[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సురేఖ పులి గారి ‘పొట్లం కట్టిన పేపర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“ఈ తాజా మల్లెపూలదండ ఐదు మూరలు ఇవ్వు” యాభై రూపాయలు పర్స్ నుండి తీసి పువ్వులు అమ్మే అవ్వకు ఇచ్చాడు నారాయణ.
“సారు, మల్లెపూలు శానా పిరియం అయినాయి, ఇంకో యాభై ఇయ్యండి, ఐదు మూరలకు.” ఆమె అడిగినంత ఇచ్చా డు. చేతిని కొలత బద్దగా పెట్టి ఐదు మూరలు కొలిచి పేపర్లో పొట్లం కట్టింది.
“కవరు లేదా? పేపర్లో కడుతున్నావు?”
“ప్లాస్టిక్ కవర్లు బ్యాను ఐనవంట సారు, గందుకే పేపర్ల సుడుతున్న..”
మల్లెపూల పొట్లం తీసుకున్నాడు.
పూలమాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ‘మాతేశ్వరి నమస్తుభ్యం’ అంటూ పూజ చేసుకుని “నా ప్రమేయం లేకుండా నేను స్కామ్‌లో ఇరుక్కున్నాను. ఈ ఆపద నుండి నన్ను రక్షించు తల్లి!”
సాస్టాంగ నమస్కారం చేశాడు. చెమ్మగిల్లిన కళ్ళతో పొట్లం కట్టిన పేపర్ చెత్త బుట్టలో వేయబోతున్న వేళ అనుకోకుండా అక్కడున్న అంశం పై చూపు నిలిచింది. కళ్ళు తుడుచుకుని, కళ్ళజోడు పెట్టుకొని చదివాడు.
***
“ఏమైందమ్మా ఇంటర్వ్యూ?” ఆశ, ఆతృతను అదుపు చేసుకోలేక గణపతి అడిగాడు కూతుర్ని.
“నా మటుకు నేను బాగానే చేశాను బాబా, సెలెక్ట్ కూడా అయ్యాను, కానీ ఒక కండిషన్ పెట్టారు. అదే నాకు నచ్చలేదు, ఈ ఉద్యోగం వద్దనుకుంటున్నాను” సుజన నిట్టూర్చింది.
“ఎవరైనా రచ్చ చేసి నిన్ను కించ పరిచారా? అక్కడ జనాలు తిక్కగా వున్నారా?” కారణ ఛేదన చేశాడు తండ్రి.
“అదేం లేదు బాబా, అక్కౌంట్స్ సంబంధమైన విషయాలే అడిగారు. అంత వరకు బాగానే వుంది. ‘ఆల్రెడీ వున్న ఒక్క పోస్ట్ భర్తీ ఐయింది, మీకు ఇష్టమైతే ప్రొడక్షన్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి, ముందస్తుగా మీరు అక్కడ జాయిన్ అయిన పిమ్మట మిమ్మల్ని అక్కౌంట్స్ సెక్షన్ మారుస్తా’మన్నారు.”
“ఇంత చిన్న కారణానికే నువ్వు నిరుత్సహపడితే ఎట్లా తల్లీ? పబ్లిక్ సెక్టార్ ఉద్యోగం అంటే మాటలా! ప్రొడక్షన్ అయితే నీకేంటి? అడ్మిన్ అక్కౌంట్స్ అయితే నీకేం? హాయిగా జాయిన్ అయిపో. నీకు అంత పెద్ద కంపెనీలో అవకాశం దొరికినందుకు ఎంతో అదృష్టం అనుకోవాలి” తండ్రి ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు.
గణపతి ప్రైవేట్ స్కూల్ ప్రైమరీ టీచర్. ప్రభుత్వానికి చూపించే జీతాలు, ఉపాధ్యాయులకు యిచ్చే జీతాలకు మధ్య ఏర్పడిన వ్యత్యాసం స్కూల్ యాజమాన్యం యొక్క అంతస్తుకు ప్రతిబింబం. పైగా టీచింగ్ ట్రైనింగ్ లేనందున గణపతికి ఒక్క పీరియడ్ కూడా విరామం కేటాయించక అన్ని తరగతుల విద్యార్థులకు నీతి కథలు చెప్పాలి, సెలవులో ఉన్న టీచర్ల క్లాస్ పాఠాలు బోధించాలి. స్కూల్ సెక్రటరీ గారి ఇంటి పనులు చక్కబెట్టాలి. లేదంటే రెపరెపలాడే ఉద్యోగం ఊడుతుందని భయం!
గణపతి దంపతులకు ఎన్నాళ్లకు పిల్లలు పుట్టలేదు; చెత్త కుప్పల్లో దొరికిన పాపను తెచ్చి ఎంతో ఆనందంగా పెంచుకున్నారు. సుజన ఇంటికి వచ్చిన ఐదేళ్ల తరువాయి పెంచిన ప్రేమకు చిహ్నంగా మగపిల్లాడు పుట్టాడు.
