నీవు కనిపించావు
నిన్ను వెన్నాడుతూ నా
కళ్ళు అవిశ్రాంతమైనాయి
పగలంతా
నీ ఉనికిని నిరంతరం వెతుకుతూనో
నీ ఆగమనాన్ని
పాదముద్రల మానచిత్రరచన చేస్తూనో
నీ సాన్నిధ్యాన్ని చూపుల వలలో చుట్టివేస్తూనో
నీ నేపథ్యాన్ని ఆహ్లాదవర్ణాలతో నింపివేస్తూనో
నీ అనుపస్థితిలో నీ రూపును భావిస్తోనో
ఉపస్థితిలో
నీ రూపును అణువణువూ శోధిస్తూనో
కంటిపాపల లోయల్లో నీ శిల్పాన్ని ప్రతిష్ఠిస్తూనో
కనురెప్పల పరదాల వెనుక నీ చిత్రాన్ని భద్రపరుస్తూనో
కళ్ళు అవిశ్రాంతమైనాయి
కళ్ళు అంతకంతకూ అలసిపోతున్నాయి
రాతిరంతా
నీతో
ఊహల ఊయలలో జంటగా ఊగుతోనో
కలలలోకంలో కనులపంటగా సాగుతూనో
మానసమందిరాన ప్రణయదేవతారాధన చేస్తూనో
స్వప్న వీధులలో సరాగాల రాగాలాపన చేస్తూనో
నిన్ను కూడిన
జ్ఞాపకాల పుటలను ఒక్కొక్కటిగా చదువుతూనో
నిన్ను చేరిన
సంఘటనల సౌరభాన్ని ఆస్వాదిస్తూనో
కలత నిదురలో
కనురెప్పల కదలికల నృత్యం ప్రదర్శిస్తూనో
కళ్ళు అవిశ్రాంతమైనాయి
కళ్ళు అంతకంతకూ అలసిపోతున్నాయి
కానీ
ఆ కళ్ళు, అలసి సొలసిన నా కళ్ళు
అందంగా వెలుగులీనుతూనే ఉన్నాయి
నిన్ను కన్న ఆనందంలో దివ్వెలుగా
వెలుగుల జిలుగులు చిమ్ముతూనే ఉన్నాయి

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
5 Comments
Sreevani putrevu vedula
అమోఘమైన ఊహ శక్తి. అద్భుతమైన కవి హృదయం
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు శ్రీవాణి గారూ…!
Shyam Kumar Chagal
అమోఘమైన ఊహ శక్తి. అద్భుతమైన కవి హృదయం
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు శ్యాం…!
andelamahender56@gmail.com
చాలా అద్భుతంగా రాశారు sir చాలా బాగుంది