[పారనంది అరవిందారావు గారి ‘అహమిక’ అనే గల్పికల సంపుటిని సమీక్షిస్తున్నారు విశ్వర్షి వాసిలి.]


అరవింద గారి ‘అహమిక’ సాఫ్ట్ కాపీని తిరగేస్తుంటే నా ఆలోచనలు గల్పిక ఎలా ఉంటే బాగుంటుంది అన్న వైపు పరుగులు తీసాయి. పర్యవసానంగా నాలో పాదుకున్న అంశాలు ఇవి –
గల్పికలో కాల్పనికత పాలు తక్కువగా వాస్తవికత పాలు ఎక్కువగాను ఉండాలి. అలాగే కథలా అనిపించాలి కానీ కథ కాకూడదు. కథకు కావలసినంత నేపథ్యం గల్పికకు అవసరం లేదు. షార్ట్ స్పాన్ అంటే అతి తక్కువ వ్యవధిలో ముగియాలి. కథలా కురిసినట్టు కాక ఉరిమినట్టో, మెరిసినట్టో గల్పిక ముగియాలి. రేఖాచిత్రానికి కొన్ని నగిషీలు దిద్దితే కథ అవుతుంది. కాబట్టి గల్పికకు ఎటువంటి అలంకరణలు ఉండకూడదు. అనవసరతలు ఏ మాత్రం లేనిది గల్పిక. ఆ అనవసరత కాల్పనికత కావొచ్చు, వర్ణన కావొచ్చు, సంభాషణ కావొచ్చు, సంఘటన కావొచ్చు, పదం కావొచ్చు, వాక్యం కావొచ్చు. ఈ కావొచ్చులలో దేనిపైన కాస్తంత మోజు ఉన్నా ఆ రచయిత గల్పిక కోసం కలం పట్టకుండటమే మంచిది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, జీవితం నుండి ఏమాత్రం పారిపోకూడదు.. ఊహల్లో తేలిపోకూడదు. మొత్తానికి ఏవిధంగానూ నేల విడిచి సాము చేసే రచన కాదు గల్పిక. కథన చాతుర్యం గల్పికకు అవసరం లేదు. అన్నట్టు, గల్పిక – అనుభవానికి మొదటి తాంబూలమిస్తూ – అనుభూతి ప్రధానంగాను, సంఘటనా ప్రధానంగాను ఉంటూ – వాస్తవికతను, వ్యంగ్యాన్ని, విమర్శను పొదువుకోవాలి. ముఖ్యంగా – గల్పిక వస్తువు ఒక అంశానికి పరిమితం కావాలి.
ఇక, ‘అహమిక’ను కథల సంపుటి అనాలా, గల్పికల సంపుటి అనాలా అన్న సందేహం వచ్చింది. ‘సిరికోన’లో గంగిశెట్టిగారు గల్పికా రచనకు పిలుపు ఇచ్చిన మీదట చేసిన రచనలు కాబట్టి ఈ సంకలనంలోని 62 శీర్షికలను గల్పికలుగానే పరిగణించాను.
అరవిందగారి గల్పికలను చదివి, సమీక్షించేముందు వారినే వారికి నచ్చిన గల్పికలను చెప్పమని అడిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే గత ఆదివారం “అరవిందగారూ, ఇన్ని గల్పికల్లో మీకు బాగా నచ్చిన పది గల్పికలను.” అంటూ మధ్యాహ్నం మెసేజ్ పెట్టాను. రాత్రికి “నాకు బాగా నచ్చిన గల్పికలు అంటూ 13 శీర్షికలు పంపి “ఇవి చదివి మీకు నచ్చిన పది ఎంపిక చేసుకోండి” అంటూ ఒక నోట్ పెట్టారు.