ఎలక్షన్ల హామీల రాపిడిలో ప్రభుత్వ పట్టాల పంపిణీ వలన దొరికిన ఒక సెంటు స్థలంలో పెంకుటిల్లు కట్టుకొని ఉన్న సమయంలో గణపతి భార్య గతించింది. పిల్లలు చిన్న వయస్కులైనా అన్ని పనుల్లో సహాయపడేవారు. తాను పస్తులు ఉన్నా పిల్లలు మాత్రం పౌష్టికాహారం తినాలని, దర్జా కొలువు చేయాలని సగటు తండ్రి ఉబలాటం!
ఉన్నంతలోనే చదువు చెప్పిస్తూ, తన ఆశల కలలు కథలుగా చెప్పేవాడు. వచ్చే నెలలో గణపతి రిటైర్మెంట్.
పబ్లిక్ సెక్టార్ ఉద్యోగం అంటే మాటలా! తండ్రి మాటలే చెవిలో మారుమ్రోగుతున్నా యి. ఇంటర్వ్యూ బోర్డు కూడా అదే మాట ‘మీరు ప్రొడక్షన్ సైడ్ జాబ్ ఒప్పుకుంటే, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే కార్మికులకు లభించే ఎన్నో బెనిఫిట్స్ మీకు వుంటాయి.. డైరెక్ట్ బోనస్‌లు, వేజ్ రివిషన్, ఎల్.టి.సి., హోమ్ టౌన్, ఈ.ఎస్.ఐ., పి.ఎఫ్., ఫ్యామిలీ పెన్షన్., సంవత్సరానికి ముప్పయి సెలవులు, తక్కువ వ్యవధిలోనే ప్రమోషన్, సిటీలో అన్ని చోట్లకు కంపెనీ బస్, సబ్సిడీ ధరలకు టీ-టిఫిన్, భోజనం, నాణ్యత ఉన్న మిల్లు యూనిఫార్మ్..’ అని చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చూపించారు.
‘బాబా రిటైర్మెంట్ కంటే ముందే తన జీతం ఇంట్లోకి రావాలి, తమ్ముడు తనను మించి చదువుకోవాలి! చిన్న తొట్టిలో పెద్ద చేప కంటే పెద్ద తొట్టిలో చిన్న చేప బతుకు బాగుంటుంది.’
***
సుజన విద్యుత్ బల్బుల ఫ్యాక్టరీలో జాయిన్ అయింది. తయారైన బల్బులకు ప్యాకింగ్ కవరు తొడిగించి పెద్ద అట్ట డబ్బాలలో అమర్చాలి. అసెంబుల్ మెషిన్ ఔట్పుట్ నుండి వచ్చే తయారీ బల్బుల వేగం అందుకొని పని చేయాలి. ఇంత చిన్న పనికి డిగ్రీ చదువు ఎందుకు అనుకుంది.
సెక్షన్ యూనియన్ లీడర్ వచ్చి పలకరించాడు “ఈ కర్మాగారంలో అవయవాలు కోల్పోయిన, మృతి చెందిన కార్మికుల కుటుంబీకులు కోసం సానుభూతిగా దయతలిచి డ్యూటీ ఇచ్చే సెక్షన్ ఇది, నువ్వెందుకు ఇక్కడ జాయిన్ అయినావు?”
‘నువ్వు’ అనే సంబోధన చిరాకు వేసింది. సుజన జవాబు ఇవ్వలేదు.
“డిగ్రీ-ఇంగ్లీష్ చదువుకున్నవేమో, ఇది మా కాండిడేట్‌కు రావాల్సి వుండే, నీకు ఇక్కడ నౌకరీ దొరికింది అంటే.. నీది ఎవరి రికమెండ్?”
ఇంకా ఏవేవో మాట్లాడుతున్నాడు. ‘నచ్చని మాటలకు సమాధానం ఇవ్వవద్దు’ తండ్రి మాటలు గుర్తుకు తెచ్చుకుంది.
“సుజనా, ప్రతి నెల యూనియన్ ఫీజు కట్టాలి. మన సెక్షన్ నుండి నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ అంటే మాటలు, స్పీచ్ ఇయ్యగలవా?”
“లేదండీ, నాకు అవేవీ రావు సర్” గౌరవంగా సంబోధించినందుకు సంతోషపడ్డాడు యూనియన్ లీడర్.
“అమ్మా నాయిన లేరా? చక్కని చుక్క వలె ఉన్నావ్, పెళ్లి చేసుకొని మొగుడితో సంసారం చేసుకోక.. మాతో సమంగా కూసోని డ్యూటీ చేస్తే ఏమన్నా బాగుందా?” సీనియర్ ఉద్యోగుల ఉచిత సలహాలు సుజన పట్టించుకోలేదు కానీ పక్కనే ఉన్న సరోజిని వెకిలి నవ్వు ఎందుకో అర్థం కాలేదు.
మే డే పండుగ అని ఫ్యాక్టరీ గేట్ ముందు పెద్ద షామియానా, యూనియన్ నాయకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మైకు, కార్మికుల కోసం నేలపైన దళసరి తివాసీలు సిద్ధమయ్యాయి, చూస్తుండగానే వేదిక పెద్దలచే అలంకరించబడింది.
