[సెప్టెంబర్ 15, ప్రఖ్యాత సినీదర్శకులు శ్రీ కె.వి. రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]
బాల టామ్ సాయర్గా..
కె.వి. రెడ్డి అనే కదిరి వెంకటరెడ్డి సొంతవూరు అనంతపురం జిల్లా, తాడిపత్రికి దగ్గరలోవున్న తేళ్ళమిట్టపల్లి గ్రామం. కె.వి. రెడ్డి తండ్రి కొండారెడ్డి ఆ వూరి మునసబు.. నూట యాభై ఎకరాల భూస్వామి. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ గ్రామంలో చదవను, రాయను నేర్చింది కొండారెడ్డి ఒక్కరే. కె.వి. రెడ్డి ఆయనకు ఏకైక సంతానం. కె.వి. రెడ్డి తల్లిది తాడిపత్రి. వారిది కూడా సంపన్న కుటుంబమే. అందరూ విద్యావంతులే. కె.వి. రెడ్డి మాతామహుడు తహసిల్దారు వుద్యోగం చేశారు. కె.వి. రెడ్డి పుట్టింది తాడిపత్రిలో మాతామహుల ఇంటనే. ఆయనకు రెండేళ్ళ వయసున్నప్పుడే తండ్రి కొండారెడ్డి కాలం చేశారు. దాంతో కె.వి. రెడ్డి తల్లి తాడిపత్రిలోని మాతామహుల ఇంటికి వచ్చేశారు. కె.వి.రెడ్డి చదువు సంధ్యలు మేనమామ పర్యవేక్షణలో తాడిపత్రిలోనే జరిగాయి. భర్త మరణించడంతో తట్టుకోలేని కె.వి.రెడ్డి తల్లి వైరాగ్యం చెంది కుమారుని పెంపకం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయినా కె.వి.రెడ్డి బాల్యం ఆహ్లాదకరంగానే సాగింది. మార్క్ ట్వేన్ నవల లోని టామ్ సాయర్ పాత్ర లాగే ఈతకొట్టటం, చేపలు పట్టటం, కొండలెక్కటం, పొలాలమీదకు వెళ్లి అజమాయిషీ చెయ్యటం వంటి పనులు కె. వి. రెడ్డి యెంతో ఆసక్తికరంగా చేసేవారు. శ్మశానానికి వెళ్లి ఎముకలు ఏరుకొనివచ్చి వాటిని పరిశోధించేవారు. స్కూలు ఫైనల్ వరకు కె.వి.రెడ్డి తాడిపత్రిలోనే చదివారు. నాలుగవ తరగతి మొదలు స్కూలు ఫైనల్ వరకు కె.వి. రెడ్డికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు మూలా నారాయణ స్వామి. ఇద్దరూ ఒకే బెంచిలో కూర్చోనేవారు. ఇద్దరికీ చాలా పెద్ద పెద్ద పనులు చేయాలనే ఊహలు ఉండేవి. చిన్నతనంనుంచే అందుకోసం ప్రణాళికలు రచిస్తూ గడిపేవారు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఆ వూరికి సినిమా హాళ్లు కూడా వచ్చాయి. మిత్రులిద్దరూ సినిమాలు చూసేవారు. ఆ సినిమాల తీరు వారికి వింతగా తోచేది. ఎప్పటికైనా సినిమాలు నిర్మించాలని ధృడంగా నిశ్చయించుకున్నారు. పదిహేనేళ్ళ వయసులోనే సినిమా నిర్మాణంకోసం లొకేషన్ కూడా నిర్ణయించేశారు. వారి వూరికి ఐదు మైళ్ళ దూరంలో ఒక చిన్న కొండ, దాని ప్రక్కనే ఒక లోయ, ఆ లోయ మధ్యలో చిన్న నీటి ప్రవాహం ఉండేది. తమ స్నేహితులతో వీరిద్దరూ తరచూ అక్కడకు వెళ్ళి వారి ఊహలకు రూపమిస్తూ, వాటిని స్నేహితులతో చర్చిస్తూ ఆనందిస్తూ వుండేవారు. ఎప్పటికైనా ఆ లొకేషన్లో సినిమా నిర్మించాలనేది వారి అభిలాష. కె.వి.రెడ్డి కి ప్రతి సబ్జెక్ట్ లోనూ మొదటి మార్కులు వచ్చేవి. ఆ రోజుల్లోనే వీరిద్దరూ ఫుట్ బాల్, హాకీ వంటి క్రీడల్లోనూ, పరుగు పందెం వంటి జిమ్నాస్టిక్స్ లోను ముందుండేవారు. 1930లో కె.వి. రెడ్డి స్కూలు ఫైనల్ పరీక్షలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (ప్రెసిడెన్సీ) మొత్తంమీద రెండవ స్థానంలో నిలిచారు. అయితే స్నేహితుడు నారాయణ స్వామి మాత్రం స్కూలు ఫైనల్ తప్పారు.
