[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అజరామరుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


మీకు కనిపించే నేను
సంపూర్ణంగా నేను కాను
ముమ్మూర్తుల అచ్చొత్తినట్లే
పుణికి పుచ్చుకొన్న రూపమిది
చెప్పిన విద్యాబుద్ధులతో
చేసిన హిత బోధలతో
పసితనం వీడిపోగానే
మనస్సు పరిపక్వమైంది
నాన్న నేర్పిన విజ్ఞతతో
నేన్నేర్చుకొన్న నడవడికతో
విశ్వ కుటీరంలో చేరగానే
జీవన శైలి పూర్తిగా మారింది
నాన్న ప్రభావం చేత
ఈ ప్రపంచ సొరగులో
బాధలను ఎదుర్కొనే శక్తి
అలవోకగా అలవాటైంది
నాన్న అజరామరుడు
ఐనా మరణం ఆవహించింది
మరణం కాదది మహానిద్ర
నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం..
నాన్న చిరస్మరణీయుడు
సడలని జన్యుపరంపరతో
నాలో సజీవమై సంచరించు
సద్గుణ సదాచార సంపన్నుడు