[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘అదంతే!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఎప్పటినుంచో అనుకుంటున్నాడు రామేశ్వర్రావ్, లోయలో ఉన్న ఆ గుడి కెళ్ళాలని! లోయేశుడి గుడి లేదా లోయేశ్వరస్వామి ఆలయం అనే పిలుస్తారు దాన్ని.
అక్కడి స్వామిని దర్శించుకుని, మనసులోని కోరిక భక్తిగా, శ్రధ్ధగా కోరితే తప్పక నెరవేరుతుందన్నది వందల ఏళ్ళ నుంచి వస్తున్న నమ్మకం!
సరే, పిల్లలకు ఎట్లాగూ వేసవి సెలవులు ఇస్తారు వచ్చే వారం నుంచి, ఇదే మంచి సమయం అనుకున్నాడు. వెంటనే భార్య సుజాతతో కలిసి ప్లానింగ్ మొదలెట్టాడు.
ఈ గుడి, వాళ్ళ పుట్టింటికి దగ్గర కావటంతో, అయిన వారినందరినీ చూసి; కాస్త ఆ పంట పొలాలు, స్వచ్ఛమైన నీళ్ళు పిల్లలకు చూపించవచ్చు కదా, అని సుజాత కూడా ఆనందంగా ఒప్పుకుంది ఈ ప్రయాణానికి!
***
ఎసి కోచ్‌లో హాయిగా సాగుతోంది ప్రయాణం, పెద్ద రద్దీగా కూడా లేదు ఆ వేళ వారి కంపార్ట్మెంట్. దాదాపుగా వీరి వయసే ఉన్న, ఎదురు బెర్తులలోని కుటుంబంతో పరిచయమైంది కాస్సేపట్లోనే. విశాఖపట్నం వైపు దూసుకెళ్తోంది రైలు. వీళ్ళ ఇద్దరు పిల్లలు, వారి అమ్మాయి బాగా కలిసిపోయి ఆటలాడుకోవటం కూడా ఆరంభించేశారు.
మగవారు టెక్నాలజీలో వస్తున్న మార్పులు, లేటెస్టు ఫోనులూ వగైరాల గురించి బాతాఖానీలో పడ్డారు. ఆడవారిద్దరూ వారి పిల్లలూ, వాళ్ళ స్కూళ్ళు, తమ చీరల్లో రకాలు వాటి మన్నికల గురించిన ఇష్టాగోష్ఠిలో బిజీ అయిపోయారు.
పిల్లలు ఆడుకుంటుంటే తన ఐ ఫోనులో చాలా ఫోటోలే తీశాడు, రామేశ్వర్రావు. చాలా క్లారిటీగా ఉన్నాయి అని అందరూ ఆనందించారు.
‘ఎట్లాగైనా ఆపిల్ ఆపిలే, మిగతావి మిగతావే’, అనుకున్నారు మగవారిద్దరూ, వారి ఇంట్రస్టు వాటి మీదే ఎక్కువ కావటంతో.
పిల్లల ఫోటోలు మాంఛి హ్యాపీ మూడ్‌లో బాగా వచ్చాయని, తల్లులూ, పిల్లలూ కూడా మురిసిపోయారు.
వారికి సహ ప్రయాణికుడిగా పరిచయమైన నవీన్ మనసులో అనుకున్నాడు అప్పుడే- అతి త్వరలో మనం కూడా ఐ ఫోను వాడకందార్ల జాబితాలోకి ఎక్కేయాలని! అనగా ఓ ఐ ఫోను కొనేయాలని!
తను తీసిన ఫోటోలు నవీన్ వాట్సాప్‌కి పంపాడు కూడా రావు, “మీ అమ్మాయి ఆల్బంలో ఉంచండి”, అంటూ!
రైలు వైజాగ్ స్టేషనులో ఆగగానే, బై బైలు చెప్పుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు రెండు కుటుంబాలు, “తప్పక రావాలి మా ఇంటికి”, అంటూ అడ్రసులు మార్చుకుని.