మద్రాసుకు మకాం..
అనంతపురంలో కాలేజి వున్నా తను మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదవాలని కోరడంతో వారి కుటుంబ సభ్యులు కె.వి.రెడ్డి ని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చారు. అప్పట్లో విక్టోరియా హాస్టల్ లో కె.వి.రెడ్డి వుండేవారు. మద్రాసులో అడుగు పెట్టాక తరచూ సినిమాలు.. ముఖ్యంగా ఇంగ్లీషు సినిమాలు చూడడం అలవాటయింది. అయితే ఆ సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే చూసేవారు కాదు. భాషా జ్ఞానం పెంచుకోవడం కోసం, ఆ సినిమాల్లో మంచి విషయాలను గుర్తుపెట్టుకొని విశ్లేషించుకోవడం కోసం చూసేవారు. సినిమా వాల్‌పోస్టర్లను కూడా నిశితంగా పరీక్షించి వాటి ప్రయోజనాన్ని ఆకళింపు చేసుకోనేవారు. అందువలన సినిమాల్లోకి రాకపూర్వమే కె.వి.రెడ్డికి చిత్రనిర్మాణం గురించి, ప్రచార సాధనాల గురించి మంచి అవగాహన వుండేది. కె.వి. రెడ్డి 1935లో బి.ఎస్సి (ఆనర్స్).. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సమాన విద్యను పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేబట్టిన పట్టాభి రామారావు, ‘ఆంద్ర మహిళా’ సంపాదకులు ఎ.వి.వి. కృష్ణారావు, ఎం.కె.వి. రెడ్డి వీరికి సహాధ్యాయులు. ప్రముఖ దర్శక నిర్మాత పి. పుల్లయ్య కాలేజిలో కె.వి. రెడ్డికి ఒక సంవత్సరం సీనియర్. కె.వి.రెడ్డి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసేనాటికే పి. పుల్లయ్య సినిమా రంగంలో ప్రవేశించి స్టార్ కంబైన్స్ వారు నిర్మించిన ‘హరిశ్చంద్ర’ చిత్రానికి దర్శకుడు టి.ఎ. రామన్‌కు సహాయకుడిగా పనిచేశారు. కె.వి.రెడ్డి రాత్రిపూట పుల్లయ్యతో కలిసి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కూర్చొని సినిమాలకు పనికివచ్చే కథల గురించి చర్చించేవారు. వారు చర్చించుకున్న కథలన్నీ కాలక్రమంలో సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి! ఆనర్స్ డిగ్రీ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనా కె.వి.రెడ్డికి ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు పెడితే బోధనానుభవం లేదని ప్రక్కనపెట్టారు. దాంతో కె.వి. రెడ్డి తన సహాధ్యాయి ఎ.వి.వి. రెడ్డితో కలిసి ‘ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ’ ని ప్రారంభించారు. స్కూళ్ళకు, కాలేజీలకు కావలసిన శాస్త్రోపకరణాలను ప్రామాణికంగా తయారుచేసి వాటిని పాఠశాలలకు, కళాశాలలకు సరఫరా చేసేవారు. ఈ వ్యాపారం లాభసాటిగా మారింది.
