్మా… వయసు పైబడిన నాకు చూపుతో బాటు జ్ఞాపకశక్తి కూడా మందగించినట్లుంది. సరే నేను ఎందుకు వచ్చానంటే నేను నీ రచనలు కొన్ని చదివాను… నువ్వేదో స్త్రీ వాదం అనుకొని వ్రాస్తున్నావు. ఏ వాదం అయినా ఫర్వాలేదు కానీ వ్రాయడానికి భాష ముఖ్యం తల్లీ! ఇలా అన్నానని ఏమీ అనుకోకు. నువ్వు వ్రాసే కొన్ని పదాలు అసలు భాషలోనే వుండవు. అర్థాలు తెలుసుకొని ప్రయోగించాలి. చదువులు రాణి కచ్ఛపి నుండి అపస్వరాలు మ్రోగకూడదు”.
ఆ మాటలకి మాళవిక దెబ్బ తిన్నట్లుగా చూసింది.
ముందుగా వాసుదేవరావు తేరుకుని ఇంకా మాట్లాడ్తున్న ముసలాయనతో.. “సర్లే… వెళ్ళు… వెళ్ళి చిన్న పిల్లలకి పాఠాలు చెప్పుకో!” అని మెడ పట్టుకుని గెంటెయ్యబోయాడు.
ఆయన విడిపించుకుని, “వెళ్తాను… వెళ్ళే ముందు ఇంకొక్క మాట! ఇందాక వాళ్ళు పొగిడినవన్నీ అబద్ధాలు.. నిజాలనుకుని భ్రమలో వుండకు. రచనలు సామాజిక స్పృహతో కూడుకున్న నిజాలై వుండాలి, అభూతకల్పనలు కాకూడదు! చివరిగా నాదో విన్నపం… ఇందాక చెప్పినట్లుగా ఎవరితోటీ నేను నీకు తెలుగు నేర్పిన పంతులనని మాత్రం చెప్పకమ్మా! ఏదో కాస్త తెలుగు పండితుడిగా పేరు తెచ్చుకున్నవాడ్ని… వస్తా!” అని వెళ్ళిపోయాడు.
మాళవిక దెబ్బ మీద దెబ్బ తిన్నదాన్లా అవాక్కయిపోయి చూస్తుండిపోయింది.
వాసుదేవరావు తలుపు గడియ పెట్టి ఆమె దగ్గరగా వస్తూ “అవన్నీ పట్టించుకోకు… ముసలాడు చాదస్తుడో, మతి చలించినవాడో అయి వుంటాడు” అన్నాడు.
మాళవిక విసుగ్గా బెడ్ మీద వాలి “నాకు మూడ్ బాగా లేదు” అంది.
“నేను సరి చేస్తాగా…” అల్మారా లోంచి సీసాలు గ్లాసులూ తీస్తూ అన్నాడు.
మాళవిక ఇంకో పది నిమిషాల్లో మూడ్ లోకి వచ్చింది
(ఇంకా ఉంది)
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
రచయిత్రి రమణి గారికి నమస్కారాలు. వైకుంఠపాళి చాలా ఆసక్తి కరంగా మొదలైంది. రెండో భాగం కోసం ఎదురు చూసేలా ఉంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మురళీ
అలనాటి అపురూపాలు-120
స్వప్న వీధిలో…
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-27
మరుగునపడ్డ మాణిక్యాలు – 42: యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్
ఏకాంతంలో ఎంతో ఉంది
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 26: కొల్లిపర
సాగర ద్వీపంలో సాహస వీరులు-3
శ్రీపర్వతం-53
తంబురా రక్ష!
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®