రాసిన 62 గల్పికల నుండి అరవింద గారే ఐదో వంతు గల్పికలను ఎంపిక చేసిన తర్వాత వాటిని తూచటం అంత తేలికైన పని కాదు. ఈ 13 గల్పికలలో ప్రతి గల్పికా ఏదో ఒక దృక్కోణంలో రచయిత్రికి ప్రీతిపాత్రమైనవే కదా. అరవిందగారే వడబోసిన గల్పికల్ని నాకు తెలిసిన గల్పికా రచనతో సమీక్షించటం, విశ్లేషించటం ఇప్పుడు నా పని.
వింత కాని వింత (గ 60 – పు 197)
‘వింత కాని వింత’ గల్పిక అరవిందారావు గల్పికల కదంబమైన ‘అహమిక’లో అరవయ్యవ గల్పిక. ఆరు పదుల అనుభవాన్ని పండించుకున్న రచయిత్రి -ఒక గాయకురాలిగా జీర్ణించుకున్న వ్యవస్థకు అక్షరరూపమిచ్చిన గల్పిక ఈ ‘వింత కాని వింత’. రచయిత్రి అవగాహన, వాదన, వేదన, ఆవేదనలను కథనరూపంలో ప్రతిఫలింపచేసిన గల్పిక ఇది.
ఇతివృత్తపరంగా – ఒక కాకి.. ఏకాకి కథ ఇది. పూర్వ ముఖంలో – కథకురాలు కనిపించిన ఈ గల్పిక ముగింపులో కథకురాలి ఆంతర్యం పలికిన తీరు కథారవిందమైంది. కళాకారుల విషయంలో తోటి కళాకారుల నైజాలను కాకి-కోకిలల పరంగా చూపటంలో కథకురాలు కృతకృత్యురాలు కావటం ఈ గల్పికకు పూర్వ ముఖం. ఉత్తర భాగంలో – ముగింపులో – వర్తమాన తిరోగమన ధోరణులను, పరోక్ష సందేశాన్ని అందించి గల్పికా రచనలో తమ మార్కులు సంపాదించుకున్నారు అరవింద గారు. కొన్ని దశాబ్దాల క్రితమే మాతృభూమికి భౌతికంగా దూరమైన రచయిత్రి అరవింద ప్రవృత్తిపరంగా తనకు తెలిసిన గ్రామీణ వాతావరణాన్ని అక్షరబద్ధం చేయటం ఆమెకు ఇక్కడి ప్రకృతిపట్ల ఉన్న మక్కువను చూపిస్తోంది. అందుకే గల్పిక ప్రారంభంలోనూ, ముగింపులోనూ వర్ణనాత్మకత చోటుచేసుకుంది.
ఈ గల్పికకు చిన్నారి లహరి వేసిన రేఖాచిత్రం ఇంకా బాల్యాన్ని వీడని అరవిందగారి ప్రవృత్తిని రేఖాబద్ధం చేసినట్లుంది.
అనామకుడు (గ 7 – పు 25)
అరవింద గారి ఏడవ గల్పిక ‘అనామకుడు’. ఇది పాఠకుడ్ని ఏడిపించే గల్పిక. ప్రతి ఒక్కరినీ కదిలించే గల్పిక.
