సిరులు పండిన మలయమారుతం మలయాల భూమి
సస్యశ్యామల సుందరాంబుధువుల రాజ్యం
గలగల వరద అలలు మలయాలమంత హాలాహలముగ మారె
బోసిబోసి నవ్వులన్ని అందనంత దూరమేగగ
కాళరాత్రి కపట వేషమున వచ్చినంట్లుండె
పులకింతల పల్లెసీమలు పదురుచు పరుగులంఘించె
లోతులోయలన్ని జలము నింపుకొని యమపాశమాయె
ఇల్లు వదిలి కూటికెళ్ళిన సర్వజనము సంద్రమాయె
కటకటాల వరదకడలిన దాగెను సర్వజనుల స్వేచ్ఛ
సిరిగాంచిన మాతృభూమి మృత్యుభూమిగ మారె
సర్వజనుల కోపతాపమెల్ల కొండకోటలుదాటె
ఆడపడుచుల ఆర్తనాదములు ఎవరు ఆలపించకపోయె
పచ్చపచ్చ పంటలన్ని పిడచగట్టుకుపొయె
కలకలలాడే సౌధములు కూడ శిథిలమై శిఖరమెక్కె
ముక్కుపచ్చలారని పసికూనల ముళ్ళ బ్రతుకులాయె
విధివంచన విశ్వరూపము దాల్చెను కదా
విపత్తు సర్వమతావళిని ఒక్క సందిట చేర్చెను
కేరళీయుని మురళిగానమంత మ్రూగబోయె
దక్షిణాత్య అందములకు అంధకారమన్నది అతిథిగా వచ్చె
సంకల్పమన్నది ఆబాలగోపాలాన్ని ఆవహించెను
దేవభూమిన దేవుని అండదండ లేకుండకపోయె
భారతీ దేవి పాదపద్మము మోడుబారిపోయే
ప్రకృతి కన్నెర్రకు కడలి కదిలి తోడుగ వచ్చె
సుగంధమూళికలు సుడిగాలిన కలసిపోయే
ఆహ్లాదము కూడ అలిగి అందనంత దూరముగ జరిగె
అలౌకిక ఆనందమంత అంతులేకుండపోయే
ముకుళిత హస్తాల స్వాగతము విగతమాయె
కమ్మకస్తూరి కాలగమనమున కలసిపోయె
విధి నారికేళకేరళము తో విలాసములాడెనా
ఒకే భాష ఒకే జాతీ రక్షణార్థం ఒకటాయెనా
జలప్రళయందు దీనులు దిక్కులేని దివ్వెలాయె
కేరళీయులు కన్నీరుమున్నీరై కలతచెందెను
మానవత్వపు మమతకై మది అంతా వెదుకుచుండె
ఆదరించమన్న ఆర్తనాదం ఆవిరైపోతుండె
వాన వరద ఒక్కనుదుటున ఒడిసిపట్టి చూపెను
నోరుమెదపని మూగజీవులు తుఫాను తీరమును తుడుచుకుపోయె
కూడుగుడ్డలొదిలి కుప్పకూలిపోయె జనవాసము
సాయముకోసము సాగిలపడి సర్వకేరళం సాధు శయనమాయెను కదా
అందమైన రాదారుల అందెల వళి అంతైనఐలేక అలమటించె
విపత్తు విగతజీవిగ చేసి వెన్ను విరిచెను
ఎన్నో ఏళ్ళ సంపద గంగమ్మ పాలయ్యెనా
ఊరువాడంత ఒక్కనుదుటన ఉబికిపోయెనా
దారులన్ని తీరులు మార్చి తీరములాయెనా
చేలుచెట్లు ముంచి కడకు చితులు కూడా ముంచెనా
కన్నీటివరదల కంటిన నీటిని ఆపుదాం
చేయిచేయి కలిపి కలసి సాగి చేయూతనిచ్చుదాం
దీనజనలందరినెల్ల మనదరి చేర్చుకొందమూ
భారతీయ సరిహద్దుకు సాధ్యమైనంత సాయమందుదాం
సర్వజనులకు సాకారము కలగాలని ఆశిద్దాం
కారణాన్ని కాలదన్ని కలసిమెలసి ముందుకేగు మిత్రమా
ఎల్లలోకములొక్కయిల్లై మలయ సోదరునికి మది నిండా మమత నింపు
మదిన మెదిలె మసకరాత్రిని మాపివేయుదాం
చిన్నపెద్ద కలసి చిట్టిరూకను చేతికి
కలకలలాడే కేరళమ్మకు కాసంత కూడెట్టుదాం
బస్సుబందు తిండిబందు నీరుబందు దిక్కుబందు
స్వార్థమొదిలి చేతనైన సాయమందు సోదరా!
సైనికుడెత్తిన సాయమందున ఒక చేయి అందించు
కలకలకన్నీరొలికే కేరళా కడుపుమంట ఆపుదాం
పిడికిలెత్తి పరుగులెత్తి అన్నార్ఠులకండగుందము
కదలిరండి కదలిరండి తీరజనుల దరిచేరండి
థాంక్యూ సో మచ్ రాజ్యలక్ష్మి గారు