సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
నటిగా మారి బాలీవుడ్లో ప్రవేశించిన ఉషా మరాఠే (22 ఏప్రిల్ 1929 – 9 మార్చ్ 2000) తన పేరును వెండితెర కోసం ఉషా కిరణ్ అని మార్చుకున్నారు.
ఆమె తండ్రి పేరు బాలకృష్ణ విష్ణు మరాఠే, తల్లి పేరు రాధ. మధ్యతరగతి మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఐదుగురు సంతానంలో రెండవవారు. ఆమె తండ్రి తన పిల్లలు కుటుంబానికి గొప్ప పేరు తేవాలని ఆశించేవారు. అందుకే కూతురు ఉషని, ఆమె అక్కని రంగస్థలం వైపుకు ప్రోత్సహించారు. కానీ ఉషకి ఇష్టం లేదు. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని సాధారణ జీవితం గడపాలని ఆమె కోరుకునేవారు. కానీ విధి మరోలా ఉంది. ఇప్పటి ఎక్స్లెసియర్ థియేటర్లో జరిగిన ఒక ప్రదర్శనలో గొప్ప నాట్యకారుడు/కొరియోగ్రాఫర్ అయిన ఉదయ్ శంకర్ ఆమెను గుర్తించారు. తాను తీస్తున్న ‘కల్పన’ అనే సినిమాలో నటించేందుకు ఆమెను ఆమె తండ్రితో సహా మద్రాసుకు రమ్మన్నారు. అది చిన్న వేషమైనా, ఆమె తండ్రి పొంగిపోయారు.
అయితే మద్రాసులో ఒక గొడవ జరిగింది. ఆమెని ఆ సినిమా నుంచి బయటకు పంపేశారు. దాంతో ఆమె తిరిగి బొంబాయి వచ్చేసారు. అది చాలా చిన్న అపార్థం… కానీ ఉదయ్ శంకర్ గారి అస్థిరమైన స్వభావం, ఆమె తిరుగుబాటు ధోరణి… వల్ల గొడవ పెద్దదయింది. ఒక నృత్య సన్నివేశంలోకి ఆమె వేసుకోవలసిన దుస్తులు చాలా పలచగా ఉన్నాయి. అందుకని ఉష లోపల మరో తెల్లని దుస్తులు వేసుకున్నారట.. శ్రీమతి అమల ఉదయ్ శంకర్ దాన్ని తీసేయమన్నారట. ఉష తీయలేదట. షూటింగ్ సమయంలో అది గమనించిన ఉదయ్ శంకర్ – కాస్ట్యూమ్స్‌ని సరిగా పట్టించుకోనందుకు అమలని తిట్టారట.. ఆమె ఉషని మందలించారట. ఈ సంఘటన తర్వాత – షూటింగ్లో ఉన్నంత కాలం, సెట్లో ముఖం మాడ్చుకునే ఉన్నారట. అది చూసి ఓ రోజు – “నీకు నవ్వడం రాదా?” అన్నారట ఉదయ్. “రాదు, మీరు నేర్పించండి” అన్నారట ఉష. అంతే, అంతా అయిపోయింది. కానీ తర్వాతి రోజుల్లో ఉష చెప్పారు – ఆయనే తనకి నటనలో, నాట్యంలో తొలి గురువని!
కానీ కూతురుని ఎలా అయినా పెద్ద నటిని చేయాలని పట్టుదల ఉష తండ్రిది. అవకాశమున్న ప్రతీ సినిమాలో కూతురుకి చిన్న పాత్రయినా దక్కేదాకా అయన ఊరుకునేనారు కాదు. కాని ఉషకి ఇదంతా ఏమీ పట్టేది కాదు. మనసులో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆమె తండ్రి ఎంత పట్టుదలగా ఉండేవారంటే, చివరికి తానే ఓ సినిమా తీయాలన్న ఆలోచన చేశారు. ఆ తర్వాత ఆమెకు హిందీ, మరాఠీ, గుజరాతీ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కొన్ని వచ్చాయి. కానీ అవేవీ ఆమె కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేయడంలో – ఆ సినిమాల ద్వారా వచ్చిన కొద్దిపాటీ ఆదాయం కుటుంబ నిర్వహణకి తోడ్పడింది.
చివరికి ఆయన ఓపిక ఫలించింది. ఆమె జీవితంలోకి అమియ చక్రవర్తి ప్రవేశించారు. మొత్తం మారిపోయింది. ‘గౌనా’ చిత్రంలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పరాజయం పాలయినా, ఆయన తదుపరి చిత్రంలో మరో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ఆమె శశికళకు తల్లిగా నటించవలసి వచ్చింది. అప్పుడామె వయసు 22 ఏళ్ళే. శశికళకూ అంతే ఉంటాయి, లేదా ఓ రెండేళ్ళు పెద్దవారేమో! కానీ తప్పనిసరై ఈ పాత్రలో నటించారు ఉష. ఆమె అక్కకి పెళ్ళి చేయడానికి వాళ్ళకి డబ్బు కావాలప్పుడు. కానీ ఉష అదృష్టం కొద్దీ ఈ సినిమా కూడా పరాజయం పాలయింది. లేదంటే అసలు ఆమె హీరోయిన్ అయ్యేవారే కాదు. కొద్ది కాలానికి గుజరాతీ, మరాఠీ సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. క్రమంగా హిందీలోని నాయిక పాత్రలు లభించాయి. ఆమె తొలి పెద్ద హిట్ ‘పతిత’. దాని తరువాత వరుసగా – దేవ్ ఆనంద్‌తో ‘దుష్మన్’, ‘బాద్బాన్’; దిలీప్ కుమార్‌తో ‘ముసాఫిర్’; రాజ్ కపూర్‌తో ‘నజరానా’; బల్రాజ్ సహానీతో – ‘కాబూలీవాలా’, ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’; కిషోర్ కుమార్‌తో ‘ధోభీ డాక్టర్’, ‘అధికార్’ – సినిమాలలో నటించారు.