నాన్న ప్రతిసారీ “వీడి పేరేంటి?” అని అడగటం.. అమ్మ ప్రతిసారీ కాస్త ఆలోచించి చెప్పటం అరవిందగారి ‘అనామకుడి’ నేపథ్యం. తండ్రికి వంద సార్లు చెప్పినా కొడుకు పేరు గుర్తుండకపోవటం, అమ్మ ఆ వందసార్లూ వెంటనే చెప్పక గుర్తు తెచ్చుకుని చెప్పటం ఎనిమిది మంది సంతానంలో ఈ అనామకుడికున్న గుర్తింపు, అస్తిత్వం. ఈ ఒక్క వాక్య నెరేషన్ అరవింద మార్కు ఈ గల్పిక. ఒకరోజు నాన్న ఏదో సంచీలో తీసుకొస్తే ఎవరికీ తెలీకుండా అనామకుడు అందులోని తాయిలాన్ని మింగేసి నీళ్లు తాగేస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం –
“ఇదేంటి! అందరూ నా వైపే చూస్తున్నారు! అమ్మ నా తల మీద చెయ్యి వేసి ప్రేమగా జుట్టుని తన వేళ్ళతో దువ్వుతోంది. అబ్బా! ఎంత బావుందో! ఇదేదో కలలా ఉంది! అన్నలూ తమ్ముళ్లూ అక్కలూ చెల్లెళ్లూ అందరూ నా చుట్టూ కూర్చుని ఉన్నారు. కొంతమంది నా చేతులని కొంతమంది నా కాళ్లని మెల్లగా రాస్తున్నారు. అబ్బా! ఎంత హాయిగా ఉందో! వీళ్ళందరూ నా చుట్టూ కూర్చున్నారంటే ఏదో గొప్ప పనే చేసి ఉంటాను.. ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది.” (పుట 26)
“వీడి పేరేంటి? అని నాన్న అమ్మని అడుగుతున్నాడు మళ్లా. నేను చిన్నగా నవ్వుకున్నాను. పేరు లేకపోతే నేమిటి! అందరూ నా చుట్టూతా ఉన్నారు.. దీనికోసమే ఇన్నాళ్లు కలవరించాను!” (పుట 27)
అనామకుడు తిన్నది విషమని, ముగింపు సీన్లో ఉన్నది తాను కోరుకున్న కుటుంబ సభ్యుల మధ్య అని – ఇట్టే పాఠకుడికి తెలిసిపోతుంది. పాఠకుడి కంట తడితో – చివరి మూడు వాక్యాలు అలుక్కుపోయినా – అరవింద గారి అనామకుడు మాత్రం పాఠకుడి హృదయాలలో చిరంజీవిగా మిగిలిపోతాడు. హాట్స్ ఆఫ్ అరవిందగారూ.. ఇంతమంచి గల్పిక ఇచ్చినందుకు.
అహమిక (గ 4 – పు 12)
‘అహమిక’ ఓ గొప్ప, అంతర్జాతీయ రచయిత్రి కథ. తోటి రచయితలు, రచయిత్రులు తన స్నేహం కోసం ఎగబడుతుంటారనుకుంటూ మిడిసిపడుతుండే రచయిత్రి కథ. తనకు తనే గర్వంగా ఫీలవుతూ అమిత స్వార్థంతో వర్తించే రచయిత్రి. కావాలనుకునేవారితో స్నేహం పెంచుకుంటూ తక్కినవారిని దూరంగా ఉంచే అహంభావి. ఎన్ని సన్మానాలు జరుగుతున్నా ఇంట ఒంటరితనంతో మగ్గిపోయే ప్రఖ్యాత రచయిత్రి. తన సంతోషం పంచుకోవడానికి ఎప్పుడూ దగ్గిర ఉండని వ్యాపారవేత్త రచయిత్రి శివరంజని భర్త మహేష్. అయినా శివరంజని కథలు వింటూ స్పందించే భర్త మహేష్. ఇంత ప్రఖ్యాత రచయిత్రి కొత్త పత్రికవారు నిర్వహిస్తున్న పోటీకి కథ పంపించటం, ఆ కథ బహుమతి పొందకపోవటం, కొత్తగా కలంపట్టిన రచయిత్రికి బహుమతి రావటం శివరంజని అహాన్ని దెబ్బతీసింది.
భర్త మహేష్ చూపిన చొరవతో అహాన్ని వీడి వాస్తవంలోకి రావటం రచయిత్రిగా అరవిందగారు ఆశించిన ప్రయోజనం. ‘Versatility should be your calling card.. కొత్త పుంతలు తొక్కాలి’ అన్న భర్త హితోపదేశంతో మారిన వైనం ఈ కథ.