రామేశ్వరరావు కుటుంబం టాక్సీలో వంద కిమీ అవతల ఉన్న లోయేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరింది.
***
పురాతనమూ, ప్రసిద్ధమే అయినా పెద్ద హడావిడి లేదు గుడి దగ్గర. సులభంగానే దర్శనం అయింది వీరికి. భక్తిగా అభిషేకం టిక్కెట్టు కొని, యథావిథిగా పూర్తి చేసుకున్నారు, స్వామి వారికి ఎవరి కోరికలు వారు చెప్పుకుని.
దర్శనం అయి, బయట హాల్లోకి వస్తుండగా ఒక పక్కగా పెట్టిన ఉన్న పెద్ద హుండీ చూశాడు రావు.
“రజతపు తాపడం చేయించబోతున్నాం స్వామి వారి ద్వారతోరణానికి. ధారాళంగా విరాళాలు ఇచ్చి తరించండి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకుని”, అని కింద వ్రాసి ఉన్నది కూడా చూశారు రామేశ్వర్రావూ, అతని భార్యా!
ఏదైనా ఇద్దామా అని భార్య నడిగాడు రావు. ఆమె కూడా తప్పకుండా అన్నట్టు తలూపింది.
వెంటనే తాను ఇంటి దగ్గరే అనుకుని, పర్సులో నుంచి తీసి చొక్కా జేబులో విడిగా పెట్టుకున్న పది ఐదువందల నోట్లు, అనగా 5000/- రూపాయలూ తీశాడు, హుండీలో వేయటానికి.
అవి తీసి వేయడానికి, ఇలా ముందుకు కాస్త వంగాడో లేదో, “ముందు నేను”, అన్నట్టు అతని ఐ ఫోను. జేబులోంచి జారి హుండీలో పడిపోయింది.
ప్రమాదం గుర్తించి చేయి అడ్డు పెట్టే లోపలే, పెద్ద హుండీ కావటంతో, దాని ఓపెనింగ్‌లో నుంచి దూరి హుండీలోకి జారిపోయింది, మొబైల్ సర్రున!
సరేలే ఆలయం వారితో మాట్లాడి తీసుకుందాం అని తను అనుకున్న 5000/ హుండీలో వేసి బయటకు వచ్చాడు, రావు కాస్త కంగారుగానే.
సుజాత, పిల్లలూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు, ఆ ‘హఠాత్పరిణామాన్ని’!
“ఇచ్చేస్తారంటారా”, అని అడిగింది సుజాత మెల్లిగా, భర్త వెనకాలే నడుస్తూ!
“పిచ్చిదానా, ఎందుకివ్వరూ, వివరం చెప్పి తెచ్చుకుందాం,” అన్నాడు రావు, ధైర్యంగా, ఏ మాత్రం అనుమానమే లేకుండా!
అక్కడే కాస్త దూరంలో ఉన్న ఆఫీసు రూము చేరుకున్నారు, నలుగురూ!
“సాయంత్రం రావాలి, ఇప్పుడు ఎవరూ లేరు”, అన్నాడు అక్కడ ఉన్న జూనియర్ క్లర్కు, తల కూడా ఎత్తకుండా!
“ఇట్లా ఎప్పుడూ అవలేదు, బహుశా ఇవ్వలేరేమో”, అని కూడా అనుమాన బీజం నాటాడు వాళ్ళ మనసుల్లో, ఆ క్లర్కు, మళ్ళీ తలఎత్తని వీరుడి పోజులోనే!
“సరేలే నేను ఏఈవో/ఈఓ లతో మాట్లాడుతాను, సాయంత్రం వచ్చి. ఈ లోపల హుండీ ఏం తెరవరుగా”, అని సందేహ నివృత్తి కోసం అడిగాడు.
“లేదండీ, నెలలో కేవలం రెండు నెల్ల కొకసారి, చివరి ఆదివారం నాడు మాత్రమే అది తెరిచేది, ఇక మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చినా తెరవరు” అని భరోసా ఇచ్చాననుకుని అన్నాడు ఆ క్లర్కు!