ఇంకా అశోక్ కుమార్, ప్రదీప్ కుమార్, మొదలైనవారితో పలు చిత్రాలలో నటించారు. ఆమె నటించిన అన్ని ద్విభాషాచిత్రాలు విజయవంతం కాసాగాయి. ఆమె ఉన్నత స్థానానికి ఎదిగారు. రెండు షిఫ్టులలో పని చేయసాగారు. అది అప్పట్లో సాధారణ విషయమే. ‘బాద్బాన్’ చిత్రానికి ఆమెకి ఫిలింఫేర్ వారి ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’ అవార్డు లభించింది. ది బాంబే టాకీస్ వారు నిర్మించిన ఈ చిత్రంలో దేవానంద్ జాలర్ల కుటుంబానికి చెందినవారు. అతన్ని నగరంలోని ఓ ధనవంతులైన జంట పెంచుకుంటారు. పెద్దయ్యాకా, దేవ్ ఆనంద్ తిరిగి తన గ్రామానికి వస్తాడు. అక్కడ తన భార్య (మీనా కుమారి)కి పూర్తి వ్యతిరేకంగా ఉన్న మోహ్నియా (ఉష)ని చూసి ఇష్టపడతాడు. ఈ చిత్రానికి గాను ఉషకి ఫిలింఫేర్ వారి ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’ అవార్డు లభించింది. ఈ విభాగం అంతకు ముందు సంవత్సరం లేదు. జాలరి యువతి పాత్రలో ఉష కనబరిచిన నటన, హీరోయిన్ నటన కన్నా బావుందని ఓ పత్రిక తన సమీక్షలో పేర్కొంది. ‘ఆమె అక్షరాల తన ప్రతిభతో వెండితెరని వెలిగించింది, ఆమె హుందాతనం, నృత్యాలు అద్భుతం’ అని ఆ సమీక్షకులు వ్యాఖ్యానించారు.
కానీ ఈ విజయాలతో పాటు మానసిక బాధనూ, దుఃఖాన్ని ఎదుర్కున్నారు. ఆమె తన దర్శకుడు అమియ చక్రవర్తితో ప్రేమలో పడ్డారు. ఆయన ఆమెకన్నా 16 ఏళ్ళు పెద్ద. అయినా ఆమె ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. కానీ ఆయన అప్పటికే వివాహితుడు. అందుకే దుఃఖం. పైగా ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు, ఆ కుటుంబంలో ఇలాంటివి చాలా అరుదు. అప్పట్లో ఇదొక సంచలనం. అమియ భార్యకి ఈ విషయం తెలిసింది. ఆవిడ ఉషని కలిసి, వాళ్ళిద్దరి మధ్య తాను అడ్డుగా ఉండడని, తప్పుకుంటానని తెలియజేశారు. చాలాసేపు ఆలోచించిన ఉష తన జీవితంలోకెల్లా తెలివైన, బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అమియకి దూరంగా ఉంటానని, తాను వారి మధ్యకు రానని ఆవిడకి మాటిచ్చారు. ఆ మాటని నిలుపుకున్నారు. పెళ్ళి తప్ప మరో మార్గం లేదని ఉషకి తెలుసు, కానీ ఆ పెళ్ళి జరగదని గ్రహించి, హుందాగా తప్పుకున్నారు. తర్వాత తన వయసుకు తగ్గ యువకుడిని ఎంచుకున్నారు. తమ బంధువులకి ఇంటికి తరచూ వచ్చే ఓ అందమైన యువ వైద్యుడిని కలిసారు. ఆయనతో మనస్ఫుర్తిగా మాట్లాడారు. ఆయన నవ్వేసి, అంగీకరించారట. ఈ విధంగా ఉష వివావం డా. మనోహర్ ఖేర్‌తో జరిగింది. అప్పట్లో ఆయన బొంబయిలోని LTMMG (Sion) హాస్పిటల్‌కి డీన్‌గా ఉండేవారు. ఈ విధంగా ఉష 1954లో శ్రీమతి ఖేర్ అయ్యారు.
ఆమె భర్త మెడిసిన్‌లో స్వర్ణపతక గ్రహీత. భర్తగా రాణిస్తున్నందుకు కూడా ఆయనకి మెడల్ ఇవ్వాలని ఉష కొన్నిసార్లు సరదాగా అనేవారు. తమ పెళ్ళి ఘనత అంతా ఆయనకే చెందుతుందని అన్నారు. ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాకా, ఆయన పాత విషయలేవీ ఎప్పుడూ ప్రస్తావించలేదట. అది ముగిసిపోయిన అధ్యాయం అని భావించారట. పైగా పెళ్ళయ్యాకా, ఆమె అమియ దర్శకత్వం వహించిన ‘బద్నామ్’ చిత్రాన్ని పూర్తి చేశారు కూడా. ఆ రోజుల్లో ఆమె భర్తలో అనుమానం కాని, వైముఖ్యం కానీ ఉండేవి కావట. ఎప్పుడూ ఒకేలా ఆదరించారట. ఇద్దరి మధ్య పరస్పర గౌరవంతో, ప్రేమ పెరిగింది. ఆయన లోని ఉత్తమ గుణాలు ఆమెను కూడా వినమ్రంగా మార్చాయి. తన గ్లామర్, కీర్తి ప్రతిష్ఠల కన్నా ఆయన గొప్పవారన్న సంగతి ఆమె హృదయానికి తెలుసు. తనపై తనకి ఎంతో నమ్మకం ఉన్న వ్యక్తి డా. ఖేర్. ఎటువంటి భేషజాలు లేని వ్యక్తి. ఉష తొలి చూలు కడుపుతో ఉండగా, అమియ చక్రవర్తి చనిపోయారు. ఆ సందర్భంలో మాత్రం ఆమె ఆయన గురించి ప్రస్తావించి, వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించడానికి భర్త అనుమతి కోరారు. అయన అర్థం చేసుకుని, వెళ్ళమన్నారు. అమియని ఇక కలవనని ఆయన భార్యకి మాట ఇచ్చిన తరువాత – ఉష వాళ్ళింటికి వెళ్ళడం అదే మొదటిసారి.
