[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]


ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘గుమ్రాహ్’ (Gumrah, 1963) చిత్రం లోని ‘చలో ఇక్ బార్ ఫిర్ సే’. గానం మహేంద్ర కపూర్. సంగీతం రవి.
~
ప్రతి రచయితకు ఒక సిగ్నేచర్ పాట ఉంటుంది. సాహిర్కు ఒక్కటి కాదు చాలా సిగ్నేచర్ పాటలున్నాయి. ఇది సాహిర్ మార్కు అనిపించే గీతాలను పదుల సంఖ్యలో మనం గుర్తుచేసుకోవచ్చు. సాహిర్ని నేను విపరీతంగా అభిమానిస్తానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని ఒక్క పాట ఎప్పుడు విన్నా ఆయన పట్ల నాలో ప్రేమ కలుగుతుంది. నాకు నచ్చిన కళాకారుడిని కలవాలని అనుకునే వ్యక్తిని నేను కాను. కాని ఈ పాట విన్న ప్రతి సారి ఆయన్ని ఒకసారి చూడలేకపోయానే అన్న బాధ కలుగుతుంది. ఈ పాట తరువాత ఎన్ని గొప్ప గీతాలయినా నాకు దీని తరువాతే అనిపిస్తాయ్. ప్రపంచంలో సాహిర్ని మించిన కవులు ఉండే ఉంటారు. కాని ఈ పాట తరువాతే నాకు ఏ కవిత్వం అయినా. సాహిర్ తరువాతే నాకు ఏ కవి అయినా. అంతగా ఈ పాటతోనూ, దీన్ని రాసిన కవితోనూ ప్రేమలో పడిపోయాను. సాహిర్ స్థానాన్ని ఇప్పటిదాకా ఎవరూ నా మనసులో ఆక్రమించుకోలేకపోయారు.
సాహిర్ దగ్గరే నన్ను ఫ్రీజ్ చేసేసిన గీతం ఇది. ఇందులో ప్రతి వాక్యం నాకు అమృత ప్రాయం. ఇది విషాద గీతం కాని విషాద గీతం. ‘యే కదమ్ కిసీ ముకామ్ పే జో జమ్ గయీ తొ కుచ్ నహీ’ అన్నది సాహిర్ తత్త్వం. అంటే, ప్రయాణించే అడుగులు ఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతూనే వుండాలన్నమాట. దేన్నీ పట్టుకుని వ్రేళ్ళాడకూడదు. ఏది లేకున్నా, ఏది కోల్పోయినా ముందుకు సాగాలి. అందుకే, తనకు ప్రేయసి దూరమయిందని ఏడుస్తూ కూర్చోకుండా, మళ్ళీ అపరిచితులమవుదాం అంటున్నాడు. అందకే, విషాద గీతం కాని విషాదగీతం. అద్భుతమైన సందేశాన్నిచ్చిన గీతం. నా జీవితంలో అంతులేని ప్రశాంతతను తెచ్చిన గీతం కూడా.
