జీవనగమనంలో ప్రయాణాలు చిత్రంగా సాగుతాయి. అన్నీ అనుకున్నట్టుగా సాగవు. మలుపులూ వెరపులూ సాధారణం. ఊహించినవేవీ జరగక పోవచ్చు. అనూహ్యమయినవి అనేకం మన ముందుకు రావచ్చు. అయినా ప్రవాహం ఆగదు. ఒక్కోసారి ఈదుకుంటూ ఒడ్డుకు చేరతాం. ఇంకోసారి కొట్టుకుపోతాం. నా విషయంలో సరిగ్గా అట్లే జరిగింది. చిన్నప్పటి మెడికల్ కల ముగిసిన తర్వాత ఉస్మానియాలో చేరాలని, చదవాలన్నది కోరికే కాదు ఒక రకంగా లక్ష్యం కూడా. ప్రవేశం సరే కానీ ఊహించని విధంగా లైబ్రరీ సైన్స్‌లో చేరడం పెద్ద మలుపు. అప్పటికి పేరే తెలీని కోర్సు. అందులో ఏముంటుందో తెలీదు. ఏమి జరగబోతున్నదో తెలీదు. కేవలం మిత్రుడు మదన్ సలహా.. యునివర్సిటీలో చేరాలన్న కోరిక… ఎంట్రన్స్‌లో దొరికిన సీటు అంతే. అట్లా కాంపస్‌లో వచ్చి పడ్డాను. కరీంనగర్ లాంటి చిన్న కాలువ లోంచి మహాసముద్రంలో పడ్డట్టు అయింది. కోర్సులో ప్రవేశం అయితే దొరికింది కానీ. హాస్టల్లో గది లేదు. భోజనం వుంది కాని నీడ లేదు. పేరుకు ఆర్ట్స్ కాలేజీ. కానీ క్లాసులు ‘డి’ హాస్టల్ గదుల్లో. అంతా ఆగమ్య గోచరం.
సరే రాజు మామ (జింబో) వాళ్ళ ‘ఈ’ హాస్టల్ లోని తన రూము 28 లో అతిథిగా ఉండిపోయాను. తనేమో యునివర్సిటీలో చేరగానే చాలా యాక్టివ్ అయిపోయాడు. విజయ్ లాంటి మిత్రుల ప్రోత్సాహంతో ఎన్నికలు అవీ బిజీ అయ్యాడు. నాకేమో హాస్టలు, క్లాసులు అంతా కొత్త. అట్లా మొదలయింది నా యునివర్సిటీ ప్రయాణం.
నిజానికి చదువుల్లో మొదటినుంచీ నేను ఫర్వాలేదు. కానీ టెన్త్ వరకు కంపోజిట్ మాథ్స్, ఇంటర్లో మెడికల్ కలలతో జీవశాస్త్రం, డిగ్రీ కొచ్చేసరికి పీజీ కెమిస్ట్రీ కోసం ఫిజికల్ సైన్స్.. అట్లా భిన్నమయిన సబ్జెక్ట్స్‌తో ‘ఘర్ కా న ఘాట్ కా’ అయింది మన చదువు. వాటితో పాటు సాహిత్యం పట్ల ఏర్పడ్డ ఇష్టం అనుబంధం. చదవడం రాయడం మరో మలుపు. ఇక లైబ్రరీ సైన్స్ కొచ్చేసరికి అంతా కొత్త. కన్ఫ్యూజన్. ప్రొఫెసర్ రాజు వచ్చి ఎస్. ఆర్. రంగనాథన్ అంటూ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. కోలన్ క్లాసిఫికేషన్ సబ్జెక్టులను లైబ్రరీ కోసం ఎట్లా విభాజించాలో చెప్పేవాడు. పాస్చులెట్స్ నుంచి మొదలు అనేక కొత్త కొత్త పదాలు, సూత్రాలతో వివరిస్తుంటే తెలిసినట్టు అనిపిస్తూనే ఏమీ తెలీకపోయేది. వామ్మో వామ్మో.. ఇంగ్లీషులో ఎక్కడి ఎక్కడి పదాలో వచ్చేవి. గణిత శాస్త్ర ఆచార్యుడు ఎస్. ఆర్. రంగనాథన్ రూపొందించిన ఆ సూత్రాలు మా దుంప తెంచేవి. ఇక రాజు గారే డేవీ డెసిమల్ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. ఇక మరో వైపు కాటలాగింగ్ దాంట్లో మళ్ళీ ఎస్. ఆర్. రంగనాథన్.. క్లాసిఫైడ్ కాటలాగ్, దాంతో పాటు ఎ.ఎ.సి.