[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


మాధవమ్ మధుసూదనమ్-3
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥10.20॥
(శ్రీమద్భగవద్గీత)
క్షీరసాగరమథనం చేయమని శ్రీహరి సలహా ఇచ్చినంత మాత్రానే పని మొదలు కాలేదు. మొదట వాసుకిని ఒప్పించాల్సి వచ్చింది. ఆ పైన మందర పర్వతాన్ని అక్కడకు చేర్చాల్సి వచ్చింది. ఇక మిగిలింది రాక్షసులతో తాత్కాలిక సంధి. చేసుకుని తమ కార్యాన్ని వివరించాల్సి వచ్చింది.
దానికి “రండి చేసేద్దాం,” అంటారా? లేదు కదా! మాకు కూడా అమృతాన్ని పంచమన్నారు. ఆ సమయానికి రాక్షసులకు రాజు బలి. విష్ణుభక్తుడు. పైగా ప్రహ్లాదుడికి మనుమడు.
ఇక్కడ దేవతలు ఇస్తామనలేరు. కారణం వారు ఆ అమృతం కోసం కృషి చేయాల్సినదే ఆ రాక్షసుల పరాక్రమం తట్టుకోలేక. వారి తేజస్సు సన్నగిల్లి. ఇవ్వమంటే వారు రారు. వీరు ఒక్కరే ఆ మథనం చేయలేరు.
అక్కడే శ్రీహరి కల్పించుకోవాల్సి వచ్చింది. ఆయనకే శరణాగతి చేశారు దేవతలు.
ఆయన “నేనున్నాను, మొదలు పెట్టండి,” అన్నాడు.
మరి అసత్య దోషం?
చూసుకునేది భగవానుడే కనుక ఇక వేరే ఆలోచన లేక కేవలం అమృతం కోసమే సంకల్పం చేసుకుని పని ప్రారంభించారు.
ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరం చేర్చే బాధ్యత కూడా శ్రీమన్నారాయణుడే స్వీకరించాడు. ఆలోగా క్షీరసాగరంలో వేయాల్సిన ఓషధులను దేవతలు, దానవులు వేశారు. పర్వతానికి వాసుకిని చుట్టి మథనం ప్రారంభించే ముందు ఒక సమస్య వచ్చింది. శిరస్సు వైపు పట్టుకుంటే అక్కడ వచ్చే విషాగ్ని జ్వాలలు తట్టుకుంటం చాలా కష్టం. అందులోనూ తేజోవిహీనులైన దేవతలకు అది సాధ్యమయ్యేది కాదు. అందుకే శ్రీహరి తన లీల మొదలెట్టాడు.
ఇద్దరు పసి పిల్లలలో అన్నీ నాకే కావాలి అనే వారిని ఏమార్చేందుకో, లేదా మనకు కావలసినది మనం తీసుకుంటే తనకు కూడా అదే కావాలనే మరొకరితో మనం ఎలా ఉండాలో చెప్పే విధంగా ఆయన పరిష్కారం చూపాడు.
దేవతలు మేము సురులము కనుక వాసుకి శిరస్సు వైపు పట్టుకుంటాము. తోక పట్టుకోవటం మాకు అవమానం అన్నారు, శ్రీహరి సలహా మీద.
ఠాట్! అంటే మేము తక్కువ వారిమా? తోక పట్టుకునేందుకు? మేమే శిరస్సు పట్టుకుంటాం. అన్నారు రాక్షసులు.
సరే! మీకు మాకు సహకారంగా వచ్చారన్న కృతజ్ఞతతో మేము మీ మాట వింటున్నాం. మీరే శిరస్సు వైపు పట్టుకోండి అన్నారు.
సత్యవాక్పరిపాలన అమృతంతో సమానం. అసత్య దోషం మృత్యువుతో సమానం. ఇది గుర్తుంచుకోండి.
ఇలా రాక్షసులు శిరస్సు వైపు, దేవతలు తోక వైపు పట్టుకుని చిలకటం మొదలు పెట్టారు కానీ, పర్వతం మాత్రం బరువు వల్ల మునగటం మొదలైంది. సరిగ్గా అక్కడే శ్రీమహావిష్ణువు కూర్మ రూపం ధరించి ఆ పర్వతానికి క్రింద ఆధారంగా నిలిచి ఆ బరువును మోస్తూ కిందకు దిగబడి పోకుండా కాపాడాడు.
