వెన్నెల సాహితీ సంగమం, సిద్ధిపేట ఆధ్వర్యంలో 23 మార్చ్ 2025 సిద్ధిపేట శివానుభవ మండపంలో ఉగాది కవిసమ్మేళనం నిర్వహించబడింది.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహిత్య విమర్శకులు కస్తూరి మురళీకృష్ణ ప్రసంగిస్తూ, సంఘర్షణ లోంచి పెల్లుబికిన భావావేశాన్ని అక్షర రూపంలో వ్యక్తపరుస్తే, అది కవిత్వమవుతుందని అన్నారు.
వంగర నరసింహారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, తెలుగు సాహిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలలా విస్తరించి విశ్వవేదికపై ఆవిష్కరించబడటం సంతోషకర పరిణామమని తెలిపారు.


చెట్టువేళ్ళు భూమిలో వున్నంతవరకే వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఫలపుష్పాలను పంచుతుందని, భారతీయ ప్రాచీన సాహిత్యం తల్లివేరులాంటిదని, ప్రాచీన సాహిత్య అధ్యయనం ద్వారానే, సమగ్రమైన సాహిత్యాన్ని సృజియించవచ్చని తెలిపారు. చిక్కనైన కవిత్వాన్ని రాస్తూ తెలుగు సాహిత్యం సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేయాల్సిన భాద్యత ఈ తరం కవులపై వుందని సూచించారు.
విశిష్ఠ అతిథిగా హాజరైన తెరవే, రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి మాట్లాడతూ కవిత్వాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి, కవులు నిరంతరం ప్రజాపక్షం వహించి రచనలు చేయాలని, పీడితుల గొంతుక అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రశంసల కోసం సృజియించే కవిత్వం ఎంతోకాలం నిలబడదని, ప్రజలకోసం రచించిన సాహిత్యమే కలకాలం నిలిచి వుంటుందని తెలిపారు. వెన్నెల సాహితీ సంగమం కొత్త కవులకు వేదిక ఏర్పాటు చేసి ప్రోత్సాహించడం అభినందనీయమన్నారు.
అనంతరం జరిగిన కవిసమ్మేళనంలో డెబ్బైమంది కవులు కవితాగానం చేశారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులకు సొప్పదండి విద్యాసాగర్, సౌజన్యంతో సురవరం ప్రతాపరెడ్డి స్మారక సాహిత్య పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వంగర నరసింహారెడ్డి, పర్కపెల్లి యాదగిరి, మహమూద్ పాషా, మోరమోహన్, త్రివిక్రమ్ శర్మ, మహిపాల్, మహేందర్, సుధాకర్, ఉమాశంకర్, పరకాల రవీందర్, శ్రీధర్, సుజాతాప్రసాద్, వనితారాణి, నర్సింలు, ఎడ్లలక్ష్మి, వర్కోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, ఎలికట్టె అయిలయ్య, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
వెన్నెల సాహితీ సంగమం ప్రతినిధి