ఎర్ర జెండా ఎగురవేసి కార్మిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, శ్రమ దోపిడీ అరికట్టి గెలుపొందిన తీరుతెన్నులు వివరించారు. శ్రామిక వర్గానికి చైతన్యం కలిగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో యజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ దోపిడీ విధానం పోవాలంటే ప్రపంచ కార్మికులు ఏకం కావాలి! ఈ సమయాన మేనేజ్మెంట్తో పోట్లాడి గెలిచిన ‘మినిమమ్ (కనీస) బోనస్’ మన కార్మికుల కొరకు ప్రకటిస్తున్నాము” అందరి చప్పట్లతో ఘనంగా సాగిన కార్మికుల సభ ముగిసింది. ‘బోనస్’ ప్రకటన చల్లదనంతో మే నెల ఎండ తీవ్రత తెలియలేదు.
బోనస్ డబ్బులు తండ్రి చేతిలో పెట్టి “నువ్వు చెప్పిన మాట నిజమే బాబా, నేను చేస్తున్న పని, అక్కడ వున్న వాతావరణం నాకు నచ్చలేదు కానీ నిరుద్యోగం పెనుభూతం లాగా వున్న ఈ రోజుల్లో వచ్చిన ఏదో ఒక ఉద్యోగం చేయడం సబబు” నిరాశలో కూడా ఆశ చూసుకుంది.
“మీరు కొత్త బట్టలు కొనుక్కోండి” అని గణపతి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. రోజులు గడిచిపోతున్నాయి, యాంత్రిక జీవితం.. ఇల్లు, ఆఫీసు; పరుగుల జీవనం! సెలవు రోజున ఇంటిపని లేదంటే నిద్ర!
మనస్ఫూర్తిగా బాబాతో, తమ్ముడితో మాట్లాడి ఎన్ని రోజులైందో..
సుజనకు ఎవ్వరూ స్నేహితులు కాలేదు, అందరూ దూరం పెట్టేశారు. ఒకవేళ తానే కల్పించుకుని మాట్లాడినా ‘పెండ్లి ఎప్పుడు చేసుకుంటావు? జీతం అంతా మీ నాయినకు ఇచ్చేయకు, పెండ్లికి కూడబెట్టుకో..’, లేదంటే ‘ఏమైనా పైసల్ ఉంటే అప్పి స్తావా?’ సరదా మాటలే లేవు.
‘దసరా పండుగ వైభవంగా జరుపుతాము.. చందా ఇవ్వమని’ సెక్షన్ అబ్బాయిలు కొంతమంది పెన్ను-పేపర్ పట్టుకొచ్చారు. మారు మాట్లాడక వారు అడిగినంత ఇచ్చేసింది. ఎవరి ఆర్భాటం వారిది!
కంపెనీ తరపున మేనేజ్మెంట్ శాస్త్రోక్తంగా అష్టమి నాడు దుర్గాదేవి పూజ జరిపించారు. అమ్మ వారి విగ్రహం వెనుక విద్యుత్ చేరికతో మెరిసే చక్రం తిరుగుతూ వుంటే చాలా ముచ్చటగా వుంది. ఫ్యాక్టరీలో ఎన్ని విభాగాలు ఉంటే అన్ని పూజలు!?
టెన్త్ క్లాస్‌లో తెలుగు టీచర్ చెప్పేవారు.. ‘ఒక ఇంటి యజమాని తానున్న ఇంట్లో ఒకటికి మించి పూజ గదులు వుంటే.. ఆ ఇల్లు కళ తప్పుతుంద’ని.. ఇంత పెద్ద ఫ్యాక్టరీ! ఎంతో మందికి జీవనోపాధినిచ్చే పెన్నిధి!! అన్ని బాగుండాలని అనుకోవాలి. ఏది ఏమైనా మెరుస్తూ కాంతివంతంగా తిరిగే చక్రం అద్భుతంగా అనిపించింది.
***
ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయి. దేశ రాజకీయ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో కమిటీ, సమావేశాలు జరిగాయి. బోనస్ మాట దేవుడెరుగు, నెల జీతాలకే దిక్కు లేదు. ‘ప్రైవేటీకరణ వద్దు’ అంటూ కార్మిక సంఘాలు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాయి.
ప్రజలు ఎన్నుకున్న నేతలు ప్రజలను ఆపదలో ఆదుకోకుండా, ‘ఉత్పత్తులు మీ వంతు-లాభాలు మీ వంతు’ అని ప్రభుత్వం చేతులెత్తేసింది. అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానం కాదు, ఒక గంట కూడా పని లేక కార్మికులు అలల్లాడారు. జీవనోపాధి కోసం ఇంట్లో వస్తువులు అమ్ముకోవటం లేదా అప్పుల కోసం అర్రులు జాచటం తప్ప వేరే మార్గాలు కనిపించలేదు.
యాజమాన్యం కార్మికులకు నిర్దేశించిన నియమ-నిబంధనల ప్రకారం నడుచుకున్నారు. ఏ వేళ రావాలి, నిర్ణయించిన ఎన్ని గంటలు పని చేయాలి, ఎట్టి భద్రత పాటించాలి; ఎక్కడా తప్పిదం జరుగలేదు.