ఆర్. మరి వైపు బిబిలియోగ్రఫీ అంటూ వేణుగోపాల్ సర్.. మరోవైపు మేనేజిమెంటు ఇంకా ఎన్నో. థియరీతో పాటు ప్రాక్టికల్స్. యునివర్సిటీ చదువులా వుండేది కాదు. ప్రైమరీ స్కూలులాగా వుండేది. ఊపిరాడని క్లాసులు. ‘డి’ హాస్టల్లో క్లాసులు జరిగినన్ని రోజులు అంతా ఎక్కడో ఎడారిలో వున్నా ఫీలింగ్. ఒకసారి ప్రతిష్ఠాత్మక ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మారింతర్వాత జనం కనిపించడం మొదలు పెట్టారు. కలర్స్ కనిపించడంతో మౌనంగానే అయినా పరిస్థితి ఎంతో కొంత ఉత్సాహంగా మారింది. అమ్మయ్య యునివర్సిటీకి వచ్చాం అని అందరమూ ఊపిరి పీల్చుకున్నాం. బయట అది మంచి కోర్సు వెంటనే ఉద్యోగం దొరుకుతుంది అని పేరు. ఏంటో అంతా కన్ఫ్యూజన్ లోనే కోర్సు ముగిసింది. యునివర్సిటీ విద్యార్థి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ వాటిల్లో ఉత్సాహంగా పాల్గొనే చొరవ చూపలేదు. అట్లా ఆ విద్యా సంవత్సరం ముగిసింది. సంపత్ కుమార్, గోపాల్ రెడ్డి, సీతారాములు, ఉమాశంకర్, రవీంద్ర చారి, నర్సింగ్ రావు, మనోహర్ ఇట్లా కొంతమంది క్లాస్‌మేట్స్‌తో క్లోజ్‌గా వుండేవాన్ని. మిత్రులంతా నాకున్న సాహిత్య అభిలాష పట్ల అభిమానంగా చూసేవారు. మొత్తం మీద లైబ్రరీ సైన్స్ ప్రథమ ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు అయ్యాయనిపించాను. పరీక్షలు రాసి కరీంనగర్‌కు వచ్చేసాను. ఏంచేయాలో అని ఆలోచిస్తున్న రోజులు. మళ్ళీ కరీంనగర్ ఫ్రెండ్స్ నా కంపనీ. వెంకటేష్, కృష్ణ, సుధాకర స్వామి, ప్రసాద్, మోహన స్వామి లతో కాలం గడుస్తున్న వేళ ఒక రోజు హైదరాబాద్‌లో కాంపస్ లో వున్న జింబో నుంచి ఇన్లాండ్ లెటర్ వచ్చింది. తెరిచిచూస్తే ఒకే వాక్యం ఫస్ట్ క్లాస్‌కి అభినందనలు. అంతే ఉత్సాహంగా అనిపించింది. అమ్మయ్య చాలా చిత్రంగా అప్పటిదాకా అకాడెమిక్ పరీక్షల్లో నాకున్న 60% గెట్టును లైబ్రరీ సైన్స్‌లో దాటేసాను. అప్పుడు నాన్న ధనగర్వాడి హై స్కూలులో పని చేస్తున్నారు, వెళ్లి చెప్పాను. ఉత్తరం చూపించాను. అంతే నా ఇంకేమీ రాయలేదా పర్సంటేజీ అదీ అని అడిగాడు. నవ్వుకున్నాం. మేక్ మెర్రి అన్నాడు.
అట్లా లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ప్రస్థానం ముగిసింది. అప్పటికి ఉస్మానియాలో పీజీ లేదు. ఎట్లయినా కాంపస్‌లో వుండాలి, ఒకసారి కాంపస్ అలవాటు అయిన తర్వాత విడిచి వెళ్ళడం అంత ఈజీ కాదు. అప్పటికే నాకున్న ఎంతోమంది మిత్రులు ఒకటి తర్వాత మరోటి కోర్సులు చేస్తూ అక్కడే వున్నారు. ఇంకో కారణం ఆ కాలంలో వున్నతీవ్ర నిరుద్యోగం. బయటకు వెళ్తే ఏం చేయాలన్నది ప్రధాన ప్రశ్న. కాంపస్‌లో ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్. లైబ్రరీ సైన్స్ ఫలితాల తర్వాత కాంపస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నాం మా బాచ్ అందరం. ఉద్యోగం అంత తొందరగా వస్తుందన్న విశ్వాసం వుండేది కాదు. ఏదయినా పీజీ కోర్సులో చేరాలి. ఇంగ్లీష్ అంతగా రాదు. తెలుగులో చేరాలి కానీ నాది ఇంటర్ నుండి హిందీ సెకండ్ లాంగ్వేజ్. మాతృ భాష తెలుగు అదే వస్తుంది హిందీలో చేరితే మరో భాష నేర్చుకోవచ్చు నన్నది అప్పటి నా ఫిలాసఫీ. హిందీ సినిమాలు,హిందీ పాటలు మరో కారణం. వెరసి అప్పటికి రెండు భాషల్లోనూ అంతగా ప్రవీణ్యం ఎమీ రాలేదు కాని ఎం.ఏ. తెలుగుకు అర్హత లేకుండా పోయింది. ఎంత సాహిత్యం చదివితే, తెలిస్తే మాత్రం ఏముంది. రూల్స్ కదా ముఖ్యం. సో నేను ఎం.ఏ. ఫిలాసఫీలో చేరాను.
