[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]


[వైనతేయ ఎంచుకున్న అంశాన్ని తదేక దీక్షతో సాధన చేసి, ప్రొద్దుటూరు హరికథా సప్తాహానికి సిద్ధమవుతాడు. వైనతేయ తల్లిదండ్రులు, దస్తగిరిసారు దంపతులు, రామ్మునిగౌడు హరికథ వినడానికి వస్తారు. వివిధ మంటపాలలో దూరదూరంగా, ఒకేసారి నాలుగైదు హరికథా గానాలు జరుగుతాయి. తన వంతు వచ్చాకా, సదాశివశర్మగారు చెప్పిన సూచనలను పాటిస్తూ, ఆదిశంకరాచార్యుల చరిత్రను అద్భుతంగా గానం చేస్తాడు. ఆ పోటీలో వైనతేయకి మూడవ బహుమతి వస్తుంది. అందరూ సంతోషిస్తారు. దస్తరిగిసారుకు ప్రమోషన్ రావడంతో ఆయన నంద్యాలలో కాపురం పెట్టి, రోజూ స్కూటరు మీద సోమయాజుల పల్లెకి వెళ్ళి వస్తుంటాడు. ఫైనల్ ఇయర్ చివర్లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రకటన వస్తుంది. షేక్స్పియర్ ‘హామ్లెట్’ నాటకం లోని సాలలొక్వేలను యథాతథంగా, తర్వాత సరళమైన తెలుగు పద్యాలలో, అభినయించి ప్రదర్శిద్దామన్న ఆలోచన వస్తుంది వైనతేయకి. ఇంగ్లీషు లెక్చరర్ డేవిడ్ రాజుతోనూ, తర్వాత తెలుగు లెక్చరర్ మంగాదేవి గారి సహకారంతో చక్కగా సన్నద్ధమై, వార్షికోత్సవం రోజున గొప్పగా ప్రదర్శించి అందరి మెప్పు పొందుతాడు వైనతేయ. – ఇక చదవండి.]
ఫైనల్ యియర్ పరీక్షలు వ్రాసి, హాస్టలు రూము ఖాళీ చేసి నంద్యాలకు వచ్చేశాడు వైనతేయ. వాడికి దస్తగిరిసారు స్కూటరు నడపడం నేర్పించాడు. అప్పుడు, బి.ఇడి కోర్సుకు ఎంట్రన్స్ లేదు. డిగ్రీలోని మార్కుల ఆధారంగా సీటు వచ్చేది. ప్రయివేటు కాలేజీలు కూడా చాలా తక్కువ.
కర్నూలులోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా పురాతనమైనది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. కర్నూలు లోని ‘బి’ క్యాంపు ఏరియాలో ఉంటుంది. 1952లో అది ప్రారంభించబడింది. అందులోనే తెలుగు పండిట్ ట్రయినింగ్ కోర్సు కూడా ఉంది. డిగ్రీలో స్పెషల్ తెలుగు తీసుకున్నవారు కూడా దానికి అర్హులు. వైనతేయ బి.ఇడికి, తెలుగు పండిట్ కోర్సుకు, రెంటికి దరఖాస్తు చేసుకున్నాడు.
అతనికి బి.ఇడిలో సీటు వచ్చింది. అతని కులం వల్ల అతనికి రిజర్వేషన్ సౌకర్యం ఉన్నా, డిగ్రీలో అతడు సాధించిన మార్కులు కూడా తక్కువేమీ కాదు. 71 శాతం వచ్చాయి. ఏమిటంటే ఫీజుల్లో, హాస్టలుతో బాగా రాయితీ లభిస్తుంది.
నంద్యాల నుంచి కర్నూలుకు నాన్ స్టాప్ బస్సులున్నాయి. బొమ్మలసత్రం దగ్గర వాటికి స్టాప్ కూడా ఉంది. రోజూ కర్నూలుకు తిరుగుతానని వైనతేయ అంటే, దస్తగిరిసారు కోప్పడ్డాడు.
