Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యద్భావం తద్భవతి!

అతి ప్రేమతో బంధాలు బందిఖానాలు కాకూడదని చెప్పే గోనుగుంట మురళీకృష్ణ కథ “యద్భావం తద్భవతి“.

కలికి గాంధారి వేళ…
అర్ధరాత్రి పూట గాంధారీ దేవి కళ్ళ గంతలు విప్పేసుకుని పతి పాదపూజకు కావలసిన ఏర్పాట్లు స్వయంగా చేసుకుంటుంది. ఆ సమయాన్ని ‘కలికి గాంధారి వేళ’ అంటారు. విజయవాడ నగరం మొత్తం గాఢ సుషుప్తిలో ఉంది. వీధులు దాదాపుగా నిర్మానుష్యంగా ఉన్నాయి.
ఇంద్రకీలాద్రి మీద కనక దుర్గమ్మ అమ్మవారి గుడి మొత్తం శోభాయమానంగా ఉంది. ఘాట్ రోడ్ క్రింద నుంచీ పైదాకా విద్యుత్ తోరణాలతో పందిరిలాగా వేసారు. అక్కడక్కడ ట్యూబ్ లైట్లు కర్రలకు కట్టి నిలబెట్టి ఉన్నాయి. దానికి కారణం సాకేతరాం, మైథిలిల ముద్దుల కూతురు శృతి వివాహం. ముహూర్తం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు. నాలుగు గంటల క్రితం వరకు ఆ ప్రాంతం బంధుమిత్రులతో, ఆహూతులతో కిటకిటలాడిపోయింది. ముహూర్తం అర్ధరాత్రి కాబట్టి మరీ దగ్గర బంధువులు ఓ వంద, నూట యాభై మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ భోజనాలు చేసి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారు.
పూలతో అలంకరించిన కళ్యాణ మంటపం మీద సాకేతరాం, మైథిలి కూతురిని మధ్యలో కూర్చోబెట్టుకుని పూజ చేస్తున్నారు. పట్టుచీరతో, ఒంటి నిండా నగలతో పగడాల చెట్టులా ఉంది శృతి. సాకేతరాం పట్టు ధోవతి, ఉత్తరీయం కట్టుకున్నాడు. మైథిలి కూడా పట్టు చీర కట్టుకుని ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతూ, ఇలా చేయండి అని చెబుతూ ఉంటే అయన చెప్పినట్లు చేస్తున్నారు ముగ్గురూ.
కొద్దిసేపటి తర్వాత పెళ్ళికొడుకు కూడా కళ్యాణ మంటపం దగ్గరకి వచ్చాడు. ఒక అరగంట తర్వాత తలమీద జీలకర్ర, బెల్లం పెట్టటం, మంగళ సూత్రధారణ ముగిసింది.
పురోహితుడు వధూవరులను, శృతి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని కనకదుర్గమ్మ దర్శనం చేయించాడు. అప్పటికి పెళ్లి తతంగం ముగిసి తెల్లవారు జాము నాలుగు గంటలు అవుతూంది. ఆలయం తలుపులు మళ్ళీ తెరిచి ఉంచారు.
“తల్లీ! నా చిట్టితల్లి ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో నూరేళ్ళు సుఖంగా జీవిచెటట్లు ఆశీర్వదించు” అమ్మవారి వంక చూస్తూ చేతులు జోడించి ప్రార్థించాడు సాకేతరాం.
పెళ్లి గడిచి వారం రోజులు అయింది. శృతి భర్త సుధీర్‌కు సెలవులు లేకపోవటం వల్ల మూడు నిద్రలు అయిపోగానే భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అతడు లాస్ ఏంజిల్స్‌లో ఒక మల్టీ నేషనల్ కంపెనీకి యం.డి.గా చేస్తున్నాడు.
ఆ రోజు ఆదివారం. సాకేతరాం పెళ్లి ఆల్బం ఒళ్లో పెట్టుకుని సోఫాలో కుర్చుని పొటోలు చూస్తున్నాడు. మైథిలి వంటగదిలో పని చూసుకుంటూంది. పెళ్లి అయిన వారం రోజులకే కూతురుని విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయినట్లుంది అతనికి. శ్రుతి ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అప్పటికి ఆల్బం ఇంకా తయారు కాలేదు. పెళ్లి ఫోటోలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండానే వెళ్ళిపోయింది. కొన్ని ఫోటోలు దాదాపు పది వరకు సెలెక్ట్ చేసి వాట్సప్ ద్వారా పంపించాడు సాకేతరాం.
ఆల్బం ఒళ్లో పెట్టుకుని సోఫాలో వెనక్కు జారగిలబడి కళ్ళు మూసుకున్న అతని దగ్గరకి కాఫీ కప్పుతో వచ్చింది మైథిలి. “కాఫీ తీసుకోండి” అందించింది.