రోహిణీ ఫిలిమ్స్ నుంచి వాహిని సంస్థకు..
1937 లో మూలా నారాయణ స్వామి కె.వి. రెడ్డికి కబురంపారు. తను రోహిణీ ఫిలిమ్స్ అనే సినిమా కంపెనీలో భాగస్తుడుగా చేరినట్లు, కె.వి.రెడ్డికి సినిమాల మీద ఆసక్తి వుంటే తనుకూడా అందులో చేరవచ్చని ఆ కబురు సారాంశం. కె.వి.రెడ్డి మిత్రుడు ఎ.వి.వి. రెడ్డితో ఈ విషయం గురించి చర్చిస్తే “ఆరునెలలు వెళ్లి చూసి, లాభాదాయక మనిపిస్తే సినిమా రంగంలో స్థిరపడు. లేకుంటే మన కంపెనీ ఉండనే వుంది కదా” అని మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహామీద కె.వి.రెడ్డి రోహిణీ ఫిలిమ్స్ సంస్థలో చేరారు. ఈ రోహిణీ సంస్థను మీసాలపులిగా పిలిపించుకున్న హెచ్.ఎం.రెడ్డి స్థాపించగా అందులో నారాయణస్వామి తోబాటు బి.ఎన్.రెడ్డి, ఛాయాగ్రాహకుడు రామనాథ్, కళాదర్శకుడు ఎ.కె.శేఖర్, బ్రిజ్ మోహన్ దాస్, బి. నాగిరెడ్డి, సముద్రాల రాఘవాచార్య భాగస్వాములుగా చేరారు. రోహిణీ బ్యానర్ తొలి చిత్రంగా హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’(1938) సినిమా నిర్మించారు. హీరోగా చిత్తూరు నాగయ్యకు ఇది తొలి చిత్రం. రోహిణీ సంస్థలో కె.వి. రెడ్డి తొలుత క్యాషియర్‌గా వ్యవహరించారు. సైన్స్ విద్యార్థి కనుక సౌండ్ రికార్డింగ్ నేర్చుకోవాలనిపించినా, షూటింగులన్నిటికీ హాజరవుతూ నిర్మాణ కార్యకలాపాలను, ఎడిటింగ్, రీ-రికార్డింగ్‌తో సహా అన్ని ‘క్రాఫ్టు’లలోని విభాగాలను క్షుణ్ణంగా గమనిస్తూ అధ్యయనం చేయసాగారు. గృహలక్ష్మి సినిమా విడుదల అవుతుండగనే మూలా నారాయణ స్వామి రోహిణీ సంస్థనుండి విడిపోయి బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, బ్రిజ్ మోహన్ దాసు, కె.వి. రెడ్డి, నాగయ్యలను కలుపుకొని వాహినీ సంస్థను స్థాపించారు. వాహినీ సంస్థ కె.వి. రెడ్డి పెరుగుదలకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని కల్పించింది. సంస్థలో అందరూ విద్యావంతులే కావడం, బి.ఎన్. రెడ్డి అందరికన్నా పెద్దవాడు కావడంతో ఆయన నేతృత్వంలో పనిచేయడంతో వాహినీ సంస్థకు మంచి పునాది పడింది. వాహిని పిక్చర్స్ బ్యానర్ మీద బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం ‘వందేమాతరం’(1939). ఇందులో కె.వి.రెడ్డి నాగయ్య సహాధ్యాయిగా నటించారు. తరవాత బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’ (1940), ‘దేవత’(1941) చిత్రాలకు కె.వి. రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. అయినా ప్రొడక్షన్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ కె.వి. రెడ్డి యిమిడిపోయేవారు.. అంతే కాదు ఆ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు కూడా.
దర్శకుడిగా భక్తపోతన..
