[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘విన్నవించుకోనా చిన్నకోరిక!?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నువ్వు క్షేమంగా వున్నావని తెలుసుకొని
నా గుండె గాయాలు ఓడుతున్నా—
పర్వతశిఖరంలా పెరిగిన మనోవ్యథను
పెదాలను బిగపట్టి ఆపేసుకొని—
నిండుకుండలా నిశ్చింతగా ఉండి పోయాను!
ఎదలో రాజుకున్న ప్రేమ బడబాగ్నిని
త్యాగం చినుకులధారలతో చల్లార్చుకున్నాను!
నీ ప్రేమామృతాన్ని నింపి
నాకు అందించాలనుకున్న ప్రేమ పాత్ర
చేతికి అందబోయి చేజారి
పగిలి ముక్కలై పోయింది!
అది అందలేదని
చింత లేదు ప్రేయసీ!
నీ సంతోషం కోసం
కన్నీళ్ళు తాగుతూనైనా గడిపేస్తాను!
నా ఆశాసౌధాన్ని తునాతునకలు చేసి
నీ దారి నువ్వు చూసుకున్నావు!
సాఫీగా సాగిపోతోన్న
మన ప్రశాంత ప్రేమ జీవనయానంలో
నిర్దాక్షిణ్యంగా విధ్వంసాన్ని సృష్టించావు!
ఏ బలమైన శక్తి
నిన్ను ప్రభావితం చేసిందో
నాకైతే తెలియదు గానీ —
నా హృదయం లోగిలిని వీడి
మరో మనసు నీడను ఆశ్రయించావు!
నెత్తురోడుతోన్న గుండెతో
కాఠిన్యాన్ని హృదయంలో నింపుకొని —
నీపై కత్తులే దూయాలనుకున్నాను!
అయితే
నా అంతరంగంతో చెలరేగిన ఆవేశాన్ని
నా మదిలోయల్లో దాగివున్న వివేకం
హెచ్చరించింది ఇలా —
“మనిషి హృదయం క్షమా సాగరమైతే
కక్షలు కార్పణాలు దూదిపింజల్లా తేలిపోయి
అడ్డ గోడలన్నీ కూలిపోయి
ఆకాశంలా విశాలమై పోతుంది!”
నా మెదడు పొరల నుండి
ఈ అద్భుతమైన భావన తొంగిచూడగా —
నీ ఆనందం కోసం
సర్వశక్తులూ ధారపోయాలనీ —
నా జీవితాన్ని కాల్చేసుకొని
నీ బ్రతుకులో వెలుగులు నింపాలనీ —
నిండు మనసుతో నిర్ణయమే తీసుకున్నాను!
నా ప్రేమ హృదయాన్ని
గాయం చేసి వెళ్ళిపోయావు —
మరి — నా కళ్ళల్లో వెలుగువై ఉండిపో!
నా విన్నపాన్ని మన్నించు ప్రేయసీ!!

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.