[శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు రాసిన ‘ఆఖరి ఉత్తరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.
ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంకంత కొంప, భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. “అమ్మా వెళ్ళొస్తాం” అంటూ పిల్లలు వెళ్లిపోయారు. అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరు తోడు. ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది.
‘ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం’ అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దానిమీద రామారావు గారి పేరు ఉంది. ‘చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారబ్బా’ అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది.
“ప్రియమైన పార్వతికి,
నువ్వు ఆశ్చర్యపడతావు అని నాకు తెలుసు. నేను బతికున్న రోజుల్లో రాసి పెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు వేణుగోపాల్‌కి ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను. ఆశ్చర్యంగా ఉంది కదా. నా మనసులోని మాట నేను బతికి ఉన్నన్నాళ్ళు చెప్పలేకపోయా. ఎవరికి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది. భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లలు దగ్గరకు వెళ్లిన మీ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ల సంసార బాధ్యత అంతా నీ నెత్తి మీద పడుతుంది. వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరు నా రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ల మీద నమ్మకం లేదు. కాలం అలా ఉంది. ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను.
రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలైపోయింది. నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. అక్కడ అయితే ఎవరికి అనుమానం రాదని. ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు. పిల్లలు ఇద్దరు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న దేహి అని నువ్వు ఎవరని అడగక్కర్లేదు. బ్యాంకు బాలన్స్ అంతా జాయింట్ అకౌంట్ లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసే పెట్టే నా శిష్యుడు రాఘవరావు బ్యాంకు మేనేజర్‌గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. ఏ పిల్ల ఇంటికి వెళ్ళిన నీకు స్వతంత్రం ఉండదు. మనసు బాధపడుతుంది. హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు. వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతోటి చాకిరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దాన్ని చేయడం చాలా పాపం.
వయసు వచ్చిన పిల్లలతో స్నేహితులా ప్రవర్తించాలి. బాధ్యతలు అప్పచెప్పకూడదు. కాలం ఎలా ఉంది. మనకంటే ముందు వాళ్లకి ప్రయారిటీలు చాలా. మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతుంటారు. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు మొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. వారందరి కంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి కానీ అధైర్య పడకూడదు.
ఒకరు ముందు ఒకరు వెనక. ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచి చూడు. ఆ పైన దేవుడు ఉన్నాడు. ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. ఇన్నాళ్లు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం వీడిపోయి బాధ్యత నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. ఆయుర్దాయం మన చేతుల్లో లేదు. మన చేతల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని. ప్రణాళికాబద్ధంగా జీవితం గడపడమే. జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తలదించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగడమే. బాధ్యతలన్నీ ఒంటిచేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం. నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునే వాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను. ఇట్లు నీ భర్త, రామారావు.”
ఉత్తరం మడిచి ఎంత బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకో మారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సప్‌లో ఆ ఉత్తరం పెట్టింది, కొంతవరకైనా మార్పు వస్తుందని.
ఎప్పుడో దేవుడు కలిపిన బంధం. చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంది పార్వతమ్మ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విదేశీ కథల అనువాద సంకలనం ‘ఏడు గంటల వార్తలు’ – విహంగ వీక్షణం
యుద్ధం
కప్పలు
శ్రీ శిరిడీ సాయినాథుని దివ్యలీలలు
చెంచు బాలలతో హిమాలయ సైకిల్ యాత్ర -1
సరికొత్త ధారావాహిక ‘పూచే పూల లోన’ – ప్రకటన
సాఫల్యం-51
వైవిధ్య కథల సమాహారం – ‘మిక్చర్ పొట్లం’
తల్లి కోరిక
మిణుగురులు-2
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®