***
ఇదిట్లా వుంటే కాంపస్‌లో వున్న కాలంలో పలుసార్లు ఖైరతాబాద్లోవున్న మా మేనత్త కాశమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ని. అక్కడ నలుగురు మేన బావలు. జగద దాస్, శ్రీనివాస్, బాబురావు, శ్యాం సుందర్. ముగ్గురు వదినలు తారక్క, విజయ, బేబి. ఇల్లంతా గోల గోలగా వుండేది. మా కరీంనగర్ మిఠాయి దుకాణం ఇల్లులాగా వుండేది. అందులో బాబురావు బావతో కలిసి సిన్మాలకు పోయేవాణ్ని. దాదాపు నా ఏజ్ గ్రూప్ అయిన బేబి కొంత ఫ్రీగా వుండేది. ఇక శ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బి.నర్సింగ్ రావు, వైకుంఠం, చంద్ర తదితరులతో కలిసి చదివాడు. తనకే మా పెదనాన్న జగన్నాధం గారి బిడ్డ శోభక్కను ఇచ్చి పెళ్లి చేసారు. తర్వాతి కాలంలో మా చెల్లెలు మంజులను కూడా ఆ ఇంటికే శ్యాం బావకిచ్చి పెళ్లి చేసారు. ఖైరతాబాద్‌లో ఇంకో విషయం ప్రముఖ కవి కె.శివారెడ్డి వాళ్ళ ఇల్లు పక్కనే వుండేది. అప్పుడప్పుడూ కలిసే వాణ్ని. ఒకటి రెండు సార్లు ద్వారకాకు కూడా పోయిన గుర్తు.
ఇక కాంపస్ లో వుండగా లాలపేట్‌లో వున్నా రాం టాకీసులోనూ, చిలకలగూడలో వున్న శ్రీదేవి లోనూ సినిమాలు చూసిన గుర్తు. ఇక యునివర్సిటీ లోని ‘టాగోర్’ ఆడిటోరియంలో కూడా ఒకటో రెండో ఆర్ట్ సినిమాలు చూసాను.
ఎం.ఏ. ఫిలసఫి లో చేరాక మర్రి విజయ రావు నా క్లాస్మేట్ అయ్యాడు. అప్పటికే తాను తెలుగు పూర్తి చేసాడు. ఇద్దరమూ ‘డి’ హాస్టల్ లో చేరాం. అప్పటికే విజయ రావు అనేక మంది కవులు, రచయితలతో అనుబంధం కలిగి వున్నవాడు. ఇక మా ఇద్దరితో పాటు జింబో, నందిగం కృష్ణా రావులు కూడా మా రూములో చేరారు. మంచి సాహిత్య వాతావరణం వుండేది.
అప్పుడే ఆంధ్రజ్యోతి వార పత్రికలో నా కవిత వచ్చింది..
“ఈ సమాజం అచ్చుతప్పులున్న ఓ గొప్ప పుస్తకం ఇప్పుడు కావాల్సింది తప్పొప్పుల పట్టిక తయారుచేయడం కాదు ఆ పుస్తకం పునర్ముద్రణ జరగాలి”
ఆ కవిత పలువురి దృష్టిని ఆకర్షించింది.
అప్పుడు జింబో రాసిన కవిత
‘నే చచ్చి పోతాననే కదూ నీ బాధ పిచ్చివాడా ఈ లోకంలో మనం బతికింది తొమ్మిది మాసాలే’
అప్పుడు చాలా హిట్టయిన కవిత.
కవితలు రాస్తూ పత్రికల్లో వస్తూవుండడం పెద్ద ఊపుగా వుండేది.