ఈ మారు ఏవఁనుకున్నాడో, తల ఎత్తి రావు ముఖంలోకి చూస్తూనే జవాబిచ్చాడు!
‘సరేలే బ్రహ్మ దేవుడెందుకు గానీ, సాయంత్రం నేనే వస్తాను’, అనుకుంటూ కదిలాడు, కుటుంబంతో పాటు బయటకు రామేశ్వరరావు, ‘ఇదేవిఁటి దేవుడా, ఇట్లా వింతగా జరిగిందీ’, అనని కాస్త విసుక్కుంటూనే!
సుజాతా, ఇద్దరు పిల్లలూ అతని వెనకాలే బయలుదేరారు.
***
బయటికి రాగానే, “ఏవండీ, అయితే మన 7 గంటల బస్సు వదులుకోవాల్సిందేనా?! సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలంటున్నారు ఆఫీసరుతో మాట్లాడి ఫోను తీసుకోవటానికి”, అన్నది సుజాత.
“అవును అదీ నిజమే, ఈ గొడవలో మర్చేపోయాన్నేను, ఆ సంగతి. ముందు ఆ టిక్కెట్లు క్యాన్సల్ చేసి ఎంతొస్తే అంత తీసుకోవాలి, ఆ మేరకైనా నష్టం తగ్గించుకోటానికి” అన్నాడు రావు.
ఇంతలో పిల్లలిద్దరూ ఆకలి అంటే, అక్కడే ఉన్న హోటల్లో ఏదో టిఫిన్ ఇప్పిచ్చారు. భార్యా భర్తా ఇద్దరూ కాఫీతో సరిపెట్టుకున్నారు, అనుకోని సంఘటనతో ఏమీ తినాలనిపించక!
“నిజానికి ఈ పాటికి తిరుగు ప్రయాణంలో ఉండాల్సింది, అంతా ఆ హుండీ చేసిన నిర్వాహకం! ఇక్కడే ఉండి పోవాల్సి వచ్చింది”, అన్నాడు రావు కాస్త చిరాగ్గా, సుజాతతో.
“పొరపాటు మాటండీ, దైవాపచారమేమో కూడా”, అన్నది దైవభక్తి కాస్త ఎక్కువైన సుజాత!
“అయితే హుండీది కాదు తప్పు, తడబడ్డ నా చేతిదీ, జార్చిన నా చొక్కా జేబుదీ – చాలా?!” అన్నాడు, రావు కొంత నిర్లిప్తంగా!
గడియారం మెల్లిగా నాలుగు గంటలు కొట్టింది, వారున్న సత్రం లాంటి హాలులో, పాతకాలపు పెండ్యులమ్తో ఉన్న మోడల్ కావటంతో. 15 నిమిషాల్లో ఆఫీసు చేరుకున్నారు మళ్ళీ.
ఏఈవో రాగానే తన మొబైల్ అడిగి తీసుకుని, వెంటనే నెక్స్టు బస్సో, టాక్సీయో ఎక్కి విశాఖ వెళ్ళి రాత్రికి రూమ్ తీసుకుని ఫ్రెష్ అవ్వాలని రావు ఆలోచన.
ఐదు కూడా అయింది, ఏఈవో వచ్చే జాడే కనిపించలేదు అక్కడ!
క్లర్కు ఏమీ పట్టనట్టు ఆఫీసుకి తాళం వేసుకుని వెళ్ళిపోతుంటే, కంగారుగా వెళ్ళి అడిగాడు రావు.
ఖంగుతినే జవాబిచ్చాడు ఆ క్లర్కు.
“ఇవాళ్టి కిక రావట్లేదని ఫోను చేశారు ఏఈవో గారు, ఇందాక. సారీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ. చట్టున గుర్తు రాలేదు, మొబైలు పోగొట్టుకున్నానని మధ్యాహ్నం వచ్చినవారు మీరేనని!” అన్నాడతను కూల్‌గా!
ఒళ్ళు మండిన రావు, “పోగొట్టుకోలేదు, హుండీలో జారి పడ్డది”, అన్నాడు అక్కసుగా.