“నీకేమైనా పిచ్చా, వెర్రా? రోజుకు మూడు నాలుగు గంటలు ప్రయాణంలోనే అలిసిపోతే, ఇక చదివేదెన్నడు? నీవు ఎమ్.ఎ. ఇంగ్లీషు ప్రయివేటుగా కట్టు. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ హైదరాబాదు వారు, వారి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా మంచి స్టడీ మెటీరియల్ ఇస్తారు. అది చేస్తే నీవు లెక్చరర్ కావచ్చు. పి.జి క్వాలిఫికేషన్ ఉన్న గవర్నమెంట్ టీచర్లు ప్రమోషన్ మీద జూనియర్ లెక్చరర్స్ అయ్యే ఛానెల్ ఉంది.” అన్నాడు.
‘తన భవిష్యత్తు గురించి సారు నిరంతరం అలోచిస్తూ ఉంటాడ’ని వైనతేయకు అర్థమైంది.
కర్నూలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చేరాడు. హాస్టల్లో సీటు కూడా దొరికింది.
హరికథా ప్రోగ్రాములు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. క్రమంగా హరికథలకు ఆదరణ తగ్గుతూ ఉండడం గమనించాడు. ఈ కళారూపాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మలచాలని నిర్ణయించుకున్నాడు.
‘వ్యక్తిత్వ వికాసం’ (Personality Development) అనే సబ్జెక్ట్ అప్పుడప్పుడే ప్రాముఖ్యతను సంతరించుకుంటూంది. హైదరాబాదు వంటి నగరాల్లో దాన్ని బోధించడానికి కోచింగ్ సంస్థలు, ‘పర్సనాలిటీ గురు’ అన్న పేర్లతో రచయితలు, స్వామిజీలు తయారయ్యారు. వైనతేయ గమనించిందేమిటంటే వారంతా ‘పాశ్చ్యాత్య దృక్పథా’న్ని (western approach) అవలంబిస్తున్నారని. మన భగవద్గీతలో, ప్రబంధాలలో, కావ్యాలలో కావలసినంత వ్యక్తిత్వ వికాస పరిమళం ఉంది. ఆయా క్యారెక్టర్లను విశ్లేషిస్తూ, ఒక హరికథను రూపొందించాలని నిశ్చయించుకొని, దాని కోసం శ్రమించసాగాడు వైనతేయ.
కర్నూలు బిర్లా టెంపుల్లో ఒకసారి అతని హరికథ ఏర్పాటయింది. నిర్వాహకులతో, ‘వ్యక్తిత్వశిల్పం’ అన్న హరికథను గానం చేస్తానని అడిగితే వారు సంతోషంగా ఒప్పుకున్నారు. సభకు ముఖ్య అతిధి, కర్నూలులో ప్రముఖ న్యాయవాది, ‘ప్రతివాద భయంకర’ శ్రీమాన్ ఉప్పులూరి విశ్వేశ్వరశాస్త్రి గారు. ఆయన ఆంధ్రాంగ్ల సంస్కృత భాషలతో పండితుడు.
వైనతేయ చదువుతున్న ట్రయినింగ్ కాలేజి నుంచి కొందరు సహవిద్యార్థులు, కొందరు లెక్చరర్లు కూడా వచ్చారు. ఉప్పులూరివారు జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్టుకు సలహాదారు కూడా. ఆయనకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ‘తిమ్మయ్య’ గారు శిష్యుడు.
బిర్లా టెంపుల్ కర్నూలులో కె.సె. కెనాల్‌ను ఆనుకుని ఉంటుంది. బిర్లా వారు కర్నూల్లో ఒక ఫ్యాక్టరీ నడిపేవారు. దాన్ని బిర్లా కంపెనీ అనేవారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ లేదు కాని, దేవాలయం మాత్రం ఉంది. సాంకేతికతకు, సంస్కృతికి అదీ తేడా!
