[విన్నకోట ఫణీంద్ర గారు రచించిన ‘విలువలు నిలిపే దిశగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


వెన్నెల చల్లగా చెప్పింది –
అన్నిటా నిండిన వెలుగులో
ఆరుబయట మంచం పరిచి
తీరైన సుద్దులు వినిపించాలని
ముంగిట ముగ్గు మెత్తగా చెప్పింది-
అంగనలు గొబ్బిళ్ళు పెట్టి
అద్భుతమైన సంక్రాంతిలక్ష్మికి
ఆహ్వానపత్రం రాయాలని
కోకిల తియ్యగా పాడుతూ చెప్పింది-
వాకిట వసంతం విరిసిన ముచ్చట;
శీతకాలపు బద్ధకాన్ని వదలి
లేతచిగురుల పద్యం రాయాలని
వాయసం బాధగా జాలిగా చెప్పింది-
పెద్దవారికి సేవలో బద్ధకం కూడదని
వేగిరం వృద్ధాశ్రమం వెళ్ళి
సాదరంగా తోడ్కొనిరావాలని
పక్షులు, ప్రకృతి
స్థావరం, జంగమం
విలువలు నిలిపే దిశగా
వినదగునెవ్వరు చెప్పిన