[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘వ్యాధ మౌని గాథ’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]


~
1.
కలడు కిరాతుడా గహన కానన సీమల వేట వృత్తిగా
కలికిని, పిల్లలం బెనిచి కాలము బుచ్చును, పోషణార్థమై
పలు విధ జంతు సంతతుల పన్నుగ జంపుచు, మాంస భక్షణన్
కిల కిల పక్కి రావముల గీతములన్ శ్రవణం బొనర్చెడున్
2.
కానన మంత నిండె నట, గాఢ తమంబు, భయంబు గల్గియున్
జానెడు పొట్ట త్రిప్పలను చల్లగ జేయగ జీవనంబుకై
తాను, కుటుంబమున్ నిలిచె ధైర్యము తోడను, భుక్తి ముక్తిగా
కానడు ధర్మ చింతలను, కానడు శాంతి యహింస సుంతయున్
3.
పదమిడ భయపడి పడిపోదు రెల్లరున్
కాననంబున దారి కనగ రాదు
భీకరారావముల్ ప్రేత హుంకారముల్
కర్ణ పుటంబుల కలత బెట్టు
అంధకార మటవి నలము కొనుట చేత
నెద్దియున్ గన రాదు యెందు బోవ
నెచట నుండి యెచటి కేగుదు మను జాడ
నరయగా లేనట్టి యడవు లందు
నరుల సంచారమే లేదు, తరులు, గిరులు
వరుస గుబురుగా, నిల్చు నా తెరువు లందు
నడక మార్గంబు కంటక నరక మగుచు
ముందుకు చనగ కష్టమై ముప్పు కలుగు
కానన విహార కాంక్ష ఇక్కరణి వేచు
4.
కాననంబున మార్గముల్ కాన రావు
భయము మది నిండి బ్రతుకెల్ల భార మగును
తరులు దట్టమై నిండిన తమము కతన
సూర్య,చంద్రుల కాంతులు చొరగ నీవు
5.
ఏ మృగము దాడి చేయునో, యెట్లు చంపు
నో యనుచు భీతి వివశులై యురుకు వారు
వనము నందుండ దుర్భర మనగ దోచు
అచట నివసించు ప్రజకు లేదలజడి మది
6.
సింగమును కని కరులెల్ల చెదరి పోవు
పులుల గని లేళ్లు పరుగిడు కలత జెంది
నక్కలును, కుక్క లరచును దిక్కు లదర
క్రూర మృగములు తిరిగాడు ఘోరముగను
శాంత చిత్తుల కట కేగ శ్రమగ దోచు
7.
నాగరికత తెలియ నట్టి నరు డొకండు
చదువు, సంధ్యలు శూన్యంబు, సంఘ మైత్రి
జీవన మెరుగని మనిసి, చేయు పనులు
అన్నమిడుచున్న చాలని యతడు తలచు
8.
అచ్చటచ్చట నుండిరి యట్టి వారు
ఒకరితో పొత్తు లేదు వేరొకరి కచట
ఎవరి పని వారిదే నట నిచ్చ కొలది
ఎవరి యారాట మది వారి ఇష్ట మగును
9.
పులులు, సింగముల్, నక్కలు, నెలుగు బంట్లు
కరులు, పందులు, పిల్లులు, కాటు కుక్క
లెన్నొ రకముల విహగము లున్న విచట
నెచ్చటైనను తిరుగాడు నిచ్చ కొలది
10.
కొంద ఱిచ్చోట తిరుగాడు చుందు రెపుడు
కేవలాహారమును పొందు కిటుకు తోడ
వలలు పన్నుచు,శరములు వాడు చుండి
పిట్టల మృగములను జంపు పట్టుదలను
11.
మాంస మాహార మగు వారు మదిని మెచ్చ
పచన విధమది చిత్రమౌ ప్రక్రియ యగు
రుచుల చింత వారెరుగరు, పచన మద్ది
కడుపు నింపిన చాలన్న కాంక్ష కతన
12.
తరులు, వల్లి, పుష్ప ఫలముల్ విరివి గాను
అడవి యందున విస్తార మగుచు నుండె
సర్పముల్ నడయాడుచున్ జనుల భీతి
పెంచి, పరుగు లిడగఁజేయు పెక్కు గతుల
13.
ఝరులు గిరులపై నుండి తా పరుగు లిడుచు
శ్వేత ఫేనంబు తెలి బట్ట విధము దోప
వేగమున బారు శబ్దముల్ భీతి గొలుప
దట్ట మగు వనీ దృశ్యముల్ తనివి గూర్చు
యాత్రికులు రారు, వీక్షింప నాస లేదు
14.
దట్ట మగుట పథము గన తరము కాదు
తాము నడయాడ నటకేగ సేమ మగునె?
ఒకరి కొకరుగ తిరుగాడి యుండు వారు
భయము, భ్రాంతిని గూర్ప సంభ్రమము తోడ
అడుగు నడుగున సర్పముల్ వెడలు చుండ
దాటు కొని పోవగా తొట్రుపాటు పడరె
15.
ఏమి హాని రానున్నదో ఎవరి కెరుక?
వారచట నుండి యలవాటు పడుట వలన
కాలము గడుపు చున్నారు,వీలు కొలది
పారి పోలేరు బయటికా వనము వీడి
(సశేషం)