అతను నవ్వి, “రెండూ ఒకటే కద్సార్”, అన్నాడు!
“సర్లే ఉండి, రేప్పొద్దున వచ్చి మాట్లాడుకోండి”, అని ఉచిత సలహా పారేసి వెళ్ళిపోయాడు.
హతాశుడైన రావు, భార్యా పిల్లలకు ఆ విషయం చెప్పి, ఆ రాత్రికి చిన్నపాటి బస లాంటిది తీసుకుని అక్కడే ఉండిపోయాడు.
మర్నాడు కలవబోయే ఏఈవో గూర్చి, తన చేతికందబోయే మొబైల్ గూర్చీ కలలు కూడా వచ్చినయ్యేమో పాపం!!
***
మర్నాడు 10 గంటలకల్లా వచ్చాడు ఏఈవో గంగాధరం.
9.30 కే వచ్చి కాచుక్కూచున్న రామేశ్వరరావుకి వారి దర్శనభాగ్యం 10.30 కి కల్గింది.
“ఆఁ చెప్పండి, ఏవిఁటి విషయం”, అన్నాడు ఏఈవో, అధికార దర్పం కొట్టొస్తున్న గొంతుతో!
నిన్నటి నుంచి జరిగినది పూస గుచ్చినట్టు చెప్పాడు రావు, వినయపు ముద్దైపోయి! అంతా వింటున్నాడు కాస్త పక్కగా నుంచొని క్లర్కు, ఏం తీర్పు ఇస్తారో ఏఈవో మహాశయులు అని!
“కష్టమండీ, అయినా రూలు పొజిషన్ చూద్దాం ఉండండి”, అని క్లర్కుతో, “ఏదీ మన హుండీ మాన్యువల్ ఇటు తీసుకు రా,” అంటూ పురమాయించాడు.
వెంటనే చెక్క బీరువా తెరిచి ఆ పుస్తకం ఇచ్చాడు క్లర్కు.
అయిదు నిమిషాలు అందులో కొన్ని పేజీలు తిరగేసి, ఏఈవో గారు ఇలా అన్నారు, చాలా మామూలుగా, “లేదండీ, అవకాశం లేదు! ‘అకౌంటింగ్ ఆఫ్ హుండయల్ రూల్సు’ లో ఉన్న నిబంధనలు ఒప్పుకోవండీ!
హుండీలో ఏది పడినా ఇక అదీ, ఆ దేవుడికే దక్కుతుంది,అంతే! అదంతే! సారీ ఐ కాంట్ హెల్ప్ యూ!” అన్నాడు.
రామేశ్వర్రావుకి మతి పోయినట్లైంది, ఆ మాట వినగానే! “అదేంటండీ, పొరపాటున జారి పడ్డదండీ, నాకు అది హుండీలో వేసే ఉద్దేశమే లేదు” అన్నాడు ఆవేశంగా!
ఏఈవో ఏ మాత్రం తొణకకుండా, “అయ్యా ఒకసారి చెప్పాను, అర్థం చేసుకోండి, నేను రాశానా ఆ రూలు?! అది, తరతరాలుగా ఉన్నదే! దేవుడికి హక్కు భుక్తమైన దానిని ఇవ్వడానికి నేనెవరిని, సారీ గుడికి రాసిచ్చేశాను అనుకోండి, అంతకన్నా ఏం చేయలేం!”, అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు.
***
రామేశ్వర్రావు కూడా బయటకు వచ్చి, “అయితే నేను మీ పై ఆఫీసుకు చెప్తాను, కంప్లైంట్ ఇస్తాను”, అన్నాడు ఆవేశంగా.
అది చెవినబడ్డ ఏఈఓ, పరమ శాంతంగా, “రేపెటూ వస్తున్నారు ఈవోగారు, తీరిగ్గా కలవండి, నాకెట్టి అభ్యంతరం లేదు”, అని రెట్టించినట్లు మాట్లాడి, తన జీపులో వెళ్ళిపోయాడు, డ్రైవరు గిర్రున స్టీరింగు తిప్పగా!