ఉషా కిరణ్‌లో పోలిస్తే మీనా కుమారిది భిన్నమైన జీవితం. మీనా కుమారి భర్తకి అనుమానం ఎక్కువ, మానసికంగా వేధించేవారు. తన భర్త దేవుడిచ్చిన వరం అని ఉష అనుకునేవారు. పెళ్ళి తరువాత ఓ నటిగా, ఓ భార్యగా స్పష్టమైన విభజన పాటించారు. తన కుటుంబానికి సాయం చేయడానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను అన్న భావన – విజయం ఆమె తలకి ఎక్కకుండా చూసింది. పెళ్ళయిన తరువాతే ఆవిడ తన వృత్తిని ఆస్వాదించసాగారు. ఆమె ఎన్నడూ తనని తాను గొప్ప అనుకునేవారు కాదు. ఒకసారి ఎప్పుడో అనుకుంటే – అమె కొడుకు “నువ్వు బయట గొప్ప హీరోయిన్‌వి కావచ్చు, కానీ ఇంట్లో మాత్రం నాకు మామూలు అమ్మవే” అని ఆమెకి గర్వం తలకెక్కకుండా చూశాడట. ఆమె షాకింగ్‌గా అనిపించినా అది వాస్తవమని గ్రహించారు. అప్పటి నుంచి, భర్త పిల్లలకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆమె దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నటిగా కంటే, ఓ భార్యగా, ఓ అమ్మగా ఆమె గొప్పవారన్న వాస్తవాన్ని ఆమె పిల్లలు గర్వంగా భావిస్తారు. అయితే, తనని తాను గొప్ప భార్యగా ఆమె భావించుకోలేదు. నిజానికి ఆవిడకి వంట సరిగ్గా రాదు. తనకి చక్కని ఆహారం తప్ప, జీవితంలో అన్నీ దొరికాయని ఆమె భర్త హాస్యమాడేవారు. ఇంట్లోనే ఉంటుంటే విసుగ్గా ఉంటుందని అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాల్లో నటించేవారు ఉష. నటించమని ఆమె భర్తే ప్రోత్సహించారట. ‘ఖాళీ బుర్ర దెయ్యాల కొంప’ అనేవారుట! కానీ క్రమంగా ఆ షూటింగుల వాతావరణం అంటే ఉషకి ఏవగింపు కలిగింది. షూటింగులన్నీ యాంత్రికమైపోయాయని గ్రహించారు. భావోద్వేగాలు లేవు. యువ నటీమణులలో స్వార్థం ఎక్కువని గమనించారు. ప్రతీ షాట్ లోనూ తమ ఆధిపత్యం ఉండేలా చూసుకునేవారు. తన రోజుల్లో నటీనటుల మధ్య పరస్పర గౌరవం, ఆదరణ ఉండేవని గుర్తు చేసుకున్నారు. తెర మీద తాము మాత్రమే కనబడాలన్న తపన అప్పటివారిలో ఉండేదికాదు. అయినా కొత్త తరానికి అనువుగా తనని తాను సర్దుకున్నారు. గౌరవప్రదమైన ముంబయి షరీఫ్ పదవికి ఆమె 1997లో ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె సహనటులు – దిలీప్ కుమార్, సునీల్ దత్‌లు ఆ పదవిని నిర్వహించారు. ఆమె తన ఆత్మకథను మరాఠీలో వ్రాశారు. అవకాశం ఉంటే మరోసారి నటిగానే జన్మిస్తానని వ్రాసుకున్నారు. కేన్సర్‌తో పోరాడుతూ 9 మార్చ్ 2000 నాడు కన్నుమూశారు.
ఆమె పిల్లలు ఆమెకెంతో ఆనందాన్నిచ్చారు. కొడుకు వివాహం చేసుకుని నాసిక్‌లో హాయిగా జీవితం గడుపుతున్నారు. ఆమె కూతురు తన్వీ పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. తన్వీ భర్త బాబా (షబానా అజ్మీ సోదరుడు) ముస్లిం కావడం వల్ల ఉష తొలుత వ్యతిరేకించారు (బాబా – బాపు రమణల ఎన్నో సినిమాలకి సినెమాటోగ్రాఫర్గా వ్యవహరించారు). పాత తరం తల్లిలా, తన్విని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నారు. తన తల్లిదండ్రులు, అన్నయ్య లాగే తన్వికి ఓ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో పెళ్ళి చేయాలనుకున్నారు. కానీ తన్వి ఒప్పుకోలేదు, ఎదిరించారు. కాలం గడిచేసరికి, ఉష బాబా మతం గురించి, ఇతర అభ్యంతరాల గురించి మరిచిపోయారు. అల్లుడి పట్ల గర్వంగా ఉన్నారు. అత్తవారింట్లో కూతురు ఆనందంగా ఉన్నందుకు సంతోషించారు. తనకి జీవితంలో ఫిర్యాదులేవీ లేవని అన్నారు ఉష. కానీ భర్త మరణం తరువాత ఒంటరితనం ఆమెను బాధించింది. ఆమె గూడు ఖాళీ అయిపోయింది. కానీ తన్వి తనకి దగ్గరలోనే ఉన్నందుకు ఆవిడ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పడప్పుడు తనకి పొరుగున ఉండే దిలీప్ కుమార్‌ని చూడ్డానికి వెళ్ళేవారు.
***
తన అమ్మ గురించి తన్వి మాటల్లో:
“అమ్మ సినీ కెరీర్ గురించి నాకు మొదటగా తెలిసింది నా 12 ఏళ్ళ వయస్సులో. అప్పటి వరకు అమ్మ ఓ నటి అని నాకు తెలియదు. నేను పుట్టిన తరువాత అమ్మ సినిమాలు మానేసింది, నాకు 12 ఏళ్ళు వచ్చాకా తిరిగి నటించింది. మొదటిసారి తనతో షూటింగ్‌కి వెళ్ళినప్పుడు – అక్కడి వాతావరణం, అమ్మకి లభించిన గౌరవం, కెమెరా, లైటింగ్… ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. అమ్మని కొత్తగా చూస్తున్నట్లనిపించింది. ఆ సినిమా పేరు ‘బావర్చి’ అనుకుంటా. అప్పటి వరకు తనని ఓ అమ్మలా, ఓ భార్యలా మాత్రమే చూశాను. నేను ఎదిగే కొద్దీ అమ్మ ఇంటిని నిర్వహించిన విధానం చూస్తూ తన పట్ల నా గౌరవం పెరిగింది. తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగా నా కోసం అన్నీ వదిలేసుకోవడం గొప్ప విషయం. ఇంట్లో ప్రతీదీ సరైన సమయంలో, చక్కగా జరిగిపోయేది. పేర్లు చెప్పను గాని, నాకు కొన్ని చెడు ఉదాహరణలు తెలుసు – పాలి హిల్ లోని సినీనటుల పిల్లలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతారో అని. కానీ మా విషయంలో అలా జరగలేదు. అందుకు దేవుడికి, అమ్మకి ధన్యవాదాలు. ఈ లక్షణాలే అమ్మను గొప్ప నటిగా కన్నా, గొప్ప మహిళగా చేశాయి.