అప్పటికే వైనతేయ పేరు హరికథకునిగా చాలామందికి తెలుసు. అతని కులం కూడా కర్ణాకర్ణిగా తెలుసు. ఆ ఆసక్తి వల్ల, ఏం చెబుతాడో, ఎలా చెబుతాడో చూద్దామని కొందరు, ప్రతిదాన్నీ కులం దృష్టితో చూసేవారు వచ్చారు. ‘గాలికీ కులమేదీ?’ అని ఒక సినీకవి అన్నట్లు, విద్వత్తుకు, జ్ఞానానికి కులమేది? తపశ్శాలియైన కౌశకునికి ధర్మసూక్ష్మములు బోధించినవాడు, మాంసం కొట్టు నడుపుకునే ధర్మవ్యాధుడు. రామాయణ మహా కావ్యమును రాసినవాడు, వాల్మీకి మహర్షి, బోయవాడు. గీతాకారుడైన శ్రీ కృష్ణపరమాత్మ గొల్లవాడు. కడపజిల్లాలో ఆ కాలంలో ‘రాజన్నకవి’ అని పండితుడు ఉండేవాడు. ఆయన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వాడని చెప్పుకునేవారు. ఆముక్తమాల్యద కావ్యంలో వచ్చే మాల దాసరి మహాజ్ఞాని అయినా జనానికి తత్త్వం బోధ పడడం లేదు.
‘విద్యానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమమ్’ అన్న సూక్తికి నిలువెత్తు ఉదాహరణలు, ఆంజనేయ శర్మగారు, సదాశివ శర్మగారు.
హరికథ ప్రారంభమైంది. దస్తగిరిసారు హార్మోనియంతో వచ్చారు. శిష్యుని కార్యక్రమాలకు ఆయన సెలవు పెట్టి మరీ హజరవుతున్నాడు. రామళ్లకోట నుండి జయరాములు, వైనతేయకు తబలిస్టుగా స్థిరపడినాడు.
వినాయకుని ప్రార్థించిన వెంటనే, తాను చెప్పబోయేదానికి కొంత ఉపోద్ఘాతం చెప్పాడు హరిదాసు.
“మిత్రులారా! పెద్దలారా! పిన్నలారా!” అని సంబోధించాడు. “భక్తులారా!” అనలేదు. కారణం సబ్జెక్టు అలాంటిది.
“నేను యిప్పుడు గానం చేయబోయేది కథ కాదు. కానీ అన్ని కథల సారమిది. మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకునే గొప్ప పాఠమిది. వ్యక్తిత్వ వికాసాన్ని కేవలం పాశ్చాత్య దృక్పథంతో చూస్తున్నారు. దానిని ఒక అమ్ముకొనే వస్తువుగా మార్చేసినారు.
‘How to win friends and Influence people’ పుస్తకాన్ని గురించి వినే వుంటారు. డేల్ కార్నెగీ అనే ఆయన దీనిని రాశాడు. స్నేహితులను గెలుచుకోవడం కాదు, నిలుపుకోవడం గురించి మన సాహిత్యం మనకు చెబుతుంది.
‘The seven habits of Highly effective people’ అన్న గ్రంథాన్ని స్టీఫెన్ ఆర్. కోవే గారు రాశారు. ఏడు ఏం ఖర్మ, మన ప్రబంధ కావ్యాల్లో, ఇతిహాసాల్లో, ఆదర్శంగా తీసుకోవలసినవారు వందల్లో ఉన్నారు.
‘The Magic of thinking Big’ అన్న పుస్తకం ఉంది. డేవిడ్. జె. స్కార్డ్జి గారిది. ఉన్నతంగా ఆలోచించడం మ్యాజిక్ ఏమిటి? అది మన సనాతన సంస్కృతి, ధర్మాలలో మౌలిక అంశం.
‘Think and grow Rich’ మరొకటి. ‘నెపోలియన్ హిల్’ దీనిని రచయిత. ఆయనను ‘The grand daddy of all motivational literature’, అంటారు.
‘Failing Forward’ అన్న గ్రంథం జాన్. సి. మాక్స్వెల్ రాశారు. ఇలా చాలా ఉన్నాయి. వీళ్లంతా వ్యక్తిత్వ వికాసాన్ని ఒక శాస్త్రంగా, abstract గా రాశారు.
మనకు వ్యక్తిత్వ వికాస పితామహుడు సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మే. భగవద్గీతలో లేని వ్యక్తిత్వ వికాసముందా? చెప్పండి?