‘కర్మాగారం మూసివేతకు కార్మికులే బాధ్యులు’ అని గొంతెత్తి వచ్చే వార్తలు ఎవ్వరు ఖండించలేదు. కళకళలాడే కర్మాగారం కాంతివిహీనం అయింది. కార్మికుల జీవితంలో కరువు కేకలేసింది.
మౌనంగా సుజన మనసు ఏడుస్తుంది, “కరుణ లేని నా కన్న తల్లికి నేను బరువైనాను. కడుపులో పేగు తెంచుకోగానే, పొత్తిళ్లలో అదుముకోలేదు, ఎదను అందించి నా ఆకలి తీర్చలేదు.
దయతలచి, ‘సుజన’ అని ప్రేమతో నన్ను పెంచుకున్న తండ్రికి చేయూతను ఇవ్వలేకపోతున్నాను. ఏమిటి నా జీవితం? ఈ అచేనత్వం సమసిపోదా?? రిటైర్ అయిన బాబా మళ్లీ పనికి పోవద్దు, తమ్ముడు చదువును మధ్యలో ఆపొద్దు. మా చిన్న ఇల్లు గడవడానికి మార్గం చూపు స్వామి!” అని మొదటిసారి భగవంతుడిని వేడుకుంది.
***
చార్టర్డ్ అకౌంట్స్ ఆఫీసులో ఇంటర్వ్యూ! ఈ ఉద్యోగం వస్తే కొంత ఊరట. తల పండిన పెద్దలు వేసే ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు ఇచ్చింది సుజన.
“ప్రభుత్వ రంగ సంస్థలో ఐదేళ్ల అనుభవం అని మీ ‘రెస్యూమే’ తెలుపుతుంది. టూకీగా మీరు నిర్వహించిన పనితీరు వివరించండి?” పెద్దమనిషి ప్రశ్న. జగమెరిగిన సత్యమే, తాను పని చేసిన విద్యుత్ బల్బుల ఫ్యాక్టరీ స్మశానం వలె మారింది. కానీ బి.కాం. చదివి అకౌంటెంట్ ఉద్యోగం కోసం అగచాట్లు పడే వేళ ‘బల్బులకు కవర్లు తొడిగించిన’ అనుభవాన్ని (ఎక్స్పీరియన్స్) కాలర్ ఎగరేసి చెప్పాలా? చెప్పకపోతే అబద్ధం అని నన్ను కొట్టి పారేస్తారు, అది చదువుకు తగిన పని కాదు. కలగాపులగంగా తడబడుతూ జవాబు చెప్పింది. ఉద్యోగం రాలేదు; ఉద్యోగ రణరంగంలో శ్రీకారం చుట్టే వేళ తన చదువుకు తగిన కొలువు చేపట్టితే ఈ రోజు ఇంత దుస్థితి వచ్చేది కాదు.
“ఫరవాలేదమ్మా, మన తలరాత ఎంత వుంటే అంతే జరుగుతుంది” తండ్రి ఊరడించాడు. తలరాత గురించి చింత లేదు, చదువులో ఎంతో చురుకైన పరమేశ్వర్ చదువుకు స్వస్తి చెప్తాడేమో అని బాధ!
కనీసం ఒక పూట అయినా భోజనం చేయాలి, ఇల్లు గడవాలి అని ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు పరమేశ్వర్. గణపతి బ్యాంక్ మేనేజర్ ఇంట్లో తోటమాలి పనికి కుదిరాడు.
“మా సార్ వాళ్ళ కూతురు శ్రీమంతం ఇంట్లోనే చేస్తున్నారు. వారి బంధువులు ఒక పది-పదిహేను మంది వస్తారంట, నువ్వు వంట చేస్తావా తల్లీ?” ఎంతో ఇబ్బంది పడుతూ సుజన జవాబు కోసం ఎదురు చూశాడు. ‘చేయను’ అని కసురుకోలేదు, ఇది-అది అని వాపోక, ఏదైనా ఒక జాబ్ చేయాలి, సుజన పట్టుదలతో మనసు గట్టి పరచుకుంది.
ఇదొక అవకాశంగా తీసుకొని సార్ ఇంటికెళ్ళి బ్యాంక్‌లో ఉద్యోగం ప్రయత్నిస్తే.. అదృష్ట లక్ష్మి తలుపు కొట్టి మేల్కొలుపుతుంది.. అంటే ఇదేనా? తండ్రితో తన అభిప్రాయం వెలిబుచ్చింది. “ముందు నేను అడుగుతాను, సార్ ఏమంటారో చూద్దామమ్మా.”
బ్యాంక్ మేనేజర్ నారాయణ మూర్తి గారు అభయహస్త ఆశీర్వాదం ఇచ్చారు. వచ్చే నెల నుంచి జాయిన్ అవ్వొచ్చు అన్నారు. సంతోషం ఉరకలు వేసింది. తను చదివిన చదువు ఇప్పుడు వాడుకలోకి వస్తుంది.
వచ్చే నెల కొత్త జాబ్! ఎంత సుదినం! అష్టలక్ష్మిదేవి కాలింగ్ బెల్ మోగించింది సుజన కోసం.
