Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-29

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

సంగీతభారతి:

ప్రసారభారతిలో మూడు దశాబ్దాలు (1975-2005) వివిధ కేంద్రాలలో నేను పని చేయడం వలన కర్ణాటక హిందూస్థానీ సంగీత విద్వాంసులు పలువురితో సాన్నిహిత్యం లభించింది. రాజాశ్రయంగా ఒకప్పుడు పోషించబడిన సంగీతాన్ని స్వాతంత్రానంతరం ఆకాశవాణి, దూరదర్శన్‌‍లు ప్రోత్సహిస్తున్నాయి. ఆకాశవాణి సంగీత సమ్మేళనం పేర ఆరు దశాబ్దాలుగా ఏటా అక్టోబరు నెలలో ఒకే రోజు 16 కేంద్రాలలో ఆహుతులైన ప్రేక్షకుల సమక్షంలో సంగీత సభలు నిర్వహిస్తుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు, మరొక హిందూస్థానీ విద్వాంసుడు విద్యను ప్రదర్శిస్తారు. ఆ రికార్డింగులను, డిసెంబరు, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల నుండి ప్రసారం చేస్తారు. విద్యాంసులను ఎంపిక చేసేందుకు ఆకాశవాణి డైరక్టరేట్‌లో సంగీత విభాగం డైరక్టరు కసరత్తు చేసి లిస్టు తయారు చేస్తారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం విద్వాంసులు మహాద్భాగ్యంగా భావిస్తారు.

ఢిల్లీలో ఈమని శంకరశాస్త్రి కర్ణాటక సంగీత విభాగ డైరక్టరుగా పని చేశారు. హిందుస్థానీ విభాగానికి మరొక డైరక్టరు. నేను ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా 1997-2000 మధ్య పర్యవేక్షించినపుడు ఎందరో సంగీత విద్వాంసులను స్టూడియోలో స్వాగతించే అదృష్టం లభించింది.

ఈమని శంకరశాస్త్రిగారు

బిస్మిల్లాఖాన్ స్టూడియోకు సపరివారంగా విచ్చేశారు. ఇంటర్య్వూలో – విదేశాలకు అహ్వానం వచ్చినా ఉద్యోగ నిమిత్తం వెళ్లలేదనీ, ప్రతి రోజూ కాశీలో గంగానది వొడ్డున షెహనాయీ వాయించే అవకాశం అక్కడ లభించదన్నారు.

భారతరత్న పండిట్ రవిశంకర్‌ను వారి నివాసంలో కలిశాను. లోడీ ఎస్టేట్‌లో ప్రభుత్వం అలాట్ చేసిన క్వార్టర్స్‌లో వున్నారు. లోగడ ఆయన ఢిల్లీ కేంద్రంలో సంగీత విభాగ నిలయ విద్వాంసులు. డైరక్టరుగా నన్నెంతో ఆదరంగా పలకరించారు. ఇంతలో ఆయన శ్రీమతి వచ్చారు. ‘ఈమె మీ తెలుగువారే’ అని పరిచయం చేశారు.

1998 లో ఢిల్లీ ఆకాశవాణి స్టూడియోలో ఆశా భోస్లేతో రచయిత

ఆశా భోస్లేను ఢిల్లీ స్టూడియోలో రికార్డు చేశాము. లతా మంగేష్కర్ తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా కె.వి.రమణాచారి వున్న సమయంలో అన్నమాచార్య సంస్కృత కీర్తనలు రికార్డు చేశారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాద నీరాజనం వేదిక పై 2008లో జరిగింది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ FICCI ఆడియోరియంలో జరిగిన స్వాతంత్ర స్వర్ణోత్సవ సభలో కచేరీ చేశారు. రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ సభకు ముఖ్య అతిథి.

ఫిక్కి ఆడిటోరియంలో డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారితో రచయిత

రాజన్, సాజన్ బ్రదర్స్ హిందుస్థానీ దిగ్గజాలు. అనేక సభలలో ఆకాశవాణి పక్షాన కచేరీలు చేశారు. ఠీవీగా వేదికపై సభారంజకత్వం చేసేవారు. శుభా ముద్గల్, మీరా పండిట్, సుమిత్రా గుహ విదుషీమణులు. సుమిత్రా గుహ శోభారాజు జ్యేష్ఠసోదరి. బెంగాలీని వివాహమాడారు.

సంతూర్ వాద్యనిపుణులు శివకుమార్ శర్మ ప్రేక్షకాదరణ పొందిన సంగీత విద్వాంసులు. ఆకాశవాణిలో మా సహోద్యోగి డైరక్టర్ భజన్ సపూర్ సితార్ విద్వాంసులు. SVBC లో నేను పని చేస్తున్నప్పుడు 2009లో నాదనీరాజన వేదికపై ఆయన కచేరీ భక్తులను అలరించింది. హిందూస్థానీ విభాగ డైరక్టర్‌గా ఆకాశవాణిలో ఆయన ప్రముఖుడు.