రావు కుటుంబం మళ్ళీ బస చేరుకుని ఆ రాత్రీ అక్కడే గడిపారు.
పిల్లలకు అలసటా, సుజాతకూ విసుగూ, రావుకు కోపమూ హెచ్చిపోసాగినై!
రాత్రి 11 గంటలకు ఉండలేక అనేసింది, సుజాత, భర్తతో: “పోన్లెండి, హుండీలో వేసి, మొబైలు కూడా స్వామికే అర్పించేశాం, అనుకుందామండీ” అని!
రావు ఏమీ అనకుండా, గుర్రుగా అటు తిరిగి పడుకున్నాడు, ఆ మాట వినగానే!
***
తెల్లవారింది. నలుగురూ ఆఫీసు కెళ్ళారు. ఈవో గారు వచ్చారు, చాలా శాంత స్వభావులు.
“అవునండీ, రావుగారూ, మా వాళ్ళు చెప్పారు మీ సంగతి, అదే మీ మొబైల్ సంగతి! కానీ ఏమీ సహాయం చేసేట్టు, చేయకలిగేట్టు కనబడలేదండీ, చేద్దామనే నాకూ ఉన్నా! స్వామి వారి సొత్తు తీసి ఇవ్వటానికి మేమెవరమండీ! అసలే, అయ్యవారు, ఫాలాక్షులు, మీకు తెలియనిది ఏముందీ, పరమేశ్వరుడితో వ్యవహారం, ఒళ్ళు దగ్గర పెట్టుకు మసలుకోవాలి. అనూచానంగా వస్తున్న సంప్రదాయం, చేసుకున్న ఆనవాయితీ, రాసుకున్న రూలు కూడా అదే చెప్తున్నాయి.” అని జాలిగా చూస్తూ చెప్పారు-రావునీ, పక్కనే నుంచుని ఉన్న సుజాతనూ ఉద్దేశించి.
సుజాత చొరవ తీసుకుని అడిగింది: “మీకు విశేష అధికారాలు ఉంటాయి కదండీ, అవి ఉపయోగించి ఏమైనా చేయగలరేమో కదా” అని.
“విశేషం.., అధికారం..” అని ఒక పెద్ద నవ్వు నవ్వాడాయన!
దైవం ముందు మనమెంత అనో, లేక ఏదైనా విశేషమైన అర్థముందో ఆ నవ్వులో, తెలియలేదు, వింటున్న ఆ ఇద్దరికీ!
ఒక్క క్షణం ఆగి ఆయనే అన్నారు మెల్లిగా: “ఒక పని చేయండి, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి, హుండీ తెరిచి లెక్కపెట్టే రెండో నెల చివరి ఆదివారం ఇంకో ఇరవై రోజుల్లో ఉన్నది, అప్పుడు మీరొస్తే, సీసీటీవిలో చూసి, మీ చేతిలోంచే ఆ మొబైల్ జారి పడ్డదీ అని నిర్దారించుకుని, మా రూల్సు చొప్పున ఫారమ్‌ల మీద సంతకాలు పెట్టించుకుని, అందరి సమక్షంలో మీ మొబైలులో నుంచి సిమ్ మాత్రం తీసుకునే ఏర్పాటు, వెసులుబాటు కల్పించగలను, మీ కిష్టమైతే!
మీ అడ్రస్ ప్రూఫూ, ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించి కాపీ ఇవ్వవలసి ఉంటుంది సుమా! కంపల్సరీ! అయ్యా అదీ నేను కాస్త చొరవ తీసుకుని చేయగల సహాయం, ఆడ కూతురు కూడా అడుగుతోంది, మా అమ్మాయి లాంటిది- కాదనలేక పోతున్నాను! అందుకే ఈ ముందడుగు వేయాలని సంకల్పం కలిగింది! నాక్కలగటవేవిఁటీ, ఆ ఈశ్వరుడే కల్గించాడు, మీ భాగ్యవశాన,” అని ముగించారు.
“సరేనండీ”, అంటూ నమస్కారం పెట్టి బయటకు నడిచారు, రామేశ్వర్రావూ, అతని భార్య సుజాతా!
