స్నేహలత ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్. అటవీశాఖలో కన్సర్వేటివ్గా గుంటూరు జిల్లాకు నియమింపబడుతుంది. తన స్నేహితురాలు సుమబాల. సుమబాల ఇంటి దగ్గర గుడి నిర్మాణం జరుగుతుంది. స్నేహలత అక్కడికెళ్ళి గుడి దారిలో ఏయే వృక్షాలు నాటాలో, గుడి లోపల ఎలాంటి వనాల్ని పెంచాలో సూచిస్తుంది. ఉదాహరణగా, నవగ్రహాలకు సంబంధించిన వనాలు, రాశులకు నక్షత్రాలకు సంబంధించిన వనాలు పండితులను అడిగి తెలుసుకుని వాటిని పెంచమని చెప్తుంది. దీంట్లో ఆమె ఉద్దేశం అవకాశమున్న చోటల్లా మొక్కల్నీ, చెట్లన్నీ, వనాల్ని పెంచాలి.
***
ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏ జిల్లాలో పెరిగే మొక్కల్లో ఆల్కలాయిడ్ లాంటి ఔషధ గుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలని; ఔషధ గుణాలున్న మూలికల్నీ చెట్లను మనమే పెంచి ఇతర రాష్ట్రాల ఫార్మసీలకు ఎగుమతి చేసే స్థితికి రావాలనీ ముఖ్యమంత్రి అటవీశాఖాధికారులకు సూచిస్తారు.
***
గుంటూరు జిల్లా అటవీ అధికారిగా వుంటూనే స్నేహలత అనేక సామాజిక సమస్యలని కూడా పరిష్కరిస్తుంది. ఆమె గతంలో తోటి ఐ.ఎఫ్.ఎస్. ట్రయినీ కిషోర్ని ప్రేమిస్తుంది, పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కాని కిషోర్ పెళ్ళి సౌందర్య అనే ఆమెతో జరిగిపోయింది. ఆ తరువాత స్నేహలత ఒంటరిగానే మిగిలిపోయింది. ఇద్దరు బిడ్డల తల్లయిన తర్వాత సౌందర్య క్యాన్సర్ బారిన పడింది. కిషోర్ నివాసం కర్నాటక రాష్ట్రం. అనుకోకుండా కిషోర్, సౌందర్యలు స్నేహలతను కలుసుకున్నారు. ఆ తర్వాత సౌందర్యా, స్నేహలతల పరిచయం పెరిగింది. సౌందర్య ఆరోగ్యం పట్ల స్నేహలత కూడా చాలా ఆదుర్దాను, జాలిని ప్రకటిస్తుంది.
కిషోర్ పట్ల ప్రేమను అలాగే పదిలపరుచుకుని తన జీవితంలోకి మరెవ్వరినీ ఆహ్వానించలేకపోతుంది స్నేహలత. పెద్దవాళ్ళు ఒక ఐ.జి.తో ఆమె పెళ్ళి చేయాలనుకున్నారు. ఆ సంగతి స్నేహలతకు తెలియదు. విశాఖ ఐటిడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మహంతి. అతను కూడా స్నేహలత లాగానే తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగినవాడు. అతను స్నేహలత పట్ల మమకారం పెంచుకున్నాడు. అతని కజిన్ రంజిత స్నేహలతకు క్లాస్మేట్. మహంతి అంటే ఆమెకు చెప్పలేని అభిమానం.
గుంటూరు జిల్లా కన్సర్వేటర్గా స్నేహలత రైతులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రితో చర్చిస్తుంది. సౌందర్య క్యాన్సర్తో పోరాడుతూ రకరకాల ఆలోచనలు చేస్తుంది.
మహంతీ, స్నేహలతలు వివాహబంధంతో ఒకటైనారు. అప్పుడే వాళ్ళ జీవితాల్లో నిజమైన ఆమని వచ్చింది. సౌందర్య క్యాన్సర్ని జయించింది.
***
అటవీశాఖకి సంబంధించిన అనేక విషయాలతో వ్రాయబడిన నవలిక ‘ఆమని’. సందర్భోచితంగా నవలలో అనేక మొక్కల పేర్లు, వాటి కున్న ఔషధ విలువలను రచయిత్రి తెలియజేశారు. ఔషధ విలువలున్న మొక్కల్ని సాగు చేయటంలో గిరిజనులకు ఉపాధి కల్పించే విషయంగా చర్చించారు.
నవలిక వచ్చే వారం నుంచి ప్రారంభమవుతుంది.

శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి.
వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.