ఇది మొదటి సారి వింటే ప్రేమికుల బ్రేక్ అప్ సాంగ్ అని అర్థం అవుతుంది. కాని జీవితంలో నేను వదిలేసిన ప్రతి అనుభవం చేసిన గాయం నుండి నన్ను కాపాడిన అద్భుతమైన ఔషధం ఇది. జీవితంలో ఎన్నిటినో ప్రేమిస్తాం. కావి అవి గాయాలనే మిగులుస్తాయి. ఆ గాయాలు మనలో కోపాన్ని అసహనాన్ని పెంచుతాయి. వాటి మధ్య చిక్కుకుని మన వ్యక్తిత్వాన్నే కోల్పోయి అత్యంత బలహీనమయే సందర్భం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. నా జీవితంలో అలాంటి సందర్భాలలో నన్ను కాపాడినవి రెండు పాటలు. అవి లేకపోతే నేను ఈ రోజు జీవించి ఉండేదాన్ని కాదని చెప్పడానికి నేను సంకోచించను. అవి గుమ్రాహ్ సినిమాలోని ‘చలో ఎక్ బార్ ఫిర్ సే’, అలాగే ‘చిత్రలేఖ’ సినిమాలోని ‘మనరే తూ కాహే న ధీర్ ధరే’. ఈ రెండు పాటల్లో మొదటిది నా జీవితంలో కొన్ని అనుభవాలను వదిలించుకోవడానికి సహాయపడితే రెండవ పాట జీవితంలోని ఒంటరితనాన్ని నా శక్తిగా మార్చుకోవడానికి ఉపయోగపడింది. అందుకే ఈ రెండు కూడా నాకు జీవితాన్ని ఇచ్చిన పాటలుగా చెప్పుకుంటాను. ఈ రెండు రాసిన కవి సాహిర్ అని నేను ప్రత్యేకంతా చెప్పక్కర్లేదు అనుకుంటా..
చలో ఇక్ బార్ ఫిర్ సే అజనబీ బన్ జాయే హమ్ దోనో (2)
(పద, ఒక్క సారి మళ్ళీ మనిద్దరం అపరిచితులుగా మారిపోదాం)


ఈ వాక్యం నాకు కృష్ణుడి నోటి నుండి వచ్చిన భగవద్గీతలా అనిపిస్తుంది. ఒక సంబంధాన్ని తెంచుకోవలసిన సందర్భంలో, ఆ స్థితి ఎంత గాయం చేస్తుందో అనుభవించినవారికే అర్థం అవుతుంది. అయితే ఆ విషాదాన్ని ఎలా అధిగమించాలో చాలా మందికి తెలియదు. విపరీతమైన కోపం, మనల్ని మనం నాశనం చేసుకోవాలని, అవతలివారిని ఏదో చేయాలనే కసి మనలో పెరుగుతుంది. కాని ఆ కోపం కసి మనల్ని ఇంకా బలహీనులనే చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం. చాలా సందర్భాలలో అవతలివారికి కావల్సింది కూడా అదే. మనలోని విచక్షణ చనిపోయి, మనం జంతువుగా మారి ఆ గాయంతో రగిలిపోతూ అమానవీయంగా ప్రవర్తిస్తే వాళ్లకు మన నుండి విడిపోవడంలో ఓ జస్టిఫికేషన్ కనిపిస్తుంది. అది వారి అపరాధ భావాన్ని తగ్గించి వారిని వారు సమర్థించుకోవడానికి ఓ అవకాశాన్ని ఇస్తుంది. దాని కోసం వాళ్ళకి మనం విచక్షణ కోల్పోవడం కావాలి. కాని ఆ సమయంలో కూడా వారిపై విజయం సాధించి అంత గాయాల పాలైన స్థితిలో కూడా జీవితంలో గెలవడం ఎలాగో ఈ ఒక్క వాక్యం సూచిస్తుంది.
మనం అపరిచితులంగా మారదాం. ఇంతకు ముందు అనుభవించిన వాటిని ఒక్కొక్కటిగా వదిలించుకుందాం. నిజంగా ఈ ప్రక్రియ మనల్ని ఎంత కాపాడుతుందో స్వయంగా అనుభవించిన నాకు తెలుసు. మనల్ని గాయాల పాలు చేసిన వారిని మర్చిపోవడం కాదు, వారిని అపరిచితులుగా మార్చుకోవడంలో మనకు లభించే ప్రశాంతత ఎందులోనూ ఉండదు. మర్చిపోవడం అంటే గుర్తు రాకుండా మనల్ని మనం కష్టపెట్టుకోవడం. కాని అపరిచితులని చేయడం అంటే మన మనసుల్లోని ఒకొక్క జ్ఞాపకాన్ని వదిలించుకోవడం, వారు మనకేమీ కాని స్థితికి మనసును తెచ్చుకోవడం. అప్పుడు వారు మనకి ఎదురుపడ్డప్పుడు కూడా మనసు ఎటువంటి స్పందనలకు గురి అవదు. ఎంత గొప్ప డీటాక్సిఫికేషన్ పద్ధతి ఇది. ఒక్క వాక్యంలో సాహిర్ గాయపడిన మనసుకు ఎంత గొప్ప పరిష్కారాన్ని సూచించాడో ఆలోచించండి.