“వద్దు మైధిలీ! నాకేమీ తాగాలనిపించటం లేదు, తినాలనిపించటం లేదు. మాటిమాటికీ నా చిట్టితల్లే గుర్తుకువస్తూంది.”
“అంత బాధ పడేవారు దానికి పెళ్ళెందుకు చేసారు?” నవ్వు దాచుకుంటూ అడిగింది.
“తప్పదు కదా!”
“ఇది కూడా అంతే అనుకోండి”
“అలా అనుకోలేకపోతున్నాను. పెళ్లి ఫోటోలు వాట్సప్‌లో పంపించాను. చూసినట్టు అర్థమైంది కానీ రెస్పాన్స్ ఇవ్వలేదు”
“అక్కడ ఏం పనిలో ఉందో, ఏమిటో?”
“కనీసం ఫోన్ చేసి, ‘బిజీగా ఉన్నాను డాడీ, తర్వాత మాట్లాడతాను’ అని ఒక్కమాట చెప్పవచ్చు కదా!”
“రాత్రి నాకు చేసింది లెండి”
“ఏమిటీ! నీకు ఫోన్ చేసిందా?” దిగ్గున లేచాడు సాకేతరాం. “ఏం మాట్లాడింది?” అడిగాడు.
“ఏదో అడిగింది. నిద్రమత్తులో గుర్తులేదు. రేపు ఉదయం మాట్లాడతానని చెప్పాను”
“రాత్రంతా ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు. రాత్రింబవళ్ళు దాన్ని నేను తలచుకుంటుంటే నాకు ఫోన్ చేయలేదు. అసలు పట్టించుకోని నీకు చేసింది చూడు” అలకగా అన్నాడు.
మైథిలి నవ్వింది. “పిల్లలకు తల్లితోనే ఎక్కువ చనువు. అందులోను ఆడపిల్లలకి మరీ ఎక్కువ ఉంటుంది. అందులో వింతేముంది?”
“నీకు నా కన్నా ఎక్కువ ప్రేముందా అమ్మాయి మీద?” ఈర్ష్యగా అడిగాడు.
“నువ్వూ, నేనూ ఏమిటండీ! ఇద్దరం ఒకటి కాదా! కాఫీ తాగండి. అవతల నాకు బోలెడు పని ఉంది. మీతో వాదిస్తూ కూర్చుంటే ఎలా?” కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి లోపలకి వెళ్లిపోయింది మైథిలి.
మైథిలి తల్లిదండ్రులు పెళ్ళికి వచ్చి వెంటనే తిరిగి బయలుదేరుతూంటే నాలుగు రోజులు ఉండమని అడిగింది మైథిలి. తల్లీ, దండ్రి ప్రతిరోజూ తెల్లవారుజాము నాలుగింటికే నిద్ర లేస్తారు. నిద్ర లేవగానే స్నానం చేసారు. తల్లి తులసికోటకు పసుపు రాసి బొట్లు పెట్టి అగరొత్తులు వెలిగించి పూజ చేసింది.
తండ్రి పూజగదిలో కుర్చుంటే పూజకి కావలసినవి అన్నీ సిద్ధం చేసింది. గంధపు చెక్క రాతి మీద అరగదీసి గంధం తయారు చేసింది. అయన నుదుట గంధపు బొట్టు పెట్టుకుని, మధ్యలో కుంకం బొట్టు పెట్టుకున్నాడు. టిఫిన్ చేయటం ముగించి తండ్రి భక్తి టి.వి. చూస్తూ కూర్చున్నాడు. మైథిలి, తల్లి కబుర్లు చెప్పుకుంటూ వంటింట్లో పని చూసుకుంటున్నారు.
సాకేతరాం మావగారు, అత్తగారి వంక చూస్తూ “వీళ్ళు ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇద్దరూ ఎప్పుడు చూసినా ప్రశాంత వదనంతో, సౌజన్యం ఉట్టిపడుతున్న మాటలతో ఉంటారు. తను అలా ఉండలేకపోతున్నా డెందుకు? అనుకున్నాడు. మైథిలికి కూడా తల్లిదండ్రుల పోలికే వచ్చింది. ఏ విషయంలోనూ భాధపడుతున్నట్లే కనిపించదు.