అలా మొదలైనది కూర్మావతారం.
పోతన గారు చెప్పిన ఈ పద్యం చూడండి. ఆ సన్నివేశాన్ని బహురమ్యంగా వర్ణించారు.
తరిగాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్.
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్.
తరిగాండ్ర = చిలికెడివారి
లోనన్ = లోపల
ఒకడు = ఒకడు
అటన్ = అక్కడ
తరిగడవ = మజ్జిగకుండైనసముద్రము
కున్ = అందలి
కుదురున్ = కుదురు
నాక = సర్పపు
త్రాడు = తాడు
అటన్ = అక్కడ
చేరుల్ = చేరినవారు
తరి = చిలికెడి
కవ్వంబున్ = కవ్వము
తాన్ = తనే
అటన్ = అట
హరిహరి = ఆహా
హరి = విష్ణుని
చిత్ర = విచిత్రమైన
లీలన్ = లీలలను
హరియే = విష్ణువునకే
యెఱుగున్ = తెలియును.
ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణు లీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మందర పర్వతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.
ఇంకా ఇలా వర్ణిస్తాడు.
సముద్రాన్ని కుండగానూ, పర్వతాన్ని కవ్వంగానూ, సర్పాన్ని కవ్వంతాడుగా చేయగలవాడు, ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని, అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవాడు ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా!
ఇక్కడ సముద్రమథనంలో బైటకు వచ్చేది స్వర్గలక్ష్మి అని గ్రహించాలి. శ్రీమహాలక్ష్మి కాదు.
పాలసముద్రంలో మందరపర్వతం గిరగిరా తిరుగుతుంటే, దాని శబ్దం బ్రహ్మాండం అంతా నిండిపోయి, బ్రహ్మదేవుడి చెవులు గింగురుమన్నాయి.
ఇక్కడ పోతన గారి పద్యం ఎంత అందంగా అమరుతుందో!
ఆలోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె నవనీనాథా!
Alliteration!
పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన ‘హాలాహలము’ అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
మందర పర్వతంతో చిలికిన చిలుకుడుకు పాలసముద్రంలో పుట్టిన హాలాహలం, ప్రళయకాలంలో, మహారుద్రుడి నుదుటి కన్ను నుండి వెలువడే మహా భయంకరమైన అగ్ని జ్వాలల కంటె నూరురెట్లు చురుకైనది, కల్పాంతకాలపు అగ్నికంటె వెయ్యిరెట్లు తీవ్రమైనది, మహాప్రళయకాలపు లక్ష సూర్యుల తేజస్సువలె తేరిచూడరానిది, ప్రళయకాలపు కాళరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగులవలె మహా భీకరమైనది, భగ భగ మండే పంచభూతాలవలె భరింపలేనిది. భుగ భుగ మనే పొగలతో, చిటపటమనే నిప్పుకణాలతో, ధగ ధగ మని మెరిసే పెనుమంటలతో, ఫట ఫట మంటూ ఆ మహా విషం ఆకాశం అంత ఎత్తు పొంగుతోంది, దిక్కులంతా వ్యాపిస్తోంది, బయళ్ళన్నీ నిండిపోతోంది, మందర పర్వతాన్ని దాటి సముద్రంలో నలువైపులా వ్యాపిస్తోంది, చెలియలికట్టల గట్లు దాటేస్తోంది. దేవదానవుల గుంపులను దాటిపోతోంది, కొండగుహలలో తొట్రుపడకుండా ఎత్తైన పర్వతశిఖరాలలో నిప్పులు నింపేస్తోంది, అడవులను కాల్చేస్తోంది, పొదరిళ్ళలో పూల గుత్తులను మాడ్చేస్తోంది. గ్రామాలను కాల్చేస్తోంది, నదీనదాలను ఎండగట్టేస్తోంది, దిగ్గజాల కుంభస్థలాలపైకి ప్రాకేస్తోంది, సూర్యగోళాన్ని నక్షత్రాలను అణగద్రొక్కేస్తోంది, మహర్లోకాన్ని మసిచేస్తోంది, ఊర్థ్వ లోకాలకు కీడు కలిగేటట్లు పెరిగిపోతోంది, చుట్టు ముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం బద్ధలయిపోయేలా విస్తరిస్తోంది, పాతాళ లోకం దాకా వ్రేళ్ళూనుతోంది. ఆ హాలాహలం ఎటుచూస్తే అటుపక్క అసాధారణంగా అన్నిలోకాలలోనూ కూరుకుపోతోంది, జింకవలె గంతులు వేస్తోంది, సింహమువలె దూకుతోంది, పక్షిలా ఎగురుతోంది, ఏనుగులా స్థిరంగా నిలబడిపోతోంది, లోకాలన్నిటా గగ్గోలు పెట్టిస్తోంది. ఆ పెనుమంటల వేడికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మం అయ్యారు, రాక్షసులు నేలకూలారు, చుక్కలు రాలాయి, కిన్నర దంపతులు నశించారు, గంధర్వుల విమానాలు కాలిపోయాయి, సిద్ధుల గుంపులు చెదిరి పోయాయి, గ్రహాలు సంకటపడ్డాయి, నదులు ఎండిపోయాయి, సముద్రాలు ఇంకి పోయాయి, అడవులు మాడిపోయాయి, పట్టణాలు బావురుమన్నాయి, పురుషులు వెతల పాలయ్యారు, పుణ్యస్త్రీలు పొగిలిపోయారు, పర్వతాలు బ్రద్దలైపోయాయి, జీవరాసులు అడుగంటిపోయాయి, లోకాలు తపించి పోయాయి, దిక్కులు కలత చెందాయి, చెట్లు తలక్రిందులు అయ్యాయి, నేలలు బదాబద్దలు అయ్యాయి, అకాలంలో ప్రళయం వచ్చినట్లు అయింది.
విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు.
అప్పటికే శ్రీమన్నారాయణుడు కమఠావతారుడై ఉన్నాడు. కనుక దేవతంతా పరమశివుని శరణువేడారు. శ్రీమద్భాగవతం ప్రకారం అప్పటికి సతీదేవి ఉన్నది. రామాయణ కాలానికి దగ్గరలో మాత్రమే శివ పార్వతుల వివాహం జరగటం, కుమార సంభవం జరగటం మనం గమనించాల్సిన అంశాలు (రామాయణం కోటి డెబ్భై లక్షల సంవత్సరాల క్రితం – రమారమి. కుమార సంభవం కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. శివపార్వతుల కళ్యాణం 2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు). దగ్గర కాలంలో జరిగిన విశేషాలు కనుకే విశ్వామిత్రుడు శ్రీరాముడికి కుమార సంభవ గాధను చెప్పాడు.
శరణన్నవారిని ఆదుకునేందుకు శివుడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయనను సదాశివుడు అంటారు. అంటే ఎల్లప్పుడూ ఆశ్రయించిన వారికి మంగళం చేకూర్చువాడు.
సతీదేవికి విషయాన్ని చెప్పాడు. ఆమె అంగీకారం తీసుకున్న తరువాత ఆయన కదిలాడు.
ఇది ప్రమాదకరమైన పని కనుక భార్యకు చెప్పి, అంగీకారం తీసుకోవటం ఉత్తముల లక్షణం. ఆ విషయాన్ని మనకు స్పష్టం చేసేందుకు శివుడు ఆ పని చేశాడు. భర్యాభర్తలు సంప్రదించుకునే నిర్ణయం తీసుకోవాలి.
ఓ దేవి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచిపని. హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.
ఇక్కడ మరొకసారి పోతన గారి చమత్ కృతిని చూద్దాము (pun intended).
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
ఆమె సర్వమంగళ (మంగళము కలిగించెడి – శుభములనిచ్చు – వాని సతి కదా!) కదా మరి, అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకకల్యాణంతో అందరికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే సతీదేవి హాలాహలాన్ని మింగమని పరమ శివునికి చెప్పింది.
ఆ నాటికి నిజానికి మంగళసూత్రములు (తాళి) లేవు. అంటే ఇక్కడ మంగళసూత్రము అంటే తామిద్దరిని పట్టి ఉంచు బంధము అని గ్రహించాలి. ఆ బంధం గట్టిగా ఉంటే ఏ సూత్రాలూ అక్కర్లేదు. ప్రజా శ్రేయస్సే తమ శ్రేయస్సు అని నమ్మిన జంట వారిది.