‘ఏ’ హాస్టల్ కు వెళ్లి వచ్చేవాళ్ళం. అక్కడ నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారయణరెడ్డి, గుడిహాళం రఘునాధం, అంబటి సురేందర్ రాజు మొదలయిన ఎంతో మంది కవులు వుండేవాళ్ళు క్రమంగా వాళ్ళతో స్నేహం కుదిరింది. అంతా ఒకే సాహితీ గూటికి చెందిన వాళ్ళం కదా. నందిని సిధారెడ్డి అప్పటికే కవిత్వం రాయడంతో పాటు మంచి ఆర్గనైజర్‌గా ఉండేవాడు. సుంకిరెడ్డికి సాహిత్యంతో పాటు ప్రేమ కథ ఏదో వుండేది. సురేందర్ రాజు బాగా చదువుకున్న వాడని అనేవాళ్ళు. నీషే గురించి ఇంకా పలువురు తత్వవేత్తల గురించి బాగా చదివాడని విజయ రావు చెప్పేవాడు. కేవలం చదువుకుంటే ఏం లాభం భై ఏదయినా రాయాలి చెప్పాలి కదా అని నేను అనేవాడిని. అందరమూ క్లోజ్ గానే వుండేవాళ్ళం. ఎందుకోగాని రఘునాధం నాకు కొంచెం ఎక్కువ నచ్చేవాడు.
ఈ క్రమంలోనే ఉస్మానియాలో ఒక సాహిత్య సంస్థ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అంతా ఆర్ట్స్ కాలేజీ ముందు పలుసార్లు కూర్చున్నాం. చర్చించాం. పేరేమి పెట్టాలనే చర్చ వచ్చింది. ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అన్న పేరు చర్చకు వచ్చింది. అయితే అది ఝరి పోయెట్రీ సర్కిల్ లాగా వుంది అన్న అభ్యంతరం చెప్పారు. నేనయితే ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ నే సమర్థించాను. అదే ఖాయమయింది. కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసారు. నిర్వహించారు.
ఇంతలో నాకు జూనియర్ కాలేజీలలో లైబ్రరియన్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు కాల్ లెటర్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యం వేసింది. అంత తొందరలో కాల్ వస్తుందని అనుకోలేదు. కానీ ఏంచేద్దాం వెళ్ళాల్సిందే. అందరేమో ఉద్యోగం వచ్చేసినట్టేనని అభినందించారు. ఇంటర్వ్యూ కోసం పెద్దగా ఏమీ తయారు కాలేదు. ఖైరతాబాద్ లోని హయ్యర్ ఎడుకేషన్ ఆఫీసుకి వెళ్లాను. బోర్డులో ఒక జాయింట్ డైరెక్టర్ మరెవరో వున్నారు. ఆయన కీచుగొంతు సుబ్బారాజు గారని పెద్ద పేరున్న అధికారి. ఏవో ప్రశ్నలడిగారు. నేనేవో చెప్పాను. ఒకే అన్నారు. నిరాసక్తంగానే బయటకు వచ్చాను. అక్కడెవరో చెప్పారు. ఈ ఉద్యోగాలు ఎక్కువున్నాయి, అభ్యర్థులు తక్కువ అని. తిరిగి కాంపస్కు వచ్చేసాను. ఒక వేళ ఉద్యోగం వస్తే నా ఎం.ఏ. ఎట్లా అన్న ఆలోచన వచ్చింది. అప్పుడే ఎక్స్టర్నల్ పరీక్షల కోసం యునివర్సిటీ ప్రకటన వచ్చింది. ఇంకేముంది.. జింబో నేను ఇంకా కొంత మంది మిత్రులం కట్టేశాం. నేను కరీంనగర్‌కు వచ్చేసాను. ఒక రోజు నేను వెంకటేష్ తదితర మిత్రులం ఫైర్ స్టేషన్ దగ్గరలో ఒక షాపులో వుండగా పోస్ట్‌మాన్ నన్ను చూసి “సార్ మీకు ఒక రిజిస్టర్ లెటర్” అన్నాడు. ఇంకేముంది అనుకునట్టుగానే అపాయింట్మెంట్ లెటర్. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్‌గా నియమించారు. అంతా అభినందించారు కానీ నాకే లోపల ఏదో ఒక మీమాంస ఈ నౌకరీలో చేరడమా…. ఇంకా చదువుకోవడమా.. ‘అందరూ ఉద్యోగాలు రాక ఏడిస్తే నువ్వేమిట్రా’ అన్నారు మిత్రులు… వెంటనే జాయిన్ కాలేదు. మూడు-నాలుగు రోజుల తర్వాత 18 జనవరి 1980 రోజున మంథని కాలేజీలో జాయిన్ అయ్యాను.
వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.
(ఇంకా ఉంది)
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక – పద ప్రతిభ – 83
నిశీధి ప్రయాణం
నిజమైన దృశ్యకావ్యం ‘శంకరాభరణం’
సవ్యసాచి
చిత్రగుప్తుడి నోము
ఉదార చరితానాంతు..
మీరొస్తున్నరా
విద్యా తపస్విని శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ
మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?
తెలిసొచ్చింది… తెలివొచ్చింది
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®