సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.


~
ఇసైజ్ఞాని ఇళయరాజా
1970 దశకం చివరి సంవత్సరాల నుంచి దక్షిణ భారత సినీరంగపు ప్రఖ్యాత సంగీత దర్శకులలో ఒకరయ్యారు ఇళయరాజా. ఆయన ప్రధానంగా తమిళ చిత్రాలకు పని చేసినా, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ సినిమాలకు కూడా సంగీతం అందించారు. తమిళ చిత్రాలలలోనూ, ఇతర దక్షిణాది భాషల సినిమాల్లోనూ జానపద భావగీతికా పద్ధతిని, విస్తృతమైన పాశ్చాత్య రాసిక్యాన్ని ప్రవేశపెట్టారు. విద్వాంసుల నుంచి సాధారణ శ్రోత వరకూ అందరికీ నచ్చే సంగీతం కోసం కృషి చేశారు.


ఇళయరాజా 1993లో లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి క్లాసికల్ గిటార్లో గోల్డ్ మెడల్ పొందారు. పూర్తి సింఫొనీని నిర్వహించి, లండన్‌లోని వాల్తామ్‌స్టో టౌన్ హాల్లో రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శించిన పూర్తి సింఫనీని కంపోజ్ చేసిన మొదటి ఆసియా వ్యక్తి అయ్యారు. 2003లో, బిబిసి వారి అంతర్జాతీయ పోల్ ప్రకారం, 155 దేశాలకు చెందిన ప్రజలు 1991 నాటి ‘తలపతి’ చలనచిత్రం కోసం ఇళయరాజా కూర్చిన ‘రక్కమ్మ కయ్య తట్టు’ పాట ప్రపంచంలోని అత్యుత్తమ 10 అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్‌రూట్ మ్యూజిక్ ఆర్గనైజేషన్, అమెరికాకి చెందిన జస్ట్ ప్లెయిన్ ఫోక్స్ మ్యూజిక్ ఆర్గనైజేషన్ వారి బెస్ట్ ఇండియన్ ఆల్బమ్ మ్యూజిక్ అవార్డ్స్ విభాగంలో ఆయన నామినేట్ అయ్యారు, ‘మ్యూజిక్ జర్నీ: లైవ్ ఇన్ ఇటలీ’ తో మూడవ స్థానంలో నిలిచారు.
ఇళయరాజా గ్రామీణ ప్రాంతంలో పెరిగారు, తమిళ జానపద సంగీతాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, తన అన్నయ్య పావలార్ వరదరాజన్ నేతృత్వంలోని ప్రయాణ సంగీత బృందంలో చేరి, తరువాతి దశాబ్దంలో దక్షిణ భారతదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ బృందంతో పని చేస్తున్నప్పుడు, ఆయన తన మొదటి బాణీని కూర్చారు. అది భారతదేశపు తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకి నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన గీతానికి బాణీ. 1968లో, ఇళయరాజా మద్రాసు (నేటి చెన్నై) లో ప్రొఫెసర్ ధనరాజ్‌తో కలిసి సంగీత కోర్సును ప్రారంభించారు, అందులో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతపు అవలోకనం, కౌంటర్ పాయింట్ వంటి పద్ధతులలో స్వర శిక్షణ, వాయిద్య ప్రదర్శన అధ్యయనం ఉన్నాయి. ఇళయరాజా క్లాసికల్ గిటార్లో నైపుణ్యం సాధించి లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో సంబంధిత కోర్సు చేశారు.




చెన్నైలో 1970లలో, ఇళయరాజా బ్యాండ్-ఫర్-హైర్ కోసం గిటార్ వాయించారు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సలీల్ చౌదరి వంటి చలనచిత్ర సంగీత స్వరకర్తలు, సంగీత దర్శకులకు సెషన్ గిటారిస్ట్, కీబోర్డు వాద్యకారుడిగా, ఆర్గనిస్ట్‌గా పనిచేశారు. కన్నడ చలనచిత్ర స్వరకర్త జి.కె. వెంకటేష్ గారి దగ్గర సంగీత సహాయకుడిగా చేరాకా, ఇళయరాజా సుమారు 200 చలనచిత్ర ప్రాజెక్టులలో, ఎక్కువగా కన్నడ భాషలో పనిచేశారు. జికె వెంకటేష్ అసిస్టెంట్‌గా ఇళయరాజా వెంకటేష్ సృజించిన శ్రావ్యమైన బాణీలను ఆర్కెస్ట్రేట్ చేసేవారు. ఈ సమయంలో, ఇళయరాజా తన సొంత స్కోర్లను కూడా రాయడం ప్రారంభించారు. వెంకటేష్ గారికి పనిచేసే ఇతర సంగీతకారులకు వారి విరామ సమయాల్లో – తన స్వరాలను వినడానికి, తన బాణీలను వాయించడానికి ఒప్పించారు ఇళయరాజా. స్వరకర్త ఆర్.కె. శేఖర్ (ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ తండ్రి) వద్ద నుండి వాయిద్యాలను అద్దెకు తీసుకునేవారు ఇళయరాజా. తరువాతి కాలంలో రెహమాన్ ఇళయరాజా ఆర్కెస్ట్రాలో కీబోర్డు వాద్యకారుడిగా చేరారు.




1975లో, చలనచిత్ర నిర్మాత పంచు అరుణాచలం ‘అన్నక్కిలి’ (‘ది పారట్’) అనే తమిళ చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతం అందించే బాధ్యత ఇళయరాజాకి అప్పగించారు. సౌండ్‌ట్రాక్ కోసం, ఇళయరాజా తమిళ జానపద కవిత్వం, జానపద పాటల మెలోడీలకు ఆధునిక, ప్రసిద్ధ చలనచిత్ర సంగీత ఆర్కెస్ట్రేషన్ యొక్క పద్ధతులను వర్తింపజేసారు. ఇది పాశ్చాత్య మరియు తమిళ భాషల మేలు కలయిక అయ్యింది. ఇళయరాజా తన స్వరరచనలో తమిళ సంగీతాన్ని ఉపయోగించడం భారతీయ చలనచిత్ర స్వరరచనలో కొత్త ప్రభావాన్ని చొప్పించింది. 1980ల మధ్య నాటికి ఇళయరాజా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్వరకర్తగా, సంగీత దర్శకునిగా స్థాయిని పెంచుకున్నారు. కన్నదాసన్, వాలి, వైరముత్తు, ఒఎన్వి కురుప్, శ్రీకుమారన్ తంపి, వేటూరి సుందరరామమూర్తి, చి. ఉదయ శంకర్, గుల్జార్ వంటి భారతీయ కవులు, గేయ రచయితలతో కలిసి పనిచేశారు. భారతీరాజా, కె. బాలచందర్, మణిరత్నం, సత్యన్ అంతిక్కడ్, ప్రియదర్శన్, ఫాజిల్, బాలు మహేంద్ర, వంశీ, కె. విశ్వనాథ్, ఆర్. బాల్కీ వంటి దర్శకనిర్మాతలతో పనిచేశారు.






ఇళయరాజా 2004లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. 2012లో సంగీత రంగంలో తన సృజనాత్మక, ప్రయోగాత్మక రచనలకు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. CNN-IBN 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన పోల్‌లో, ఇళయరాజా అత్యధికంగా 49%తో భారతదేశపు గొప్ప సంగీత స్వరకర్తగా ఎన్నికయ్యారు.

పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.