ఓ రచయిత్రి కథ (గ 40 – పు 133)
“సంతోషం కానీ, సంతాపం కానీ పంచుకోవడానికి సంతానమంటూ లేని” (పుట 133) అలనాటి రచయిత్రి కథ. ఇది కూడా గల్పిక కాదు. కథానికా లక్షణాలున్న కథనే. ‘అహమిక’ రచయిత్రి శివరంజని అహంభావి, స్వార్థపరురాలు అయితే రచయిత్రి రత్నాకరాంబ శివరంజనికి విరుద్ధం. ఇతర రచయిత్రులపైన ఎటువంటి అసూయా లేని రచయిత్రి. ఎన్నోయేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశాన్నిఉపయోగించుకుని – తన ఉపన్యాసంతో నాలుగు మంచిమాటలు చెప్పి – ఇంటికొచ్చి చీర మార్చుకుని – మౌనంగా పక్క మీద నడుం వాల్చి – కళ్లు మూసుకుంది. ఇక్కడ అరవిందగారి ముగింపు –
పనిమనిషి “మల్లి గిన్నెలు కడిగి, ఆవిడ చీర మడత పెట్టి, దూరం నుంచే ‘హాయిగా నిద్రపోండమ్మా! రేపొస్తాను!’ నేనొచ్చేసరికి మళ్లీ పుస్తకాలన్నీ తీసి చిందర వందర చేయకండమ్మా!’ అంది నవ్వుతూ.
ఆవిడ వద్ద నుంచి జవాబు లేదు.” (పుట 139)
ఇది గొప్ప కథ కాకపోవచ్చు. అరవిందగారి లాంటి రచయితలు, రచయిత్రులు కోరుకునే జీవిత చరమాంకానికి అక్షరార్పణ ఈ కథారవిందం.
ఎవరు మారాలి? (గ 21 – పు 74)
ఈ కథ రాగిణిది. రాగిణిని రచయిత్రి అరవిందగారు ఇంట్రడ్యూస్ చేస్తుంటే కళ్ల ముందు అరవిందగారే కదలాడతారు.
ఈ కథలోని ఇతివృత్తం same gender relationships, weddings కి సంబంధించింది. వర్క్ ప్లేస్‌లో ‘పని ముఖ్యం కాని వ్యక్తిగత జీవితం కాదు’ అన్న మెసేజ్ ఇవ్వటానికే ఈ కథ రాసుంటారు అరవిందగారు. అలాగే వర్క్ ప్లేస్ లో ‘ఎవరైనా అవాకులు చవాకులు వాగితే గట్టిగా మందలించ వలసిన బాధ్యత’ మనదే అని గుర్తు చేస్తారు. “ప్రపంచం మారుతోంది. చట్టాలు మారుతున్నాయి. మనుష్యుల వ్యవస్థ మారుతోంది. ప్రధాన విలువలు మారుతున్నాయి. మనం కూడా మారాలి.. Every human matters!” అన్న సందేశం అరవిందగారిదే. ఈ కథ ముగింపుకు బాగుంటుంది.
నేను – ఆ చెట్టు – ఓ పిచ్చుక (గ 39 – పు 131)
పేద పిచ్చుక.. “ఎక్కడికో ఎగిరెగిరి అంతో ఇంతో ఆహారం తెచ్చి తన పసిబిడ్డల నోటికి అందించి తృప్తిపడుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ నా పిల్లల కోసం నేను కష్టపడ్డ రోజులు గుర్తుకొచ్చి నా కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుంటాయి. ఆ చెట్టు, ఆ పిచ్చుక, దాని గూడు పిల్లలతో నాకో అవినాభావ సంబంధం ఏర్పడింది.” (పుట 131) – ఇదీ ప్రారంభంలో వచ్చే నెరేషన్. గల్పికకు రచయిత్రి అనుభవం ప్రాణం అనటానికి ఈ నెరేషన్ ఒక మచ్చుతునక.
మానవుల, పక్షుల మధ్య బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, రక్త సంబంధాలు ఎలా అల్లుకుపోతున్నాయో, ఎలా తెగిపోతున్నాయో సున్నితంగా ఎత్తిచూపే అరవింద గారి గల్పిక ఈ ‘నేను – ఆ చెట్టు – ఓ పిచ్చుక’.
