ఎప్పటిలానే ‘యాత్ర’ 7వ ఎపిసోడ్ కూడా ఒక రైలుని, స్టేషన్లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. ఆ రాత్రి రైలు ఆగ్రా దాటి ఢిల్లీ వైపు వెళ్తుంది అంటూ నాయర్ వాయిస్‌ఓవర్‌లో చెప్తాడు.
టైటిల్స్ పూర్తయ్యేసరికి రైలు నది మీద బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తూంటుంది. దూరంగా తాజ్ మహల్ కనిపిస్తుంది. బోగీ తలుపు దగ్గరే నిలుచున్న రాహుల్ వెళ్ళి కూపే తలుపు బాదుతుంటాడు. లోపలున్న అతనేమో తలుపు తీద్దామనంటే, ఆమె ఏమో తీయద్దని అంటుంది. ఈలోపు రైలు ఆగ్రా స్టేషన్లో వచ్చి ఆగుతుంది. మొత్తానికి వాళ్ళు కూపే తలుపు తెరిచి దిగిపోతారు. వాళ్ళిద్దరికేసి వింతగా చూసి, రాహుల్ తన స్థానంలోకి వెళ్తాడు. కొందరు తమ ఏకాంతం కోసమో/తమ సౌలభ్యం కోసమో ఎదుటివారిని ఇబ్బందికి గురిచేయడానికి వెనుకాడరనడానికి ఈ జంట ఒక ఉదాహరణ.
రైలు కదులుతుంది. కెమెరా నీనా గుప్తా వైపు వస్తుంది.
ఆమెలో చిన్నగా పాడుతూంటూంది.
“నీ గొంతు బావుంది, పాడు” అంటుంది మరాఠీ వనిత.
“నాకు పాటలు రావు.”
“ఇప్పుడేగా పాడావు చక్కగా…”
“సరే, తప్పులుంటే నన్ను ఆటపట్టించకండి” అంటూ నీనా గుప్తా పాటందుకుంటుంది. సైడ్ లోయర్‌లో కూర్చున్న మరాఠీ వృద్ధుడు వచ్చి భార్య పక్కన కూర్చుని పాట వింటూంటాడు. పక్క నుంచి శిష్యుడు కూడా ఆసక్తిగా పాట వినడం కనిపిస్తుంది.
కొంత సేపు పాడి, ఆపేస్తుంది. ‘నాకింతవరకే వచ్చు’ అంటుంది.
“నేనెప్పుడు ఇలా అందరి ముందు పాడలేదు” అని చెప్తూ, ఉన్నట్టుండి కడుపు పట్టుకుని విలవిలలాడిపోతుంది. ఆమెకి కడుపులో నొప్పిగా ఉందని మరాఠీ వనిత గ్రహిస్తుంది. డాక్టర్ని పిలవమని భర్తకి చెబుతుంది. ఈ టైమ్‌లో రైల్లో ఏ డాక్టర్ ఉంటారు అంటాడతను. లేచి వెళ్ళి నాయర్‌కి చెప్తాడు. వచ్చే స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌కి చెప్పి, రైల్వే డాక్టర్ని పిలిపిద్దాం అంటాడు నాయర్.
***
డ్రామా ట్రూప్ ముమ్మురంగా సాధన చేస్తూంటుంది. రైలు స్టాప్ లేని చిన్న చిన్న స్టేషన్లను దాటుకుంటూ ముందుకు సాగుతుంది.
శిష్యుడు గురువుగారికి మంచినీళ్ళిచ్చి, మాత్ర ఇవ్వబోతే స్వామీజీ నీళ్ళు మాత్రం కొద్దిగా తాగి, మాత్ర వద్దంటారు. శిష్యుడు నాయర్ కేసి తిరిగి, “మిస్టర్ నాయర్, మనం డాక్టర్ని పిలవాల్సిందే” అంటాడు. రైలు ఢిల్లీ సరిహద్దుల్ని సమీపిస్తుంది. డ్రామా ట్రూప్ వాళ్ళు పాటలు ఆపేసి, సామాన్లు సర్దుకోవడం మొదలుపెడతారు.