భారతం, రామాయణం, మను చరిత్ర, పాండురంగమహాత్మ్యం, శతక సాహిత్యం, విదురనీతి, హితోపదేశం, భర్తృహరి సుభాషితాలు.. ఇలా ఎన్నో మనకు వ్యక్తిత్వ పరిమళాలను అందిస్తాయి. వాటిని గురించి నేను మీకు వివరిస్తాను.”
హరిదాసు మాటలు ప్రేక్షకలలో ఆసక్తిని రేకెత్తించాయి.
“వ్యక్తిగత, మానవ సంబంధాలు ఉదాత్తంగా ఉండాలి. రామాయణం చూడండి. రేపే రామునికి పట్టాభిషేకం. ముందు రోజు రాత్రి కైకేయి ఆయనను పిలిపించి, ‘నాయనా, పట్టాభిషేకం క్యాన్సిల్ అయింది. నాన్నగారు చెప్పమన్నారు. ఆయనకు ఒంట్లో బాగులేదు. విశ్రాంతి తీసుకుంటున్నారు. నీవు పధ్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం చేయాలి’ అని చెప్తే, రాముని ముఖంలో కనీసం అశ్చర్యం కూడా కలుగలేదట, ‘సరేనమ్మా!’ అన్నాడు. ఆయనకు తప్పదు. సరే. సీతమ్మవారికేం పని? ఆమె కూడా వెళ్లాలని నియమమేవి లేదు కదా! అమె రెడీ!
సరే, వాళ్లిద్దరూ భార్యాభర్తలు. లక్ష్మణస్వామికేం పని? ‘మా అన్నయ్య, వదిన అరణ్యవాసం చేస్తున్నారు. నేను దగ్గరుండక పోతే ఇబ్బంది పడతారు’ అని ఆయనా బయలుదేరాడు! ఆయన భార్య ఆయన కంటే గొప్పదంటాను నేను. ‘నీవెందుకు వెళ్లడం! పనీ పాటా లేకపోతే సరి!’ అనలేదు ఊర్మిళా దేవి!”
సభలో నవ్వులు! ఆ నవ్వుల వెనుక ఆలోచనలు!
“ఇక సుమిత్రా దేవి, లక్ష్మణ స్వామి తల్లి, ఆమె వ్యక్తిత్వం అనన్యసామాన్యం. వెళ్లి వస్తానని చెప్పడానికి వెళ్లిన కొడుకుతో ఆమె యిలా అంటుంది” – అని ఆపి,
“మోహన!” “అని సారుకు చెప్పి,
“రామం దరశరథం విద్ధి, మాంవిద్ధి జనకాత్మజామ్
అయోధ్యాం అటవీం విద్ధి, గచ్ఛతాత! యథాసుఖమ్
నాయనా! రాముడిని మీ నాన్న దశరథుడనుకో. సీతను నేనుగా (తల్లిగా) భావించు, అడవిని అయోధ్యగా తలచు. వెళ్ళిరా తండ్రీ!
చూశారా! అవి మానవ సంబంధాలంటే. పితృధర్మం, భ్రాతృధర్మం, దాంపత్యధర్మం, చివరికి మాతృధర్మం కూడా ఈ సంఘటనలో ఉన్నాయి. భరతుడేం తక్కువ వాడా? తనది కాని అధికారాన్ని స్వీకరించలేదు.”
విశ్వేశ్వరశాస్త్రిగారి ముఖం ప్రసన్నత నుండి ప్రశంసకు మారుతున్నది. ‘ఈ పిల్లవాడెవడో అసాధ్యుడిలా ఉన్నాడే!’ అనుకున్నాడు.
అందరూ శ్రద్దగా వింటున్నారు!
“ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి? దీనికి ఉదాహరణగా శ్రీరామచంద్రప్రభువు ఆంజనేయస్వామి గురించి లక్ష్మణునికి చెబుతాడు. అతిభాషిత్వం, మితభాషిత్యం, రెండో శృతి మించకూడదు. పునరుక్తి దోషాలు ఉండకూడదు. మాటల మధ్యలో ఆగిపోవడం (Pause) రాకూడదు. భావదారిద్య్రం అన్ని దారిద్ర్యాల కంటే చెడ్డది. ఈ హనుమంతుడి మాటల్లో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి.