న మై తుంసే కోయీ ఉమ్మీద్ రఖూ దిల్-నవాజి కీ
న తుం మేరీ తరఫ్ దేఖో గలత్ అందాజ్ నజరోం సే
న మేరే దిల్ కీ ధడ్కన్ లడ్ ఖడాయే మేరి బాతోం మే
న జాహిర్ హో తుంహారీ కష్మకష్ కా రాజ్ నజరోం సే
చలో ఇక్ బార్ ఫిర్ సే అజనబీ బన్ జాయే హమ్ దోనో (2)
(నన్ను ఓదార్చే హృదయం నీది అవాలనే ఆశ నాలో లేకుండా, నా వైపు నువ్వు వేరే దృష్టితోనూ తప్పుగానూ చూడకుండా, నా గుండె చప్పుడు నా మాటలలో తడబడకుండా, నీ సందిగ్ధత లోని రహస్యం నీ కళ్ళలో అగుపించకుండా, పద ఒకసారి మళ్ళీ మనం అపరిచితులం అవుదాం)


ఎంత అద్భుతమైన రచన ఇది. మనం అపరిచితులం అవుదాం అంటూ అది ఏ స్థాయిలో జరగాలో అతను చెప్తుంటే ఆ ప్రేమను కాదనుకుని వెళ్లిపోయిన వ్యక్తీ దురదృష్టం గోచరిస్తుంది. నన్ను ఓదార్చగల మనసు నీదే అవ్వాలనే నాలోని ఆశను నేను వదిలించుకోవాలి అని అతను అంటుంటే ఆ మె పై అతనెంత ప్రేమను పెంచుకున్నాడో అర్థం అవుతుంది. అలాంటి ఆశ అతను వదిలించుకోవడం అతనికన్నా ఆమెనే ఎక్కువగా బాధించాలి. అంతటి ప్రేమను నమ్మకాన్ని ఆమె పోగొట్టుకుంటుంది కాబట్టి. అలాగే, నా వైపు నువ్వు తప్పుగానూ వేరే దృష్టితోనూ చూడకు అని అతను అనడం, అతనిపై ఆమెకున్న కోరికను ప్రస్తావిస్తూ, ఆ కోరికను నువ్వు చంపుకో అని చెప్పడం అన్నమాట. అంటే అతనిపై ప్రేమ అనే అందమైన అనుభూతి, కోరిక ఆమె జీవితంలో ఒకప్పుడు ఆమెకు ఆనందం ఇచ్చినవే. ఆ ఆనందాన్ని ఆమె దూరం చేసుకోవాలంటే అది ఆమె నష్టపోవడమే కదా.
నా గుండె చప్పుడు నా మాటల్లో తడబాటుగా నీకు వినిపించకూడదు అంటున్నాడు కవి. అవతలి వాళ్లు తమ మనసును విప్పి బైటపెట్టుకునేది ఎంతో దగ్గరయిన వారి సాన్నిధ్యంలోనే. కాని ఆ చప్పుడు ఇక ఆమెకు వినపడనివ్వకుండా అతను జాగ్రత్తపడుతున్నాడంటే ఆమెను పూర్తిగా దూరం చేస్తున్నాడనే. అసలు అంత దగ్గరగా మనుషులు రావడమే అదృష్టం. దాన్ని ఆమె పోగొట్టుకునేంత అపరిచితురాలిగా ఆమెను చేసుకోవాలని అతని నిర్ణయించుకున్నాడు. ఎంత దురదృష్టవంతురాలామె. అలాగే ఆమె కళ్లలోని ఆ సందిగ్ధత, దాని వెనుక దాగిన తమ రహస్యమైన అనుబంధాన్నిఇంకెప్పుడూ ఆమె కళ్లలో అతను చూడదల్చుకోలేదు.