1941లో దేవత చిత్ర నిర్మాణం పూర్తై, విడుదలయ్యాక మూలా నారాయణస్వామి ప్రోత్సాహంతో కె.వి. రెడ్డికి దర్శకత్వం నిర్వహించే అవకాశం దొరికింది. అందుకు తను ఎన్నుకున్న కథ ‘భక్తపోతన’(1943). దర్శకత్వంలో ఏమాత్రం అనుభవం లేని కె.వి.రెడ్డిని దర్శకుడిగా నియమించడం పట్ల కొందరు భాగస్వాములు అభ్యంతరం వ్యక్తంచేశారు. అప్పుడు నారాయణ స్వామి కల్పించుకొని “ఈ సినిమా ద్వారా లాభం వస్తే కంపెనీది. నష్టం వస్తే నాది” అని గట్టిగా చెప్పి కె.వి. రెడ్డికి భరోసా కల్పించారు. దేవత చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడే కె.వి. రెడ్డి రాత్రిపూట సముద్రాలతో కూర్చొని పోతన గురించి చర్చలు జరిపేవారు. అలా ‘భక్తపోతన’ స్క్రిప్టు పనులు పూర్తిచేసిపెట్టుకున్నారు. అనుభవజ్ఞుడైన రామనాథ్ చేత స్క్రీన్ ప్లే రాయించారు. కొందరు భాగస్వాములు పోతన పాత్రకు దైతా గోపాలం పేరును ప్రతిపాదించినా కె.వి.రెడ్డి మాత్రం నాగయ్యనే తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జపాన్ వాళ్ళు కోస్తా పట్టణాలమీద బాంబులు కురిపించనున్నారు అనే వదంతి మద్రాసు నగరంలో వ్యాపించింది. మద్రాసు మీద కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దాంతో యూనిట్ మొత్తం మద్రాసు ఖాళీ చేసి వెళ్ళాల్సివచ్చింది. ‘భక్తపోతన’ సినిమా అప్పటికి మూడువంతులు పూర్తయింది. సినిమా నెగటివ్ ను భద్రపరచడానికి కె.వి.రెడ్డి వాటిని తాడిపత్రికి పంపించారు. అసలు ఈ సినిమా పూర్తవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. పరిస్థితులు కుదుటపడ్డాక మద్రాసు తిరిగివచ్చి మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ, ప్యాచ్ వర్కులు, ట్రిక్ షాట్లు పూర్తిచేసి సినిమా విడుదలకు సిద్ధం చేశారు. సినిమా జనవరి 7, 1943న విడుదలై డంకాబజాయించింది. కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది.
పిఠాపురం రాజావారు ఈ చిత్రాన్ని చూసి ముగ్ధులై ఆ రోజుల్లోనే లక్షరూపాయల బ్యాంక్ చెక్‌ను కె.వి. రెడ్డికి అందజేశారు. ఈ సినిమా ప్రభావం ఎలాంటిదంటే, ఒక కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా హటాత్తుగా జడ్జిగారు లేచి “ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే నేను ‘భక్తపోతన’ చిత్రాన్ని చూడడానికి వెళ్ళాలి” అన్నారట. ఈ సినిమా చూసినవాళ్ళెవరూ ఇది కె.వి. రెడ్డి తొలిచిత్రమంటే నమ్మరు. అపారమైన కె.వి. రెడ్డి దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనబడుతుంది. ఈ సినిమా రాబడిలో పది శాతం వాటాగా మూలా నారాయణస్వామి కె.వి. రెడ్డికి ఇచ్చారు.
కె.వి తదుపతి చిత్రం యోగి వేమన..