సర్వనాశనము చేసే ఆ హాలాహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని, ముద్ద చేసి, నేరేడు పండునోట్లో వేసుకున్నంత సుళువుగా, విలాసంగా భుజించాడు.
పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో.
మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు, దానిని సమీపించే టప్పుడు, పదిలంగా పట్టుకుని ముద్ద చేసేటప్పుడు, నోట్లో ఉంచుకునేటప్పుడు, తినేటప్పుడు, మింగేటప్పుడు కాని, ఆయన కంఠహారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు, చెమటలు గ్రమ్మ లేదు, కన్నులు ఎఱ్ఱబార లేదు, సిగలోని చంద్రుడు కందిపోలేదు, ఆయన ముఖ పద్మం వడల లేదు.
అదీ ఆయన శక్తి. ఎక్కడి నుంచీ వచ్చింది?
ఇక్కడ గ్రహించ వలసిన మరొక విషయం శ్రీమన్నారాయణుడు మ్రింగగలడా అన్న అనుమానము రాదు. ఏ దేవతలూ అనుమాన పడలేదు. ఎందుకంటే శ్రీహరి పరమాత్మ. ఈ హలాహలము కూడా ఆయనలో భాగమే. అది ఆయనను ఏమీ చేయలేదు. విష్ణు పారమ్యాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. ఆయనకూ నాకు అభేదం (అద్వైతం) అని గ్రహించిన వాడు కనుక శంకరునికి కూడా ఆ విషం వల్ల ఏమీ కాలేదు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పిన విషయం ఇక్కడ కూడా ఒప్పుతుంది.
పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక (అభేద స్థితి) ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉదరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండును ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.
శివుడే ఎందుకు గరళాన్ని స్వీకరించాడు అంటే తరువాతి మన్వంతరం (అంటే ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరానంతరం) చివర వచ్చే ప్రళయంలో ఈ హలాహలమే ప్రధాన పాత్ర పోషిస్తుంది కనుక. అంతే తప్ప విష్ణువు తప్పుకుని శివుడిని ఈ పనికి ప్రేరేపించటం కాదది.
మరో సొగసైన పోతన గారి పద్యం
మెచ్చిన మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.
మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ, ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?
ఓ రాజోత్తమా! పరీక్షిత్తూ! హరుడు హాలాహలాన్ని కడుపులోకి మ్రింగకుండా కుత్తుకలో నిలుపుకోవడంతో ఆయన కంఠంమీద నల్లమచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా.
అని శుక మహర్షి అంటాడు.
ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్ఫూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వల్ల, తేళ్ళ వలన, అగ్ని వల్ల కష్టాలు కలుగవు.
దేవతలు, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ గారు.. అందరూ సాధు సాధు అని ఆయనను శ్లాఘించారు.
భూ మండలం మీద సంచరించే భగవత్ స్వరూపం శివుడు. ఆయనకు మూలమైన వాడు నారాయణుడు. అందుకు కూడా ఆయన భూగర్భుడు.
విషయ సంబంధం లేకపోయినా ఒక విశేషాన్ని చెప్పుకుందాము.
పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసినందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.
ఇప్పుడు పైన ఇచ్చిన మ్రింగెడివాడు అనే పద్యాన్ని చూడండి. పోతన చమత్కృతి తెలుస్తుంది.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య
1 Comments
Phani Kumar Sharma
అయ్యా ఇది ఏమైనా ప్రయోగమా? లేదా మీ పాండిత్య ప్రదర్శనా?
అసలు ఎక్కడా సంబంధం లేని విషయాలను సేకరించి విపరీత వ్యాఖ్యానం ఏమిటి.
మీరు అనుకున్న విషయానికి ఏ వస్తువు దొరికినా దానికి సహస్ర నామం లో ఏదో ఒక దానికి ముడి పెడుతున్నారు.
దయ చేసి మీరు వ్రాసిన ప్రతిదానికి సమాచార సేకరణ ఎక్కడ నుంచి చేశారు, ఏ గ్రంధాలు చదివారు లాంటి వివరాలు అందిస్తే ఉపయోగకరం గా ఉంటుంది.
నమస్కారం.