‘సంశయాత్మా వినశ్యతి’ అన్నాడు గీతాచార్యుడు. మనకు ‘Doubting Thomas’ గురించి చెబితే గొప్ప!
మన అంతఃకరణం మనలను కరెక్ట్‌గా గైడ్ చేస్తుంది. దీనిని కాళిదాసులవారు ‘శాకుంతలమ్’లో దుష్యంతుని మాటల్లో చెప్పారు.
‘సతాంహి సందేహపదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః’. శకుంతల కణ్వ ముని కుమార్తె, తానేమో క్షత్రియుడు. తన మనసు ఆమె వైపు వెళుతున్నది. అది ధర్మవిరుద్ధం. కాని, తన మనస్సు తప్పుగా వెళ్లదు. కాబట్టి ఆమె జన్మలో ఏదో రహస్యం ఉంటే ఉంటుంది.
చూశారా! తన మీద తనకెంత నమ్మకమో? అదీ వ్యక్తిత్వమంటే! శకుంతల విశ్వామిత్రుని కూతురు. క్షత్రియ కన్య! సో, నో ప్రాబ్లమ్!
గీతలో ‘యోగః కర్మసుకౌశలమ్’ అన్నాడు పరమాత్మ, అట్లే, ‘సర్వత, సమదర్శనః’ అన్నాడు యోగులను.”.
ఓ క్షణం ఆపి, సారును చూసి – “తోడి!” అని చెప్పి,
“పరగ మేదిని నేలు భూపాలుడైన
మనగ చెప్పులు కుట్టు సామాన్యుడైన
నొకటె పరమాత్మ దృష్టిలో, నుర్వి నెల్ల
సమత జూడగ గనిపించు సత్యపథము.
మిత్రులారా! ఈ పద్యం నేనే రాశాను!”
సభలో చప్పట్లు!
“ఇక మన పని మనం నిజాయితీగా, పర్ఫెక్ట్ చేస్తే అదే యోగము, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధాన మంత్రి కాన్వాయ్ వెళుతుందట. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు వేసి ఉంది. గేట్‌మ్యాన్, నెహ్రూ గారున్నారని తెలిసి, స౦భమాశ్చర్యాలతో వెళ్లి, ఆయన కాళ్ల మీద పడ్డాడట. నెహ్రూగారు, ‘గేటు తీస్తే మేం వెళ్లిపోతాం’ అంటే ‘అదెలా కుదురుతుంది? మీలాంటి పెద్దలు అడగవచ్చా ఇట్లా?’ అన్నాడట. విధి నిర్వహణ అంటే అది! రైల్వేలో లోయెస్ట్ క్యాడర్ గేట్మ్యాన్ది. కాని, హైయెస్ట్ వాల్యూస్ ఉన్నవాడు!”
సభలో చప్పట్లు!
“ఈ రోజు దాంపత్య సంబంధాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో మనకు తెలుసు. విదేశాలలో అయితే మరీ ఘోరం, సింగిల్ పేరెంట్స్, డైవోర్సల సంఖ్య అధికం. భీష్ముడు ధర్మరాజుకు భార్యాభర్తల అనుబంధాన్ని, హృదయంగమంగా బోధించాడు. ఈ శ్లోకాలు వినండి” అని దస్తగిరిసారుకు ‘బిళహరి’ అని సూచించాడు.
“భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి. ఐనా ఎంత బాగా చెప్పాడో చూడండి. అయినా దానిదేముంది? జితేంద్రియుడైన వాత్సాయన మహర్షి ‘కామసూత్రములు’ వ్రాయలేదా?”
సభలో నవ్వులు! కానీ ఇంకా వినాలనిపించే కథనం!!
“నాస్తి భర్తృసమో నాథః, నాస్తి భర్తృసమంసుఖం
విసృజ్యధన సర్వస్వం, భర్తవైశరణం స్త్రియాః”
జంటలుగా వచ్చినవారు కొందరున్నారు. వారి భర్తలు భార్యల వైపు చూశారు – ‘చూశావా?’ అని.