వాళ్ళ వైవాహిక జీవితం అద్భుతంగా గడిచినందుకు అమ్మ ఆ ఘనత అంతా నాన్నకిచ్చినా, అమ్మ పాత్రా తక్కువేం కాదు. ఇదంతా నేను ఎదిగిన తరువాత నాకు అర్థమైంది. చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్నపై అధికారం చలాయించేది అనుకునేదాన్ని. చిన్నప్పుడు మేము ఆలస్యమైనా, లేదా ఏదైనా చెయ్యకూడని పని చేసినా, అమ్మే కోప్పడేది. పైగా వాళ్ళ పెళ్ళి గురించి నాన్న చెప్పని – అవ్యక్తమయిన నియమాలను అమ్మ మాకెప్పుడూ చెప్పలేదు. అమ్మకి తొందరగా కోపం వచ్చేది, నాన్న ఎక్కువగా మౌనంగానే ఉండేవారు. కానీ అమ్మ బాగా సర్దుకుపోయింది. వాళ్ళ పెళ్ళి సమయంలో అమ్మ పెద్ద స్టార్, నాన్నకి పెద్ద హోదా ఏమీ లేదు. పాపం, మిస్టర్ ఉషా కిరణ్ అని పిలిచేవారట. అది ఒక రకంగా అవమానమే.. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో నాన్న వాటిని అధిగమించారు. అలాంటి మాటల పట్ల నవ్వుకునేవారు. తరువాత ఆయన చుట్టాల్లోనూ, అమ్మ స్నేహితుల్లోనూ ఎంతో గౌరవం సంపాదించుకున్నారు. ఇప్పుడు అమ్మని మిసెస్ ఖేర్ అంటున్నారు.
నా తల్లిదండ్రులు… ముఖ్యంగా అమ్మ… నాకు పెద్ద అభిమానులు. తనకన్నా నేను మెరుగైన నటినని అమ్మ అంటుంది. కానీ నాకు బద్ధకం అనీ, లక్ష్యం లేదని కూడా అంటుంది. నిజానికి నటన అనేది నాకు కాలక్షేపం మాత్రమే. అమ్మకి మాత్రం జీవనోపాధి లాంటిది. అమ్మది విశాల హృదయం. నేను పెరుగుతున్న సమయంలో మా అమ్మానాన్నలు ఎందరో బంధువులకి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అమ్మలోని మానవత నాలో ఒక్క శాతం వచ్చినా చాలు! తొలుత మా పెళ్ళికి అభ్యంతరాలు చెప్పినా, ఇప్పుడవన్నీ సర్దుకున్నాయి.. అజ్మీలు, ఖేర్‌లు ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం!”.
1939లో ఒక రోజున మద్రాసులోని న్యూటోన్ స్టూడియోలో ఒక పాట రికార్డింగ్‌కి షెడ్యూల్ అయి ఉంది, కాని కొన్ని సమస్యల వల్ల ఆగిపోయింది. ఆ పాటని ఒక తెలుగు రంగస్థల కుటుంబానికి చెందిన బాలుడు పాడవలసి ఉంది, కానీ మైక్ అంటే ఏర్పడిన భయం వల్ల ఆ బాలుడు పాడలేకపోయాడు. ఆర్కెస్ట్రా, రికార్డింగ్ యూనిట్ సన్నద్ధమై ఉన్నాయి, కానీ భయంతో తన తొలి అవకాశాన్ని ఈ విధంగా దారుణంగా పోగొట్టుకున్నాడా అబ్బాయి. అప్పుడే ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్, దర్శకుడికి సన్నిహితుడైన వ్యక్తి ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. విస్తుపోయిన ఆ దర్శకుడితో – ముందుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రికార్డు చేయమని, ఆ తర్వాత విడిగా మరో అబ్బాయి చేత పాడించి – రెండిటినీ జోడించవచ్చని చెప్పాడు. ఆ ఆలోచన అసాధ్యమనిపించినా, రికార్డింగ్ కాన్సిల్ చేసి మొత్తం నష్టపోయేకన్నా – బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రికార్డు చేయడం నయమని దర్శకుడికి అనిపించి అలాగే చేశారు. మరో అబ్బాయి చేత పాడించి, మ్యూజిక్‌కి జోడించడంతో ఆ పాట అద్భుతంగా వచ్చింది. దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఇలా జరగడం అదే మొదటిసారి. ఈ సలహా ఇచ్చినది జీనియస్ కె. రామనాథ్. అలాగే పెద్దగా ఎవరికీ తెలియని ఆ రికార్డిస్ట్ ఎ.కె. శేఖర్. ఆ తరువాత ఆ దర్శకుడు తెలుగులో గొప్ప దర్శకులలో ఒకరయ్యారు. ఆయనే బి.ఎన్. రెడ్డి. ఆ సినిమా ‘వందేమాతరం’ (1939).
ఆయన సృజనాత్మకతకి మరో ఉదాహరణ మరో సినిమాలోని ఈ సన్నివేశం. రైలు పట్టాల మిద ఒక యువతిని కట్టేసి ఉంటారు. వేగంగా వచ్చే రైలు ఆమె మీద నుంచి వెళ్ళిపోవాలి. ఒక రైలుని అద్దెకి తీసుకున్నారు. తీరా షూటింగ్ మొదలుపెట్టేసరికి డ్రైవర్ కంగారు పడిపోయి – యువతిని పడి ఉన్న చోటుకు అర ఫర్లాంగు దూరంలోనే రైలుని ఆపేశాడు. సస్పెన్స్‌తో నిండిన ఆ సీన్‌ని తీయడమెలా? రామ్‌నాథ్ వద్ద జవాబు ఉంది. ఇంజన్ ముందు వైపు ఉండే సెర్చ్ లైట్‌ని ఇన్స్పెక్షన్ ట్రాలీకి అమర్చి – దాని ఎత్తుని తగినట్లుగా సవరించారు. సిబ్బంది ట్రాలీని తోశారు. అది యువతి వైపు వేగంగా దూసుకెళ్తుంటే ఆయన షాట్‌ని క్లోజ్అప్లో ఎన్నో కోణాలలో తీసుకున్నారు. ఆ తర్వాత ఆగిపోయిన రైలుని చిత్రీకరించారు. రామ్‌నాథ్ గారు గొప్ప సినీ ఎడిటర్ కూడా. ఈ ఫుటేజ్‌తో ఆ సన్నివేశాన్ని అద్భుతంగా తీశారు. ఆ సినిమాని తెర మీద చూస్తూ – ఆ యువతి వేషం వేసిన నటి – గట్టిగా అరిచిందట. “సినిమా అనేది కేవలం భ్రమ. నిజానికి ఏదీ కదలదు” అని రామ్‌నాథ్ గారు వినయంగా చెప్పారట.
