[2025 ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారి ‘అద్వైతం’ అనే రచనను అందిస్తున్నాము.]


విస్మయాలన్నీ వాస్తవాలైనప్పుడు
జోహారులనందుకుంది మానవ సంకల్పం.
ఇది శ్రమ దానాల పర్వం.
వెలసింది భవ్య రామ మందిరం.
సాక్షాత్తుగ యోగి రాజ విరాజమాన శిల్పం
అంతటా కర్ణాటక దుందుభుల విజయోత్సాహం
శతాబ్దుల కాలానికి కొన సాగిన పోరాటం
జన్మ భూమి లాలనల ఒడిని చేరింది
లల్లా మోహన రూపం
మాతృ గర్భ ఫల శుక్తి
సహన శక్తి, పితృభక్తి, పత్నీ ప్రేమాను రక్తి
విశ్వ కుటుంబ యాత్రా పథికుడు
మానవుడైన పరమ దేవతామూర్తి అతడు.
సాకేత రామ అయోధ్యా నగరం
ఆధునిక అభ్యుదయానికి మకుటం
అపురూపమైన ఆలయ నిర్మాణం
సరి కొత్త చరిత్ర పుటలను తెరిచింది సనాతన ధర్మం
అంతరాత్మ జ్ఞానానికి తోడుగ
ఆర్థికతకు కలిగిందొక విప్లవం
విఫణి వీధులలో వినూత్న తేజం
భక్తికి తోడుగా వృత్తులన్నింటికి
కలిగింది క్రమ వికాసం.
శ్రద్ధా భక్తుల మందిర దివ్యత్వానికి
ఉదారతల వెల్లువెత్తిందిజనకోటిపర్వం.
నేపాలు సీత, భూపాలుడు రాముడు
పుట్టినింటి కానుకల మహా పర్వమయింది.
రాముడు అందరివాడను ఆదర్శం,
మనసులను కలిపింది
దేశ స్వాతంత్ర్య రక్షణకు
సమైక్యతను
పాదు కొలిపింది.
మరల తిరిగి రాగల రామ రాజ్యానికి
జనవరి ఇరవై రెండు
ఇరవై నాలుగు
న్యాయ మార్గాలకు ఇరవై
శిలా న్యాస ప్రాణ ప్రతిష్ఠ
జీవన మార్గ జీర్ణోద్ధరణకు కారణమై
అవధి లేని వల్మీకపు
సంపుటుల చరిత్ర లేఖనాలకు నాందిని పలికింది
మట్టి ప్రమిదల కిప్పుడు
వెల లేని భాగ్యం కలిగింది.
మంచితనాల మనుగడల ఆరంభానికి
ఆవునెయ్యి వెలుగుల
దీపావళి సంబరం మొదలయింది.
మర్యాదా పురుషోత్తముడిక
మనసారా కొలువుంటాడని
ప్రతి హృదయం ‘అద్వైత’ భావనల
సింహాసనమయింది.