తనను వదిలి వెళ్ళిపోయిన ప్రేయసిని ఎంతగా తన నుండి అతను దూరం చేసుకుంటున్నాడంటే ఇది ఉట్టి మర్చిపోవడం కాదు. అనుభవించిన ప్రతి అనుభూతి ఒకొక్కటిగా వదిలించుకోవడం. ఇది ఆమెకు అతను వేసే శిక్ష. అతన్ని వదిలి వెళ్లిన అమె జీవితంలో తనతో ఆమె అనుభవించిన ప్రతి ఆనందాన్ని, అనుభూతిని అతను చెరిపేస్తున్నాడు. ఆ బంధం తనకిచ్చిన బాధను వదిలించుకోవడానికి ఆమెను అపరిచితురాలిగా మార్చుకుంటున్నాడు. ఆమెనుండి ఆ గడిచిన ఆనందాన్ని తీసేసుకుని ఆమెను ఎంత పేదరాలిగా మారుస్తున్నాడొ చూడండి.
తుంహే భీ కోయీ ఉల్ఝన్ రోక్ తీ హై పేష్ కదమీ సే
ముఝే భి లోగ్ కహతే హై కి యే జల్వే పరాయే హై
మేరే హమ్రాహ్ భీ రుస్వాఇయా హై మేరే మాజీ కీ (2)
తుమ్హారే సాథ్ భీ గుజరీ హుయీ రాతొం కే సాయే హై
చలో ఇక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హం దోనో (2)
(నిన్ను అడుగు ముందుకు వేయకుండా ఏదో చిక్కుముడి ఆపుతూ ఉంది. నాతో కూడా అందరూ ఈ అందాలు పరాయివనే చెప్తున్నారు. నాకు తోడుగా ఉన్నవి నా గతకాలపు అవమానాలే. నీతో కూడా నువ్వు గడిపిన రాత్రుళ్ళ నీడలు ఉన్నాయి. అందుకే మనం ఒకసారి మళ్ళీ ఒకరికొకరం అపరిచితులయి పోదాము)


ఫలించని ప్రేమకు ఇంత గొప్ప వీడ్కోలు ఇవ్వగలగడం అందరికీ సాధ్యం కాదు. ఆమెతో అతను ఇలా అంటున్నాడు. “నీ జీవితంలో ఏవో చిక్కుముడులు ఉన్నాయి. అందుకే నువ్వు నా వైపు అడుగు వేయలేకపోతున్నావు. నాతో కూడా అందరు ఈ అందాలు పరాయివని అవి నాకు ఎప్పటికీ దక్కవనే చెప్తున్నారు. నాకు తోడుగా గడిచిపోయిన గతకాలపు అవమానాలు మిగిలి ఉంటే, నీతో కూడా మనిద్దరం గడిపిన రాత్రుళ్ళ నీడలున్నాయి. ఇలాంటి స్థితిలో ఇక ఇప్పుడు మనం కలవడం జరగదు. అందుకే ఇద్దరం ఒకరికొకరం అపరిచితులం అవుదాం.
ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయింది. మళ్ళీ తిరిగి కలిసిన తరువాత అతని వైపుకు అడుగు వేయలేకపోతుంది. ఆమె కారణాలు ఆమెకు ఉన్నాయి. ఆమె జీవితంలో ఎన్నో చిక్కు ముడులున్నాయి. ఇతనితో కూడా ఆమె పరాయిదని ఎప్పటికీ అతని సొంతం కాదనే అందరూ చెప్తున్నారు. ఆమె జ్ఞాపకాలు, ఆమె అతన్ని వదిలి వెళ్లిపోవడం అతనికి అవమానాన్నే మిగిలించాయి. దాన్ని తోడుగా తీసుకుని అతను ఎంత కాలం ప్రయాణించాలి. ఇప్పుడు ఆమె కూడా మరొకరి సొత్తు. అయినా వారిద్దరూ కలసి గడిపిన జ్ఞాపకాలు ఆమెను వీడవు. ఏ కారణంతో నయితేనేమి ఆమె అతని వైపుకు అడుగు వేయనంటుంది. మరి ఇక ఈ గుంజాటన ఎందుకు అపరిచితులుగా మారిపోతే సరి కదా.
మరొకరి భార్య కాబట్టి ఇప్పుడతడు ఆమెని ప్రేమించకూడదు. అతని వైపుకు రావాలని ఉన్నా, సమాజం, నియమాలు ఆమెని ఆపుతాయి. ఆమె ప్రాధాన్యతలు ఆమెకున్నాయి. ఆమె జీవితం తనతో కలవదనే సూచనలు అతనికి అందుతున్నాయి. ఆమె వల్ల పొందిన అవమానాలే అతనికి మిగిలాయి. ఆమెకు అతనితో గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ స్థితిలో ఆమెపై మనసు నిల్పుకుని అతను సాధించేదేంటీ? అతడిపై ప్రేమను నిలుపుకుని ఆమె సాధించేదేమిటి? కాబట్టి, మళ్ళీ అపరిచితులయిపోవటమే ఉత్తమం.
ఇక్కడ ఏదో కారణంతో, బలవంతపు దౌర్జన్యంతో ఆమె మరొకరి సొత్తు అయిందని అనుకుని ఆమెను అతను స్వీకరించవచ్చు. ఆమెను ప్రేమించిన వ్యక్తి అతను. కాని ఆమె అతని వైపు అడుగు వేయనంటుందని మొదటి వాక్యంలోనే అతను స్పష్టంగా చెప్తాడు. ఇష్టం లేని జీవితంలోకి వెళ్ళిన ఆమెను అతని కాపాడాలనుకున్న ఆమె దానికి సిద్ధంగా లేదు. ఆమె జ్ఞాపకాలు ఆమె కున్నాయి. అవి అతనికి అవమానాలను తప్ప మరేవీ ఇవ్వవు. ప్రేమ పేరుతో ఆ అవమానాలను స్వీకరించడానికి అతను సిద్ధంగా లేడు. ఎంత ఆత్మగౌరవం ఉంది అతని వాదనలో. ఇది అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో ఎన్నో అనర్థాలు తప్పిపోవూ.
దీన్ని ప్రేమికుల హృదయ హోషగానే తీసుకోనక్కర్లేదు. మన దరికి రాని ఏ బంధం అయినా అత్మగౌరవాన్ని వదిలించుకుని అందుకోవలసిన అవసరం లేదు. దాన్ని అపరిచితంగా మార్చుకోవడంలోనే వ్యక్తిగత విలువ ఉంటుంది. విలువను కోల్పోయిన ఏ బంధంలోనూ ప్రశాంతత లభించదు. దీన్ని సాహిర్ ఎంత గొప్పగా వివరించాడో అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో చాలా అనవసర బంధాల మాయ నుండి మనం బైటపడవచ్చు. అన్నీ కోల్పోయిన సందర్భంలో కూడా జీవితంలో హుందాగానూ, ఆత్మగౌరవంతోనూ గడపవచ్చు.