మేడమ్ గారు చెప్పిన రీతిలో అన్ని వంటలు ‘శ్రీమంతం’ కోసం తయారు చేసింది. వచ్చిన అతిథులు సుజన చేసిన వంటలు మెచ్చుకున్నందుకు అలసట మటుమాయమై, ఆకలి వేయలేదు.
‘సంతోషం’ అలసటను, ఆకలిని హతమార్చింది!
“బాబా.. సార్ గారిని ఒకసారి నేను కలవాలి” మనసు మబ్బులో సాగిపోతున్నది. ముఖాముఖి నారాయణ గారిని కలిసింది “సార్, నమస్తే! నేను సుజన..” వినయవిధేయతలతో చేతులు జోడించింది.
“నమస్తే, నీ జాబ్ గురించి మీ నాన్న చెప్పాడు, నువ్వు వచ్చే నెల నుంచి జాయిన్ అవుతావా?”
‘నువ్వు’ అని సంబోధిస్తే చిరాకుపడే సుజనకు ఈసారి ఏమీ అనిపించలేదు. పెద్దమనిషి, పెద్ద బుద్ధి, పెద్ద పదవి.. నన్ను ఒక కూతురు సమానం అనుకున్నారేమో, తప్పేముంది.
“వచ్చే నెల అంటే రేపు ఫస్ట్ తారీకు, జాయిన్ కావాలా అండీ?”
“ఓ.. నో, రేపు.. సెలవు, ఆ పై మర్నాడు రా..”
“సార్, నేను చేసే పని ఏమిటో చెప్తారా అండీ..?”
“పనీ.. అదే.. లేబర్ పని, అంటే మా అందరి కంటే ముందు వచ్చి, అందరి టేబుల్స్, ఆఫీస్ వగైరా శుభ్రం చేయాలి, అందరికీ కాఫీలు, టీలు యివ్వాలి, స్టాఫ్ అందరూ ఏ పని చెప్పినా చేయాలి” మొక్కలు కత్తిరించే కత్తెర సుజన ఆశల రెక్కలు కత్తిరించింది.
“మంచిది అలాగే సార్, జీతం ఎంత ఇస్తారు?” గణపతి అల్పసంతోషం బయటపెట్టాడు.
“పని చూసి, అందరికీ నచ్చితే, డిసైడ్ చేస్తాం” భుక్తాయాసం బ్రేవ్‌మని త్రేనుపు తెచ్చింది.
“బిడ్డ వంట చేసినందుకు ఏమైనా.. డబ్బులు..” చేయి చాచి శ్రమ ఫలితం నసుగుతూ అడిగాడు.
“నా బ్యాంకులో జాబ్ ఇప్పిస్తున్నా, ఇంకేం కావాలి గణపతి?” బిందెను పోలిన బొజ్జ నిమురుతూ ఈసడించుకున్నాడు.
“సరే సార్ మీ దయ..” తండ్రీ కూతురు ఇంటి దారి వెంట నడిచారు.
ఇద్దరికీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
“నీకు ఇష్టం లేకపోతే బ్యాంక్ డ్యూటీ చేయకు తల్లీ! అదే చింత చేయక పండుకో అమ్మా!” కూతురు వ్యథ అర్థం చేసుకున్నాడు.
“లేదు బాబా, నేను యే జాబ్ అయినా చేద్దామనుకున్నాను, బ్యాంక్ అటెండర్ అయితే ఏంటి? ఆఫీసర్ అయితే ఏంటి? రెస్ట్ తీసుకునే వయసు నీది, ఇంక నువ్వు పనికి పోవద్దు” బాగా ఆలోచించి నిర్ణయం తెలిపింది. పొద్దున్నే ముగ్గురు కలిసి ఇంటి పనులతో పాటు టిఫిన్ కోసం జొన్న రొట్టెలు, ఉల్లి కారం చేసుకున్నారు.
గణపతి పిల్లల్ని ఉద్దేశించి “నేనొక మాట చెప్తాను వినండి, మనం అందరం పొద్దున పనులు చేసుకుందాం, రాత్రులు మీరిద్దరు పై చదువులు చదుకోండి. అంటే నైట్ కాలేజ్ లేకుంటే కరెస్పాండెన్స్ కోర్సులు” అన్నాడు. పరమేశ్వర్ ముఖం ముభావంగా మారిపోయింది. తండ్రి గమనించి కారణం అడిగాడు.
“బాబా.. నాకు రెగ్యులర్ కాలేజీలో డిగ్రీ అగ్రికల్చర్ చదవాలని వుంది. నాకు నేలంటే ప్రేమ! రైతంటే భక్తి! మనకు పొలం లేదు, కానీ వేరే వాళ్ళ నేల సాగు చేసే వసతి వుందిగా” మనసులోని మాట బయటికి వెలువడ్డది. ఇంతటి భారీ ఎత్తు కోరిక తీర్చే మార్గం ఏది? గణపతి ఏమీ మాట్లాడలేక పోయాడు.