జెమిని వారి ‘దాసి అపరంజి’ (1944) చిత్రంలో తొలి షాట్‌ని ఓ గుడిలో తీశారు. ఆ గుడిలో ఏ దేవతా ఉండదు, కానీ దేవదాసి అపరంజి విగ్రహం ఉంటుంది. అప్పట్లో జెమిని సంస్థలో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉన్న రామ్‌నాథ్ ఆ గుడి సీలింగ్‌ని వీలైనంత లో-యాంగిల్స్‌లో చిత్రీకరించారట. అపరంజి గురించి తప్ప, ఆ గుడి గురించి ఎవరికీ తెలియదు. జెమిని స్టూడియోలో ఎ.కె. శేఖర్ నేతృత్వంలోని కళావిభాగం వారు ఆ గుడి మినియేచర్ సెట్టింగ్ వేసి చిత్రీకరించారు. ఆ మినీయేచర్ సెట్లో షూటింగ్ ఎలా చేశారు? చాలా ఏళ్ళ తరువాత రామ్‌నాథ్ గారు రాండార్ గై గారితో ఆ రహస్యాన్ని పంచుకున్నారు. “ఆ మినియేచర్ సెట్లో నాలాంటి పొట్టివాడు పడుకుని, షాట్స్ తీసేంత స్థలం ఉంది, చాలు కదా!” అన్నారుట. అదీ రామ్‌నాథ్ అంటే!
త్యాగరాజ భాగవతార్ నటించిన హిట్ చిత్రం ‘అశోక్ కుమార్’ (1941) చిత్రంలో ‘ఉనయ్ కందు మాయన్గాధ పెర్గల్ ఉందో’ అనే పాటని ఆయనే పాడారు. ఈ పాటకి పసుపులేటి కన్నాంబ నృత్యం చేశారు. నిజానికి ఆమె నర్తకి కాదు, కానీ ఒక నెల పాటు ఆ పాటకి నాట్యం సాధన చేశారు. అయితే ఈ సినిమాకి రామ్‌నాథ్ ఛాయాగ్రాహకుడు కాకపోయినప్పటికీ, నిర్మాతల విజ్ఞప్తిపై వచ్చి – ఆ నృత్య సన్నివేశాన్ని న్యూటోన్ స్టూడియోలో ఒక్క రాత్రిలో చిత్రీకరించారు. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తుంది. ఎన్నో షాట్లు, విభిన్న యాంగిల్స్ ఉన్న ఆ సన్నివేశం – కేవలం ఒక్క రాత్రిలో చిత్రీకరించబడింది! అదీ రామ్‌నాథ్ అంటే!
నిస్సందేహంగా రామ్‌నాథ్ ఓ జీనియస్, ఏక వ్యక్తి సంస్థ, సినెమాటోగ్రాఫర్, ఫిల్మ్ ఎడిటర్, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత. అయితే అందరూ అనుకునేటట్లు ‘చంద్రలేఖ’ చిత్రంలో ‘డ్రమ్ డాన్స్’ పాటని రామ్‌నాథ్ చిత్రీకరించలేదు. ఆ ఆలోచన రామ్‌నాథ్ గారిది, ప్రొడక్షన్ డిజైన్ శేఖర్ గారిది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు రామ్‌నాథ్ ఆ స్టూడియోని వీడారు. ఆ సుప్రసిద్ధ డ్రమ్ డాన్స్ పాటని ఒకప్పుడు న్యాయవాది అయిన నిర్మాత టి.జి. రాఘవాచారి (తెర పేరు – ఆచార్య), నాలుగు విభిన్నమైన చోట్ల అమర్చిన కెమెరాలతో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో సర్కస్ సన్నివేశాలకు రామ్‌నాథ్ పని చేశారు. టి.ఆర్. రాజకుమారి గారి ‘ఫ్లయింగ్ ట్రెపీజ్’ సీన్, బోను లోకి రావడానికి తిరస్కరించిన పులులు, సింహాల సీన్లను ఆయనే తీశారు.
రామ్‌నాథ్ గారు 1912లో త్రివేండ్రంలోని పూజాపురలో జన్మించారు. బాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, కెరీర్ అన్వేషణలో మద్రాసు చేరారు. 1932లో కొడాక్ సంస్థలో – డెవెలప్మెంట్ అండ్ ప్రింటింగ్ విభాగంలో – ట్రయినీగా చేరారు. అక్కడ పని చేస్తుండగా ఫోటోగ్రాఫీపై ఎన్నో వ్యాసాలను పలు పత్రికలకు వ్రాశారు. అలా ఒక వ్యాసాన్ని ‘సౌండ్ అండ్ షాడో’ అనే పత్రికకి పంపారు. ఆ పత్రికకి ముత్తుస్వామి అయ్యర్, ఎ.కె. శేఖర్ యజమానులు (ముత్తుస్వామి అయ్యర్ – ‘మురుగదాస’ తన కలం పేరుతో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎ.కె. శేఖర్ ఆర్ట్ డైరక్టర్ అయ్యారు). ఈ వ్యాసం వల్ల వచ్చిన గుర్తింపుతో ఆయన కొడాక్లో రాజీనామా చేసి ‘సౌండ్ అండ్ షాడో’ చేరి ‘మురుగదాస-రామ్‌నాథ్-శేఖర్’ త్రిమూర్తులలో ఒకరయ్యారు.
ఈ ముగ్గురు కలిసి రాత్రింబవళ్ళు ‘సౌండ్ అండ్ షాడో’ పత్రికని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆర్థికంగా నష్టాలు రాకుండా చూశారు. 1930లలో అది అంత సులభమైన విషయం కాదు. కళాభిమాని, ప్రజ్ఞానిధి, దనవంతులు అయిన జి.కె.శేషగిరి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. 1933లో ఓ రోజు సుదూరంలోని కోల్హాపూర్ (అప్పట్లో రాజ సంస్థానం) నుంచి వారికి ఓ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఆ ముగ్గురితో పాటు మరెందరి జీవితాలనో మార్చింది. దాన్ని రాసిన వారు – భారతదేశం గర్వించదగ్గ దర్శకనిర్మాతలలో ఒకరైన వి. శాంతారామ్. ఉత్తరంపై ఆయన వి.శాంతారామ్, పార్ట్నర్, ప్రభాత్ ఫిల్మ్స్ అని సంతకం చేశారు. తాము హిందీలో తీసిన ‘సైరంధ్రి’ (1933, దేశపు తొలి కలర్ చిత్రం) సెట్లను ఉపయోగించుకుంటూ తాము తీయబోయే ‘సీతా కళ్యాణం’ అనే తమిళ సినిమా రూపొందించడంలో సహాయం చేయగలరా అని ఆ ఉత్తరంలో అడిగారాయన. ‘సైరంధ్రి’ సినిమా బాగా ఆడలేదు, అందుకని నిర్మాణ వ్యయం తగ్గించుకోవలని ఆ సంస్థ చూస్తోంది.