నా ముగింపు మాటలు
అంశం, సందేశం గల్పికకు రెండు కళ్లు. మలుపు, ముగింపు ముఖ్యఅంగాలు. విమర్శ, వ్యంగ్యం అంతరంగం కావాలి. వాస్తవానికి అనుభవం కలబోత కావాలి. సృజనాత్మకత కలనేత కావాలి. వీటితోపాటు గల్పిక షార్ట్ స్పాన్‌లో ముగియాలి అని ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా అరవిందగారి 62 కథారవిందాలనూ అనుశీలిస్తే short span కి సంబంధించినవి కొన్నయితే నిడివి పెరిగి కథానికా స్వరూపానికి చేరువైనవి ఇంకొన్ని. బహుశా గల్పికలో ఒదగని అంశం పరిధి పెరిగి కొన్ని కథానికలుగా పరిణమించాయి అనిపిస్తుంది. అయితే ఆ కథానికలలోనూ అరవింద గారు విమర్శను, వ్యంగ్యాన్ని, అనుభవాన్ని వీడకపోవటంతో గల్పికగానే రచన మొదలు పెట్టి కథానికా నిడివికి దగ్గిరయ్యారనిపిస్తుంది. మరొక్క మాట – అరవింద తమ ప్రతి కథనూ, ప్రతి గల్పికనూ ఒక అంశంతోనూ, సందేశంతోనూ రాయటం విశేషం. అందుకే నేను నిడివి అనే ఒక లక్షణాన్ని పక్కనపెట్టి తక్కిన లక్షణాల సంహిత అయిన గల్పికల సమాహారంగానే అరవిందగారి ‘అహమిక’ను పరిగణిస్తున్నాను. నాటి గ్రామీణ వ్యవస్థల నుండి నేటి అంతర్జాతీయ వ్యవస్థల వరకు ఉన్న అనేక సమస్యలను స్పృశిస్తూ సున్నితంగా సందేశాలందించిన గల్పికలుగా అరవిందగారి ఈ రచనలను పరిగణిస్తున్నాను.
***


రచన: పారనంది అరవిందారావు
ప్రచురణ:
పేజీలు: 222 (xvi + 204)
వెల: ₹ 300/-
ప్రతులకు:
పారనంది అరవిందారావు,
మిడ్‌ల్యాండ్స్, యు.కె.
+44 7476 305893

‘విశ్వర్షి వాసిలి’ పూర్తి పేరు వాసిలి వసంతకుమార్. పుట్టింది 1956 జులై 10 న. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. అందుకున్నారు. వీరు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలకు తమ వీక్లీ కాలమ్స్ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా చిరపరిచితులు. వీరి “నేను” అనే యోగిక కావ్యం తెలుగులో తొలి యోగిక కావ్యంగా పరిశోధకుల, విమర్శకుల మన్ననలు పొందింది. వీరి రచనలు 77 సాధనారహస్యాలు, 56 ఆత్మదర్శనాలు, కొత్తకోణంలో గీతారహస్యాలు, ప్రజ్ఞానరహస్యాలు, అతీంద్రియరహస్యాలు : బ్లవట్స్కీ మొదలైన తాత్విక యోగ గ్రంథాలు అనేకముద్రణలు పొంది బహుప్రసిద్దాలు. ఇవికాక వ్యక్తిత్వవికాస పుస్తకాలైన విన్నర్ : గెలవాలి గెలిపించాలి, సిగ్గుపడితే సక్సెస్ రాదు, టైం ఫర్ సక్సెస్, ఒత్తిడి ఇక లేనట్లే, లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం, మనసును గెలవాలి, మనకే తెలియని మన రహస్యాలు మొదలైనవి. ప్రస్తుతం సికింద్రాబాద్ లో యోగాలయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వీరిని 93 93 93 39 46 సెల్ నెంబర్ పైన సంప్రదించవచ్చు.