ఆవృతాల ఆవృతాల అవనిలో –
ఇరుసులేని విస్మృత కాలగమనలో …
కరోనాలు.. కల్లోలాలు.. ఎన్నెన్నో
ఎగసి ఉవ్వెత్తున ఎగసి..
చరితను.. నరజాతి నడకను –
సరళిని.. యోచనా పరిధిని ..
నిమేష మాత్రంగా కుదిపి
మంచికై ముందుకు నెట్టే!
అగుపించిన విశాల పథం
ఎలుగెత్తిన హృదయ సందడి ..
మావిచిగురుగా సవరించిన కోకిల
అందిన ఆరురుచుల అనుభూతులు ..
పడమటకై వడివడిగా పరువులిడే!
విస్మయ సంజ రంగేళిలో –
వినయ విస్మిత యోచనలో చూస్తున్నా ..
ఇరులులేని శోభకృత్ ఉషఃకాంతికై !!



ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు.
మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు:
“మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”