శేషగిరి, మైలాపూర్ లాయర్ వి. సుందరం అయ్యర్, ఆయన పిల్లలు ఎస్. రాజాం, జయలక్ష్మి, ఏడేళ్ళ బాల మేధావి – ఎస్. బాలచందర్, ఇంకా ఒక నాటక సంఘం సభ్యులు మద్రాసు నుంచి మిరాజ్ (రైల్వే జంక్షన్) వెళ్ళే రైలు ఎక్కారు. వారితో పాటు సన్నగా ఉన్న రూపసి, గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నారు. ఆయన ఈ మధ్యే అవకాశాల కోసం మద్రాసు వచ్చారు. లాయర్ గారితో ఉండి, వారి కుమార్తెలు రాజాం, జయలక్ష్మిలకి సంగీతం నేర్పిస్తున్నారు. ఆ చిత్రానికి సంగీతం సమకూర్చడంలో సాయం చేస్తారేమోనని ఆయననీ తీసుకువెళ్ళారు. తనకి గొప్ప అదృష్టం పట్టబోతోందని అప్పట్లో ఆయనకు తెలియదు! ఆయనే పాపనాశమ్ శివన్!
అయితే చాలామంది తమిళ సినీ చరిత్రకారులు ‘సీతా కళ్యాణం’ సినిమా గురించి మాటల్లోనూ, రాతల్లోనూ ఎంతో తప్పుడు సమాచారం అందించారు. ముత్తుస్వామి అయ్యర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారనీ, రామ్‌నాథ్ ఛాయాగ్రహ బాధ్యతలు నిర్వహించగా, శేఖర్ ఆర్ట్ డైరక్టర్ అని వాళ్ళు చెప్తారు. అది నిజం కాదు.
ఆ సినిమాకి బాబూరాం పెంధార్కర్ దర్శకులు. వి. శాంతారం సోదరుడు వి. అవధూత్ సినెమాటోగ్రాఫర్. ప్రభాత్ స్టూడియో ఆర్కిటెక్టులలో ఒకరైన సయ్యద్ ఫత్తేలాల్ ఆర్ట్ డైరక్టర్. మద్రాసు త్రిమూర్తులలో ఒక్క రామ్‌నాథ్‌కి మాత్రమే సహాయ దర్శకులుగా అవకాశం దక్కింది. ఫిల్మ్ క్రెడిట్స్ లోనూ, పాటల పుస్తకంలోనూ ఆయన పేరును కె. రామనాథన్గా పేర్కొన్నారు. రామనాథన్ అనే పేరు రామ్‌నాథ్‌గా ఎలా మారిందో ఎవరికీ తెలియదు. ఆ తరువాత సినీరంగంలో రామ్‌నాథ్ గారికి ఎంతో పేరు వచ్చింది.
(“మేము ముఖ్యంగా పరిశీలకులం. అన్నీ గమనిస్తూ సినీ నిర్మాణం అనే కళను నేర్చుకున్నాం. శాంతారాం గారికి, ఆయన భాగస్వాములకి – రామ్‌నాథ్ పనితనం, అవగాహనా బాగా నచ్చాయి. అతన్ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. నటీనటులకు ముత్తుస్వామి అయ్యర్ సంభాషణలు పలకడంలో శిక్షణనిచ్చారు. నేను ఇవన్నీ గమనిస్తూ, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సినిమా నిర్మాణంలో అది మా మొదటి అనుభవం. ఆ కాలం నాటి మరాఠీ, హిందీ సినిమాల దిగ్గజాలు – వి. శాంతారాం, పెంధార్కర్ సోదరులు బాబూరావు, బాల్జీ, ఎవి దామ్లే, సయ్యద్ ఫత్తేలాల్ వంటి వారితో కలిసి ఉండడం, తినడం, మాట్లాడం, పని చేయడం గొప్ప అనుభూతి. కల నిజమవడం అంటే అదే!” అని 1980లలో రాండార్ గైతో మాట్లాడ్తూ చెప్పారు శేఖర్).
తేనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్ లో నెలకొని ఉన్న వేల్ స్టూడియోస్ వారి సాంకేతిక విభాగానికి ఈ త్రిమూర్తులు ఇన్ఛార్జ్ అయ్యారు (తరువాత ఈ స్టూడియో గిండీకి మారింది). మద్రాసులో వచ్చిన రెండో సౌండ్ స్టూడియో అది. ఈ స్టూడియోని ఎల్డామ్స్ రోడ్లో పిఠాపురం రాజాకి చెందిన డన్మోర్ బంగ్లాలో ఎం.డి. రాజన్ ప్రారంభించారు. ఈ స్టూడియో – 1935లో మార్కండేయ, 1936లో పాదుకా పట్టాభిషేకం అనే సినిమాలు తీసింది. 1938లో తాను పని చేసిన ఓ సినిమాలో రామ్‌నాథ్ తమిళ సినిమాల్లో తొలిసారిగా మినియేచర్ ఫోటోగ్రఫీని ప్రవేశపెట్టారు. వర్షాభావం వల్ల బీడుగా మారిన భూమిలో వరి పంట మొలకెత్తే దృశ్యం అది. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు నివ్వెరపోయారట.
