చినుకు లేక, చిరు తడి లేక
మొలకెత్తలేని విత్తనం
మానవుల ఆకలి తీర్చడమెలా
అని పరితపిస్తున్నది నిరంతరం.
వరుణుడు వర్షించక పోయినా
ప్రకృతి కరుణించక పోయినా
వడగాడ్పులకు నివ్వెరపోను
పెనుగాలులకు కుంగిపోను
కోటాను కోట్ల అవిశ్వాసాలు
నిరాశ పరిచినా
బ్రతికించే ఒక్క విశ్వాసాన్ని
నమ్ముతాను
అవకాశం కై నిరీక్షిస్తూ
జీవిస్తా ఆశతో
మేఘం వర్షించి
ప్రకృతి కరుణించి
కాలం కలసి వస్తే
శిరసెత్తి నిలబడతా
సిరుల పంటలు పంచిపెడతా
అన్నార్తుల ఆకలి తీర్చి
ఆనందపు జ్యోతులు వెలిగిస్తా.