తార్రుఫ్ రోగ్ హో జాయే తో ఉస్కో భూల్నా బెహతర్
తాల్లుక్ బోఝ్ బన్ జాయే తో ఉస్కో తోడనా అచ్చా
వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా నా హో ముమ్కిన్ (2)
ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ చోడ్నా అచ్చా
చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనో (2)
చలో ఎక్ బార్
(పరిచయం రోగంగా మారితే దాన్ని మర్చిపోవడం మంచిది. సంబంధం భారంగా మారితే దాన్ని వదిలించుకోవడం ఉత్తమం. కథను చివరి దాకా నడిపించలేకపోతే, దానికి ఓ అందమైన మలుపు ఇచ్చి అక్కడే దాన్ని వదిలేయడం మంచిది. అందుకే ఒక్క సారి మళ్ళీ మనం అపరిచితులమవుదాం)


ఆధునికులం అని అనుకునే ఈ తరం బంధాల పట్ల ఎంతో గందరగోళానికి గురి అవడం వెనుక కారణం ఈ స్పష్టత లేకపోవడమే. దేన్ని భరించాలి, దేన్ని సహించాలి, దేన్ని వదిలించుకోవాలి అన్న విషయం పట్ల అవగాహన లేకపోవడమే. విషంగా మారే సంబంధాలను వదిలించుకోవడం అవసరం అని నలభైవ దశకంలోనే సాహిర్ నినదించారు. అవి అందమైన అనుభూతులను మనకు కొంతకాలం అందించాయనే ఒకే ఒక సాకుతో వాటిలో కొట్టుకుపోతూ అంతం అవడం మూర్ఖత్వం. అయితే వాటి నుండి బైట పడేటప్పుడు కోపతాపాలతోనూ, కసి ద్వేషాలతోనూ రాకూడదు. ఆ కథకు ఓ అందమైన మలుపు ఇచ్చి విడిపోవడం ఉత్తమం. అందులోని విషాదం జీవితాంతం మనల్ని కప్పేయకూడదు. ఎంత గొప్ప మాట ఇది. స్త్రీల విషయంగా ఆలోచిస్తే ఇంత కన్న గొప్ప స్త్రీవాద ధోరణి మరొకటి ఉంటుందంటారా ? ఇక్కడ ఈ కవితను గానం చేసేది పురుషుడు. చాల సందర్భాలలో చెప్పుకున్నాం సాహిర్ మానవ సంబంధాలలో స్త్రీ పురుష భేధాన్ని చూపడు. ఏ బంధం అయినా మనల్ని మింగేస్తుంటే, విషంగా మారుతుంటే దాని నుండి బైటపడడం ఏ మనిషికయినా ఉత్తమం. ఇక్కడ స్త్రీ పురుషుల ప్రసక్తి అవసరం లేదు.
ఈ పాటలో ప్రతి చరణం నాకు చాలా ఇష్టం. ప్రతి వాక్యం నాకు ఎన్నో సందర్భాలలో మార్గనిర్దేశికం చేసింది. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాల వరకే పరిమితం అయిన విషయం కాదు ఓ ఉద్యోగం, ఓ ఆదర్శం, ఓ ఆలోచన, ఓ పని, ఓ బంధం, ఓ స్నేహం, ఇవన్నీ నన్ను మింగేయాలని చూసే సమయంలో అత్యంత విషాద స్థితిలో, బలహీనపడకుండా మౌనంగా వాటి నుండి తప్పుకుపోవడానికి, వెనుతిరిగి చూడకుండా నా దారి నేను నిర్మించుకుంటూ ముందుకు సాగిపోవడానికి నాకు కావల్సిన శక్తిని ఇచ్చిన గీతం ఇది. నా జీవితంలో చాలా సందర్భాలలో నేను ఒంటరినైనప్పుడు నాకు తోడు నిలిచిన పాట ఇది. అందుకే నాకు సాహిర్ అంటే ఎనలేని ప్రేమ. ఏ స్నేహం, ఏ బంధం, ఏ పని, ఇవ్వని ధైర్యాన్ని నాకు ఈ పాటతో అందించిన మిత్రుడు సాహిర్.