తనకి వారం నుంచీ శృతి గురించే ఆలోచన. చిన్నప్పటి నుంచీ ఎంత అల్లారుముద్దుగా పెంచాడు? జ్వరం వస్తే భార్య కన్నా ఎక్కువ గాభరా పడేవారు. రాత్రంతా మేలుకుని కూర్చునేవాడు. పుట్టినరోజు వస్తే తనకి పెద్ద పండగలా ఉండేది. శృతి పరీక్ష పాసయితే ప్రపంచాన్ని జయించినంత సంతోషపడేవాడు. అంత ప్రేమగా లాలించి, ప్రేమించిన కన్న తండ్రిని ఎలా మర్చిపోగలిగింది? అనుకున్నాడు.
సాకేతరాం సెల్ ఫోన్ వంక చూసాడు. వాల్ పేపర్‌గా కూతురి ఫొటోనే పెట్టుకునాడు. నిన్న, మొన్న రెండు సార్లు ఫోన్ చేసాడు. పోన్ రింగ్ అవుతూంది కానీ శృతి లిఫ్ట్ చెయ్యలేదు. వాట్సప్ మెసేజ్ ఇచ్చాడు. జవాబు లేదు. గుండెలమీద పెట్టుకుని పెంచి పెద్ద చేసిన తండ్రి కన్నా నిన్న కాక మొన్న వచ్చిన భర్త ఎక్కువ అయ్యాడా! అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోయిందా? ఆవేదనగా అనుకున్నాడు.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత అత్తగారు, మావగారు వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. వాళ్ళని పంపించటానికి సాకేతరాం, మైథిలి వాకిలి వరకూ వచ్చారు.
“వెళ్లి వస్తాం అల్లుడు గారూ!” అన్నది అత్తగారు.
మావగారు పరిశీలనగా  చూస్తూ “మరీ వంటరిగా అనిపిస్తే మా దగ్గరకి రండి. నాలుగురోజులు ఉండవచ్చు” అన్నాడు.
“సరే!” అన్నాడు సాకేతరాం. ఇద్దరూ కారు వెనక సీటులో కుర్చుని విండోలో నుంచీ చెయ్యి ఊపారు. కారు వెళ్ళిపోయింది.
ఇద్దరూ లోపలకి వచ్చారు. పని చేసిచేసి అలసిపోయిన మైథిలి మధ్యాహ్నం కునుకు తీయటానికి పడుకుంది. అయిదు నిమిషాల్లోనే నిద్రలోకి జారిపోయింది. సాకేతరాంకి నిద్ర పట్టలేదు. భార్య మొహం వంకే చూసాడు.
మైదిలి బి.ఏ. చదివింది. సాకేతరాం యం.టెక్. చేసాడు. రిటైర్ అవటానికి ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉంది.
“నేను వీడియో కాల్స్ చేస్తూ, ఫేస్ బుక్, వాట్సస్ చూస్తూ మోడరన్‌గా ఉంటాను. నువ్వేమో ఎప్పుడూ ఏ రామాయణ, మహాభారతమో చదువుకుంటూ ఉంటావు. తెలిసిన కథలేగా! వాటిల్లో సస్పెన్స్ ఏముంది? లేదంటే ఏ టి.టి.డి. ఛానెలో, హిందూధర్మం ఛానెలో చూస్తూ ఉంటావు. అందులో కూడా అవే చెప్తారు” అని ఎగతాళిగా అనేవాడు తను.
“పోనీలెండి. నేను పాతకాలపు దాన్నే! ఇదే నాకు ఇష్టం. ఇలాగే ఉంటాను” అనేది మైథిలి నవ్వుతూ. ఇప్పుడు కూడా నిశ్చింతగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ ‘ఏ టెన్షన్ లేనట్లు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది?” అనుకున్నాడు సాకేతరాం.
మైథిలి నిద్రలేచింది. పగలు ఎక్కువగా నిద్రపోదు. బడలికగా ఉండి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటుంది. మైథిలి గడియారం వంక చూసింది. సాయంత్రం నాలుగైంది. ప్లేట్లో నాలుగు మ్యారీ గోల్డ్ బిస్కెట్లు పెట్టి భర్తకు అందించింది. సాకేతరాం షుగర్ పేషెంట్. స్వీట్లు ఏవీ తినడు. షుగర్ కంట్రోల్‌లో ఉంటే మ్యారీ గోల్డ్ బిస్కెట్లు మాత్రం తింటాడు. వాటిల్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
అవి తినగానే టీ తీసుకువచ్చింది. ఇంతలో మైథిలి ఫోన్ రింగ్ అయింది. ఆన్ చేసి “శృతీ! నువ్వా! బాగున్నావా తల్లీ!” అన్నది. సాకేతరాం నిటారుగా అయ్యాడు.
“ఏముంది? ఇప్పుడే నిద్ర లేచి మీ డాడీకి టీ ఇస్తున్నాను. ఆ..ఆ… తాతగారు వాళ్ళు ఈ మధ్యాహ్నమే వెళ్ళారు. డాడీనా!… ఇదిగో! నా పక్కనే నిలబడి నీతో మాట్లాడటానికి రడీగా ఉన్నారు” అంటూ సెల్ అందించింది.
