[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఆమని ఎదురైనా..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఇది వసంతమని
తెలియదు నాకు
ఆమని ఎదురైనా
ఏమని అడిగే
అమాయకత్వం నాది
కమ్మని కోయిల గానంతో
వసంతమని తెలిసింది
పచ్చని చిగురుల పలకరింపుతో
వచ్చినది ఆమని అనిపించింది
వెచ్చని నీ ప్రేమ
ఆ అనుభవాన్ని నాకు పంచింది
ఇచ్చటనే సుఖముందని
అచ్చంగా చెప్పింది
ఇష్టంగా నీతోనే
వేయి జన్మలకు ముడిపడింది
సమస్త వైభోగాలూ
నీకు సాటి రావని తెలిసింది.

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.