భక్తపోతన విజయం మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కె.వి.రెడ్డికి కల్పించింది. ఆ చిత్రం ‘యోగి వేమన’ (1947). కె.వి. రెడ్డికి వేమనయోగి అంటే యెంతో అభిమానం. ఈ చిత్రానికి చేసినంత కృషి కె.వి. రెడ్డి మరే చిత్రానికీ చేయలేదంటే నమ్మితీరాల్సిందే. అదే కె.వి. రెడ్డి మాటల్లో చెప్పాలంటే “ఈ కృషిలో నాకు సముద్రాల వలన కలిగిన సహాయం అంతులేనిది. నా లోపాలన్నిటినీ ఆయన కమ్మేశారు. వేమన తత్త్వం గురించి, వేదాంతం గురించి సముద్రాలకు బాగా తెలుసు. అదీ కాకుండా సముద్రాల ఈ చిత్ర కథ కోసం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి నిష్ణాతుల అభిప్రాయాలు సేకరించి వాటిని కథలో పొందుపరచారు. ‘కామి కానివాడు కవి కాడు. కామిగాక మోక్షగామి కాడు. కామి అయినవాడు కవియగు, రవియగు’ అనే సూత్రాన్ని ‘యోగి వేమన’ చిత్రంలో చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు కె.వి. రెడ్డి. అనుభవాల బలం తప్ప సెంటిమెంట్ల బలహీనతలేని నాస్తికుడుగా వేమన పాత్రను రూపుదిద్దారు కె.వి. రెడ్డి. పసిపాప ‘జ్యోతి’ చనిపోతే, కాంత, కనకాల మధ్య కొట్టుమిట్టాట మానేసి విరాగిగా మారిన అంశాన్ని అద్భుతంగా చిత్రీకరించి సినిమాను సూపర్ హిట్ చేశారు.
వేమనకు అతి గుప్తమైన ఆత్మవిద్యను భగవానుడు బోధించే సన్నివేశాన్ని, ఆ బోధన ఆధారంగా వేమారెడ్డి యోగి వేమనగా పరిణామం చెంది చివరికి గుహలోనికి వెళ్ళిపోయే దృశ్యాన్ని కె.వి. రెడ్డి చిత్రీకరించిన విధానం నభూతో న భవిష్యతి అని చెప్పాలి. ఈ సన్నివేశ చిత్రీకరణలో యూనిట్ సభ్యులంతా కన్నీరు పెట్టుకున్నారు. దర్శకుడు ‘కట్’ చెప్పడం మర్చిపోయి నిశ్చేష్టులై నిలిచిపోయారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. దర్శక నిర్మాత వి. శాంతారాం ఈ చిత్రాన్ని చూసి కె.వి.రెడ్డి పనితీరును యెంతగానో మెచ్చుకున్నారట. యోగి వేమన చిత్రం న్యూటోన్ స్టూడియోలో నిర్మించారు. మేలురకం సినిమాలు తయారవ్వాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన స్వంత స్టూడియో వుండాలనిపించి మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియో నిర్మాణానికి నడుంబిగించారు. స్టూడియో నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. అప్పటికి ఇండియాలో యెక్కడాలేని ‘వెస్ట్రెక్స్ సౌండ్’ ఎక్విప్మెంట్ ఈ స్టూడియోలో అమర్చారు.
వాహిని స్టూడియోలో గుణసుందరి కథ..
ఆ రోజుల్లో బాలనాగమ్మ, గొల్లభామ వంటి జానపద చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో కె.వి. రెడ్డికి అటువంటి జానపద చిత్రాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అప్పటికి వాహినీ సంస్థ ఆరు సినిమాలు నిర్మించింది. ఆ సంస్థకు బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి ఒకరి తరవాత ఒకరు సినిమాలు చేయాలనేది ప్రత్యేక ఒడంబడిక. అయితే స్టూడియో నిర్మాణ పనుల్లో బి.ఎన్. రెడ్డి తలమునకలై ఉండడంతో కె.వి. రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ చిత్రమే బాక్సాఫీస్ హిట్ అయిన ‘గుణసుందరి కథ’ (1949). వాహినీ సంస్థకు ఆస్థాన రచయితగా వున్న సముద్రాల ఇతర చిత్రాల రచనలో బిజీగా ఉండడంతో కె.వి.రెడ్డి కమలాకర కామేశ్వరరావు సూచనతో పింగళి నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. ‘కింగ్ లియర్’ నాటకం ఆధారంగా ‘గుణసుందరి కథ’ కు రూపకల్పన జరిగింది.