“అమ్మలూ! ఎలా ఉన్నావురా?” ఆత్రుతగా అడిగాడు సాకేతరాం.
“నాకేం! ఐయాం ఆల్వేస్ ఫైన్ డాడీ!” అవతల నుంచి అన్నది శృతి.
“ప్రతిరోజూ, ప్రతి క్షణం నిన్నే తలచుకుంటున్నాను. దూరదేశం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు…… ఎలా ఉన్నావో అని”
శృతి నవ్వేసింది. “వాట్ డాడీ! నేనేమైనా చిన్నపిల్లనా లేక చదువులేని దాన్నా! నాకేం భయం? మీరు, మమ్మీ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా ఉండండి”
“హాయిగా ఎలా ఉండనురా! నేను ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా నువ్వు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. మమ్మీ కేమో అడగకపోయినా ఫోన్ చేస్తున్నావు. నీకు మమ్మీనే గానీ నేను అవసరం లేదా?” అలకగా అన్నాడు.
“ఇండియాలో టైం వేరు, ఇక్కడి టైం వేరు కదా! ఏదో పనిలో ఉండి ఉంటాను. నాకు మీరిద్దరూ సమానమే! నా ఈ చదువు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ మీరు పెట్టిన భిక్షేగా డాడీ! ఐ లవ్ మై పేరెంట్స్” అన్నది.
మరో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత సాకేతరాం మనసు తేలికపడింది. ఫోన్ పెట్టేసి సోఫాలో భార్య పక్కన కుర్చుని, “ఈ వారం రోజులు ఎంత బాధ పడ్డానో తెలుసా! నా చిట్టితల్లికి నా మీద ప్రేమ లేదేమో అనీ, నన్ను మర్చిపోయిందేమో అనీ, లేదా ఏదైనా ఆపదలో చిక్కుకుందేమో అనీ రకరకాల ఆలోచనలు వచ్చి నరకంగా అనిపించింది. ఇప్పుడు నా మనసు తేలికయినది” అన్నాడు రిలీఫ్‌గా.
“ఇరవై రెండేళ్ళు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను ఎలా మర్చిపోతుందండీ! మనతో అనుబంధం ఎవరూ కాదనలేనిది కదా! ఏవో పనుల్లో బిజీగా ఉంది ఉంటుందని చెబుతూనే ఉన్నానుగా! నేనేమీ టెన్షన్ పడలేదు. వీలయినప్పుడు చేస్తుందిలే అనుకున్నాను. అదంతా మీరు ఊహించుకున్నది. అందుకే ‘యద్భావం తద్భవతి’ అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. మనం ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే కనబడుతుందని అర్థం” అన్నది మైథిలి.
“ఏమోనే! నాకు మాత్రం బేబీని వదలి ఒక్కక్షణం కూడా ఉండలేనేమో ననిపిస్తుంది”.
“చూడండి. మొహానికి పౌడర్ రాసుకోవాలి, పూసుకోకూడదు. రాసుకుంటే మొహం అందంగా ఉంటుంది. పూసుకుంటే వికారంగా ఉంటుంది. మనుషులతో అనుబంధం కూడా అలాంటిదే! ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. అతిగా ప్రవర్తిస్తే ప్రేమయినా ఎదుటి వారికి బందిఖానా లాగా ఉంటుంది. అటువంటి మనుషులకు దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది”.
“ఇన్ని విషయాలు నా కన్నా నీకు ఎలా తెలుసు? నువ్వు చదివింది బి.ఏ. నేగా! నేను చదివింది యం.టెక్.” అన్నాడు నవ్వుతూ.
మైథిలి భర్త ముక్కు పట్టుకుని ఊపింది. “ఎలాగంటే మీరు పెరిగింది హాస్టల్‌లో. నేను పెరిగింది అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ అందరి మధ్యా! వాటితో పాటు సత్గ్రంథ పఠనం వల్ల, సత్సాంగత్యం వల్ల మరికొంత అబ్బుతుంది.”
“సరే! నేను కూడా నా మనసు డైవర్ట్ చేసుకుంటాను. ఆంజనేయస్వామి దేవాలయంలో రేపటి నుంచీ వారం రోజుల పాటు గరికపాటి నరసింహారావు గారి ‘సుందరకాండ’ ప్రవచనాలు ఉన్నాయి. వెళదాం” అన్నాడు సాకేతరాం.
“అలాగే!” అని నవ్వుతూ తలూపింది మైథిలి.
—–000000—-
-గోనుగుంట మురళీకృష్ణ

Exit mobile version