1930ల చివర్ల నుండి 1940ల వరకు అడయార్ లోని గ్రీన్‌వేస్ రోడ్లో కార్తికేయ స్టూడియోస్ పేరుతో ఒక సినిమా స్టూడియో ఉందన్న సంగతే చాలామందికి తెలియదు. మురుగదాస-రామ్‌నాథ్-శేఖర్లు ఈ స్టూడియోని నిర్వహించారు, అయితే ఆర్థిక భారం వల్ల స్టూడియో సరిగా నడిచేది కాదు. ఇప్పుడు ‘బిషప్స్ గార్డెన్స్’ అని పేరు పొందిన జిడ్డు కృష్ణమూర్తి ఎస్టేట్ సమీపంలో ఉండేది. 35 ఎం.ఎం. కెమెరా కూడా కొనలేని స్థితి వారిది. ఆ సమయంలో నిర్మాతగా మారిన ఆడిటర్ బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి (త్వరలో బి.ఎస్.రెడ్డి పేరుతో తెలుగు చిత్ర రంగంలో సృష్టించిన వ్యక్తి) ఈ ముగ్గురిని కలవడానికి వచ్చి వారికి గొప్ప అవకాశం ఇచ్చారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అని పేరుపొందిన హెచ్.ఎం.రెడ్డి గారితో కలిసి ఆయన కొద్ది రోజుల ముందే తమ సొంత సంస్థ ‘రోహిణీ పిక్చర్స్’ స్థాపించారు. వారిద్దరూ తమ తొలి సినిమాని తీయదలచి స్టూడియో కోసం వెతుకుతున్నారు. తొలి సమావేశంలో బి.ఎన్.రెడ్డి గారికి రామ్‌నాథ్, శేఖర్ బాగా నచ్చేసారు. ఈ సమావేశం ప్రభావం కేవలం బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, శేఖర్ జీవితాలపైనే కాకుండా, దక్షిణ భారత సినీ చరిత్రపైన కూడా ఉంది. బి.ఎస్. రెడ్డి స్టూడియోని 16,000 రూపాయలకి అద్దెకు తీసుకున్నారు. ఎంతో నిజాయితీగా, పారదర్శకంగా, తమకి అడ్వాన్స్ కావాలని రామ్‌నాథ్ అడిగారట. బి.ఎన్. గారు మొత్తం సొమ్ముని ఒకేసారి ఇచ్చేసారట.
ఈ విధంగా ‘రోహిణీ పిక్చర్స్’ వారు తమ తొలి చిత్రాన్ని కార్తికేయ స్టూడియోస్‌లో తీశారు. అది 1930ల నాటి క్లాసిక్. 1938లో విడుదలయిన ‘గృహలక్ష్మి’. అద్భుత నటి పసుపులేటి కన్నాంబ టైటిల్ పాత్ర పోషించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి చిత్తూరు వి. నాగయ్య ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా తన ప్రతిభని వెల్లడి చేశారు. మొత్తం దక్షిణావనిలోనే ‘గృహలక్ష్మి’ సూపర్ హిట్ అయింది. తెలుగు మాట్లాడని, అర్థం కాని ప్రాంతాలలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఈ సినిమా ద్వారా నాగయ్య ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొంది, చిత్రరంగంలో ఎదిగారు.
కార్తికేయ స్టూడియోస్‌లో తీసిన మరో చిత్రం ‘భక్తి’ (1938) చిత్రంలో ఒక సన్నివేశం చిత్రించడం ద్వారా రామ్‌నాథ్ చరిత్ర సృష్టించారు. వర్షాభావం వల్ల బీడుగా మారిన భూమిలో వరి పంట మొలకెత్తే దృశ్యం అది. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు నివ్వెరపోయారట. థియేటర్లలో దేవుళ్ళకి హారతులిచ్చేవారట. రామ్‌నాథ్ మినియేచర్లతో ఆ సీన్ తీశారు. ఈ సినిమా ద్వారా రామ్‌నాథ్ తమిళ సినిమాల్లో తొలిసారిగా మినియేచర్ ఫోటోగ్రఫీని ప్రవేశపెట్టారు.
1939-42 మధ్య రామ్‌నాథ్, శేఖర్లు బి.ఎన్.రెడ్దితో కలిసి పని చేసి – వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941), భక్త పోతన (1942) వంటి క్లాసిక్స్‌కి తమ వంతు సేవలు అందించారు. నిజానికి బి.ఎన్. రెడ్డి తన సినిమాల క్రెడిట్లలో ‘a Reddi- Ramnoth-Sekhar Production’ అని వేసేవారు.
పైన చెప్పుకున్న వాహిని వారి సినిమాలని రామ్‌నాథ్ స్క్రిప్టు సమకూర్చి, ఛాయాగ్రహణం వహించారు. భక్త పోతన (1942) కి కె.వి.రెడ్డి గారు తొలిసారిగా దర్శకత్వం వహించి. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుండడంతో 1942లో మద్రాసులోని స్టూడియోలు తాత్కాలికంగా మూతపడ్డాయి. రామ్‌నాథ్, శేఖర్లు బి.ఎన్.రెడ్డి గారికి వీడ్కోలు పలికి జెమినీ స్టూడియోస్‌లో చేరారు. అక్కడ రామ్‌నాథ్ ప్రొడక్షన్ కంట్రోలర్‌గా వ్యవహరించారు. కన్నమ్మ ఎన్ కాదలి, మిస్ మాలిని సినిమాలను నిర్మాతగా ఉన్నారు.
1948-49 మధ్యలో ఈ ఇద్దరు జెమిని స్టూడియోస్‌ని వీడి, కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియోస్‌లో ఉన్న జుపిటర్ పిక్చర్స్‌లో చేరారు. జుపిటర్ పిక్చర్స్‌లో ఉండగా రామ్‌నాథ్ ‘మర్మయోగి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విజయవంతమై, ఎం.జి. రామచంద్రన్‌కి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఒక దెయ్యం ఉన్న కారణంగా ఆ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన తొలి తమిళ చిత్రం ఇది.
జుపిటర్ పిక్చర్స్ వారు లంకా సత్యం దర్శకత్వంలో ‘మోహిని’ అనే మరో సినిమా తీస్తున్నారు. నాయికానాయకులు ఆకాశంలో ఎగిరే గుర్రంపై పాట పాడుకునే షాట్ తీయాల్సి ఉంది. దర్శకుడు తీసిన ఆ షాట్ నిర్మాతకి నచ్చలేదు. రామ్నాథ్ని పిలిచి ఆ షాట్ మళ్ళీ తీయించాకా, అప్పుడు నిర్మాత తృప్తి చెందారు. అయితే రామ్‌నాథ్ దీనికి క్రెడిట్ తీసుకోలేదు, ఆ క్రెడిట్ దర్శకుడికే ఇచ్చారు.
జుపిటర్ పిక్చర్స్ తర్వాత రామ్‌నాథ్ పక్షిరాజా స్టూడియోస్తోనూ, ఆ పిమ్మట మోడరన్ థియేటర్స్ వారితోను పనిజేశారు.
పక్షిరాజా స్టూడియోస్ కోసం – చిత్తూరు నాగయ్య, జవర్ సీతారామన్ ప్రధాన పాత్రలలో నటించగా – ‘ఏళై పడుం పాడు’ (1950, విక్టర్ హ్యుగో నవల లే మిజరబుల్స్- ఆధారం) సినిమాకి దర్శకత్వం వహించారు రామ్‌నాథ్. అది పద్మిని గారి తొలి సినిమా. ఈ చిత్రంలో కుమారి ఎన్. రాజం మీద తీసిన ఒక పాటని సింగిల్ షాట్లో ఒక్క కట్ కూడా లేకుండా పాట మొదటి నుంచి చివరి వరకు కెమెరా కదులుతుండగా, చిత్రీకరించారు.