తిరుమల నాదనీరాజన వేదికను గూర్చి ప్రస్తావించాలి. కె.వి.రమణాచారి ఆలోచనలో భాగంగా తిరుమల మహాద్వారానికి ఎదురుగా ప్రతి సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఏదో ఒక సంగీత కార్యక్రమం 2007 ఆగస్టు 15న వయొలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి కచేరీతో ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2009లో ఈవోగా ఐ.వై.ఆర్.కృష్ణారావు విచ్చేశారు. నాదనీరాజ వేదిక పై యావద్భారతం నుండి కర్ణాటక, హిందుస్థానీ విద్వాంసుల కచేరీలు రోజూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేను ఢిల్లీ వెళ్లి ఆకాశవాణి, దూరదర్శన్, సంగీత నాటక అకాడమీల, వద్ద వున్న సంగీత, నృత్య విద్వాంసుల పట్టిక దాదాపు 200 మందితో సమకూర్చాను. ప్రతి సవత్సరం ఆగస్టు 15న ఏ. కన్యాకుమారి వయోలిన్ కొనసాగుతోంది.

ఒక రోజు ప్రఖ్యాత గాయని శ్రీమతి అనూరాధా పౌడ్వాల్ తన బృందంతో కచేరీ చేశారు. వారికి పదివేల రూపాయల పారితోషికం ఇచ్చారు. దగ్గర నుండి నేను వారి బృందానికి సుముఖ దర్శనం చేయించాను. ఆమె భక్తితో హుండీ వద్దకు వచ్చి పదివేల చెక్కు అందులో వేసింది. మరో లక్షరూపాయలు విరాళంగా అన్నదానానికి సమర్పించింది.

ఆకాశవాణి కటక్ (బరిస్సా) కేంద్రంలో నిలయ విద్వాంసులుగా హరిప్రసాద చౌరాసియా నియమితులయ్యారు. అక్కడే అనౌన్సర్‌తో పరిణయమైంది. తర్వాతి కాలంలో సినీరంగ నేపథ్య సంగీతం సమకూర్చారు.

వేణుగాన నిపుణులైన ప్రపంచం సీతారాం తాజ్ హోటల్లో సంగీతం నేపథ్యంలో/ వేదిక మీది నుండి వినిపించేవారు. తరువాతి కాలంలో ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరి, విజయవాడ ఆకాశవాణి అసిస్టెంట్ డైరక్టర్ అయ్యారు. ఢిల్లీ డైరక్టరేట్‌లో సంగీత విభాగ డైరక్టరుగా పని చేశారు. ఆయన తర్వాత వాగేశ్ ఆ పదవి నధిష్ఠించారు. ఆయన గాత్ర సంగీతజ్ఞులు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇందిరా జగదాచారి సంగీత విభాగంలో ఆచార్యులు. ఇలా ఎందరో సంగీతజ్ఞులు.

ఎం. ఎస్. రామారావు స్వరపరచి గానం చేసిన సుందరకాండ లక్షలాది ఆకాశవాణి శ్రోతలను ఆకట్టుకొంది. పాలగుమ్మి విశ్వనాధం హైదరాబాదు కేంద్రంలో లలిత సంగీత విభాగ ప్రొడ్యూసరు. భక్తి రంజనికి సుందరకాండను రామరావుచే తయారు చేయించారు. వారిని కడపలో ఇంటర్య్వూ చేశారు. వారి కుమారుడు వైమానికదళంలో పని చేస్తూ అకస్మాత్తుగా కనుమరుగయ్యారు. ఆచూకీ లభించలేదు. 40 రోజులు ఆంజనేయ ఉపాసన చేయగా కుమారుడు సజీవంగా విచ్చేశాడని సజల నయనాలతో చెప్పారు. ఇప్పుడు రామారావు మనుమడు సుందరకాండను ప్రచారం చేస్తున్నారు.

నేను దూరదర్శన్‌లో పదవీ విరమణానంతరం అప్పటి ఈ.వో. ఏ.పి.వి. నారాయణశర్మ సౌజన్యంతో టి.టి.డిలో 2005 మే లో చేరాను. 2010 జూన్ వరకు ముగ్గురు ఈవోలు – నారాయణశర్మ, రమాణాచారి, ఐ.వై.ఆర్. కృష్ణారావులు – ముగ్గురు చైర్మన్లు – టి.సుబ్బరామిరెడ్డి, బి.కరుణాకరరెడ్డి, డి.ఆదికేశవులు నాయుడులు అప్పటి యంత్రాంగం, నేను SV దృశ్యశ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటర్‍గా మూడేళ్లు; 2005-2008 మధ్యలో రికార్డింగు ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కీర్తనలను వివిధ గాయనీ గాయకులచే పాడించి రికార్డు చేసి ఆడియో సి.డి.లు విడుదల చేశాము. శోభారాజు, బాలకృష్ణప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం ప్రభృత దేవస్థానోద్యోగులే గాక సుధా రఘనాదన్, నిత్య సంతోషిణి, లతా మంగేష్కర్ ప్రభృతులు వెయ్యి కీర్తనలు రికార్డు చేశారు. వి.సాయికృష్ణ యాచేంద్ర స్వరపరచారు. నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన సత్యనారాయణలు ఆ యజ్ఞంలో ఋత్విక్కులు. రికార్డు స్థాయిలో వెయ్యి కీర్తనలు వెలువడ్డాయి. అంతకు ముందు 20 సంవత్సరాలలో ప్రాజెక్టు నుండి 500 లోపు రికార్డు అయినాయి. ఆ క్యాసెట్ల అమ్మకం పెద్ద పని. ఆంధ్రా బ్యాంకు తదితర బ్యాంకులు కూడా సహకరించాయి.