“సూర్యుడు వున్న వేళ తమ్ముడు, సూర్యాస్తమం తరువాత నేను చదువుకుంటాము, కానీ బాబా.. నువ్వు మాత్రం రెస్ట్ తీసుకోని ఇంటిపట్టున ఉండాలి” కూతురు దృఢ నిశ్చయం!
“అక్కా.. మనకు కొన్ని రోజులే యిబ్బంది, నేను ట్యూషన్ చెప్పే వారికి ఫార్మ్ లాండ్ వుంది. వాళ్ళ వద్దనే పనిలో చేరుతాను. పంటలు, తోటలు పండించుకోవాలంటే స్వంత భూమి కావాలని రూల్ లేదు, వేరే వాళ్ళ భూముల్లో శ్రమిస్తే ఫలితం నాక్కూడా ఉంటుంది.”
తల్లిదండ్రుల స్థితిగతులను సంతానం అర్థం చేసుకుంటే అంతకన్నా భాగ్యం ఏమిటి; ఇంట్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంతో ప్రశాంతత. గణపతి గుండెకు కన్నీటి తడి తగిలింది.
***
“సుజనా, నువ్వేంటి ఇక్కడ బ్యాంక్‌ల చాయి ఇస్తున్నవా?” కౌంటర్ ముందు నిలుచున్న సరోజిని ఏదో ‘నక్సలైట్’ ఉద్యోగమా? అన్నట్టు బెదిరిపోయి అడిగింది.
“అవును..” ఎంతో ప్రశాంతంగా జవాబు ఇచ్చింది.
“అయ్యో! నీ ఖర్మ ఎంత ఘోస పాపం..”
సుజన స్టాఫ్ తాగిన ఖాళీ కప్పులు ట్రేలో సర్దుకుని వెళ్ళిపోయింది.
“సరోజిని గారు, మీ అకౌంటులో మినిమమ్ బ్యాలెన్స్ ఉంది. మీరు డ్రా చేయాలనుకున్న డబ్బులు డ్రా చేయలేరు” అటు వైపు గాజు అద్దాల తలుపు నుండి స్వరం వినిపించింది.
“సారు, మరెట్ల? పైసలు కావలే; బంగారం ఉద్దెర పెట్టితే ఎంత మిత్తి పడతది?”
“అక్కడ లోపల మేనేజర్ సర్ ఉన్నారు, వారిని అడగండి” మేనేజర్ గది వైపు దారి చూపించాడు.
“అట్లనే అడుగుతా, నా పుస్తెలు గిర్వి పెడ్త, ఎవ్వరికీ చెప్పకుండ్రి.” జడ పైకి ఎగరేసి చటుక్కున మెడ నుంచి మంగళసూత్రం గొలుసు బయటకు తీసి చుట్టూ చూసుకుంది.
“అవును సారూ, ఆ.., చాయి యిచ్చే పిల్ల ఈడ పర్మనెంటా? ఎంత జీతం?” తలను వంచి గుసగుస పెట్టింది.
‘బ్యాంక్‌ల అందరికీ చెవుడు’ తన ప్రశ్నకు జవాబు రాలేదని సరోజిని విసుక్కుంది.
పర్మిషన్ తీసుకొని మేనేజర్ నారాయణ మూర్తి రూమ్‌లో కూర్చుంది.
“అమ్మా, చెప్పండి..” కంప్యూటర్ నుండి చూపు మరల్చి అడిగాడు.
“సారు, మాట వస్తలేదు, జర గొంతు తడుపుకుంట..” ఎండిపోయిన నూతిలో నుండి పెకిలించిన స్వరం.
బెల్ నొక్కగానే సుజన శుభ్రమైన గాజు గ్లాసులో మంచి నీళ్ళు తెచ్చింది. దప్పిక మాట మరచి సుజనని మింగేసే చూపులతో చూసింది, ఏమీ పట్టించుకోక నీళ్ళు టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయింది.
“సార్, ఈ పిల్ల.. అదే ఈ ఆయమ్మ నాకు తెలుసు సారు.. చాలా ఖతర్నాక్ పోరి! మొగోళ్ళను ఇట్ల పడేస్తది, జర పయిలం” మేనేజర్ కళ్ళల్లోకి తొంగి చూస్తూ చెప్పింది.
“మీరు వచ్చిన పని చూడండి లేదంటే దయచేసి వెళ్ళండి” స్వరంలో కోపానికి నమ్రత పులుముకుంది.
“అయ్యో, అది గాదు సార్, ఇగో, ఈ పుస్తెలు, గాజులు బ్యాంక్‌ల పెట్టి పైసలు కొండపోనికి వచ్చిన.. ఎంత వస్తయి సారు?”
“ఈ బంగారం మీ సొంతం అని రుజువు ఏమిటి?” అనుమానంగా అడిగాడు నారాయణమూర్తి.
“అగో.. అట్లంటరు? నా మొగని చేతులు కంపిని మెషిన్ల పడి ఇరిగిపాయే, నాకు అదే కంపిన్ల లైటు బుగ్గల కవర్లు తొడిగే నౌకిరి ఇచ్చిండ్రు, ఇప్పుడు కంపిని లాస్‌ల పోయి బంద్ ఆయే..! పైసల కోసం నా సొమ్మల తెస్తే నా మీదనే షకు పడతవూ? నాకు ఝఠా మాటలు రావు సారు. అగో ఇప్పుడు వచ్చిన పిల్ల నడుగు..” గొంతు బొంగురు పోయి దుఃఖం పొరలుతుంది. సుజన కోసం బెల్!