కెమేరా స్టేషన్ లోని ప్లాట్‌ఫారంపైకి మళ్ళుతుంది. అక్కడ ఒక పెద్ద సిక్కు కుటుంబం టిటిఇని సీట్ల సర్దుబాటు చేయమని బతిమాలుతుంటుంది. “మీకున్నవి ఆరు సీట్లే ఇంతమందిని ఎలా అడ్జస్ట్ చేయను, కుదరదు” అంటాడు టిటిఇ. “పెళ్ళికి వెళ్తున్నాం, ఇబ్బంది పడిపోతాం” అంటూ బ్రతిమాలుతాడా కుటుంబం పెద్ద. “సరే మీ ఆరుగురు మీ బోగీలో కూర్చోండి, మిగతా వాళ్ళకి వేరే బోగీలో ఇస్తాను” అంటాడు టిటిఇ. ఆ ఇంటావిడ జోక్యం చేసుకుని, అందరికీ ఒకే చోట కావాలి అంటుంది.
రైలొచ్చి ఆగుతుంది. డాక్టర్ని తీసుకురావడానికి నాయర్ కిందకి దిగుతాడు. డ్రామా ట్రూప్ దిగిపోతుంది. రాహుల్ కూడ దిగిపోయి, బయటకి నడుస్తాడు. ఎంక్వైరీలోకి వచ్చి విజయవాడ వెళ్ళే రైలు ఎన్నింటికి ఉందో కనుక్కుంటాడు.
నాయర్ స్టేషన్ మాస్టర్ దగ్గరకొచ్చి వేణుగోపాల్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. వివరాలేవీ తెలియకపోవడంతో, ఏదైనా తెలిస్తే జమ్మూ స్టేషన్లో తనకి తెలియపరచవలసిందిగా కోరుతూ, తన అడ్రస్ రాసిస్తాడు. అలాగే తమ బోగీలో ఒక గర్భవతి, ఒక వృద్ధ స్వామీజీ అనారోగ్యంతో ఉన్నారనీ, వారికి వైద్య సహాయం అవసరం ఏవరైనా రైల్వే డాక్టర్ని పంపిస్తారా అని అడుగుతాడు. తప్పకుండా పంపిస్తానని చెప్పి బోగీ నెంబర్ అడుగుతారు స్టేషన్ మాస్టర్. నెంబర్ నాలుగని చెప్తాడు నాయర్.
పంజాబీ పెళ్ళి బృందమంతా రైలెక్కుతుంది. వాళ్ళ సందడి మధ్య రైల్వే డాక్టర్ వచ్చి నీనాగుప్తాని పరీక్షిస్తాడు. “ఈ సమయంలో ఈమెని ఇలా ప్రయాణం చేయిస్తున్నారు, మీరేం తల్లిదండ్రులు?” అంటాడు.
“మేం ఆమె తల్లిదండ్రులం కాదు, తోటి ప్రయాణీకులం. ఆమె తన పుట్టింటికి జలంధర్ వెడుతోంది” అని మరాఠీ వృద్ధుడు చెబుతాడు.
“నన్నడిగితే, ఈమెని ఇక్కడ దింపేసి, హాస్పిటల్లో చేర్చాలి” చెప్తాడు డాక్టర్.
“వద్దొద్దు” అంటుంది నీనాగుప్తా. నేను మా అమ్మ దగ్గరకి జలంధర్ వెళ్ళాలి అంటూ గొడవ చేస్తుంది.
చేసేదేం లేక డాక్టర్, రైల్లోనే వేరే కంపార్ట్మెంట్లో ఉన్న ఓ డాక్టర్ని మధ్య మధ్యలో వచ్చి నీనాగుప్తాని చూస్తుండమని చెప్పమని సిబ్బందికి చెప్తారు.
ఈ డాక్టర్ ఏ బోగీలో ఉంటారో ఆ వ్యక్తిని నాయర్ కనుక్కుంటాడు.
స్వామీజీని కూడా ఓసారి పరీక్షించమని డాక్టర్ని కోరుతాడు.
అలాగేనంటూ వచ్చి స్వామీజీని పరీక్షిస్తారు. “ఎన్నాళ్ళ నుంచీ స్వామీజీకి ఇలా ఉంది?” అని అడుగుతాడు. రెండు వారాల్నించి అని చెప్తాడు శిష్యుడు. “మొదట కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ తమిళనాడులో తుఫాను రావడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చారు. అప్పట్నించీ….” అని చెప్పుకొస్తాడు శిష్యుడు.
“అసలీయన ఇంతవరకు ప్రయాణించడమే ఒక అద్భుతం… ఇక వీరికి ఏం మందులూ ఈయలేం… ఐ యామ్ సారీ” అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు.
రైలు బయల్దేరుతుంది. నాయర్, శిష్యుడు ఒకరినొకరు చూసుకుంటారు. నాయర్ సిగరెట్ వెలిగిస్తాడు.
“మీరెందుకో ఆందోళనగా ఉన్నారు?” అడుగుతాడు శిష్యుడు.