జై.. పాతాళ భైరవి..
1949 ప్రాంతంలో వాహిని స్టూడియో యాజమాన్యం తోబాటు, ఆబ్కారీ వ్యాపారం మరికొన్ని ఇతర సంస్థలు వున్న మూలా నారాయణస్వామి మీద ఆదాయపు పన్నుశాఖ రెయిడ్ చేసి ముప్పై లక్షల అపరాధ పన్ను వసూలు చేసేందుకు ఆస్తులు జప్తుచేసింది. వాహిని స్టూడియోను కాపాడాలని నారాయణస్వామి అప్పటికప్పుడు స్టూడియోని విజయా ప్రొడక్షన్స్ పేరిట లీజుకు ఇచ్చినట్లు రాశారు. తరవాత నారాయణస్వామి ఆర్ధిక పరిస్థితి క్షీణించి కాలంచేశారు. ఈ పరిస్థితులమధ్య విజయా ప్రొడక్షన్స్ సంస్థను నాగిరెడ్డి, చక్రపాణి నిలబెట్టి ‘షావుకారు’ (1950) చిత్రాన్ని నిర్మించారు. చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో కె.వి.రెడ్డిని ఒక జానపద చిత్రాన్ని నిర్మించవలసిందిగా కోరారు. అరేబియన్ నైట్స్ కథలలోని అల్లావుద్దీన్ అద్భుత దీపం కథను, కొన్ని కాశీ మజిలీ కథలను మధించి కె.వి. రెడ్డి పింగళితో కలిసి ‘పాతాళ భైరవి’ కథను తయారుచేసారు. తరువాత పింగళితో సంభాషణలు రాయించి, కమలాకర కామేశ్వరరావు సహకారంతో స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. ఇందులో పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు చదివే మంత్రాలకోసం మంత్రపుష్పంలోని వేదమంత్రాలను తిరగరాయించి విచిత్రమైన భాషగా రంగారావు చేత పలికించారు. అలాగే పద్మనాభం చేత పలికించిన “మోసం గురూ” అనే మాట తరవాతి కాలంలో వూతపదమై కూర్చుంది. మాంత్రికుడు పలికే “సాహశం శాయరా..రాజకుమారి లభిస్తుందిరా”, “నరుడా ఏమి నీ కోరిక”, “ఏ డింబకా.. ఏ బుల్ బుల్, ఏ డింగరీ” వంటి మాటలు అందరి నోళ్ళలో నానాయి. ముందు 13 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం అప్రతిహతంగా ఆడి విజయవంతం కావడంతో విజయావారు 11 వారాల తరువాత మరో 60 ప్రింట్లను సిద్ధంచేసి తమిళనాడు, ఉమ్మడి ఆంధ్ర, కర్నాటక కేంద్రాలో విడుదల చేయగా అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. బెంగుళూరు మినర్వాలో 30 వారాలు, గోల్డన్ గ్లోరీ థియేటర్ లో 50 వారాలు ఆది రికార్డు సృష్టించింది.
అన్నపూర్ణ లో కె.వి.రెడ్డి..