వెంటనే సుజన వచ్చి చేతులు కట్టుకుని నిలబడింది. “ఈవిడ నీకు తెలుసా?” సూటిగా ప్రశ్న.
“సార్, కొంతకాలం ఒకే చోట పని చేశాము.”
“ఓకే..” అని సరోజినీ వైపు చూసి “అమ్మా, మీరు కరెక్ట్ గానే చెప్పి ఉండొచ్చు. కానీ మేము కొన్ని రూల్స్ పాటించాలి, అందుకే అడిగాను.
మీ బంగారం మా కంసాలి చేత చెక్ చేయించి తాకట్టుకు వడ్డీ రేటు, దానికి కావాల్సిన ఫామ్ గట్రా నింపిన పిమ్మట మీ ఎలిజిబిలిటీ వరకు డబ్బులు ఇస్తారు. ఈ పనులన్నిటికి మా వాళ్లు మీకు సహాయపడతారు. బయట హల్లో కూర్చోండి.”
“సార్, ఎవలో ఎందుకు? ఆ పిల్లను తోలియు..” మేనేజర్‌కు డైరెక్షన్ ఇచ్చింది.
“మీరు వెళ్ళండి..” తర్వాత సంభాషణలకు తావివ్వలేదు. వెళుతూ మరొక మారు లోపలికి వచ్చింది సరోజిని.
“పెద్ద సారు, నీకు దండం పెడతా, ఆ పిల్ల సదుకున్న పిల్ల, ఎడన్నా కొలువు చూస్కుంటది. నా పొట్ట, బట్ట శానా ఖస్తీగ నడుస్తున్నది. ఇమెను డ్యూటీల కేంచి ఎల్లగొట్టి నన్ను పెట్టుకో, నీ కాల్ మొక్కుత” అని వంగి కాళ్ళు పట్టుకుంది. ఎంత విదిలించినా పట్టు విడవలేదు.
కష్టంగా కాళ్ళు విదిలించుకుంటూ “సెక్యూరిటీ” అని అరిచాడు.
మేనేజర్ రూమ్ నుండి అరుపు వినగానే పక్కనే వున్న స్టాఫ్ కొందరు పరిగెత్తుకు వచ్చారు. పర్యవసానంగా సరోజిని నగలు తాకట్టు పెట్టలేక బ్యాంక్ వారందరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.
***
“అక్కా.. నేనొక తప్పు చేశాను” మాటలు దిగమింగుతూ ముద్దాయి వలె అన్నాడు పరమేశ్వర్.
“తప్పా! ఏం తప్పు, ఎందుకు చేశావు?” సుజన రాత్రి భోజనం కోసం వంట చేస్తూ అడిగింది.
“నేను ట్యూషన్ చెప్పే ఇంటర్మీడియట్ అబ్బాయి దీక్షిత్ వాళ్ళ పేరెంట్స్‌తో అబద్ధం చెప్పాను.”
“అదే.. ఏమని?”
“నేను డిగ్రీ అని, జాబ్ దొరక్క ట్యూషన్లు చెపుతున్నానని.”
“ఐతే.. ఇప్పుడు వచ్చిన నష్టమేంటి?” మిరియాల చారు కాగినదని స్టౌ మంట ఆపేసింది.
“దీక్షిత్ కూడా మెరిట్లో పాస్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ నేనిచ్చిన ట్యూషన్ కారణమని నాకు రిటర్న్ గిఫ్ట్ ‘యాక్టివా స్కూటీ’ ఇవ్వాలనుకున్నారు.”
“కంగ్రాట్స్, పెద్ద మనసున్న వాళ్ళు.. అయినా నువ్వు ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు?”
“ఈ వారంలో మనింటికి వచ్చి గిఫ్ట్ ఇస్తారట, నా భయం ఏంటంటే.. నేనూ.. ఇంటర్మీడియట్.. అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్‌కి పాఠాలు చెప్పాను.. నాకు వేరే గత్యంతరం లేక..”
“అవును, పరం.. నువ్వు దీక్షిత్ కలిసి శ్రమిస్తే ఫలితం దక్కిందని వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే ఇందులో నువ్వు చేసిన తప్పేంటి? వాళ్ళు ఇంటికి వస్తే రానీ..”
“నా అబద్ధం.. సంగతి తెలిస్తే.. నన్ను అసహ్యించుకుంటారెమో అని..”
“మరేం ఫరవాలేదు పరం, వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయవచ్చు అని సామెత; నువ్వు ఒక్క అబద్ధం చెప్పి విద్యా దానం చేశావు. మహా అయితే నీకు యిద్దామనుకున్న గిఫ్ట్ ఇవ్వరేమో అంతే..” వెనుక నుండి గణపతి విషయం విని జరుగుతున్న సంభాషణలో జోక్యం చేసుకున్నాడు.