“వేణుగోపాల్ ఇంకా ఇంటికి చేరలేదు” అంటాడు నాయర్.
“ప్రాణాలకేం ప్రమాదం లేదుగా?”
“తెలియదు. ఇలా శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతాయో?” అంటాడు నాయర్. కొన్ని క్షణాలాగి, “అతన్ని ఇద్దరు వెంబడిస్తున్నారనీ, అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని నాకు తెలుసు. అయినా… ఈ విషయం నా మనసులోంచి ఎట్లా తప్పించుకుందో… నా వీరత్వాన్ని చూపించాలని దొంగల వెంట పడ్డాను… దేని కోసం? వెండి బంగారు నగల కోసమా?” అంటాడు బాధగా.
రైల్వే స్టాఫ్ వెళ్ళి కూపే తలుపుకొడతాడు. మగతను తలుపు తీయగానే, “నమస్కారం డాక్టర్. సెకండ్ క్లాస్ నాల్గో నెంబర్ బోగీలో ఒక గర్భవతి ఉంది. ఆమెకి ఏదైనా అవసరమైతే మీ సహాయం కోరమని రైల్వే డాక్టర్ చెప్పారు” అంటాడు.
“డాక్టర్ నేను కాదు, నా భార్య” అంటాడతను.
“మేడమ్, మీరు వస్తారుగా…” అని అడుగుతాడు.
“తప్పకుండా వస్తాను. కాసిని వేణ్ణీళ్ళు సిద్ధంగా ఉంచండి” అంటుందామె. కాసేపు ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటారు.
పంజాబీ పెళ్ళి బృందం జోరుగా, హుషారుగా పాటలు పాడుతూంటుంది.
నీనాగుప్తా మూల్గుతూ నిద్రపోడానికి ప్రయత్నిస్తుంటూంది. జలంధర్ ఎప్పుడొస్తుంది? అంటూంటుంది.
రైలు ముందుకు సాగుతుంది.
ఉన్నట్టుంది నీనాగుప్తా భయంతో గట్టిగా కేకలు వేస్తుంది. ఆమెకేదో భయంకరమైన కల వస్తుంది. ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతుంది. గట్టిగట్టిగా కేకలు వేస్తుంది. ఆమెకి నొప్పులు వస్తుంటాయి.
నాయర్ రైల్వే స్టాఫ్‌తో వెళ్ళి కూపే తలుపుకొడతాడు. విషయం చెప్పి డాక్టర్ని రమ్మంటాడు. ఆమె బయల్దేరుతుంది.
వచ్చి “డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారో తెలుసా? మంత్లీ రిపోర్ట్స్ ఉన్నాయా?” అని మరాఠీ వనితను అడుగుతుంది.
“మేం ఈమెని రైల్లోనే కలిసాం. ఎనిమిదోనెల అని చెప్పింది” అంటుందామె.
డాక్టర్ అక్కడున్న వారిని ఖాళీ చేయించి, వేణ్ణీళ్ళు సిద్ధం చేయించమని నాయర్‌కి పురమాయించి, తన సామాన్లు తెమ్మని రైల్వే స్టాప్‌ని కోరుతుంది. నీనాకి ధైర్యం చెబుతూ, తన భర్త సహాయంతో ఆమెకి పురుడు పోస్తుంది. ఆడపిల్ల పుడుతుంది. చేయాల్సినవన్నీ పూర్తి చేసి డాక్టర్ వెళ్ళిపోతుంది.
“పిల్లలు పుట్టడం సృష్టిలో ఒక అద్భుతం” అంటారు స్వామీజీ.
అందరూ ఎక్కడివాళ్ళక్కడ సర్దుకుంటారు.
“…what thrills me about trains is not their size or their equipment but the fact that they are moving, that they embody a connection between unseen places” అన్న Marianne Wiggins మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఆపుదాం.
ఈ 7వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.
ఎనిమిదవ ఎపిసోడ్ తదుపరి సంచికలో!
(సశేషం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జీవన రమణీయం-35
చిరుజల్లు-104
నారద భక్తి సూత్రాలు-1
కశ్మీర రాజతరంగిణి-22
నాన్న నిజం చెప్పలేదు
సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీ – ఒక అప్డేట్
కాజాల్లాంటి బాజాలు-136: మా వదిన మూడురోజుల ప్రయోగాలు..
సత్యాన్వేషణ-30
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-16
మహాభారత కథలు-20: కౌరవ వంశము – యయాతి మహారాజు చరిత్ర
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®