అన్నపూర్ణా పతాకం నలభై యేళ్ళదాకా అప్రతిహతంగా కొనసాగింది. ‘పెద్దమనుషులు’ సినిమాకు తొలి రచన చేసిన డి.వి. నరసరాజు కె.వి.రెడ్డి సలహాపై ‘దొంగరాముడు’ సినిమాకు మలిరచన చేశారు. షూటింగు ప్రారంభించే ముందు నరసరాజు స్క్రిప్టు చదువుతూవుంటే కె.వి.రెడ్డి టైం నోట్ చేయించి, ప్రతి షాట్ కు ముడిఫిలిం యెంత ఖర్చవుతుందో లెక్ఖ వేసి, మొత్తం ఫిలిం నిడివి 17 వేలుగా తేల్చారు. సినిమా పూర్తయ్యేసరికి నిడివి మొత్తం 17,250 అడుగులు వచ్చింది. 70 కాల్షీట్లలో సినిమా పూర్తయింది. కాల్షీట్ అనుకున్న సమయానికన్నా పావుగంట ముందుగానే పూర్తయ్యేది. అంత ఖచ్చితమైన ప్రణాళికతో కె.వి.రెడ్డి ఈ సినిమా తీశారు. అందుకే పుణే ఫిలిం కళాశాలలో ‘దొంగరాముడు’ సినిమా ఇప్పటికీ ఫిలిం మేకింగ్ సిలబస్‌గా కొనసాగుతోంది. “సినిమాలో నవరసాలు వున్నాయి. మంచి హిట్ అవుతుంది. నా అంచనా తప్పితే నేను చిత్రరంగం నుండి విరమిస్తాను” అని కె.వి.రెడ్డి అన్నపూర్ణా భాగస్వాములకు భరోసా ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం. భానుమతిని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని దుక్కిపాటి భావించినా కె.వి.రెడ్డి సావిత్రి వైపే మొగ్గుచూపారు. 1955 అక్టోబరు 2 గాంధి జయంతినాడు సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. నాటకీయత లేకుండా సహజసిద్ధమైన సన్నివేశాలు ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తూనే వున్నాయి.
హై.. హై.. నాయకా కె.వి. రెడ్డి..
పాతాళభైరవి తరవాత కె.వి.రెడ్డి విజయా వారి తదుపరి చిత్రానికి సినిమా చేయాల్సివున్నా, అన్నపూర్ణావారి దొంగరాముడు సినిమాకు పనిచేయాల్సి రావడంతో వీలుపడలేదు. 1955లో దొంగరాముడు సినిమా విడుదలయ్యాక కె.వి.రెడ్డి మాయాబజార్ (1957) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పాటు శ్రమించి స్క్రిప్టు పని పూర్తిచేశారు. ఈ సినిమా మీద నమ్మకం లేక పోవడం, అంతకుముందు భారీ ఎత్తున కమలాకర దర్శకత్వంలో నిర్మించిన ‘చంద్రహారం’ సినిమా పరాజయం పాలవడంతో నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి చిత్రనిర్మాణాన్ని వాయిదావేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎ.వి.ఎం అధిపతి మెయ్యప్పచెట్టియార్ మాయాబజార్ సినిమా తీసేందుకు ముందుకు వచ్చి కె.వి.రెడ్డి యెంత పారితోషికం అడిగితే అంత ఇస్తానని కబురంపారు. అంతేకాదు సుందర్‌లాల్ నహతా తోబాటు మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా కె.వి. రెడ్డికి ఇదే ప్రతిపాదనను చేరవేశారు. కె.వి.రెడ్డి మాత్రం విజయా వారికి తప్ప వేరేవారికి తీయనని చెప్పడంతో, నాగిరెడ్డి-చక్రపాణి పునరాలోచనలో పడ్డారు. సినిమా బడ్జట్ ను కె.వి. కి అప్పగించి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. తెలుగు తోబాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించాలనే నిర్ణయం జరిగింది. సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే యేయే పాత్రలకు ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే విషయాన్ని ముందుగానే కె.వి. రెడ్డి నిర్ణయించేశారు. ఆ రోజుల్లో కృష్ణుడు అంటే కల్యాణం రఘురామయ్యే అనుకునేవారు.