‘మా భాగ్యమే, భాగ్యం’ అనుకున్నాడు రావు, ఆయన అన్న ఆ చివరి మాట గుర్తు చేసుకుని!
***
మర్నాటికి కాస్త సమాధానపడి, తేరుకున్నాడు రామేశ్వర్రావు.
“హైద్రాబాదు వెళ్ళి మన అడ్వకేట్‌ని సంప్రదించాల్సిందే ఈ విషయంలో” అన్నాడు,తనకు జరిగింది గొప్ప అన్యాయమని ఫీలవుతున్న రావు, రైల్లో తిరుగు ప్రయాణంలో, పక్కనే ఉన్న భార్యతో.
ఆమె “వదిలేయండీ, ఇంతటితో! దైవానికే ఇచ్చామనుకుందాం, తప్పేముంది. ఏదో పొరపాటున జారిపడ్డది, మర్చిపోండిక” అన్నది అనునయంగా.
“అది సరే, ఎవరిదైనా భక్తురాలి మంగళసూత్రం జారిపడితే, అదీ ఉంచేసుకుంటారా?! మన ఇంటి లోన్ కాగితాలు అందులో పడేస్తాం, ఆ బ్యాంకు అప్పు దేవుడి ఖాతాలోంచి తీసి కట్టేస్తారా?! అప్పు తీర్చేస్తారా?! పడ్డ ఆస్తులు ఆయనవే అయినప్పుడు, హుండీలో పడ్డ అప్పులూ ఆయనవే కావాలి కదా మరి?! ఏమి రూల్సో ఏమిటో, అర్థం లేకుండా” అన్నాడు రావు కుతకుతలాడుతూ!
“ఊరుకోండి, ఆవేశపడవాకండి,” అని మాత్రం అనగల్గింది సుజాత భర్తతో, ఏమీ పాలుపోక!
***
ఆ చివరి. ఆదివారం, ఆలయానికి ఒక్కడే వెళ్ళి, ఆ సిమ్మూ, తన పర్సనల్ డేటా అంతా తెచ్చుకున్నాడు రావు, తన దురదృష్టానికి గునుస్తూనే!
తిరిగి వచ్చిన ఆ రోజే అతనికి ఓ ఫోను వచ్చింది.
కాల్ చేసింది, రైల్లో కలిసిన అప్పటి తోటి ప్రయాణికుడు, నవీన్!
“సార్, రావు గారు బాగున్నారా?! మేడం గారు, పిల్లలూ బాగున్నారా?! అన్నట్టు మీరు మీ ఐఫోనులో ఆ రోజు రైల్లో తీసిన ఫోటోలు మా అమ్మాయి చూసి చూసి మురిసిపోతూ ఉంటుందండీ, చాలా బాగున్నాయి ఆ ఫోటోలు,. మన పరిచయం ఇంకా బాగుంది, నాకూ మా ఆవిడకూ! అన్నట్టు, నేను కూడా నిన్ననే ఐ ఫోను కొన్నాను సార్, I am thrilled by my new possession!
మీకే థాంక్సు చెప్పుకోవాలి సార్! రైట్ సార్ ఉంటాను, ఇది చెప్పి నా ఆనందం మీతో పంచుకోవటానికే ఫోను చేశాను. వీలు చూసుకుని మా ఇంటికి రాండి సార్ పిల్లలతో సహా. వచ్చేముందు జస్ట్ ఒక కాల్ చేయండి అంతే, మీ కోసం నిరీక్షిస్తూ ఉండిపోతాం, ఎటూ వెళ్ళకుండా! బై సార్” అని సెలవు తీసుకున్నాడు.
***
రామేశ్వర్రావు, ‘You.. I-Phone..’, అనుకున్నాడు మనసులో- గట్టిగా!
ప్రేమతోనో, కోపంగానో- How do ‘we’ know?!
నిజమే, మనకేం తెలుసూ?!
(యథార్థ ఘటన ఆధారంగా కల్పించి వ్రాసినది)