సినిమాలో ఈ పాట సన్నివేశం ఉద్విజ్ఞ్నతా మయమయిన సన్నివేశం. నాయికా నాయకులు ప్రేమించుకుంటారు. ఒకరోజు నాయిక వేరేవాడిని పెళ్ళిచేసుకున్నదని నాయకుడికి తెలుస్తుంది. ఆమె మోసం చేసిందని అతను బాధపడుతూంటాడు. ‘ఇల్మ్ నహీ థా ఇత్నీ జల్దీ ఖత్మ్ ఫసానే హోజాయేంగే/ తుమ్ బేగానే బన్ జావోగీ, హమ్ దీవానే హోజాయేంగే’ అంటాడో సందర్భంలో ఇదే సినిమాలో నాయకుడు.. అంటే, ఇంత త్వరగా మన కథ సమాప్తమవుతుందనుకోలేదు. నువ్వు అపరిచితురాలివవుతావనీ, నేను పిచ్చివాడినవుతాననీ అనుకోలేదు, అంటాడు. అలాంటివాడికి ఒకరోజు ఒక వ్యక్తి పరిచయమవుతాడు. ఇంటికి పిలుస్తాడు. అతని భార్య నాయిక. అప్పుడు పాటపాడమంటే, ఈ పాట పాడతాడు హీరో. ఇతడిని భగ్న ప్రేమికుడిని చేసిందామె. ఆమె కళ్ళల్లో తనపట్ల ప్రేమను గమనిస్తాడు. కానీ, భర్త ముందు ఆమె వ్యక్తం చేయలేదు. ‘తుమ్హే భీ కోయి ఉల్ఝన్ రోక్ తీ హై పేష్ కద్మీ సే’ అనటం వెనుక భావం ఇది. ఆమె భర్త ముందు ఇద్దరికీ పూర్వ పరిచయం వున్నదని చెప్పలేరు. కాబట్టి పద, మళీ అపరిచితులమవుదాం, మారిన పరిస్థితుల ఆధారంగా కొత్త పాత్రలు నిర్వహిద్దాం అంటున్నాడన్నమాట.
అందుకే, సినిమాలో నాయిక, అతడు పాడుతూంటే, రేడియో స్టేషన్ కు వస్తే, ‘ ఆజ్ వో బాత్ నహి/ ఫిర్ భి కొయీ బాత్ తొ హై/ మేరె హిస్సే మె హల్కీ సి ములాఖాత్ తొ హై/ గైర్ కా హోకె భీ యే హుస్న్ మెరే సాథ్ తొ హై, అంటాడు హీరో. గతంలో వున్నంత ప్రేమ లేకపోయినా, నా మీద ఇంకా కొంత ప్రేమ వున్నట్టే వుంది. నా ఖాతాలో మృదువయిన కలయిక ఇంకా వున్నట్టే వుంది. పరాయివాడిదయి కూడా ఆమె నా వెంట వుంది, అంటాడు. ఇదీ సాహిర్ పాట రచన పద్ధతి. ఒక పాటకు మరో పాటతో సంబంధం వుంటుంది. ఒక పాటను మరో పాట ద్వారా మరింతగా అర్ధం చేసుకోవచ్చు. సినిమాలోతు పెరుగుతుంది.
వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా నా హో ముమ్కిన్ (2)
ఉసే ఎక్ ఖూబ్శురత్ మోడ్ దేకర్ చోడ్నా అచ్చా
నేను వదిలిపెట్టిన ఏ స్నేహం పట్ల నాలో ఇప్పుడు కోపం లేదు. వాటిని గుర్తు చేసుకోవలసిన అవసరమూ లేదు. అన్నిటికీ అందమైన మలుపుల వద్దే వదిలిపెట్టగల శక్తిని సంపాదించుకున్నాను. సాహిర్ నాలో నింపిన బలంతో..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)