‘నాడోడి మన్నన్’ చిత్రానికి ఎం.జి.ఆర్. తొలుత దర్శకుడిగా రామ్‌నాథ్ గారినే అనుకున్నారు. కానీ ఆయన చేయలేకపోయారు. ఆయన ఎంజిఆర్‌కి ఇష్టమైన దర్శకులు. ఎందుకంటే ఎం.జి. రామచంద్రన్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘మర్మయోగి’ చిత్రానికి దర్శకత్వం వహించింది రామ్‌నాథ్ గారే. ఆ తర్వాత ఎంజిఆర్ సూపర్ స్టార్ అయిపోయారు.
రామ్‌నాథ్ విద్యావంతులు, మేధావి. వడ్రంగిపని, సినెమాటోగ్రఫీ, కన్ఫ్యూషియస్, కాబరే – దేనిమీదైనా ఆయనని ప్రశ్న అడిగితే వెంటనే సరైన జవాబు ఇచ్చేవారు. రామ్‌నాథ్ సమాధానాలు విన్నవారికి ఆ విషయం మీద పూర్తి అవగాహన ఏర్పడేది. సినీ పరిశ్రమలో కూడా అన్ని విషయాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తిగా ఆయనను పరిగణించేవారు. ఆ రోజుల్లో చాలా మంది ఫైనాన్సియర్లు ఫిల్మ్ స్టూడియోలు నిర్మించాలనుకునేవారు. వారంతా రామ్‌నాథ్ సలహాలు తీసుకునేవారు. అందుకే జెమిని స్టూడియోస్ స్థాపించేందు ఎస్.ఎస్.వాసన్ కూడా రామ్‌నాథ్, శేఖర్‌లను సంప్రదించారు. అయితే తన సలహాని జనాలు పట్టించుకోకపోయినా రామ్‌నాథ్ బాధపడేవారు కాదు. తనకి అన్నీ తర్కమే నేర్పిందని తన సంభాషణలలో ఆయన చెప్పేవారు. తన కెరీర్లో ప్రతీ సారి తర్కాన్ని ఉపయోగించానని అంటారు.
తన బుర్రలో రామ్‌నాథ్ నింపుకుని ఉన్న సమాచారానికి జనాలు అబ్బురపడేవారు. ఆయనలో ఉదాసీనత ఉండేది. ఎవరైనా రానీ, ఏమైనా కానీ అనే ఆయన వైఖరి ఆయన ముందు ఎందరినో పిల్లులని చేసింది. ఆయన ఎవరినీ కించపరిచేవారు కాదు, ఎవరినీ అవమానించేవారు కాదు. కానీ ఓ తుంటరి నవ్వు అంతా చెప్పేసేది. పొట్టిగా ఉన్నప్పటికీ, ఆయన ఏ బృందంలోనైనా నెగ్గుకొచ్చేవారు. ఆచి తూచి తర్కబద్ధంగా మాట్లాడేవారు. ఆయన ఒక్కోసారి అహంకారిగా కనిపించవచ్చు, కాని ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించలేదు. ఆయనెప్పుడూ తన గురించి తాను చెప్పుకోకపోవడం వల్ల ఆయన్ కెరీర్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయనదో అద్భుతమైన పురోగతి ఉన్న కెరీర్. ఎవరినీ మోసం చేయకుండా, ఎవరినీ క్రిందకి తోసిపారేయకుండా, గొడవలు, తగాదాలు లేకుండా ఆయన ఉన్నత స్థానానికి చేరారు. ఎప్పటికప్పుడూ విజ్ఞానం పెంచుకునేవారు, మెరుగ్గా రాణించేవారు. పనిలో కూడా ఎప్పుడూ ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నట్లు ఉండేవారు. చేసే పనిని బాగా ఆస్వాదించేవారు. రోజంతా పని చేసినా మొహంలో అలసట కనిపిచ్చేది కాదు. ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోయేవారు. సినెమాటోగ్రాఫర్గా అప్పుడప్పుడూ బ్రేక్‌లలో కెమెరా క్రేన్ మీద నిద్రపోతూ కనిపించేవారు. లేదంటే అస్సలు తీరిక లేకుండా కనబడేవారు. ఒకవేళ మరీ ఎక్కువగా తీరిక దొరికితే – ఎవరితోనూ కబుర్లు చెప్పకుండా, ఏదైనా పుస్తకం చదువుకునేవారు. ఒక సినిమా కోసం లాయర్ గది సెట్లో షూటింగ్ జరుపుతుండగా, విరామంలో ఆయన అక్కడ ఉంచిన పుస్తకాలు తిరగేస్తూ కనిపించారు.
ఆయన అత్యంత ఖరీదైన దర్శకులు/సినెమాటోగ్రాఫర్ అయినా డబ్బుకి పెద్దగా విలువీయలేదు. ఆయన పెద్దగా దాని గురించి ఆలోచించకుండానే ఆయనకి డబ్బు అందేది. రామ్‌నాథ్ సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించి, జాన్ గాల్స్‌వర్తీ నాటకం ‘First an the Last’ని తమిళంలో ‘విడుదలై’ (హిందీలో ‘రిహాయి’) అనే పేరుతో సినిమాగా తీసారు. ఆ సినిమా పరాజయం పాలయి, ఆయని ఆర్థికంగా, మానసికంగా క్రుంగదీసింది. ఈ సినిమాకి సంబంధించిన సమస్యలే ఆయన 44 ఏళ్ళ చిన్న వయసులోనే 1956లో చనిపోయేందుకు కారణమయ్యాయి. ఈ విధంగా ఓ అద్భుతమైన మేధావి కెరీర్, జీవితం అంతమయ్యాయి.
ఆయన మృతి సినీ పరిశ్రమకి, సినిమాప్రియులకి తీరని లోటు!
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 27
కౌరవ సభలో అన్యాయాన్ని ప్రశ్నించిన వికర్ణుడు
శ్రీ మహా భారతంలో మంచి కథలు-1
అదే నిప్పు…
కవిత్వం అందించే మధురానుభూతులు ఎన్నో
సర్వజీవ సమానత్వం బోధించిన శ్రీ సాయి
హిమాచల్ యాత్రానుభవాలు-2
సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 16
శ్రీవర తృతీయ రాజతరంగిణి-4
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®