అయితే కృష్ణుడి పాత్రకు ఎన్.టి.రామారావును తీసుకొని, కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ లతో రకరకాల స్కెచ్‌లు గీయించి నిండుకిరీటం పెట్టించి, మేకప్‌మన్ పీతాంబరం, భక్తవత్సలం చేత ఆహార్యం మెరుగు పరచి, నడక, వాచకంలో మార్పులుచేసి “కృష్ణుడంటే ఇలా వుండేవాడా” అనేలా తీర్చిదిద్దారు. ఇక హీరో ఘటోత్కచుడి పాత్రకు ఎస్.వి. రంగారావును తీసుకున్నారు. ఘటోత్కచుడుగా తదాత్మ్యంతో రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పింగళి అనేక కొత్త మాటల్ని ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారతీయ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా 2013లో CNN-IBN సంస్థ నిర్వహించిన సర్వేలో వంద ఆల్ టైం గ్రేట్ భారతీయ సినిమాలలో మాయాబజార్ సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మాయాబజార్ 27 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది.
ముగింపు..
మాయాబజార్ తరవాత పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ చిత్రాలకు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు. సొంత బ్యానర్ ‘జయంతి పిక్చర్స్’ బ్యానర్ మీద ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1961) నిర్మించారు. అక్కినేని, ఎన్.టి.ఆర్ నటించిన ఈ చిత్రం జగదేకవీరుని కథ సినిమాతో సమానంగా విజయం సాధించింది. అయితే తరవాత కె.వి. రెడ్డి విజయా సంస్థకు దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ విజయవంతం కాలేదు. ఎన్.టి. రామారావు సంస్థకోసం దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ సత్య బాగా ఆడింది. సొంత బ్యానర్ మీద నిర్మించిన భాగ్యచక్రం కూడా సరీగా ఆడలేదు. కె.వి. రెడ్డి మూడు దశాబ్దాల కాలంలో దర్శకత్వం వహించిన చిత్రాలు కేవలం 14 మాత్రమే. అయినా అవి వేటికవే అజరామరాలు. కె.వి. రెడ్డి భార్య శేషమ్మ. వారిది అన్యోన్యమైన దాంపత్యం. భార్య తల దువ్వనిదే కె.వి. రెడ్డి అడుగు బయటకు పెట్టేవారు కాదు. వారికి తొమ్మండుగురు సంతానం. వారిలో యెవరినీ సినిమా నిర్మాణపు గడప తొక్కనీయలేదు. పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ప్రయోజకులయ్యారు. కె.వి. రెడ్డి అంటే తెలుగు చలచిత్ర చరిత్రలో చెరిగిపోని మచ్చలేని సుగంధ కుసుమం.
ఆచారం షణ్ముఖాచారి
జననం: 1949
చదువు : B.Sc (Ag), MA, CAIIB, CRB
వృత్తి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయ అధికారిగా, ఆంధ్రా బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా
ఉద్యోగ విరమణ: 2009
ప్రవృత్తి: సీనియర్ సినీ జర్నలిస్టుగా ఈనాడు సంస్థ వారి సితార సినీ వారపత్రిక, చతుర, తెలుగు వెలుగు పత్రికలకు 2022 వరకు స్వచ్ఛంద సేవలు
సాంస్కృతిక రంగం : సాహిత్య సంగీత సమాఖ్య (రి ) కు 2014 నుండి 2020 వరకు – శ్రీ రావి కొండలరావు గారు దివంగతులైన తరువాత ఆ సమాఖ్య కు ప్రస్తుత అధ్యక్షుడిగా
సినీ పుస్తక సంకలన కర్తగా : (1) పల్లవించవా నా గొంతులో మకుటంతో పద్మవిభూషణ్ బాలు గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ
(2) ఆమని పాడవే మకుటంతో పద్మవిభూషణ్ ఇళయరాజా గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ
సంగీత కార్యక్రమాలు: కాకినాడలో వరుసగా ఐదు సంవత్సరాలు ఘంటసాల, శోభన్ బాబు జయంతి, వర్ధంతి సందర్భంగా సంగీత విభావరుల నిర్వహణ.
రవీంద్ర భారతి లో చందమామ పాటల కార్యక్రమ నిర్వహణ
ప్రభుత్వ సత్కారాలు: ఉత్తమ బ్యాంకర్ గా 11 సార్లు ప్రభుత్వ సత్కారం

