

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
‘బినాకా గీత్‌మాలా’ ఫేమ్ అమీన్ సయానీ:
అమీన్ సయానీ అనగానే ‘బినాకా గీత్‌మాలా’, బినాకా గీత్‌మాలా పేరు వినగానే అమీన్ సయానీ పేరు మదిలో మెదులుతాయి.


అమీన్ సయాని డిసెంబర్ 21, 1932న బొంబాయిలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక సంస్కర్త, రచయిత్రి కుల్సుమ్ సయాని వారి తల్లిగారు. స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు అయిన డాక్టర్ జాన్ మొహమ్మద్ సయాని వారి తండ్రి. జాన్ మొహమ్మద్ గారు పేద రోగులకు ఉచితంగా చికిత్స చేయడంలో ప్రసిద్ధి చెందారు, తరచుగా వారి మందులకు డబ్బులిచ్చేవారు. సయాని తాత, రహీంతుల్లా ఎం. సయాని, గొప్ప న్యాయవాది, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
అమీన్ సాబ్ తన హిందీ రేడియో అనుభవాన్ని స్వయంగా పునర్నిర్వచించుకోడం ఆసక్తికరం. ఆయన సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఆంగ్లంలో చదువుకున్నారు, కానీ, తన హిందీపై పని చేయాల్సి వచ్చింది.


1950ల ప్రారంభంలో సోదరుడు హమీద్ సయానీ బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియో (AIR)కి పరిచయం చేయడంతో అమీన్ సయానీ రేడియో కెరీర్ ప్రారంభమైంది. ప్రారంభంలో, సయానీ ఆంగ్ల కార్యక్రమాలలో పాల్గొని, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, అద్భుతమైన కెరీర్‌కు వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
తరువాత హిందీ ప్రసార విభాగంలోకి మారి రేడియో సిలోన్లో చేరినప్పుడు ఆయనకి పెద్ద బ్రేక్ వచ్చింది, అక్కడ ఆయన ‘బినాకా గీత్‌మాలా’ అనే ఐకానిక్ షోను నిర్వహించారు. అమీన్ సాబ్‌కు పర్యాయపదంగా మారిన అత్యంత ప్రజాదరణ పొందిన షో బినాకా గీత్‌మాలా, హిందీ సినిమా పాటలలో శ్రోతల అగ్రశ్రేణి ఎంపికలను ప్రదర్శించింది, ప్రతి బుధవారం సాయంత్రం లెక్కలేనన్ని కుటుంబాలను ఆకర్షించింది.
సయాని గారి ఉత్తేజిత, ఆకర్షణీయమైన శైలి, లోతైన సంగీత జ్ఞానంతో కలిసి, ఆ కార్యక్రమాన్ని ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మార్చింది. ఆయన సిగ్నేచర్ గ్రీటింగ్స్ – ‘బెహ్నో ఔర్ భయ్యో’ (సోదరీమణులారా, సోదరులారా), వారి పేరుకు పర్యాయపదంగా మారింది. లక్షలాది మంది శ్రోతలకు ప్రియమైన వ్యక్తిగా చేసింది.


1952లో ప్రజాదరణ ఆధారంగా హిందీ సినిమా పాటలను వినిపించే కార్యక్రమంగా ప్రారంభమైన ‘బినాకా గీత్‌మాలా’ రేడియో సిలోన్లో సంచలనంగా మారింది. 70ల చివరి నాటికి, దీనికి వారానికి దాదాపు 21 కోట్ల మంది శ్రోతలు ఉన్నారని అంచనా. ఈ కార్యక్రమానికి అఖండ స్పందన లభించింది, గోనె సంచుల నిండా ఉత్తరాలు వెల్లువెత్తాయి – వారానికి 65,000 ఉత్తరాల స్థాయికి చేరుకుంది. ఏ ఛానెల్ అయినా ఆశించే అత్యంత ఆరాధించబడిన రేడియో స్టేషన్ హోస్ట్ ఇందులో ఉంది. గీత్‌మాలా 1989 నుండి 1993 వరకు ఆల్ ఇండియా రేడియో (AIR)లో వివిధ భారతికి మారింది.
‘బినాకా గీత్‌మాలా’తో పాటు, సయానీ ‘ఎస్. కుమార్ కా ఫిల్మీ ముకద్దమా’, ‘ఫిల్మీ ములాఖాత్’, ‘సరిదోన్ కే సాథీ’, ‘షాలిమార్ సూపర్లాక్ జోడి’, ‘సంగీత్ కే సితారోన్ కీ మెహఫిల్’ వంటి అనేక ఇతర ప్రముఖ రేడియో కార్యక్రమాలను హోస్ట్ చేశారు.


ఆయన ‘బోర్న్‌విటా క్విజ్ కాంటెస్ట్’ అనే ఇంగ్లీష్ క్విజ్ షోను కూడా నిర్వహించారు, దీనిని 1975లో తన అన్నయ్య హమీద్ సయాని మరణం తరువాత చేపట్టారు.
తన విశిష్టమైన కెరీర్లో, సయాని అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు, వాటిలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ (ISA) (1991) నుండి స్వర్ణ పతకం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ (1992) నుండి పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ట్ (IAAFA) నుండి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు (1993), శతాబ్దపు అత్యుత్తమ రేడియో ప్రచారం – బినాకా/సిబాకా గీత్‌మాలా అనే పేరిట అడ్వర్టైజింగ్ క్లబ్, బొంబాయి నుండి గోల్డెన్ అబ్బి (2000) పురస్కారం, రేడియో మిర్చి (2003) నుండి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) నుండి లివింగ్ లెజెండ్ అవార్డు (2006), ఇంకా న్యూఢిల్లీలోని హిందీ భవన్ నుండి హిందీ రత్న పురస్కార్ (2007) ముఖ్యమైనవి.


అమీన్ సయాని రమ గారిని వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు రాజిల్ సయాని అనే కుమారుడు ఉన్నాడు. అమీన్ సయాని సాహబ్ ఫిబ్రవరి 20, 2024న ముంబైలో 91 సంవత్సరాల వయసులో మరణించారు, తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని వదిలివెళ్ళారు.

పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.