దరిమిలా 2008 జూలైలో రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ SV భక్తి ఛానల్ ప్రారంభించారు. దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు, సారథ్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమం ఐదు సంవత్సరాలు ఎందరో వర్ధిష్ణులను ప్రోత్సహించింది. ఛానల్ టి.ఆర్.పి. రేటింగు పెరిగింది. కీరవాణి నేతృత్వంలో అదొక పండుగగా నిర్వహించారు.

హరికథా సామ్రాజ్యం:

హరికథకులకు ప్రోత్సాహమిస్తున్న సంస్థలలో ఆకాశవాణి ప్రథమం. వారానికొకసారి హరికథలు ప్రసారమవుతున్నాయి. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహులు. బుల్లి అబ్బాయిగా పేరొందిన యస్. బి. పి. బి. కె. సత్యనారాయణరావు హరికథా పాఠశాలను కపిలేశ్వరపురంలో స్థాపించి ఎన్నో ఏళ్లుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. తిరుమల దేవస్థాన సంగీత కళాశాలలో హరికథా డిగ్రీ కోర్సు నడుస్తోంది. వంగల పట్టాభి భాగవతార్, ముప్పరపు సింహాచలశాస్త్రి అద్యయన అధ్యాపనాలు కొనసాగించారు. విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అమెరికాలో విజయశ్రీ స్కూలు హరికథలు ఆన్‌లైన్‌లో 2020 ఫిబ్రవరిలో మొదలైంది.

ప్రముఖ హరికథా విద్వాంసులలో తెనాలికి చెందిన ములుకుట్ల సదాశివశాస్త్రి అగ్రగణ్యులు. రేడియో ఆర్టిస్టులుగా హరికథకులు ఆడిషన్ ప్యాసయి బి గ్రేడ్, బి హై గ్రేడే, ఏ గ్రేడు, టాప్ గ్రేడు పొందారు. విజిటింగ్ కార్డులు తయారు చేసుకుంటారు. ఇటీవలి కాలంలో కోట సచ్చిదానందశాస్త్రికి తొలిసారిగా హరికథలో పద్మశ్రీ ప్రకటించారు. ఆ తర్వాత డి. ఉమా మహేశ్వరి 2024లో పొందారు.

వీరగంధం వెంకటసుబ్బరావు హరికథలు శ్రోతలను అలరించాయి. నాగరత్నభగవతార్ 90వ దశకంలో ప్రముఖ కథకులు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి జయంతి సావిత్రి దేశవిదేశాలలో హరికథకు ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. విన్నకోట రామకుమారి ప్రముఖ కథకురాలు. రేడియో ఆర్టిస్టు.

గ్రామాలలో ఒకప్పుడు హరికథా సప్తహాలు జరిపిన కథకులు వార్షికంగా గ్రామస్థుల వద్ద తృణమో, ఫణమో కానుకగా స్వీకరించేవారు.

డా. ఎల్లా వెంకటేశ్వరరావు

తిరుపతి దేవస్థానం హరికథకులను గుర్తించి ఆయా దేవాలయాలలో అప్పుడుప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కథలు చెప్పే ఏర్పాటు చేస్తోంది. కె.వి.రమణాచారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కిన్నెర సాంస్కృతిక సంస్థ ద్వారా హరికథా సప్తాహం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క కథకునికి పదివేల రూపాయల పారితోషికం అందిస్తున్నారు. అనాదృతులైన కథకులను ఎంపిక చేసి రవీంద్రభారతి ఆరు బయట రంగస్థల వేదికపై కథలు చెప్పిస్తున్నారు. పండితారాధ్యుల సాంబమూర్తి (బాలు తండ్రి) గొప్ప కథకులు.

అంతరించిపోతున్న హరికథా కాలక్షేపాన్ని పోషించకపోతే ఆ అద్భత కళ కనుమరుగు కాగలదు. కపిలేశ్వరపురంలో శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల 1973లో ప్రారంభించబడి నడుస్తోంది. ఉపాధి కల్పనలో మహిళలకు ప్రత్యేకం. నిట్టల శ్రీరామచంద్రమూర్తి ఈ పాఠశాలకు ప్రస్తుతం కరస్పాండెంటు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version