అది గమనించి, వైనతేయ అన్నాడు “సార్, తొందరపడకండి! ఇంకా ఉంది”.
మళ్లీ నవ్వులు!
“నాస్తి భార్యాసమో బంధుః నాస్తి భార్యాసమాగతిః
నాస్తి భార్యాసమోలోకే, సహాయోధర్మ సంగ్రహే”
ఈసారి భార్యలు భర్తల వైపు గర్వంగా చూశారు.
“అయ్యా! భారతంలో, అశ్వత్థామ ఉపపాండవులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తాడు. అర్జునుడు అతన్ని బంధించి, ద్రౌపదీ దేవి కాళ్ల దగ్గర పడవేస్తాడు. అప్పుడు ఆ మహాసాధ్వి అతనితో ఇట్లా చెబుతుంది.” అని ఆపి, “సార్! కల్యాణి!” అని దస్తగిరిసారుకు చెప్పి,
ఉ.
‘అక్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నిను పోర గిరీటి నిబద్ధు జేసి నే
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నే
డెక్కడ, నిట్టి శోకమున, నేక్రియ నేడ్చుచు బొక్కుచున్నదో?’
చూశారా! అదీ మహొన్నత వ్యక్తిత్వమంటే! తనకు సంక్రమించిన దుఃఖం ఇతరులకు రాకూడదనుకోవడం. అశ్వత్థామను చంపితే, వాళ్లమ్మ కూడా తన లాగే బాధ పడుతుంది కదా!”
ఇలా, ఎన్నోరకాల పాత్రలను, సంఘటనలను ఉదహరిస్తూ, చమత్కరిస్తూ, మధ్యలో పద్యాలతో, శ్లోకాలతో, సంగీతభరితం చేస్తూ, రసహీనమైన సబ్జెక్టును రక్తి కట్టించాడు వైనతేయ.
హరిదాసుకు సన్మానం చేశారు నిర్వాహకులు. ఉప్పులూరువారు అతన్ని ఆశీర్వదించారు.
తిమ్మయ్య గారు, “హరికథలలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించావు అబ్బాయి!” అని మెచ్చుకున్నాడు. ఆయన ప్రిన్సిపాల్‌గా ఎంత ప్రసిద్ధుడంటే, గవర్నమెంట్ జూనియర్ కాలేజీని ‘తిమ్మయ్య కాలేజీ’ అంటారు!
ఆయన అన్నాడు “వచ్చే నెలలో, ఒంగోలులో మా వాళ్లది ‘ఆదర్శ’ కాలేజీ వార్షికోత్సవం ఉంది. మీరు వచ్చి ఇదే ధీమ్ చెప్పాలి!”
ఆనందంగా అంగీకరించాడు వైనతేయ.
క్రమంగా, ‘వ్యక్తితృశిల్పము’ను బాగా చెబుతాడని పేరు వచ్చింది. చిన్మయా మిషన్ హైస్కూలు, కట్టమంచి డిగ్రీ కాలేజి, ఇలా వైనతేయను ఆహ్వానించసాగారు.
వైనతేయకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పురాణాలు, ఇతిహాసాలు, హరికథలుగా ఎంతో కాలం నుంచి వింటున్నారు ప్రజలు. వారికి కొత్తదనం కావాలి. ప్రెజెంటేషన్‌లో వైవిధ్యం కావాలి. అంతేగాని, హరికథలకు ఆదరణ తగ్గిందనడంతో నిజం లేదు. దీనికి తార్కాణం తాను రూపొందించిన ‘వ్యక్తిత్యశిల్పమే!’.
ఒక ప్రోగ్రాముకు ఇంకో ప్రోగ్రాముకు అతడు పేర్కొనే ఉదాహరణలలో భేదాలుండేవి. తాను చదివిన సాహిత్యం నుండి ఎన్నో దృష్టాంతాలను సేకరించుకున్నాడు. వాటిని వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా mould చేసుకోసాగాడు.
(ఇంకా ఉంది)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.