“బాబా.. వంట అయింది, చేతులు కడుక్కో..” అంటూ అన్నం తినే ముందు తండ్రి వేసుకోవాల్సిన టాబ్లెట్ తెచ్చి ఇచ్చింది.
“దీక్షిత్ వాళ్లు మనింటికి వచ్చే ముందు చెబితే ఎక్సట్రా పాలు తీసుకొస్తాను” అంటూ సుజన ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాడు.
అనుకున్నట్టుగానే దీక్షిత్ నాన్న మహేందర్ మల్హోత్రా, అమ్మ ధరణి వచ్చారు; ధనవంతులు అయినా చూడడానికి సాధారణంగా వున్నారు.
ఉన్న ఒక్క గదిలో మంచం, కుర్చీ వున్నాయి. గది ఆనుకొని వంటగది, మరో దిశగా బాత్రూమ్. ఇవన్నీ వచ్చిన అతిథులు పట్టించుకోలేదు.
సుజన మంచి నీళ్ళు ఇచ్చింది.
“హమారా దీక్షిత్ థోడా పడాయి మే కంజోర్ థా.. అప్కే బేటే నే మదత్ కియా, బహుత్ ఖుషి కీ బాత్ హై (మా దీక్షిత్ చదువులో కొంచెం బలహీనుడు, మీ అబ్బాయి సహాయం చేశాడు, చాలా సంతోషమైన మాట).”
“సాబ్జీ, మై ఆప్ సే ఝూట్ బోలా, మై భీ దీక్షిత్ క్లాస్.. అబ్ మై డిగ్రీ జావుంగా. ఘర్ కీ ముష్కిలోంనే ముఝే మజ్బూర్ కర్ దియా.. (సర్ గారు, నేను మీతో అబద్ధం చెప్పాను, నేను కూడా దీక్షత్ క్లాస్, ఇప్పుడు నేను డిగ్రీకి వెళ్తాను. గత్యంతరం లేక ఇంటి సమస్యల వలన..)” రెండు చేతులు జోడించి ప్రాధేయపూర్వకంగా అన్నాడు పరమేశ్వర్.
నవ్వుతూ “హమే పతా థా, మైనే ఆప్ కే ఫ్యామిలీకే బారే మే కార్వాయి కియా (మాకు తెలుసు, మేము మీ ఫ్యామిలీ విషయాలు నిశితంగా తెలుసుకున్నాము)” సంతోషంగా భార్య వైపు చూస్తూ అన్నాడు.
“ఏ లీజియే” అంటూ మిఠాయి పాకెట్టు సుజన చేతిలో పెట్టారు.
“పరమేశ్వర్ కో హమారే సాత్ లేజాయేంగే, హమ్ టూ వీలర్ గాడీ గిఫ్ట్ దేనా చాహ్తే హైఁ (పరమేశ్వర్‌ను మాతో పాటు తీసుకెళ్ళి టూ వీలర్ బహుమతి ఇవ్వాలనుకున్నాము)” గణపతి వంక చూస్తూ అంది.
గణపతి నమస్కరిస్తూ “మేడం జీ.. మేరే బచ్చే కో ఆప్కా ప్యార్ ఔర్ ఆశీర్వాద్ బస్ హై (మేడమ్ గారు నా కొడుక్కి మీ ప్రేమ, ఆశీస్సులు చాలు).”
ఎంత వద్దన్నా, మహేందర్ దంపతుల నిర్ణయం మారలేదు. దీక్షిత్‌ని మెడిసిన్ చదివిస్తామని చెప్పకనే చెప్పారు. పరమేశ్వర్ అగ్రికల్చర్ డిగ్రీ చదివే కోరిక వెల్లడించాడు.
“బహుత్ ఖూబ్.. (ఎంతో మెచ్చుకోదగినది).” అని షామీర్పేట్ ఫార్మ్ లాండ్ వారి ఆస్తుల్లో ఒకటైన సంపద గురించి పూలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెం చే అవకాశాలు వాళ్ళ వద్ద ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.
***
మెరిసే కాలచక్ర వేగంలో మార్పు సహజం! కాంతివంతంగా తిరిగే కాలచక్రం ప్రగతి వైపు భ్రమిస్తూ మరో మెట్టు అనుకూలమైన మార్పుకు కూడా తోడ్పడుతుంది.
పరమేశ్వర్ ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఐటి హబ్ వద్ద పేరొందిన విల్లా హౌస్ ముందు గేటును అనుకున్న గోడకు ‘మిస్. సుజన సి.ఎ., ఎల్.ఎల్.బి.’ (Ms. Sujana CA., LLB) అని పాలరాతి పలక మీద కాంతివంతమైన అక్షరాలు ఆకర్షణీయంగా కనబడుతున్నాయి.
నారాయణ పొట్లం కట్టిన పేపర్లో ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాడు.
“రండి సర్” ఎంతో మర్యాదగా అన్నాడు గణపతి.
“నువ్విక్కడ?” అనుమానంగా అడిగాడు.
“మనిల్లే సార్..”
“ఈ అడ్రసు.. నీదేనా?”
గణపతి సంతోషంగా అన్నాడు “అవును సార్.. మా అమ్మాయి సుజన!”